చెల్లనికాసుల చిల్లర పంచాయితీ


image

తెలంగాణ అసెంబ్లీ గౌరవం కాపాడుకుందాం

నీకు మంచిపేరు లేకపోతే అవతలివాడికి ఉన్న పేరును చెడగొట్టెయ్. నీవు చిన్న గీత అయితే, నీ గీతను పెంచుకోలేకపోతే పెద్ద గీతను చెరిపేసెయ్. ముఖం బాలేకపోతే అద్దం పగులగొట్టు. నీకు చేయడానికి ఏ పనీ లేకపోతే అవతలివాడి పనిని కూడా చెడగొట్టు. సీమాంధ్ర ఆధిపత్య శక్తులు చాన్నాళ్లుగా అమలు చేస్తున్న వ్యూహం ఇది. చంద్రబాబు, వైఎస్సార్, తెలంగాణలోని వారి ఏజెంట్లు, ఆంధ్ర మీడియా… అందరిదీ అదే దారి. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని నైతికంగా దెబ్బతీయడానికి వారు చేయని ప్రయత్నం లేదు. కేసీఆర్‌పై వ్యక్తిగతంగా అత్యంత నీచమైన దాడులకు కూడా వెనుకాడలేదు. తాగుడు, జూదం, వ్యభిచారం, ఆర్థిక నేరాలు, దందాలు, మోసాలు, ఏమాటకూ కట్టుబడని రాజకీయ అవినీతి వంటి సకల అవలక్షణాల పునాదులపై పుట్టిపెరిగిన సీమాంధ్ర నాయకత్వం తమ మచ్చలను కప్పి పుచ్చుకుని తెలంగాణ నాయకత్వంపై దాడులు చేయించింది. తెలంగాణలోని కొందరు కిరాయి కోటిగాళ్లను అడ్డంపెట్టుకుని తెలంగాణ నాయకత్వంపై విపరీతమైన విషప్రచారం చేయించింది. తెలంగాణ నాయకులు తాగుతారని, వారికి రాజకీయాలు చేతకాదని, పార్టీలను నడుపలేరని, టికెట్లు అమ్ముకుంటారని….ఇంకా నోటికి ఏమి వస్తే అవి మాట్లాడించారు. నిజానికి రాజకీయాలను లాభసాటి వ్యాపారంగా మార్చింది సీమాంధ్ర నాయకత్వమే. పార్టీలను లిమిటెడ్ కంపెనీలుగా మార్చింది వారే. టిక్కెట్ల అమ్మకాలు కొనుగోళ్లు ప్రవేశపెట్టింది చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలే. హైదరాబాద్ చుట్టూ ఎస్టేట్‌లు, ఫామ్ హౌజ్‌లు, పారిశ్రామిక సామ్రాజ్యాలు నిర్మించుకుంది వారే. మొత్తం కుటుంబాలను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆయా పార్టీలను కబ్జాపెట్టిందీ వారే. ఒక్కో కుటుంబం నుంచి అరడజను మంది, డజను మంది పార్టీల్లో, ప్రభుత్వాల్లో తిష్ట వేసిన చరిత్ర వారిది. తమ తమ కులాల వారికి ప్రభుత్వాల్లో, పార్టీల్లో పెద్ద పీట వేసి కుల పార్టీలుగా, కుల ప్రభుత్వాలుగా పేరుగడించిన చరిత్ర కూడా సీమాంధ్ర నాయకులదే. రాజకీయాల్లో, ప్రభుత్వాల్లో ప్రత్యర్థులను రాచి రంపానపెట్టిన నియంతృత్వ చరిత్ర కూడా వారికుంది. నమ్మిన వారిని నట్టేట ముంచిన హీనమైన చరిత్ర కూడా వారిది. సీమాంధ్ర నాయకత్వం తమకు ఉన్న ఈ అవలక్షణాలన్నింటినీ తెలంగాణ నాయకత్వానికి అంటగడుతున్నది.. వారి చెంచా మీడియా కూడా చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి ఎజెండాలను అమలు చేస్తూ వచ్చాయి. తెలంగాణ నాయకత్వానికి వారు ఏ రంగు వేయమంటే ఆ రంగు వేస్తూ వచ్చాయి.

