బాబు ఎత్తుజిత్తులకు చిక్కొద్దు


image

‘చెప్పులోన రాయి, చెవిలోన జోరీగ, కంటి లోన నలుసు, కాలి లోన ముల్లు…’ ఏ పనీ చేసుకోనివ్వవు. మన శ్రద్ధను, శక్తిని, సమయాన్ని దారి మళ్లిస్తుంటాయి. వృథా చేస్తాయి. తెలంగాణలో చంద్రబాబు నాయుడు, ఆయన మనుషులు, ఆయన పత్రికలు, చానెళ్లు నిర్వహిస్తున్నది ఈ జోరీగ పాత్రనే. తెలంగాణ తొలి బడ్జెటు సమావేశాలు సంబరంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సాధించిన విజయాలు అనేకం ఈ సందర్భంగా ప్రజల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. చంద్రబాబునాయుడు ఒకప్పుడు ‘తెలంగాణ’ పదాన్ని నిషేధించిన చోటే, ఇవ్వాళ తెలంగాణ గురించి తప్ప మరొకటి మాట్లాడాల్సిన అవసరం లేని పరిస్థితి వచ్చింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమ నేతలను పట్టుకుని, వాడు, వీడూ అని సంబోధించడమే కాకుండా ‘తలెక్కడ పెట్టుకుంటావని’ నిందించి దురహంకారాన్ని ప్రదర్శించిన చోట, ఇప్పుడు ఆ ఉద్యమ నేతలే సభానాయకులై వర్ధిల్లుతున్న సన్నివేశం సాక్షాత్కరించింది. తెలంగాణ ఉద్యమాన్ని వెన్నువిరవడానికి టీఆరెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అనేక అమానాల పాలుజేసిన ఈ సభలోనే ఇప్పుడు టీఆరెస్ రాజ్యాధికారాన్ని దక్కించుకుంది. సీమాంధ్ర అధికార మదాంధతకు ప్రతీకగా తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అని కిరణ్‌కుమార్‌రెడ్డి హూంకరించిన చోటే ఇవ్వాళ తెలంగాణ లక్ష కోట్ల బడ్జెటును ప్రతిపాదించి ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసింది. తెలంగాణ రాదు, రానివ్వము అని కొంతకాలం, తీరా వచ్చే వేళ తెలంగాణపై అనేక ఆంక్షలు పెట్టాలని కొంతకాలం తెలుగుదేశం కుట్రలు సాగించిన చోటే, ఇప్పుడు తెలంగాణ కొత్త తరం కొలువు తీరింది. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ రాష్ట్ర అసెంబ్లీలో లక్ష కోట్ల బడ్జెటును ప్రతిపాదిస్తున్న వేళ లక్షలాది మంది తెలంగాణ ప్రజల హృదయాల్లో మెదిలిన జ్ఞాపకాలివి. అయితే చంద్రబాబునాయుడు తెలంగాణకు ఏ జ్ఞాపకాలూ మిగలనివ్వదల్చుకోలేదు. ఏ స్వేచ్ఛావాయువులూ ఆస్వాదించనీయదల్చుకోలేదు. ఏమాత్రం గాలి పీల్చుకోనివ్వ దల్చుకోలేదు. తెలంగాణ ప్రభుత్వాన్ని పునర్నిర్మాణ పథం నుంచి దృష్టిమళ్లించడానికి చేయగలిగినదంతా చేస్తున్నది. అందుకే జోరీగలను గుంపుగా చేసి తెలంగాణ ప్రభుత్వంపై ఉసిగొల్పుతున్నది.

