చెరువులతోపాటే ప్రాజెక్టులు


TEL_Major Irrigation ProjectsMap (1)

మిషన్ కాకతీయ విజవంతమయి చెరువుల పూడిక తీత పూర్తయినా తెలంగాణ పల్లెలకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్న ఆశలేదు. కాలమయితే పర్వాలేదు. కాలాలు కాకపోతే పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్నార్థకం. ఇందుకు ఒకటే సమాధానం. తెలంగాణలో ఇప్పటివరకు ప్రారంభించిన నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ ఒక యజ్ఞంలా పూర్తి చేయడమే.

బహుశా 1976-77లలో అనుకుంటా. పదవ తరగతిలో ఉన్నా. ఇంటి గడపలో కూర్చుని చేపలు పట్టిన సందర్భం. ఆ ఏడాది భారీ వర్షాలు కురిశాయి. పది రోజులు సూర్యుడిని చూడలేదు. ఆకాశానికి చిల్లులు పడినట్టు నిరవధికంగా చినుకు పడుతూనే ఉంది. ముసురుపెట్టి, నల్లని మబ్బులు ఆకాశాన్ని కమ్మి పగటివేళ కూడా చిమ్మని చీకటి. చెరువులు వారం రోజులుగా అలుగులుపోస్తున్నాయి. కుక్కడం చెరువు నిండి నీరు వెనుకకు తంతున్నది. ఊరిపైన నల్లగుంట చెరువుదాకా ఎటు చూసినా నీరే. ఊళ్లో వీధులన్నీ ఏరుల్లా మారాయి. మా ఊరి నీళ్లన్నీ కుక్కడం చెరువుకు ప్రవహిస్తాయి. నల్లగుంట చెరువు తెగుతుందేమోనని అందరూ భయపడ్డారు. చెరువు తెగితే వరద మా ఊరు మీదే పడుతుంది. ఇంటి గడప ముందు మూడు మెట్లుంటే మొదటి మెట్టు మునిగి నీరు ప్రవహిస్తున్నది. అలా ప్రవహించబట్టి అది ఆరో రోజు. సరదాగా ఆడుకుంటూ చూస్తే చేపలు ఎగురుకుంటూ ఎదురెక్కుతున్నాయి. అవి కుక్కడం చెరువు నుంచి ఎదురెక్కుతున్నాయి. పదవరోజు తెరిపి నిచ్చిన తర్వాత చూస్తే పైన నల్లగుంట చెరువు, దిగువ పెద్దరెడ్డి చెరువు నిండు గర్భిణిలా ఉన్నాయి. పొలాలన్నీ జలాలతో నిండిపోయి కనుచూపు మేర పొలంగట్లు, భూమి కనిపించడం లేదు. మర్రిబావి, బుడిగెబావి, నల్లగుంటబావి, సౌటబావి, చిన సౌటబావి, చెర్లబావి, అలుగుబావి…ఒకటేమిటి బావులన్నీ పొంగిపొర్లుతున్నాయి. నల్లగుంట అలుగు వరదకు మా బావులతో సంబంధాలు తెగిపోయాయి. పెద్దరెడ్డి చెరువు అలుగు వరద వల్ల ఆవలిగట్టు పొలాలు, చెల్కలకు వెళ్లడం మానేశారు. ఉండబట్టలేక ఒక తాత అలుగువరదను దాటుకుని పొలం వద్దకు వెళ్లాలని ప్రయత్నించి కొట్టుకుపోయి ఎక్కడో ఒక తాటి చెట్టుకుని పట్టుకుని బతికిపోయాడు. ఈదులాగు ఉధృతంగా ప్రహించింది. నిజంగా అటువంటి సన్నివేశం మళ్లీ చూడలేదు. అంతగా కాలం మళ్లీ కాలేదు.

ఇంటి గడప ముందు మూడు మెట్లుంటే మొదటి మెట్టు మునిగి నీరు ప్రవహిస్తున్నది. అలా ప్రవహించబట్టి అది ఆరో రోజు. సరదాగా ఆడుకుంటూ చూస్తే చేపలు ఎగురుకుంటూ ఎదురెక్కుతున్నాయి. అవి కుక్కడం చెరువు నుంచి ఎదురెక్కుతున్నాయి. పదవరోజు తెరిపి నిచ్చిన తర్వాత చూస్తే పైన నల్లగుంట చెరువు, దిగువ పెద్దరెడ్డి చెరువు నిండు గర్భిణిలా ఉన్నాయి.

