శ్రీశైలం రిజర్వాయరు కబ్జా


pottiredupadu

ఎన్ని ప్రాజెక్టులు? ఎన్ని నీళ్లు? ఎంత దోపిడీ?
తెలంగాణ ప్రాజెక్టులపైనే ఎందుకీ ఏడుపు?

ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రలో ఏవైనా ప్రాజెక్టులు ప్రతిపాదించినపుడు మీడియాకు వేల క్యూసెక్కుల నీరు సముద్రం పాలుకాకుండా అడ్డుకుంటున్న దృశ్యాలు కనిపించేవి. తెలంగాణ ప్రాజెక్టుల ప్రస్తావన వస్తే మాత్రం కృష్ణా, గోదావరి నదులు ఎండిపోయి నీళ్లు లేక దీనంగా కనిపించేవి. అడవులు అడ్డుపడేవి. కొండలు ఆపేసేవి. మాది ఎడారి ప్రాంతం అని దబాయించే రాయలసీమకు ఉమ్మడి రాష్ట్రంలో వారికి హక్కు ఉన్న తుంగభద్ర, కేసీ కెనాల్ కాకుండా హక్కులు లేని శ్రీశైలం ప్రాజెక్టు ఆధారంగా అనేక ప్రాజెక్టులు నిర్మించారు. సీమ మొత్తం ఎక్కడపడితే అక్కడ డజన్ల కొద్దీ రిజర్వాయర్లు కట్టుకున్నారు. పోతిరెడ్డిపాడునుంచి 450 టీఎంసీల నీటిని తరలించేలా సామర్థ్యం పెంచుకున్నారు. ఇవాళ కృష్ణ నీరు పోతిరెడ్డిపాడు నుంచి తెలుగుగంగ కాలువ పేర తమిళనాడు పూండి దాకా అడవులు, నదులు, కొండలు, గుట్టలన్నీ ఛేదించి బిరాబిరా వెళ్లిపోతున్నది. హంద్రీనీవా ఆరు వందలకు పైగా కిలోమీటర్ల దూరం నదులను దాటేసి అనంతపురం జిల్లాదాక అలవోకగా వెళుతున్నది.

తెలంగాణలో ఏదైనా ప్రాజెక్టు చేపడుతున్నామనగానే సీమాంధ్ర నాయకత్వం, మీడియా వందరకాల ప్రశ్నలు లేవనెత్తుతారు. సాధ్యాసాధ్యాలపై చర్చ చేస్తారు. నీటి హక్కుల గురించి మాట్లాడతారు. పరివాహక హక్కులను గుర్తు చేస్తారు. అనుమతులున్నాయా అని ఆరాలు తీసారు. కృష్ణానది నీటి వినియోగం విషయంలో నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు జరిగిన అన్యాయం గురించి అర్థం చేసుకోవాలంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్ర నాయకత్వం చేసిన నీటి దోపిడీని అర్థం చేసుకోవాలి. శ్రీశైలం రిజర్వాయరు నుంచి యథేచ్ఛగా కాలువలు, ఎత్తిపోతలు నిర్మించిన తీరు చూస్తే ఆశ్చర్యం, విస్మయం కలుగుతాయి. పలు జిల్లాలు, వివిధ నదులు, కొండలు, వాగులు, అప్పటికే ఉన్న కాలువలను దాటుకుని శ్రీశైలం నీరు ముందుకు సాగిపోతుంది. శ్రీశైలం వద్ద రాయలసీమకు నీటి హక్కులు లేవు. పరివాహక నిబంధనల ప్రకారం అనంతపురం, కడప, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు కృష్ణా బేసినులోకి రావు. చాలా ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం అనుమతులు లేవు. అటవీ అనుమతులు లేవు. నిజానికి శ్రీశైలం రిజర్వాయరు నుంచి రాయలసీమకు తొలుత ఎటువంటి కేటాయింపులూ లేవు. తుంగభద్ర నుంచి 110 టీఎంసీల నీటి కేటాయింపు మాత్రం ఉంది. దానిని తుంగభద్ర ఎగువ కాలువతోపాటు సుంకేశుల వద్ద తుంగభద్రపై నిర్మించిన కేసీ కాలువల ద్వారా తీసుకోవాలి. కానీ తుంగభద్ర నుంచి తమకు నీరు తగినంత రావడం లేదనే కారణం చూపి సీమాంధ్ర నాయకత్వం శ్రీశైలం రిజర్వాయరును దాదాపు కబ్జా చేసేసింది. ఒక్కటి కాదు రెండు కాదు…ఆరు కాలువలు శ్రీశైలం నుంచి నీటిని తీసుకుపోతాయి. పోతిరెడ్డిపాడు నుంచి బయలు దేరేవి నాలుగు కాగా, కర్నూలు జిల్లా మల్యాల వద్ద ఎత్తిపోసే హంద్రీ-నీవా ఐదవది. వెలిగొండ సొరంగం ప్రాజెక్టు ఆరవది. భూమి పొరలను పర్రున పగుల గొట్టుకుంటూ,అవసరమైన చోట సొరంగాలు తవ్వుతూ, ఎత్తిపోతలు నిర్మించుకుంటూ, నదులు, కాలువలపై నీటి వంతెనలను నిర్మించుకుంటూ జలాలను తరలించారు. ఎన్ని రిజర్వాయర్లు నిర్మించారో లెక్కలేదు. నిజానికి స్వర్గీయ రాజశేఖర్‌రెడ్డి బరితెగించి ఈ ప్రాజెక్టులన్నీ ముందుకు తెచ్చారు.