విచిత్రంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అది కొనసాగుతున్నది. తెలంగాణలో చంద్రబాబునాయుడు కోరుకుంటున్నదే జరుగుతున్నది. రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు… వంటి తెలుగుదేశం నాయకులు ఇప్పుడు రోజూ పతాక శీర్షికల్లో కనిపిస్తున్నారు. అసెంబ్లీలో వారి గురించే మాట్లాడుతున్నారు. బయటా వారి గురించే మాట్లాడుతున్నారు. ప్రజల దృష్టిని, ప్రభుత్వం దృష్టిని మళ్లించడానికి చంద్రబాబునాయుడు ఎప్పుడూ అమలు చేసే వ్యూహమే ఇప్పుడు కూడా ఇక్కడ ఆచరణలో పెట్టారు. ఆయన వ్యూహాన్నే ఆయన చేలా మీడియా కూడా అనుకరిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న పనులపై మంచి చెడుల చర్చ జరుగకూడదు. ఎంత నీచంగా, ఎంత అమర్యాదకరంగా మాట్లాడినా పర్వాలేదుకానీ ‘చర్చను నీవైపు తిప్పుకో’. అదే జరుగుతున్నది. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు కూడా గమనించారో లేదో కానీ తెలుగుదేశం వ్యూహంలోనే పడిపోతున్నారు. నిజానికి తెలంగాణ తెలుగుదేశం నాయకులు చరిత్ర హీనులు. తెలంగాణ మొత్తం వీధిపోరాటాలు చేస్తుంటే తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు చేసిన చంద్రబాబుతో కలిసి చలిమంటలు కాచుకున్న బ్యాచ్. చంద్రబాబు ఉసిగొల్పినట్టల్లా తెలంగాణ ఉద్యమంపై అత్యంత నీచంగా దాడులు చేసిన నీతిబాహ్యులు. తెలంగాణ ప్రజల బాగోగుల కంటే చంద్రబాబు బాగోగుల గురించి, ఆయన ఇచ్చే ఎన్నికల పెట్టుబడుల గురించి మాత్రమే ఆలోచించిన అల్పబుద్ధులు. తెలంగాణ సమాజం ఆ పార్టీని తిరస్కరించింది. ఆ పార్టీకి తెలంగాణతో బంధం తెగిపోయింది. దానిని ఇక ఆంధ్రాపార్టీగానే తెలంగాణ చూస్తుంది. గెలిచిన ఆ కొద్ది మంది బై డిఫాల్టు గెలిచినవాళ్లే. వాళ్లేమిటో తెలంగాణ సమాజానికి బాగా తెలుసు. వాళ్లకు మాట్లాడడానికి, చెప్పుకోవడానికి ఏమీ మిగల్లేదు. కేసీఆర్‌ను, తొలి తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసి రోజూ పత్రికల్లో, చర్చలో ఉండాలన్నది వాళ్ల వ్యూహం. తెలంగాణ ప్రభుత్వానికి మనశ్శాంతి లేకుండా చేయాలన్నది వారి ఆంతర్యం. తెలంగాణలో రోజురోజుకు జారిపోతున్న తెలుగుదేశం శ్రేణులను కాపాడుకోవడానికి వీలైనంత అల్లరి చేయడమే సరైన మార్గమని చంద్రబాబు ఆలోచన. అందుకే ఆయన ఎంత ఖర్చు పెట్టడానికయినా వెనుకాడడం లేదు. తెలంగాణతో సమానంగా ఆంధ్రలో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే గత జనవరి నుంచి 60 మంది రైతులు, చేనేత కార్మికులు మరణించారు. అయినా అక్కడ రైతులను పట్టించుకున్నవారు లేరు. ఇక్కడ మాత్రం మరణించిన రైతు కుటుంబాలకు తలా 50 వేల చొప్పున ఇవ్వాలని నిధులు సమకూర్చారు. మంచిదే… తెలంగాణలో కొల్లగొట్టిన సొమ్ము తిరిగి తెలంగాణ రైతు కుటుంబాలకు ఏ రూపంలో వచ్చినా హర్షించాల్సిందే.