అప్పటికి నాకు గుర్తుకు ఉన్నమేరకు మా ఊళ్లలో భూముల స్వభావం వేరుగా ఉండేది. ప్రతి రైతుకు కొంత కంచె(అడవి వంటిదే) ఉండేది. వాటిల్లో రేగడి కంచె చాలా పెద్దగా ఉండేది. ఎండాకాలం వస్తే అందులో వేటకు వెళ్లేది. ప్రతికంచెలో పొదలు, సండ్రలే కాదు మోదుగులు, తుమ్మలు, చింతలు, వేపలు, మర్రి, జువ్వి చెట్లు ఉండేవి. నాకు తెలిసి మా ఊళ్లోనే 30-40 కంచెలు ఉండేవి. అంతేకాదు ప్రతిరైతుకు ఒక దొడ్డి పశువులు, దొడ్డి చుట్టూ వనం ఉండేది. పచ్చదనం ఉండేది. ఎండాకాలం వస్తే ఇంటింటికీ ఒక బండి కట్టుకుని ముందుగా చెరువు మట్టి తవ్వుకుపోయి చెల్కల్లో పొలాల్లో కుప్పలు కుప్పలుగా పోసి వచ్చేవాళ్లు. ఆ తర్వాత దొడ్డి మట్టిని బండ్లలో తోలుకుపోయి చెరువు మట్టి దిబ్బల మధ్య కుప్పలు పోసేవారు. రెంటినీ కలిపి దున్నితే పొలాలకు, చెల్కలకు ఎరువుల అవసరం ఉండేది కాదు. అప్పటికింకా బోర్లు వేసే అవకాశం రాలేదు. కానీ బోర్లు వేయడం వచ్చిన తర్వాత సహజంగానే రైతులు మరింత భూమిని సాగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. క్రమంగా కంచెలు నశించిపోయాయి. బోర్లు పెరిగే కొద్దీ బావుల్లో నీరు తగ్గిపోతూ వచ్చింది. ఎండాకాలం వస్తే ఊరు చుట్టూ ఉన్న ఏడు బావులూ కలియదిరిగి ఈత కొట్టేవాళ్లం. పోటీలు పడి కామంచి కొట్టి బావుల అడుగుదాకా వెళ్లి వచ్చేవాళ్లం. అలా ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. కొందరు మిత్రులను కోల్పోయాం కూడా. 1985 నుంచి బావులలో నీరు అడుగంటి పోనారంభించింది. చెట్టూ చేమలు నశించాయి. కంచెలు చేలయ్యాయి. చాలా మంది పశువులను వదిలించుకున్నారు. దొడ్లు పడవపడిపోయాయి. చెట్లు కలపకోసం నరికేశారు. కోనసీమలో ఎటుచూసినా పచ్చదనం కనిపిస్తుందంటారే… అలా ఇక్కడ ఎటు చూసినా కిలోమీటర్ల కొద్దీ ఎర్ర చెల్క నేలలు కనిపిస్తాయిప్పుడు. ప్రకృతి విధ్వంసం, కరువు…ఒకదాని వెంట ఒకటి వచ్చాయి. ఏది ముందు ఏది వెనుక అన్న చర్చ అందరికీ తెలుసు.

