ఇదా రాజకీయం?


images

నాయకులకు దీర్ఘకాలిక దృష్టి ఉండాలి. తమ ప్రతిష్ఠను, పార్టీల ప్రతిష్ఠనూ మెట్టుమెట్టుగా నిర్మించుకుంటూ ఎదగాలి. హ్రస్వదృష్టితో రాజకీయాలు చేస్తే తరాలు నష్టపోతాయి. జనంలో రాజకీయాలపై ఏవగింపు కలుగుతుంది. పార్టీలపై చిరాకు పుడుతుంది.

తెలంగాణ ప్రభుత్వం ముందు చాలా పెద్ద బాధ్యత ఉంది. స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వంగా తెలంగాణ వచ్చిన ప్రయోజనం ఏమిటో తెలంగాణకు చూపించాలి. తెలంగాణపై ఒక చెరగని ముద్ర వేయాలి. తెలంగాణ నాయకత్వానికి పరిపాలించడం చేతకాదని ఆరు దశాబ్దాలుగా ప్రచారం చేసిన పాలి నాయకత్వానికి మన చేతిలో అధికారం ఉంటే ఏమి చేయగలమో రుజువు చేయాలి. తెలంగాణ గడ్డపై సరికొత్త లాండుమార్కులు నిర్మించాలి. మనం ఓడిపోయిన చోటనే గెలవాలి. సాగునీరు, తాగునీరు, విద్యుత్ రంగాల్లో మనం ఉన్నత శిఖరాలను దాటాలి. అభివృద్ధికి సరికొత్త నిర్వచనం చెప్పాలి. దార్శనిక దృక్పథం, దూరదృష్టి, పట్టుదల, సాహసం, భిన్నంగా ఆలోచించేతత్వం ఉన్న నాయకుల వల్ల మాత్రమే ఏ ప్రాంతమైనా ప్రగతిని సాధించగలదు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నాయకులకు ఉండాల్సిన లక్షణాలయితే ఇవే. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆలోచన, ఆచరణ, తపన ఏమిటో ఇప్పటికే అందరికీ అర్థమయింది. ప్రతిపక్ష నాయకుల్లో జానారెడ్డి ఆలోచనలు, ఆచరణ తెలంగాణ ప్రజలకు ముందే తెలుసు. గతంలో ఎలా ఉన్నా శాసనసభలో ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆయన గౌరవాన్ని పెంచుతున్నది. కాంగ్రెస్ గౌరవాన్నీ పెంచుతున్నది. ఆయన తాము గతంలో చేయగలిగింది, చేసినవీ చెప్పుకుంటూనే, మీరు పనులు చేయండి, సహకరిస్తాం అని చెబుతున్నారు. తమ పార్టీపై తెలంగాణవాదులు చేస్తున్న విమర్శలను చాలా హుందాగా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ సాధ్యమయ్యేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం ఇవ్వడంలో జరిగిన జాప్యం, లోపాల వల్లే మేము ఇక్కడ(ప్రతిపక్షంలో) ఉన్నాం, మీరు అక్కడ(అధికారపక్షంలో) ఉన్నారు అన్న వాస్తవాన్నీ అంగీకరించారు. నాయకులకు దీర్ఘకాలిక దృష్టి ఉండాలి. తమ ప్రతిష్ఠను, పార్టీల ప్రతిష్ఠనూ మెట్టుమెట్టుగా నిర్మించుకుంటూ ఎదగాలి. హ్రస్వదృష్టితో రాజకీయాలు చేస్తే తరాలు నష్టపోతాయి. జనంలో రాజకీయాలపై ఏవగింపు కలుగుతుంది. పార్టీలపై చిరాకు పుడుతుంది.

