Is religion greater than humanity?


మతాలు మనిషిని మించినవా?

13-mumbai-terror-attack-455

మనిషిలో కలిగే అన్ని రకాల స్పందనలు, విశ్వాసాలు దేశకాల పరిస్థితులను బట్టి సంక్రమిస్తాయి. ఎక్కడయినా మనిషి మాత్రమే సత్యం. మనిషి ఆనందంగా ఉండడం మాత్రమే మౌలిక తత్వం. దానికి భంగం కలిగించేవి విశ్వాసాలు కాదు, మానవ విద్రోహాలు, కరడుగట్టిన ఉన్మాదాలు.

‘భారతీయ తత్వంలో ఉన్న గొప్పతనం మరే తత్వంలోనూ లేదు. సహిష్ణుత, వైవిధ్యం, సహజీవనం భారతీయ తత్వానికే సాధ్యమైంది’-చాలాకాలం క్రితం ఒక ఆచార్యుడు చెప్పిన మాటలివి. మా తత్వశాస్త్ర తరగతి గదిలో ఆ ఆచార్యుడు అలా ఒక తత్వాన్ని అంతగా కీర్తించడం ఎందుకో రుచించలేదు. ‘మీకు ఇలా అనిపించినట్టే, అమెరికాలోని మరో తత్వశాస్త్ర ఆచార్యునికి ప్రాగ్మాటిజంపయోజనవాదం) గొప్పగా అనిపించవచ్చు. అరబ్బు విశ్వవిద్యాలయంలోని ఆచార్యులకు ఇస్లామిక్ తత్వశాస్త్రానికి మించింది లేదనిపించవచ్చు. చైనాలోని తత్వశాస్త్ర ఆచార్యునికి కన్ఫ్యూసియన్ తత్వం అపూర్వం అనిపించవచ్చు. టిబెట్ ఆచార్యునికి బౌద్ధాన్ని మించిన తత్వం లేదనిపించవచ్చు. భారత దేశంలోనే ఇంకా నాగరిక ప్రపంచంలోనికి రాని గిరిజన ప్రజల్లో, లాటిన్ అమెరికా, ఆఫ్రికా అడవుల్లో నేటికి ఈ ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉన్న గిరిజన తెగల్లో ఏ తత్వాన్ని, ఏ దేవున్ని, ఏ శక్తిని ఎక్కువ ఇష్టపడతారో, కొలుస్తారో తెలియదు. పుట్టిన పరిస్థితులు, పెరిగిన వాతావరణం, ఎదుర్కొన్న సవాళ్లు ఏ మనిషికి ఏ తత్వాన్ని, ఏ మతాన్ని ఇస్తుందో తెలియదు. మనమే గొప్ప అనుకోవడం ఎలా సార్?’. ఆయన వెంటనే వాస్తవంలోకి వచ్చి ‘తత్వానికి మతం లేదు, స్థలంలేదు, కాలం లేదు. ప్రజలకు ఇష్టమయిందాన్ని బట్టి, అర్థమయిందాన్ని బట్టి అది మనుగడ సాగిస్తుంది. లేదా వెనుకబడిపోతుంది. నాకు ఇష్టమయింది కాబట్టి భారతీయ తత్వాన్ని ఎక్కువగా భావించాను. మన ఇష్టాయిష్టాలకు అతీతంగానే తత్వాలను చూడాలి’ అని ఆచార్యులు సమాధానపరిచారు. ఈ ప్రశ్నలు, చర్చలు ఎడతెగనివి. ఏ దేవుడు గొప్ప? ఏ మతం గొప్ప? అన్న ప్రశ్నలు ముందుకు తేవడమే అనర్థం.