ఇది ఒక ఊరి కథ కావచ్చు. కానీ చాలా ఊళ్లలో పరిస్థితి ఇదే. చెరువులు కుంచించుకుపోయాయి. రైతులు చెరువు మట్టిని పొలాలకు, చెల్కలకు తోలడం మానేశారు. పశువులు లేకపోవడంతో పెంటదిబ్బలు మాయమ్యాయి. ఎరువులకు అలవాటుపడిపోయారు. నిరంతరం ఏదో ఔషధాలు వాడే మనిషి ఎలా రోగనిరోధక శక్తిని కోల్పోతాడో, నిరంతరం ఎరువులు వాడే భూములూ అలాగే నిర్వీర్యమయి పోతాయి. చెరువు శిఖంలో భూములున్న రైతులు చెరువులోపలిదాకా సాగు చేసుకోవడం మొదలు పెట్టారు. తమ భూములను కాపాడుకోవడం కోసం చెరువులను తెగగొట్టడం, అలుగులను ధ్వంసం చేయడం, తూములను పీకేయడం వంటి పంచాయతీలు చాలా ఊళ్లలో చూశాం. ఇంకోవైపు చెరువులకు నీరు ప్రవహించే వాగులనూ, వంకలనూ(కాంటూర్లు) క్రమంగా పూడ్చేసి సాగులోకి తెచ్చారు. అసలే కాలం తక్కువ. వర్షాలు తక్కువ. దాంతో చెరువులకు నీరు రావడమే మానేసింది. అప్పుడో ఇప్పుడో కొద్దిపాటి నీరు వచ్చినా కుంచించుకుపోయిన చెరువుల్లో ఎక్కువ మోతాదులో నిలిచే పరిస్థితి లేదు. గత రెండు దశాబ్దాలుగా మా మండలమయితే కరువు మండలంగానే గుర్తింపు పొందుతున్నది. కరువు మండలాల సంఖ్య తెలంగాణలో చాలా ఎక్కువ. వర్షపాతం బాగా తక్కువగా ఉండడమే కరువు మండలాలుగా మారడానికి ప్రధాన కారణం. ఆదిలాబాద్ జిల్లా మొత్తం, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉత్తర ప్రాంతాల్లో తప్ప మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కావడం లేదు. మిషన్ కాకతీయ విజవంతమయి చెరువుల పూడిక తీత పూర్తయినా తెలంగాణ పల్లెలకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్న ఆశలేదు. కాలమయితే పర్వాలేదు. కాలాలు కాకపోతే పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్నార్థకం. ఇందుకు ఒకటే సమాధానం. తెలంగాణలో ఇప్పటివరకు ప్రారంభించిన నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ ఒక యజ్ఞంలా పూర్తి చేయడమే. తెలంగాణాలో పెద్ద ఎత్తున కాలువలను తవ్వి పెట్టారు. శ్రీరాంసాగర్‌లో నీటి లభ్యతపై భరోసా లేకపోయినా వేల కోట్ల రూపాయల ఖర్చు చేసి కాకతీయ కాలువను 384 కిలోమీటర్ల పొడవున తవ్విపెట్టారు. ఆ కాలువకు అనుబంధంగా వందల కిలోమీటర్ల పొడవున ఉపకాలువలను కూడా తవ్వారు. కాకతీయ కాలువ సామర్థ్యాన్ని పెంచలేదు. మరో ప్రత్యామ్నాయ ప్రాజెక్టు నుంచి నీటిని అందించే ప్రయత్నమూ చేయలేదు. ఆ ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరయిపోయింది.

ఇలాగే వరద కాలువలు చాలా పొడవు తవ్వారు. మహబూబ్‌నగర్‌లో ఎత్తిపోతల హెడ్‌వర్క్స్ పూర్తి చేయకుండానే కాలవలయితే తవ్వుతూ పోయారు. కొన్ని చోట్ల నీళ్లొచ్చినా డిస్ట్రిబ్యూటరీల పని పూర్తి కాలేదు. మాధవరెడ్డి ప్రాజెక్టు కింద ఇంకా డిస్ట్రిబ్యూటరీలు పూర్తి కాలేదు. సాధారణంగా ఇప్పుడు డబ్బు ఖర్చు చేస్తే ఎప్పటికి ఆదాయం వస్తుందని అందరం లెక్కలు వేసుకుంటాం. ప్రభుత్వ సొమ్ము విషయంలో మాత్రం అటువంటి లెక్కలు ఏవీ వేస్తున్నట్టు కనిపించడం లేదు. నీటిపారుదల ప్రాజెక్టుల పరిస్థితి మరీ అన్యాయం. ప్రాజెక్టులను, కాలువలను పూర్తి చేసి, వాటిని గొలుసుకట్టు చెరువులకు అనుసంధానం చేసి వరుసగా మూడు నాలుగేళ్లు చెరువులను నింపితే తప్ప మళ్లీ ఊళ్లు కోల్పోయిన జవజీవాలను సంతరించుకోలేవు. ఇప్పటికే తవ్విన కాలువలకు అనుసంధానమై ఉన్న చెరువుల లెక్కలు తీయాలి. ఇంకా చెరువులను అనుసంధానం చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలి. కొన్ని చోట్ల కాలువల నీటిని మళ్లించి వాగులు, ఉపనదులను పునర్జీవింప జేయడంపై కూడా దృష్టిని కేంద్రీకరించాలి. ఈ వాగులు, ఉపనదుల కింద చాలా చెరువులు ఉన్నాయి. జలసాధన ఉద్యమంగా జరగాలి. కాలంకాకపోతే నదుల్లో నీళ్లు ఎలా వస్తాయి అని ఎవరయినా ప్రశ్నించవచ్చు. తెలంగాణలో కాలమయినా కాకపోయినా కృష్ణా, గోదావరి నదులకు వరదలు వస్తున్నాయి. శ్రీరాంసాగర్‌కు దిగువన గోదావరికి నీరు రాని సంవత్సరం లేదు. కాళేశ్వరం దిగువ నుంచి గోదావరి జీవనదే. గోదావరి ఉపనదులయిన ప్రాణహిత, ఇంద్రావతి నదుల్లో నీరు పుష్కలం. కృష్ణాలో తెలంగాణలో ఇంత కరువున్నా ఈసారి కూడా నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటిని వదిలిపెట్టాల్సి వచ్చింది. కర్ణాటక, మహారాష్ట్రలలో విస్తరించి ఉన్న పశ్చిమ కనుమలు కృష్ణను బతికిస్తున్నాయి.