ఒక నాయకుడిగా రాటుదేలడానికి, ఒక ఉద్యమ ప్రతిష్ఠను పెంచడానికి, లక్ష్యాన్ని సాధించడానికి ఎంత కష్టపడాలో తెలంగాణ ఉద్యమం నేర్పింది. రాష్ట్ర సాధనలో పదమూడేళ్లు కేసీఆర్ చేసిన శ్రమ, చూసిన ఎత్తుపల్లాలు తెలంగాణ ప్రజలకు తెలుసు. కిందపడిన ప్రతిసారీ పైకి లేస్తూ పోరాడుతూ వచ్చారు. అంతిమగమ్యం చేరేదాకా ఆయన ఉద్యమాన్ని విస్తృతం చేస్తూ వచ్చారు. మిత్రులను పెంచుకుంటూ వచ్చారు. తాను ఎదుగుతూ ఉద్యమాన్ని పెంచుతూ ఆయన ముందుకు సాగారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన చేస్తున్న పని అదే. కొత్త రాష్ట్రం. మొదటి సారి మన చేతికి సర్వాధికారం. మన అభివృద్ధిని మనమే నిర్వచించుకునే తరుణం. కొంతకాలం రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధిపై అందరూ దృష్టిని సారించాల్సిన సమయం. ఉన్నతంగా ఆలోచించడం(థింక్ బిగ్), ఉన్నతమైన లక్ష్యాలు(ఎయిమ్ హై) పెట్టుకోవడం, పట్టుదలగా పనిచేసుకుపోవడం(వర్క్ హార్డ్) కేసీఆర్ తత్వం. ఆయనను ఎదుర్కోవాలనుకునేవారు, ఆయన స్థానంలోకి రావాలని ఆరాటపడేవారు కూడా అంతే ఉన్నతంగా, అంతే హుందాగా ఆలోచిస్తే తప్ప జనం హర్షించరు. ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఆ విషయాన్ని గుర్తించినట్టున్నారు. ఉన్న బాణాలన్నీ ఇప్పుడే వేసేస్తే అసలు యుద్ధం చేయాల్సిన సమయానికి అంబుల పొదిలో ఏమీ ఉండవు అనే విషయాన్ని అర్థం చేసుకున్నట్టున్నారు. లేకితనాన్ని, గాలి మాటలను జనం ఇప్పుడు స్వీకరించరు. తెలుగుదేశంలో కొందరు, కాంగ్రెస్‌లో ఇంకొందరు అటువంటి లేకితనాన్ని ప్రదర్శిస్తున్నారు. వాళ్లు రోజుకోసారి పత్రికా విలేకరుల ముందుకు, టీవీ తెరల ముందుకు రావడం, నానా సొల్లు వాగేసి పోవడం అలవాటుగా పెట్టుకున్నారు. వాళ్లంతా ఈ రాష్ర్టాన్ని సుదీర్ఘకాలంపాటు పరిపాలించిన పార్టీలకు చెందినవాళ్లు. తెలంగాణకు ఇంతకాలం జరిగిన సకల కష్టనష్టాల పాపాన్ని మోస్తున్నవాళ్లు. అధికారం కోల్పోవడం జీర్ణించుకోలేక విపరీతమై ఉక్రోశం, అసూయ, కడుపుమంటతో ఉడికిపోతున్నవాళ్లు. వాళ్లు జానారెడ్డి వంటి వారిని కూడా భ్రష్టుపట్టించాలని చూస్తున్నారు. లేకి నాయకత్వాలు పార్టీల ప్రతిష్టలను పెంచవు. మరింత మరింత పతనం వైపు నడిపిస్తాయి.

తెలంగాణలో టీటీడీపీని పునరుద్ధరించడం లంపెన్ నాయకత్వాలతో కాదు. ఏదైనా ఒక పార్టీని బతికించాలి, నడిపించాలి అంటే రాజకీయ పరిణతి చెందిన నాయకులు కావాలి. రాజకీయ మరుగుజ్జుల వల్ల కాదు. తెలంగాణలో టీడీపీని పునరుద్ధరించడం 1999 తర్వాత ఇప్పటిదాకా చంద్రబాబువల్లనే కాలేదు. వీళ్లవల్ల ఏమవుతుంది?