ఈ ప్రాజెక్టులన్నీ నింపుకోవడానికి వీలుగానే పోతిరెడ్డిపాడు కాలువ సామర్థ్యాన్ని 11000 క్యూసెక్కుల నుంచి ఏకంగా 44000 క్యూసెక్కులకు పెంచారు. పాత, కొత్త కాలువలు రెండింటి ద్వారా 55000 క్యూసెక్కుల నీటిని తరలించే అవకాశం ఉంది. అంటే రోజుకు ఐదు టీఎంసీల నీటిని మళ్లించుకునే సామర్థ్యం ఈ కాలువకు ఉంది. ముప్పై రోజులు వరద ఉంటే 150 టీఎంసీలు, 45 రోజులు వరద ఉంటే 225 టీఎంసీల నీటిని ఆలవోకగా తరలించుకుపోవడానికి వీలుగా ఈ కాలువల నిర్మాణం జరిగింది. 90 రోజులపాటు నీటిని తరలిస్తే 450 టీఎంసీల వరకు తీసుకోవచ్చు. అంతేకాదు పోతిరెడ్డిపాడు కాలువ ద్వారా శ్రీశైలం రిజర్వాయరులో 844 అడుగుల లోతువరకు నికర జలాలను కూడా తరలించుకునే అవకాశం ఉంది. వెలుగోడు, అలగనూరు, గోరకల్లు, అవుకు, పెన్న అహోబిలం, తెలుగుగంగ, దువ్వూరు, బ్రహ్మంగారి మఠం, చిన్నముక్కపల్లి, మైలవరం, గండికోట, సోమశిల, కండలేరులతోపాటు పలమనేరు సమీపంలోని అడవిపల్లి రిజర్వాయరుదాకా ఎన్ని రిజర్వాయర్లు ఉంటాయో లెక్క తీయడం కూడా కష్టమే. తెలుగు గంగ కాలువ గాలేరు, సగిలేరు, పెన్నా, స్వర్ణముఖి, ఆరణి నదులను దాటుకుని ప్రయాణిస్తుంది. గాలేరు-నగరి కాలువ గాలేరు, కుందు, పెన్నా, స్వర్ణముఖి నదులను దాటుకుని నీటిని మోసుకెళుతుంది. హంద్రీ-నీవా హంద్రీ, పెన్నా, చిత్రావతి, నీవా నదులను దాటుకుని ముందుకు సాగుతుంది. కడప-కర్నూలు కాలువ హంద్రీ, గాలేరు, కుందు, పెన్నా నదులను దాటుకుని కడప చేరుకుంటుంది. శ్రీశైలం నీటితో గాలేరు, కుందు, పెన్నా నదులు పునర్జన్మనెత్తాయి.