నిజానికి వారికేదో తెలంగాణ ప్రజలపై మమకారం ఉండి కాదు. చంద్రబాబునాయుడు ఎంత రైతు పక్షపాతో అందరికీ తెలుసు. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ఎంత మంది రైతులు బలయ్యారో తెలుసు. తెలంగాణలో ఆకలి చావులు జరిగిందీ, గంజికేంద్రాలు ఏర్పాటు చేసిందీ ఆయన పాలనలోనే. విద్యుత్ చార్జీలు పెంచొద్దన్నందుకు అసెంబ్లీకి ఫర్లాంగుదూరంలో ముగ్గురు ఉద్యకారులను కాల్చి చంపింది కూడా ఆయన ప్రభుత్వమే. కాల్దరిలో రైతులను బలితీసుకున్నది కూడా చంద్రబాబే. టూరిజం తప్ప ఏ ఇజమూ లేదని చెప్పిందీ ఆయనే. ఎంతో దూరం ఎందుకు? సీమాంధ్రలో ఇప్పటికీ రుణమాఫీ జరుగలేదు. డ్వాక్రా మహిళలకు అన్ని రుణాలు మాఫీ చేస్తాం, చెల్లించకండి అని చెప్పి, ఇప్పుడు మనిషికి పదివేలు ఇస్తామని మాటమార్చిందీ ఆయనే. తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై ఇంత యాగీ చేస్తున్న తెలంగాణ తెలుగుదేశం, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు సీమాంధ్రలో జరుగుతున్న ఆత్మహత్యలు కనిపించడం లేదు. ఒక్క అనంతపురంలోనే గత ఆరునెలల్లో 60 మంది రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆంధ్రాలో ఒకరు, రాయలసీమలో మరొకరు పింఛను రాదని తెలిసి ఇద్దరు మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ వార్తలను ఈనాడు, ఆంధ్రజ్యోతి అక్కడి స్థానిక పత్రికల్లో ఎవరికీ కనిపించకుండా ప్రచురిస్తాయి. చంద్రబాబునాయుడు అక్కడ అంతా సుభిక్షంగా ఉన్నట్టు నటిస్తుంటారు. ఇక్కడ మాత్రం ఆ పత్రికలు, ఆ నాయకులు తెలంగాణ లూటీపోతున్నట్టు, ఆత్మహత్యలతో తెలంగాణ ఖాళీ అవుతున్నట్టు బిల్డప్ ఇస్తాయి. తెలంగాణలో ఆత్మహత్యలు తప్ప ఇంకేమీ జరుగడం లేదన్నట్టు ప్రచారం చేస్తారు. చిన్న గుంపు, పెద్ద నోరు పెట్టుకుని అరుస్తారు. ఏదో ఒకటి చేసి ఎప్పుడూ ప్రచారంలో ఉండడం, చెదరిపోతున్న తెలుగుదేశం శ్రేణులను కాపాడుకోవడం, తెలంగాణ ప్రభుత్వాన్ని పనిచేయకుండా చికాకుపర్చడం, వీలైనంత బద్నాం చేయడం చంద్రబాబు లక్ష్యం. అందుకోసం ఎంత ఖర్చుపెట్టడానికయినా చంద్రబాబు సిద్ధపడుతున్నాడు. తెలంగాణ వాళ్లకు పరిపాలించుకోవడం చేతకాదు అని ఇంటా బయటా ముద్రవేయడం వారి ఉమ్మడి వ్యూహంగా కనిపిస్తున్నది.

