తెలంగాణ తేజమే నిజం


IMG_2293

‘తెలుగు తేజం, ఆంధ్ర తేజం అని ఇంతకాలం వాళ్లు చెప్పినదంతా తెలంగాణ తేజమే. తెలంగాణ బలమే ఆంధ్రప్రదేశ్ బలంగా చెలామణి అయింది. తెలంగాణ సొమ్ములు, భూములు, వనరులతో రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు అధికార చక్రాలు తిప్పారు’

తెలంగాణా ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజులు గుర్తున్నాయా? తొలుత రాజశేఖర్‌రెడ్డి, తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు, ఉండవల్లి, లగడపాటి….వంటివారు తెలంగాణ గురించి ఏమన్నారో జ్ఞాపకం ఉందా? వీళ్లసలు ముందుగా తెలంగాణ ఉద్యమాన్నే గుర్తించలేదు. తెలంగాణ ఉద్యమ నాయకులను గుర్తించలేదు. పైగా ఎగతాళి చేసి, ఆగంపట్టించాలని చూశారు. తెలంగాణకు అసలు నాయకులే లేరన్నారు. పరిపాలించుకోలేరన్నారు. విడిగా తెలంగాణ బతకలేదన్నారు. సంపన్న ఆంధ్ర జిల్లాలతో కలిసి ఉంటేనే తెలంగాణకు బతుకుదెరువన్నారు. అక్కడి నిధులు తెచ్చి ఇక్కడ పెడుతున్నామన్నారు. తెలంగాణకు తీరప్రాంతం లేదన్నారు. సమైక్యపాలనలో తెలంగాణలోనే ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. తెలుగుతేజాన్ని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారన్నారు….ఇక తెలంగాణ ఇవ్వక తప్పదని తేలిపోయిన తర్వాత, కేంద్రం రాష్ట్ర విభజన దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టిన తర్వాత, విడిపోతే మాకు నష్టం, కష్టం అని వాదించడం మొదలు పెట్టారు. హైదరాబాద్ లేకపోతే మాకు మనుగడ లేదన్నారు. తెలంగాణను అడ్డుకోవడానికి అడ్డగోలు ప్రయత్నాలన్నీ చేశారు. తెలంగాణ వచ్చినా ప్రశాంతంగా పనిచేసుకోలేని, పరిపాలించుకోలేని మెలికలెన్నో పెట్టి కూర్చున్నారు. ఇప్పుడు అదే చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి, ‘జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నాం ఆదుకోండ’ని కేంద్రాన్ని ప్రాధేయపడుతున్నారు. సమైక్య రాష్ట్రంలో సమస్త రాష్ట్రాన్ని పోషించామని చెప్పుకున్న నాయకులు ఇప్పుడు ఈ బేలతనాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారు? రాష్ట్రంలోని అందరికీ జీతాలు తామే చెల్లించామని చెప్పుకున్న నాయకత్వం ఇప్పుడు ఇలా ఎందుకు వాపోతున్నది? ఆంధ్ర ప్రాంతం దన్నుతో తెలంగాణను ఉద్ధరించామని చెబుతున్నదంతా నిజం కాదన్నమాట. ‘తెలుగు తేజం, ఆంధ్ర తేజం అని ఇంతకాలం వాళ్లు చెప్పినదంతా తెలంగాణ తేజమే. తెలంగాణ బలమే ఆంధ్రప్రదేశ్ బలంగా చెలామణి అయింది. తెలంగాణ సొమ్ములు, భూములు, వనరులతో రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు అధికార చక్రాలు తిప్పార’ని ఒక తెలంగాణ రచయిత, కవి చెప్పిన మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అబద్ధాల సేద్యం కొసెల్లదు. అన్యాయపు వాదాలు నిలబడవు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పేర్చిన అబద్ధాల పేక మేడ కూలిపోవడానికి ఎంతో కాలం పట్టలేదు. చంద్రబాబే దానిని కూల్చివేస్తుండడం ఇంకా ఆసక్తిని కలిగించే విషయం.