galerunagari-canal-scheme

1. హంద్రీ-నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల అంతిమగమ్యం కృష్ణానది నుంచి 610.100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్తూరు జిల్లా పలమనేరు. హంద్రీ-నీవా కర్నూలు జిల్లాలో హంద్రీ నదిని, కేసీ కాలువను, అనంతపురం జిల్లాలో పెన్నా, చిత్రావతి నదులను, తుందభద్ర కాలువను దాటుకుని చిత్తూరు జిల్లాలో ప్రవేశిస్తుంది. కర్నూలు జిల్లా మల్యాల వద్ద శ్రీశైలం రిజర్వాయరు వెనుకభాగం నుంచి 40 టీఎంసీల నీటిని తరలించి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 6.03 లక్షల ఎకరాలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

2. గాలేరు-నగరి సుజల స్రవంతి అంతిమగమ్యం 390 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరి. పోతిరెడ్డిపాడు నుంచి గాలేరు నదికి నీటిని మళ్లించి అక్కడి నుంచి అలగనూరు, గోరకల్లు, అవుకు రిజర్వాయర్ల ద్వారా పెన్నా నదిపై నిర్మించిన మైలవరం, గండికోట రిజర్వాయర్లకు తరలించి, అటు నుంచి కడప మీదుగా కాలహస్తి, నగరిల వరకు నీటిని తీసుకెళ్లాలన్నది ఈ కాలువ లక్ష్యం. శ్రీశైలం నుంచి 38 టీఎంసీల నీటిని తరలించి చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో 2.6 లక్షల ఎకరాలకు నీరివ్వాలన్నది లక్ష్యం.

3. తెలుగు గంగ గమ్యం 434 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూండి రిజర్వాయర్. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకుని వెలుగోడు రిజర్వాయరును నింపి అటు నుంచి నల్లమల అడవుల ద్వారా తెలుగు గంగ రిజర్వాయరు, బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ అటు నుంచి పెన్నా నదిపై నిర్మించిన సోమశిలకు, అక్కడి నుంచి కండలేరుకు అక్కడి నుంచి చిత్తూరు జిల్లా మీదుగా తమిళనాడుకు నీరు తరలించారు. చెన్నయ్‌కి 15 టీఎంసీల తాగునీరుతోపాటు 28.99 టీఎంసీలతో కర్నూలు, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో 2.75 లక్షల ఎకరాలను సాగులోకి తేవడం లక్ష్యం.

4. ఎస్‌ఆర్‌బీసీ కాలువ 300 కిలోమీటర్లు నీటిని తీసుకెళుతుంది. ఈ కాలువ బనకచర్ల నుంచి పెన్నాపై నిర్మించిన మైలవరం దాకా 198 కిలోమీటర్ల పొడవున 19 టీఎంసీల వరద నీటితో కర్నూలు, కడప జిల్లాల్లో 1.9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం.

veligonda

5. వెలిగొండ ప్రాజెక్టు కాలువ అంతిమ లక్ష్యం శ్రీశైలం రిజర్వాయరుకు 290 కిలో మీటర్ల దూరంలోని నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలుకా. ఈ ప్రాజెక్టు ద్వారా 43.5 టీఎంసీల వరద నీటిని తరలించి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4.38 లక్షల ఎకరాలను సాగు చేయాలన్నది లక్ష్యం. శ్రీశైలం రిజర్వాయరు నుంచి టన్నెలు ద్వారా ప్రకాశం, నెల్లూరు జిల్లాలో నీటిని పారించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

6. ఇవి కాకుండా తుంగభద్రపై సుంకేశుల వద్ద ప్రారంభమయ్యే కడప-కర్నూలు కాలువను కూడా బనకచర్ల వద్ద పోతిరెడ్డిపాడుకు లింకు చేశారు. తుంగభద్ర నుంచి తగినంత నీరురావడం లేదని, ఆ నీటిని బనకచర్ల వద్ద నుంచి తీసుకోవాలని ఈ లింకును నిర్మించారు. ఈ కాలువ కడప పట్టణంలో ముగుస్తుంది.