‘భారత దేశంలోని వారంతా మూలంలో హిందువులేన’ని ఒక నాయకుడంటే, ‘ప్రపంచంలోని వారంతా అల్లాహ్ బిడ్డలే’ అని ఒక నాయకుడన్నారు. క్రైస్తవులు కూడా తమ దేవుడిని ‘దేవుళ్లకు దేవుడు, ప్రభువులకు ప్రభువు’ అని భావిస్తారు. మన దేవుళ్లను పూజించడం, ఆరాధించడం, కీర్తించడం మన జీవన విధానం నుంచి వచ్చింది. ఎవరినీ పూజించకుండా జీవించేవాళ్లు, ప్రకృతిని ఆరాధించి బతికేవాళ్లూ ఉన్నారు. ఉంటారు. అవి వారివారి సాంస్కృతిక జీవన విధానాలు. ఇటువంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైవిధ్యం మొన్న ఉంది, నిన్న ఉంది, రేపూ ఉంటుంది. వేదాలు రాసిన ఈ గడ్డపైనే వేదాలను తిరస్కరించిన చార్వాకులూ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సహజీవనం కొనసాగుతూనే ఉన్నది. ఎటొచ్చీ ఎవరు గొప్ప అన్న ప్రశ్నలు వేసుకుని, ఒక మతంతో మరో మతాన్ని, ఒక దేవునితో మరో దేవుడిని పోటీ పెట్టాలని చూసినప్పుడు మాత్రమే ఘర్షణ పుడుతుంది. ఇటువంటి ఘర్షణలన్నీ చరిత్రలో అధికారంకోసం, రాజకీయాలకోసం మొదలయి యుద్ధాలదాకా వెళ్లాయి. మనం నాగరికులం అనుకుంటున్నాం. ఎదిగామనుకుంటున్నాం. ఖగోళ మూలాలను ఛేదించే బాటలో పయనిస్తున్నాం. సృష్టికి ప్రతిసృష్టి చేయడం గురించి పరిశోధనలు చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఇటువంటి మధ్యయుగాల వాదాలతోనే యుద్ధాలకు దిగుదామా?

భవిష్యత్తులో ‘నాగరికతల సంఘర్షణ(clash of civilizations)’ జరిగే ప్రమాదం ఉందంటూ అమెరికన్ రాజనీతి శాస్త్రవేత్త హంటింగ్టన్ రెండున్నర దశాబ్దాల క్రితం చెప్పిన జోస్యం ఆచరణ రూపం తీసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. మరో ప్రపంచయుద్ధం అంటూ వస్తే, అది క్రైస్తవ, ఇస్లామిక్ ప్రపంచాల మధ్య యుద్ధంగా జరుగుతుందని పాశ్చాత్య రాజనీతిజ్ఞులు కొంతకాలంగా విశ్లేషణలు చేస్తున్నారు. మనిషి, మానవత్వం కంటే రాజకీయ అధికారం, ఆధిపత్యం మత లక్ష్యాలుగా మారడం ఇవ్వాళ ఇటువంటి దుస్థితికి కారణం. ఈ ధోరణి విస్తరించి, వికటించే కొద్ది మానవాళికి ముప్పు పెరుగుతుంది. ఈసారి అటువంటి యుద్ధమంటూ వస్తే మిగిలేది నాగరికతలు, మతాలు, దేశాలు కాదు…బూడిద.