నిజానికి చెట్టంత మనిషి జోరీగల గోలకు తలొగ్గాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం తెలుగుదేశం సృష్టిస్తున్న అల్లరికి అవసరమైనదానికంటే ఎక్కువగా స్పందిస్తున్నది. తెలుగుదేశం తలకిందికి, కాళ్లు మీదికి పెట్టి తపస్సు చేసినా మరోసారి తెలంగాణ ప్రజలు నమ్మే అవకాశం లేదు. ఆ పార్టీ ఎవరి పార్టీయో, ఏ ప్రాంత ప్రయోజనాలకోసం పుట్టిన పార్టీయో తెలంగాణ ప్రజలకు బాగా అర్థమయింది. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ మిగలదు. జార్కండులో లాలూ ప్రసాద్, నితీష్‌కుమార్‌ల పార్టీలకు పట్టిన గతే ఇక్కడ తెలుగుదేశం పార్టీకీ పడుతుంది. ఇది చాలా సహజంగా జరిగే పరిణామం. అయితే ఈ సమస్యను ఓపికగా ఎదుర్కోవాలి. రైతుల ఆత్మహత్యలను తెలుగుదేశం ఒక పావుగా వాడుకుంటున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆ సమస్యను దాటవేయడం వల్ల తెలుగుదేశంకు అటువంటి అవకాశం చిక్కుతున్నది. ప్రభుత్వమే చొరవతీసుకుని ఆ సమస్యను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే, తెలుగుదేశం పార్టీని ఎవరు పట్టించుకుంటారు? రైతుల ఆత్మహత్యలకు తెలంగాణ ప్రభుత్వం కారణమని ఎవరూ అనుకోవడం లేదు. ఇందులో దాచుకోవాల్సింది ఏమీ లేదు. రైతుల ఆత్మహత్యలు తెలంగాణకు వారసత్వంగా సంక్రమించిన సమస్య. సీమాంధ్ర ప్రభుత్వాలు యాభైయేళ్లపాటు తెలంగాణలో సాగునీరు, విద్యుత్ సమస్యలను నిర్లక్ష్యం చేయడంల్ల తలెత్తిన సంక్షోభం. ప్రభుత్వం మాట్లాడకపోతే, అవతలివాళ్లు మాట్లాడతారు. జూన్‌లో ప్రభుత్వంతో పాటే కరువు వచ్చింది. కాలం కాకపోవడం వల్ల నీటికొరత, విద్యుత్ కొరత అన్నీ మీదపడి వచ్చాయి. ఒక్క సంవత్సరం కాలంకాకపోయినా తట్టుకోలేని దారుణమైన పరిస్థితులు మన పల్లెల్లో ఉన్నాయి. అందుకే రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి.

ఎంతమంది చనిపోయారన్న చర్చ కూడా అనవసరం. ఇది తెలుగుదేశం సమస్య కానే కాదు. వారికి ఇది ఒక అవకాశం మాత్రమే. కరెంటు సమస్యపై వారు మాట్లాడలేరు కాబట్టి, ఈ సమస్యను ముందేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలు మన సమస్య. మన తెలంగాణ సమస్య. మనమే ఆ సమస్యను ఎదుర్కోవడానికి ఒక గట్టి ప్రయత్నం చేయాలి. ‘రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ధైర్యం కోల్పోవద్దు. వ్యవసాయాన్ని పండుగ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా కృషిచేస్తున్నది. కరెంటు, సాగునీరు ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రైవేటు అప్పులు ఉన్నవాళ్లు కూడా మళ్లీ కాలం అయ్యేదాకా అప్పులు చెల్లించవద్దు. ఎవరయినా అప్పులు అడిగితే స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయండి అని రైతాంగానికి భరోసా ఇవ్వాలి. మంత్రులు మొదలు ఎమ్మెల్యేల వరకు అన్నిస్థాయిల్లో రైతులకు ఆత్మస్థైర్యం కలిగించే దిశగా నియోజకవర్గాల్లో ప్రచారం జరగాలి. సంక్షోభంలో అణగారుతున్న రైతులను ఆదుకోవడానికి రైతు సంక్షేమ నిధిని ఒక దానిని ఏర్పాటు చేయవచ్చు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి. ఇన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వానికి మరో నాలుగైదు కోట్లు కేటాయించడం కష్టం కాదు. ఎదుటివారికి నినాదాలు లేకుండా చేయడంపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు ఆ విషయం బాగా తెలుసు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

One thought on “బాబు ఎత్తుజిత్తులకు చిక్కొద్దు”

  1. mee abiprayamu tho nenu ekibavinchatam ledu ….nidra pothunna vanni lepatam sadhyam kani nidra natisthunna vanni lepatam asadhyam . raithula athmahathyalu meeru cheppina salahaltho agi pothayaa … private finance vallaku return raka pothey vallu malli raithualku appulu ivvadam manestharu. daniki okate margam intha ka mundhu TRS govt raka mundhu chani poyeena raithula gurunchi manam pracharamu cheyali ….TDP hayamulo chani poyeena raithu la gurunchi bari ettunaa pracharmu cheyali valla kutumbalu ekkadu nnayo telusu koni paper valla dina paristhi thi ni prachurinchali
    …… eddo ni eddi basha lo ne samdham cheppali ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s