వరదలు వచ్చినప్పుడు అతితక్కువ కాలంలో వీలైనంత ఎక్కువ నీటిని ఈ కాలువలకు మళ్లించడం ఎలా అన్నదే ప్రధానమైన సమస్య. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు అన్నింటినీ కలిపి ఆలోచిస్తే తప్ప తెలంగాణ తాగునీరు, సాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు.

అందుకే మిషన్ కాకతీయ ఎంత ముఖ్యమో నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడమూ అంతే ముఖ్యం. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటిపారుదల ప్రాజెక్టులపై చేస్తున్న మేథోమధనం, ఇంజనీర్లను ఆగమేఘాలపై పరుగెత్తిస్తున్న తీరు భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తున్నది. ప్రాజెక్టులు కాంట్రాక్టర్లకోసం కాదు. ప్రజలకోసం. ప్రాజెక్టుల పనులను ఏళ్లతరబడి సాగదీయడం వల్ల ప్రజలకు, ప్రభుత్వానికి నష్టం. సాధ్యమైనంత త్వరితగతిన రైతుల పొలాలకు నీళ్లు మళ్లించడం లక్ష్యంగా పనులు జరగాలి అని ఇటీవల నీటిపారుదల ఇంజనీర్లు, అధికారులతో జరిగిన సమావేశంలో స్పష్టంగానే చెప్పారు. తెలంగాణ నీటిపారుదల ఇంజనీర్లు, పదవీవిరమణ చేసిన ఇంజనీర్లు కూడా అంకితభావంతో తెలంగాణ ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌పై పనిచేసుకుపోతున్నారు. ఎక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు నిర్మించడం కాకుండా ఎక్కువ నీటిని తీసుకునే విధంగా ప్రాజెక్టులను రూపొందించాలని ప్రయత్నిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులు అటువంటి భావన నుంచి రూపుదిద్దుకున్నవే. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో వివిధ ప్రాజెక్టులకోసం విస్తృతంగా రకరకాల కాలువలు ఇప్పటికే తవ్వి ఉన్నాయి. ఇంకా కొన్ని కాలువలు నిర్మాణంలో ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడు అతితక్కువ కాలంలో వీలైనంత ఎక్కువ నీటిని ఈ కాలువలకు మళ్లించడం ఎలా అన్నదే ప్రధానమైన సమస్య. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు అన్నింటినీ కలిపి ఆలోచిస్తే తప్ప తెలంగాణ తాగునీరు, సాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

2 thoughts on “చెరువులతోపాటే ప్రాజెక్టులు”

  1. వర్షాల క్రమం మారినట్టే అనిపిస్తుంది. స్కూలుకు నడచి వెళ్ళే దారికిరువైపులా గోతుల్లో కూడా తామర్లు తెగ పూసేవి. ఆ గుంటల్లో కూడా గాలాలేసే వారు. ఇప్పుడు చుక్కైనా లేదు. వాటర్ షెడ్ మైక్రో ప్లానింగ్ కూడా మంచిదే. మారిన కాలానికి పెద్ద ప్రాజెక్టులు కూడా అవసరమే. ఉన్న వనరులతో సరైన ప్రాధమ్యాల్ని ఎన్నుకోవడం లోనే విజయ రహస్యం ఉంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s