విచిత్రం ఏమంటే అన్ని మతాలూ దేవుడిని కీర్తించే విషయాలు ఒకే విధంగా ఉంటాయి. ‘దేవుడు ఒక్కడే, సర్వవ్యాపి, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, దయామయుడు’-అన్ని మతాలూ దాదాపూ ఇలాగే కీర్తిస్తాయి. కొన్ని మతాలు దేవుడిని ‘నిరాకారుని’గా భావిస్తాయి. ‘నిర్గుణుడి’గానూ భావిస్తాయి. మరికొన్ని మతాలు దేవుడిని విశ్వరూపుడు, తేజోరూపుడు, సద్గుణ సంపన్నునిగా భావిస్తాయి. మనిషి పుట్టుక నుంచి, దేశకాల పరిస్థితుల నుంచి, వారివారి అనుభవాల నుంచి, ఒక్కో కాలానికి, ఒక్కో ప్రాంతానికి, ఒక్కో దేవుడు అవతరించాడు. ఇప్పుడు ప్రపంచమంతటా వందలు, వేల దేవుళ్లు ఉన్నారు. ఎవరి దేవుడు వాళ్లకు. ఎవరి గొప్ప వారిదే. ఎవరి నమ్మకం వారిదే. ప్రపంచమంతటా మనుషులు తమకు రక్షణగా దేవుడిని ఆశ్రయించారు. దేవుడు అదే మనుషులను చంపమంటాడా? చంపి సాధించేది భక్తి కాదు, ఆధిపత్యం, అధికారం. మతం, విశ్వాసం మనిషి, మనసుకు సంబంధించినవి. వాటిని అనుభవించనీయండి. ఆసరా పొందనివ్వండి. ఆ మనుషులను రాక్షసులను చేసే దిశగా మతం, విశ్వాసం ఎదగకుండా చూడండి. ‘త్యాగరాజ కీర్తనలు వింటే నేను ప్రపంచాన్ని మరచిపోతాను. అందులో ఎంత తాదాత్మ్యత? ఎంత తాత్వికత? ఎంత భక్తి? ప్రపంచమంతా తిరిగాను. ఇంకే సంగీతం విన్నా నాకు ఇలా అనిపించలేదు’ అని ఒకసారి మా తత్వశాస్త్ర ఆచార్యులు అన్నారు. నేను పుట్టుకతో త్యాగరాజు కీర్తనలు వినలేదు. గుమ్మడికాయ బుర్రతో తయారు చేసుకున్న తంబురపై ఊరంతా తిరుగుతూ మా మాబాయి పాడిన రామదాసు కీర్తనలే నాకు బాగా గుర్తు. ఏక్‌తారతో సన్నని గొంతు కలిపి ఆయన పాడుతుంటే ఎంతో మైమైరచిపోయేవాళ్లం. ఆదిలాబాద్ అడవుల్లో గుస్సాడి నృత్యానికి, వారి పాటలకు అక్కడి గిరిజనం ఊగిపోతుంది. రష్యాలో జాజ్, రాక్, యూరప్‌లో పాప్, అమెరికాలో రాక్, జాజ్, తూర్పు ఆసియాలో బుద్ధిస్టు సంగీతమంటే చెవులుకోసుకుంటారు. ఇంకా దేశంలో ఎక్కడెక్కడి ప్రజలను ఏయే సంగీతాలు ఎలా కదిలిస్తాయో తెలియదు. మన నరాల్లో ఇంకిపోయిన సంగీత తంత్రులు మనకు మన జీవితం నుంచి సంక్రమించినవి. అంటే మనిషిలో కలిగే అన్ని రకాల స్పందనలు, విశ్వాసాలు దేశకాల పరిస్థితులను బట్టి సంక్రమిస్తాయి. ఎక్కడయినా మనిషి మాత్రమే సత్యం. మనిషి ఆనందంగా ఉండడం మాత్రమే మౌలిక తత్వం. దానికి భంగం కలిగించేవి విశ్వాసాలు కాదు, మానవ విద్రోహాలు, కరడుగట్టిన ఉన్మాదాలు.

పెషావర్, బెంగళూరు, పారిస్, వజీరిస్థాన్… ప్రపంచంలో ఎక్కడ తూటాలు పేలుతున్నాయన్నా, ఎక్కడ బాంబులు పేలుతున్నాయన్నా, ఎక్కడ టార్పెడోలు రాలుతున్నాయన్నా….మత ప్రేరిత యుద్ధోన్మాదాలే కారణం. ఈ మతం ఆ మతం అన్న భేదం అక్కర లేదు. అమెరికా, పాశ్చాత్య దేశాలు లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి ఒకప్పుడు మతోన్మాద భూతాన్ని సృష్టించి భూమండలంపై వదిలాయి. మధ్యయుగాల్లో మట్టికలసి పోయిన మతోన్మాద భూతాన్ని తట్టి లేపి కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఉసిగొల్పారు. ‘కమ్యూనిజం పీడ’ నుంచి ప్రపంచాన్ని విముక్తి చేయడంకోసమని ఇస్లామిక్ ఉగ్రవాదులను చిన్నపిల్లల్లా సాకారు. తుపాకి గొట్టం నుంచి అధికారం ఎలా సాధించుకోవచ్చో వారికి రుచి చూపారు. మతం పేరుతో రాజ్యాలను ఎలా కొల్లగొట్టవచ్చో అఫ్ఘనిస్థాన్‌లో వారికి అనుభవంలోకి వచ్చింది. అదే సూత్రాన్ని ప్రపంచమంతటికీ విస్తరిస్తున్నారు. ఆ ఉగ్రవాదమే సర్వవ్యాప్తతమై ప్రపంచాన్ని వణికిస్తున్నది. ఇప్పుడు అదే అమెరికా ఉగ్రవాదాన్ని అణచివేత పేరుతో ఇస్లామిక్ దేశాలకు వ్యతిరేకంగా గిల్లి గిల్లి యుద్ధాలు చేస్తున్నది. చివరికి ఇది మతయుద్ధంగా పరిణమిస్తుందా అన్న భయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్తులో ‘నాగరికతల సంఘర్షణ(clash of civilizations)’ జరిగే ప్రమాదం ఉందంటూ అమెరికన్ రాజనీతి శాస్త్రవేత్త హంటింగ్టన్ రెండున్నర దశాబ్దాల క్రితం చెప్పిన జోస్యం ఆచరణ రూపం తీసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. మరో ప్రపంచయుద్ధం అంటూ వస్తే, అది క్రైస్తవ, ఇస్లామిక్ ప్రపంచాల మధ్య యుద్ధంగా జరుగుతుందని పాశ్చాత్య రాజనీతిజ్ఞులు కొంతకాలంగా విశ్లేషణలు చేస్తున్నారు. మనిషి, మానవత్వం కంటే రాజకీయ అధికారం, ఆధిపత్యం మత లక్ష్యాలుగా మారడం ఇవ్వాళ ఇటువంటి దుస్థితికి కారణం. ఈ ధోరణి విస్తరించి, వికటించే కొద్ది మానవాళికి ముప్పు పెరుగుతుంది. ఈసారి అటువంటి యుద్ధమంటూ వస్తే మిగిలేది నాగరికతలు, మతాలు, దేశాలు కాదు…బూడిద.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