‘విలువైన వస్తువులు, వాహనాలు, యంత్రాలు ఏవైనా కొనాల్సి వస్తే ఆంధ్రలో కొనండి. ఇక్కడ దొరకకపోతే చెన్నయ్, బెంగళూరులలో కొనండి. హైదరాబాద్‌లో, తెలంగాణలో మాత్రం కొనవద్దని మా అగ్ర నాయకులు చెబుతున్నారు. ఈ ధోరణి మరీ రోతపుట్టిస్తున్నది’

ఆంధ్ర రాష్ట్రం ఇబ్బందులు పడడం తెలంగాణకు వినోదం కాదు. అక్కడి ఉద్యోగులు, ప్రజలు సమస్యల్లో పడడం తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షా కాదు. ఆంధ్ర నాయకత్వం వాస్తవిక దృష్టితో తెలంగాణ ఉద్యమాన్ని చూడలేకపోవడం, అబద్ధాలతో, ఆవేశకావేశాలతో ఉద్యమాన్ని తప్పుదోవపట్టించాలని చూడడం ఇవ్వాల్టి పరిస్థితికి కారణం. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రజానీకాన్ని ఎగదోయాలని చూడడం ఇంకా విషాదం. సామరస్యంగా విభజన జిరిగి ఉంటే ఆంధ్ర ప్రాంతానికి కూడా మరింత న్యాయం జరిగి ఉండేది. సీమాంధ్ర నాయకత్వం తెలంగాణను ప్రతిఘటిస్తున్నామన్న రాజకీయ భ్రమలో పడిపోయి, తమ ప్రాంతానికి సాధించుకోవాల్సిన హక్కులు, నిధులు… అన్నింటినీ గాలికి వదిలేశారు. అవాస్తవిక నినాదాలతో వాస్తవిక సమస్యలను వదిలేశారు. ఆ పాపంలో సీమాంధ్ర నాయకులందరూ భాగస్వాములే. చంద్రబాబు ఇప్పటికయినా వాస్తవిక దృష్టికి రావడం మంచిదే. వరుస వాయి, సమయమూ సందర్భమూ తెలియని ఒక రాజకీయ అజ్ఞాన గుంపును వెంటేసుకుని, తెలంగాణలో ఇంకా ఏదో బావుకుందామని ఇక్కడ సమస్యలు సృష్టిస్తున్నారు. ఇటువంటి చిల్లర పనులు మాని ఆంధ్ర ప్రాంత హక్కులకోసం పోరాడితే తెలంగాణ ప్రజానీకం కూడా ఆయనకు సంఘీభావం ప్రకటిస్తుంది. పోలవరం కోసం ఆరు మండలాలను కలిపేయడమే బలవంతంగా జరిగింది. కొత్తగా బూర్గంపాడును కూడా కొట్టేయాలని చూడడం చంద్రబాబు దుర్భుద్ధికి నిదర్శనం. ఉమ్మడి సంస్థలు, ఉమ్మడి నిధులు, ఎంసెట్ వంటి అంశాలలో కూడా చంద్రబాబు ఇంకా తెలంగాణపై వంకర దృష్టితోనే స్వారీ చేయాలని చూస్తున్నారు. ఇంకా విడ్డూరం ఏమంటే, ‘విలువైన వస్తువులు, వాహనాలు, యంత్రాలు ఏవైనా కొనాల్సి వస్తే ఆంధ్రలో కొనండి. ఇక్కడ దొరకకపోతే చెన్నయ్, బెంగళూరులలో కొనండి. హైదరాబాద్‌లో, తెలంగాణలో మాత్రం కొనవద్దని మా అగ్ర నాయకులు చెబుతున్నారు. ఈ ధోరణి మరీ రోతపుట్టిస్తున్నది’ అని తెలుగుదేశం సీనియర్ నాయకుడే ఒకాయన ఇటీవల వాపోయాడు. చంద్రబాబునాయుడు తన ‘గీత’ను బాగుచేసుకోవడానికి బదులు ఎదుటివారి ‘గీత’ను చెరిపేయాలని చూస్తున్నారు. ఇట్లా ఆలోచించినవాళ్లెవరూ బాగుపడిన దాఖలాలు చరిత్రలో లేవు. రెండు ప్రాంతాల మధ్య సయోధ్యను పెంచడానికి ఇవి ఏమాత్రం దోహదం చేయవు. ఇప్పుడు తెలంగాణతో కొట్లాడి ఆంధ్రలో బావుకునేది ఏమీ లేదు.