టీటీడీపీ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అది ఆరిపోయే దీపం. చంద్రబాబు నిర్వాకాల పుణ్యాన తెలంగాణలో వారికి ఎటువంటి రిలవెన్స్ లేకుండాపోయింది. ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా, ఎన్ని మొసలి కన్నీళ్లు కార్చినా చంద్రబాబు ఇక పక్కరాష్ట్రం బాబే. ఆయన అందరి మనిషి కాదు, కాలేడు. టీడీపీ అంటేనే ఆంధ్రాపార్టీగా స్థిరపడిపోయింది. అయితే తెలంగాణతో పంచాయతీలు కొనసాగిస్తుంటేనే భవిష్యత్తులో కూడా అక్కడ చంద్రబాబుకు రాజకీయ మనుగడ. ఎందుకంటే ఇప్పుడాయన అక్కడ ఉన్న పరిస్థితుల్లో పరిపాలనలో సక్సెస్ కావడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. పరిమితులు ఉన్నాయి. అందుకే తెలంగాణకు వ్యతిరేకంగా భావోద్వేగాలను సజీవంగా ఉంచడం ఆయనకు అవసరం. ఆయనను తెలంగాణ ఇక ఆదరించడం కల్ల. ఇది సహజ రాజకీయ పరిణామక్రమం. అక్కడో ఇక్కడో ఇంకా కొంతమంది తెలంగాణ సోదరులు ఎటుపోవాలో ఏం చేయాలో దిక్కుతోచక ఆ పార్టీలో ఉండిపోవచ్చు. వచ్చే ఎన్నికల సమయానికి వారు కూడా ఏదో ఒక పార్టీని చూసుకుంటారు. తెలంగాణలో టీటీడీపీని పునరుద్ధరించడం లంపెన్ నాయకత్వాలతో కాదు. ఏదైనా ఒక పార్టీని బతికించాలి, నడిపించాలి అంటే రాజకీయ పరిణతి చెందిన నాయకులు కావాలి. రాజకీయ మరుగుజ్జుల వల్ల కాదు. తెలంగాణలో టీడీపీని పునరుద్ధరించడం 1999 తర్వాత ఇప్పటిదాకా చంద్రబాబువల్లనే కాలేదు. వీళ్లవల్ల ఏమవుతుంది? అనునిత్యం ఉక్కపోతతో కడుపుచించుకునేవాళ్లతో ఏమీ ఒరగదు. వాళ్లు పార్టీని ఇంకింత నాశనం చేయడం తప్ప ఒరిగేది లేదు. వాళ్లు చంద్రబాబు కీ ఇచ్చిన బొమ్మల్లా వ్యవహరిస్తున్నారని ప్రతిక్షణం అర్థం అవుతూనే ఉంది. ఆ పార్టీతోక పట్టుకుని తెలంగాణ బీజేపీ నాయకత్వం కూడా వారి పాటే పాడుతున్నది. టీడీపీని వెంటబెట్టుకోవడం అంటే తెలంగాణలో శనిని వెంటబెట్టుకోవడమే.

బీజేపీ నేతలు కూడా టీటీడీపీతో పోటీలు పడి అకాల విమర్శలు, అకారణ అక్కసు వెళ్లగక్కుతున్నారు. విమర్శలకు ప్రభుత్వం, పాలక పక్షం అతీతం కాదు. కానీ చేస్తున్న దాడి ప్రజలకు సమంజసం అనిపించాలి. పార్టీల ప్రతిష్ఠ పెంచడమయినా దించడమయినా ఒక్కరోజుతో కాదు. కానీ ప్రతి అడుగులో ఆ ఎదుగుదల కనిపించాలి. ఆ పరిణతి కనిపించాలి. ఆ హుందాతనం కనిపించాలి. బీజేపీ నాయకత్వం ఎవరినో అనుకరించడానికి, ఎవరితోనో పోటీపడడానికి మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నదే తప్ప, సొంత పంథాతో అడుగులు వేస్తున్నట్టు కనిపించడం లేదు. కాంగ్రెస్‌లో కూడా ఇటువంటి వారు కొందరు ఉన్నారు. పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన నేత మొదలు మాజీ మంత్రులు, మాజీ ఎంపీల వరకు అందరూ నోరు పారేసుకునేవారే. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ ప్రసంగంలో కేసీఆర్‌పై కులం, కుటుంబం అని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కులం ప్రతినిధిగా ఉద్యమం సాగించలేదు. కులం ప్రతినిధిగా రాష్ట్రం సాధించలేదు. కులం ప్రతినిధిగా ముఖ్యమంత్రి కాలేదు. తెలంగాణ ప్రజల ఆమోదంతోనే ఆయన అడుగులు ముందుకు వేశారు. ఆయన కుటుంబం కూడా ఉద్యమాలలో కేసీఆర్ వెన్నంటి నడిచారు. ఉద్యోగాలు, వ్యాపారాలు వదిలేసి ఉద్యమాల్లో, టీఆరెస్ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. వాళ్లు నిర్వహించిన పాత్రకు ఇవ్వాళ ఎవరూ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన పనిలేదు. తెలంగాణ సమాజానికి తెలుసు. కానీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసింది ఏమిటి? ఎటువంటి రాజకీయ చరిత్ర లేకపోయినా తన సతీమణికి కోదాడ టికెట్ ఇప్పించుకున్నారు. అక్కడ రెడ్డి అయితేనే గెలుస్తారని అధిష్ఠానాన్ని నమ్మించి టిక్కెటు తెచ్చుకున్నారు. అప్పుడు కులమూ, కుటుంబమూ కనిపించలేదా? విమర్శలు చేయడం సులువు. కానీ మనం చేసే విమర్శను మనమీదే ప్రయోగిస్తే మనం నిలవగలమా లేదా అన్నది ప్రతిసారీ ప్రతినాయకుడూ వెనుదిరిగి చూసుకోవాలి.