2 thoughts on “Is religion greater than humanity?”

  1. నిజమైన హిందువు ఎవరూ ఇతర మతస్తుల్నికించపరచడు.ప్రాచీన కాలంనుండి హిందూ మతం అందరి విశ్వాసాలను ఆమోదించింది.నిజానికి హిందూ అనేది ఇతర మతాల వలె వ్యవస్తీకృతం అయినది కాదు.భగవంతుడు అన్నిప్రాణుల్లోనూ ఉన్నాడన్నసత్యాన్నితాము తెలుసుకొని ఇతరులకు తెలుపడంకోసం యోగులు,ఋషులు రకరకాలుగా మార్గాలను ఏర్పరచారు.ఆమార్గాలన్నింటిని కలిపి ఇప్పుడు హిందూమతం అంటున్నారు. భగవంతున్ని తెలుకోవడానికి ఎవరు ఏ మార్గాన్నైనా అవలంబించవచ్చు.అది ముస్లిముల పద్దతి అయినా, క్రైస్తవుల పద్దతి అయినా కావచ్చు. మా మార్గమే సరైనది అని మొండి వాదన చేసే వారితోనే సమస్య.ఈ దేశం పైకి ఎన్నోజాతులవారు దండెత్తి వచ్చినా వారందరూ ఈదేశ ప్రజల సరైన జీవన విధానంతో ప్రభావితమై కలిసిపోయారు.రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నతరువాత కొన్నిరాజకీయ పార్టీల సంకుచిత వోటు బాంకు రాజకీయాల వల్ల పరిస్తితులు మారుతున్నాయి.ప్రస్తుత కాలంలో శిరిడీ సాయి బోధించిన మార్గంలో అందరి దేవుడు ఒక్కడే అనే విధానాన్నిపాటిస్తే ఏ గొడవలు ఉండవు.అదే విషయాన్ని వీర బ్రహ్మేంద్ర స్వామి. వివేకానంద,రమణ మహర్షి , మెహర్ బాబా , రైదాసు,యోగి వేమన, మొదలైన ఎందఱో మహాత్ములు చెప్పారు.వీటిని పాటించకుండా మేమే హిందూ మతాన్ని రక్షిస్తున్నామని అనుకునేవారు నిజమైన హిందువులు కారు. ఈ దేశ ప్రజలు వారు ఏ మతానికి చెందిన వారైనా రాజకీయ పార్టీల ప్రభావాలకు లొంగకుండా సహనముతో కలిసి మెలసి ఉండాలని కోరుకుంటున్నాను.మానవత్వం ఒక మనిషి ఇతర మనుషులను తోటి మనుషులుగా చూడడంలో సహాయపడుతుంది . కాని దైవత్వం ప్రానులన్నింటిని దైవ సమానులుగా చూడడంలో సహాయపడుతుంది. దైవత్వం చూపిన్చకున్నా కనీసం ఇతరుల పట్ల మానవత్వం చూపించినా ఇటువంటి ధోరణులు మారుతాయి.

  2. Sir
    Any religion does not greater than humanitariism
    But in the same way
    No one cannot
    Criticise other regions believes .I observe some of our friends are Supporting this incident But how can I turn their minds d they are educate them because their ism are foolism.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s