భూస్వామ్యం నుంచి తొందరగా బయటపడింది, సామాజిక సామరస్యాన్ని సాధించింది తెలంగాణనే. దళితులు, పేదలపై సీమాంధ్రలో జరిగినన్ని దారుణాలు తెలంగాణలో జరుగలేదని పౌరహక్కుల ఉద్యమాల నివేదికలే బట్టబయలు చేశాయి. తెలంగాణలో జరిగిన అన్ని రకాల ఉద్యమాలు తెలంగాణ సమాజాన్ని మరింత ప్రజాస్వామ్యీకరిస్తూ వచ్చాయి.

తెలంగాణ నాయకత్వాన్ని పలుచన చేయడానికి, ప్రజల ముందు విలన్లుగా నిలబెట్టడానికి సీమాంధ్ర ఆధిపత్య వ్యవస్థలు చేసిన ప్రయత్నమే ఇంకా ఇక్కడ కొందరు కొనసాగిస్తున్నారు. తెలంగాణలోనే దొరలు, భూస్వాములు ఉంటారని, ఇక్కడే అన్నిరకాల అణచివేతలు ఉంటాయని చారిత్రకంగా ఒక ప్రచారం జరిగింది. తెలంగాణ వస్తే మళ్లీ భూస్వాముల పాలన వస్తుందని ప్రచారం అప్పుడూ, ఇప్పుడూ కొనసాగుతున్నాయి. సీమాంధ్ర ఆధిపత్య వ్యవస్థలు సృష్టించిన మేధో భావజాలం ఇప్పటికీ ఇక్కడి మేధావులు, సామాజిక వేత్తల మెదళ్లను ఏలుతున్నది. భూస్వాములు, అణచివేత, దుర్మార్గాలు ఒక్క తెలంగాణలోనే కాదు, ఆంధ్రలోనూ ఉన్నాయి. కానీ విశాలాంధ్రవాదులు ఉద్దేశపూర్వకంగా ఒక సత్యాన్ని మరుగున పడేశారు. తెలంగాణను భూస్వాముల నుంచి, నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి చేయడానికి ముందుగా రంగంలోకి దూకిన నేతల సామాజిక నేపథ్యాలు ఒక్కసారి ఎవరియినా అధ్యయనం చేశారా? రావి నారాయణ రెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వర్‌రావు, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, రేణికుంట రాంరెడ్డి, గొట్టిముక్కల గోపాల్‌రెడ్డి, యానాల మల్లారెడ్డి, అల్గుబెల్లి వెంకటనర్సింహారెడ్డి, ఎలమరెడ్డి గోపాలరెడ్డి, అనభేరి ప్రభాకర్‌రావు, బోయినపల్లి వెంకట్రామారావు, చెన్నమనేని రాజేశ్వర్‌రావు, బద్దం ఎల్లారెడ్డి, కట్కూరి రామచంద్రారెడ్డి, పశ్య ఇంద్రసేనారెడ్డి, కొండవీటి జగన్‌మోహన్‌రెడ్డి, గురునాథరెడ్డి, మంచికంటి రాంకిషన్‌రావు, చిర్రావూరి లక్ష్మీనర్సయ్య, గాండ్లూరి కిషన్‌రావు, కాంచనపల్లి వెంకటరామారావు, కాకి చంద్రారెడ్డి, దాయం రాజిరెడ్డి, వెదిరె రాజిరెడ్డి, పులిజాల రాఘవరంగారావు….ఇలా రాస్తూ పోతే ఈ జాబితాకు అంతులేదు. తెలంగాణ సాయుధ పోరాటమే తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసింది. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన అనేక మందిని మహాయోధులుగా మలిచింది. ఆ తర్వాత జరిగిన విప్లవోద్యమాలు కూడా భూస్వామ్యానికి వ్యతిరేకంగా పైకొచ్చినవే. ఆ ఉద్యమాల్లో కూడా అత్యధికులు భూస్వామ్య, అగ్రకుల కుటుంబాల నుంచి వచ్చినవారే. భూస్వామ్యం నుంచి తొందరగా బయటపడింది, సామాజిక సామరస్యాన్ని సాధించింది తెలంగాణనే. దళితులు, పేదలపై సీమాంధ్రలో జరిగినన్ని దారుణాలు తెలంగాణలో జరుగలేదని పౌరహక్కుల ఉద్యమాల నివేదికలే బట్టబయలు చేశాయి. తెలంగాణలో జరిగిన అన్ని రకాల ఉద్యమాలు తెలంగాణ సమాజాన్ని మరింత ప్రజాస్వామ్యీకరిస్తూ వచ్చాయి.