క్లుప్తంగా-

1. ఆరు ప్రాజెక్టుల డీపీఆర్‌ల ప్రకారం శ్రీశైలం నుంచి తరలించదల్చుకున్న నీరు – 154.5 టీఎంసీలు
2. ఆరు ప్రాజెక్టుల కింద సాగులోకి తీసుకురాదలచిన ఎకరాలు- 19.66 లక్షల ఎకరాలు
3. ఆరు ప్రాజెక్టుల ద్వారా తాగునీరు, సాగునీరు అందుకునే జిల్లాలు- 6 ( కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం)
4. ఆరు జిల్లాల్లో తవ్విన కాలువల మొత్తం పొడవు- 2024 కిలోమీటర్లు
5. ఆరు ప్రాజెక్టుల నుంచి నీరందుకునే నదులు, ఉపనదులు- 10 (హంద్రీ, గాలేరు, కుందు, సగిలేరు, పెన్నా, స్వర్ణముఖి, చిత్రావతి, పాపాగ్ని, మాండవి, నీవా)
6. ఆరు ప్రాజెక్టుల నుంచి నీరందుకునే రిజర్వాయర్లు-32 (వెలుగోడు, అలగనూరు, గోరకల్లు, అవుకు(కర్నూలు), చిన్నముక్కపల్లి, బ్రహ్మంగారి మఠం, మైలవరం, గండికోట, వామికొండ, సర్వరాజసాగర్(కడప), సోమశిల, కండలేరు, దుర్గంసాగర్, వెలికొండసాగర్, కృష్ణసాగర్(నెల్లూరు), శ్రీబాలాజీ రిజర్వాయర్, పద్మాసాగర్, శ్రీనివాససాగర్, చెర్లోపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి(చిత్తూరు), పెన్నా అహోబిలం, చిత్రావతి, మిడ్ పెన్నా రిజర్వాయర్, జీడిపల్లి, గొల్లపల్లి, మారాల(అనంతపురం), రాళ్లవాగు, గుండ్ల బ్రహ్మ్రేశ్వరం, నల్లమలసాగర్, కంభం చెరువు, తురిమెళ్ల రిజర్వాయర్(ప్రకాశం).

ఈ ప్రాజెక్టుల కాలువల తవ్వకం అటు చిత్తూరు జిల్లా పలమనేరుదాకా, ఇటు నగరిదాకా పూర్తయింది. తెలుగుగంగ, శ్రీశైలం కుడికాలువ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా మొదటి దశలు పూర్తయ్యాయి. సీజనులో నీళ్లు ప్రవహిస్తున్నాయి. రెండవ దశ పనుల్లోనే అక్కడక్కడా పనులుపెండింగులో ఉన్నాయి. వెలిగొండ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరిని మోసం చేశారు? రాయలసీమకు రావలసిన నీటివాటా విషయంలో ఎవరూ అభ్యంతర పెట్టాల్సిన పనిలేదు. వరద నీటిని తీసుకోవడంలోనూ తప్పు లేదు. కానీ తెలంగాణ ఏం పాపం చేసింది? మహబూబ్‌నగర్ ఏం పాపం చేసింది? 610 కిలోమీటర్ల దూరంలో కూడా కాలువలు తవ్విన ఏలికలకు పక్కనే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు ఎందుకు కనిపించలేదు? ఇక్కడ జనం ఆత్మహత్యలు, ఆకలి చావులకు గురవుతుంటే దత్తత తీసుకున్నామని చెప్పినవారు ఏం చేశారు? ఫ్లోరైడు నీరు తాగి అచేతనులవుతుంటే ఎందుకు కళ్లప్పగించి చూస్తూ వచ్చారు? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానం చెప్పుకోవాలి. అది తెలంగాణ ప్రభుత్వం చేయాలి.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

7 thoughts on “శ్రీశైలం రిజర్వాయరు కబ్జా”

  1. శ్రీశైలం సొరంగం అలా సాగుతూనే ఉంటుంది. నక్కల గండి రిజర్వాయరు నుండి డిండీ చెరువుకు లిఫ్ట్ అని అంటుంటారు గానీ అసలు ఆ నక్కలగుండి దగ్గర కట్టాల్సిన డ్యామ్ మాటే వినపడదు. పనీ మొదలు కాదు. ఎన్నాళ్ళో ఎన్నేళ్ళో

  2. చాలా సమగ్ర సమాచారం. సోయితోటి లేక ఎంతో నష్టపోయాము. తెలంగాణా సర్కారైనా ఈ ప్రాజెక్టులను పూర్తిచేస్తుందని ఆశిద్దాము.

  3. telugu ganga nunchi swarnamukhi loki neeru ela vastundo konchem cheptara? ekkada neeru tap chestaro telusa? naku telisi ekkada ledu. urike edo perlu telusu kada ani rasesaru ee article lo.

  4. sir i am a group-2 aspirent i want to know each & every details of each project in telangana

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s