చంద్రబాబు దీనిని రాజకీయ పెట్టుబడిగా భావిస్తున్నారు. తెలంగాణ తెలుగుదేశం నాయకులు ప్రైవేటు సంభాషణల్లో ఈ విషయమే అంగీకరిస్తున్నారు. ‘ఏం చేస్తాం. ఏ పార్టీలోకి వెళ్లాలి? ఎలాగూ టీఆరెస్‌లోకి మమ్మల్ని తీసుకోవడం లేదు. ఇక్కడ ఉంటే చంద్రబాబు పెట్టుబడి అయినా పెడతారు. ఈ పార్టీని ఈ మాత్రం కూడా కాపాడుకోకపోతే మమ్మల్ని ఎవరు దేకుతారు? మేము గొడవ చేయకపోతే మా వెంట ఎవరూ మిగిలేటట్టు లేరు. మాకు సరైన అవకాశం వచ్చేదాకా ఈ పార్టీని ఎంతోకొంత కాపాడుకోవాలిగదా’ అని ఇప్పుడు అల్లరికి నాయకత్వం వహిస్తున్నవారిలో ఒకరు చెప్పుకున్న గోడు ఇది. అంతేకాదు ‘త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. మాకు బలం ఉంది ఇక్కడే. దీనిని కాపాడుకోవాలి. హైదరాబాద్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవాలంటే మేము రోజూ లైమ్ లైట్‌లో ఉండాలి. అందుకే ఈ తాపత్రయం అంతా’ అని మరో నాయకుడు చెప్పారు. చంద్రబాబునాయుడికి, తెలుగుదేశం నాయకత్వానికి, వారికి మద్దతుగా ప్రచార యుద్ధం చేస్తున్న మీడియాకు తాము ఏంచేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో స్పష్టత ఉంది. తెలంగాణ నాయకత్వమే స్పష్టత తెచ్చుకోవలసి ఉంది. ఏ పాయింటూ లేనివాడే అడ్డగోలుగా మాట్లాడతాడు. ప్రజాసమస్యలపై మాట్లాడడానికి బదులు వ్యక్తిగత నిందలకు దిగుతాడు. రెచ్చగొడతాడు. తను ఎజెండాలోకి రావడానికి ఇదొక ఎత్తుగడ. ఇప్పుడు మాట్లాడుతున్న తెలంగాణ తెలుగుదేశం నాయకులు ప్రజల దృష్టిలో టుమ్రీలు. తెలంగాణ నాయకత్వం, తెలంగాణ అసెంబ్లీ, తెలంగాణ మీడియా వాళ్ల వెంట పడాల్సిన పనిలేదు. ఎంపీ కవిత రెండు చోట్ల పేరు నమోదు చేయించుకున్నారంటూ రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణకు విలువలేదు. ఆ విషయంలో సభలో ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఒక వేళ రెండు చోట్ల నమోదు చేయించుకున్నా కొంపలు మునిగేదేమీ లేదు. ఆమె ప్రభుత్వ ప్రయోజనాలేవీ పొందడం లేదు. పైగా ప్రతి కుటుంబ సర్వే రిపోర్టును ఆధార్‌కు లింకు చేస్తామని ప్రభుత్వం చెబుతూనే ఉంది. ఎక్కడయినా రెండుసార్లు నమోదయితే ఆటోమేటిక్‌గా ఒకటి చెల్లకుండా పోతుంది. కానీ గోరంతను కొండంత చేసి చూపడంలో చంద్రబాబువద్ద శిక్షణ పొందినవాళ్లు కదా. వాళ్లు అట్లాగే మాట్లాడతారు. తెలంగాణ నాయకత్వమే వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి తమ పనులు తాము చేసుకుపోవాలి.

మైనస్ టీడీపీ తెలంగాణ అసెంబ్లీ అర్థవంతంగా నడుస్తున్నది. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, వామపక్షాలు ఈ సమావేశాలను సమస్యలపై చర్చించడానికి ఉపయోగించుకుంటున్నాయి. నిరసనలు, వాకౌట్లు, వాదోపవాదాలు సహజం. కాంగ్రెస్ సభా పక్ష నాయకులు జానారెడ్డి, డి.శ్రీనివాస్ పరిణతితో వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం పనితీరుపై విమర్శలే కాదు నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. బీజేపీ కాస్త టీడీపీ దారిలో వెళ్లడానికి ప్రయత్నిస్తున్నది. కానీ అంతలోనే తమాయించుకుని ప్రత్యేకంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నది. తెలుగుదేశం వాళ్లపై అనవసరమైన స్పందనలను పక్కనబెడితే ముఖ్యమంత్రి, మంత్రులు సభను సమర్థంగా ఎదుర్కొంటున్నారు. వారి ప్రసంగాల్లో, సమాధానాల్లో పరిణతి, ప్రగాఢ ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి ప్రతి చర్చలోనూ భాగస్వామి కావడం, ఓపికగా సమాధానాలు చెప్పడం, కలుపుగోలుగా వ్యవహరించడం సభ గౌరవాన్ని పెంచుతున్నది. తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి లోతైన అవగాహన, అభివృద్ధి గురించి ఒక దీర్ఘకాలిక దృక్పథం వారి ప్రసంగాల్లో తెలుస్తున్నది. ఎవరూ తడుముకోవడం, తడబడడం కనిపించలేదు. అయితే కొంత మంది మంత్రులు ఎక్కువసార్లు ఎదురుదాడికి దిగుతున్నారని, అది మంచిగా అనిపించడం లేదని సమావేశాలు గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కారణంగా గత దశాబ్దకాలంగా తెలంగాణ సమస్యలపై శాసనసభలో చర్చలే జరుగలేదు. ఇప్పుడు మనదంటూ ఒక ప్రత్యేక సభలో ఉన్నాం. బయటివాడు ఎవడో ఆడిస్తే ఆడే పరిస్థితి ఇప్పుడు కూడా మన సభకు ఉండకూడదు. మన శాసనసభ ఉన్నత సంప్రదాయాలను నెలకొల్పాలి. చిల్లర పంచాయతీలతో మనలను బజారున పడేయాలని చూస్తున్నవాళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలి. సభ సాఫీగా జరిగేందుకు అన్ని పక్షాలూ బాధ్యతగా వ్యవహరించాలి.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

One thought on “చెల్లనికాసుల చిల్లర పంచాయితీ”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s