తెలంగాణ ఉద్యమం కూడా అటువంటి ప్రజాస్వామిక ఆకాంక్ష పర్యవసానమే. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు, హక్కులకు ప్రతీకగా కేసీఆర్ ముందుకు వచ్చారు. కేసీఆర్ ఏనాడూ భూస్వామ్య వర్గానికి ప్రతినిధిగా రాజకీయాల్లోకి రాలేదు. తెలంగాణ ఉద్యమం రావడానికి ముందే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సిద్ధిపేట నియోజకవర్గంలో ఆయన కులానికి చెందిన వారు వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మంది. ప్రజల మనిషిగానే ఆయన రాజకీయ సోపానంలో ఎదిగారు. సిద్ధిపేటను ఒక నమూనాగా అభివృద్ధి చేశారు. ప్రజాకేంద్రక అభివృద్ధిని నమ్మి ఆచరించిన నాయకునిగా ఆయనకు పేరుంది. పేదల వాడల్లో తిరిగి, వారి అభివృద్ధికి ప్రణాళికలు వేయడం ఆయన మొదటి నుంచీ చేస్తున్నదే. ‘చలనశీలత ఆయన స్వభావంలోనే ఉంది. నిత్యనూతనంగా ఆలోచించడం, ఆలోచనలను ఆచరణలో పెట్టేదాకా విశ్రమించకపోవడం ఆయన తత్వమ’ని ఆయనను దగ్గరగా చూస్తున్నవారందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమ నిర్మాణానికి, ప్రస్థానానికి ఆయనకు ఆ అనుభవమే పునాదిగా పనిచేసింది. అయినా తెలంగాణ ఉద్యమ నైతికతను దెబ్బతీయడానికి, తెలంగాణ ఉద్యమం భూస్వాముల ఉద్యమమని నిందించడానికి సీమాంధ్ర ఆధిపత్య వ్యవస్థలు ఆయనకు దొర బిరుదును ప్రసాదించాయి. ఆ పేరుతో నిందించడానికి తెలంగాణ లోపలా బయటా కొన్ని పెంపుడు చిలుకలను తయారు చేశాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ చిలుకలు ఇంకా ఆ పలుకులు మానలేదు. ఆ వంకర దృష్టి నుంచి విముక్తి కాలేదు. ఇటువంటి వారి నుంచి తెలంగాణ సమాజమే విముక్తి కావాలేమో.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

One thought on “తెలంగాణ తేజమే నిజం”

  1. sir,
    bjp govt in centre assured that first yr deficit will be borne by them and also spl status will be given
    keeping these in mind, ap govt made some plans.because of delay in centre fulfilling its commitments, ap is facing financial crisis
    moreover hudhud cyclone also
    atleast if spl status was given also,deficit would have been rectified to some extent

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s