ఇంకొకాయన ఉన్నాడు. తెలంగాణలో తనకు చాలా పలుకుబడి ఉందని చెప్పే పెద్దమనిషి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఒక్క మంచి పనీ చేయలేదు. ఢిల్లీలో పెత్తనం చేసిన కాంగ్రెస్ దళారీలకు అడుగులకు మడుగులొత్తడం, వారికి ఉచిత సేవలు చేయడం తప్ప తెలంగాణకు ఉపయోగపడింది లేదు. అటువంటాయన ఇప్పుడు ఫర్మానాలు జారీ చేస్తున్నాడు. వీళ్లకు ఇంకా ఎందుకు సోయిరాలేదో అర్థం కావడం లేదు. వరుసగా ఇన్ని ఎన్నికల్లో జనం తిరస్కరించిన తర్వాత కూడా బాధ్యతగా మసలు కోవాలన్న విషయం ఎందుకు అర్థం కావడంలేదో బోధపడదు. ఇంకో పెద్దమనిషి ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో కూడా బాగానే ఉరుకులబెట్టాడు. ఆయన ఓ బట్టకాల్చి మంత్రి జగదీశ్‌రెడ్డి మీద వేశాడు. లేస్తే మనిషిని కాదంటాడు. నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయంటాడు. అవన్నీ విచారించడానికి ఒక వేదిక కావాలట. జగదీశ్‌రెడ్డి సూర్యాపేట కోర్టులో కేసు వేసి వేదిక కల్పించాడు. కోర్టుకు మించిన వేదిక లేదు. ఆ ఆధారాలన్నీ ఆయన కోర్టుకు సమర్పించి జగదీశ్‌రెడ్డిని దోషిగా నిరూపించవచ్చు. లేదంటే తాను బోనులోకి పోవచ్చు. విచిత్రం ఏమంటే ఇంత రాజకీయ అనుభవం కలిగిన నాయకులు కూడా సచివాలయంలో అస్తమానం గాలిపోగేసే కొందరు పైరవీ జర్నలిస్టులు, పైసలిచ్చి ప్రకటనలు చేయించుకునే కొందరు ఇంజనీరింగ్ విద్యా వ్యాపారుల గాలాలకు చిక్కడం. నాయకులు తమ ఒరిజినాలిటీని కోల్పోవడం, కిరాయి మనుషులుగా పేరు సంపాదించుకోవడం ఎందుకో. మిషన్ కాకతీయలో అవినీతిపై ఉత్తమ కథనాలు ఇచ్చినవారికి లక్ష రూపాయల బహుమతి ప్రకటిస్తానని మరో లేకి ప్రకటన చేశారు ఇంకో నాయకుడు. జలయజ్ఞం ధనయజ్ఞంగా మారినప్పుడు, ఆ అవినీతి యజ్ఞాన్ని పత్రికలు పేజీలకు పేజీలు రాసినప్పుడు ఎంతమందికి బహుమతులు ప్రకటించారు? అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు పండ్లు తోముతూ తరించారెందుకు? చిల్లర వేషాల్లో టీడీపీ నాయకులు, కొందరు కాంగ్రెస్ నాయకులు పరస్పరం పోటీపడుతున్నట్టు కనిపిస్తున్నది.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s