తెలంగాణకు తాగునీరు అక్కరలేదా?


45767212

మొగుణ్ణికొట్టి మొగసాలకెక్కడం ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి మొదటి నుంచీ అలవాటు. తాను తప్పులు చేయడం ఎదుటివారిని బద్నాం చేయడం చంద్రబాబునాయుడుకు పరిపాటి. రాష్ట్ర విభజన తర్వాత కూడా అదే జరుగుతున్నది. తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు తన చెంచా మీడియా, చేలా గ్యాంగు అడ్డంపెట్టుకుని ప్రాక్సీవార్ నడుపుతున్నారు. ఆయన పునర్విభజన చట్టాన్ని అడ్డంగా ఉల్లంఘిస్తాడు. చెంచా మీడియా ఆయనకు వంతపాడుతుంది. ఇక్కడి చేలా గ్యాంగును ఆ విషయాలు తప్ప అన్ని విషయాలు మాట్లాడతారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు సైగలకు అనుగుణంగా సన్నాయినొక్కులు నొక్కుతున్నది. ఒకటి కాదు, రెండు కాదు….వరుసగా తెలంగాణపై దాడులు జరుగుతున్నాయి. అయినా నిలువరించే ప్రయత్నం చేయడం లేదు. తెలంగాణను ఇక్కట్లపాలు చేయాలనే కుట్ర చంద్రబాబు ప్రతి చర్యలోనూ బాహాటంగానే కనిపిస్తున్నది. శ్రీశైలం వివాదం, కార్మిక నిధి మళ్లింపు చంద్రబాబు దాష్టీకానికి తాజా ఉదాహరణలు. ఎంత చిత్రమంటే చంద్రబాబు చేస్తున్నదాంట్లో న్యాయాన్యాయాలను మాట్లాడాల్సినవారు సైతం మేము అప్పుడే చెప్పాం. విడిపోతే జల వివాదాలొస్తాయని రాగాలు తీస్తున్నారు. సీపీఎం నేత బీవీ రాఘవులు విభజనకు ముందు తాను పలికిన అపశకునాలన్నీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిలాగా ఇప్పుడు వల్లెవేస్తున్నారు. చంద్రబాబుకు పచ్చతివాచీ పరిచి ఊరేగించే ఆంధ్ర దినపత్రికలు, చానెళ్లు కూడా శ్రీశైలం అడుగంటిపోతున్నదని, హే కృష్ణా…. కొంపలు మునిగిపోతున్నాయని దీర్ఘాలు తీస్తున్నాయి తప్ప, తెలంగాణ కోణం నుంచి ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. తెలంగాణలో పత్రికా వ్యాపారం చేస్తూ తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఆ పత్రికలు రాతలు రాస్తున్నాయి. చంద్రబాబు హైదరాబాద్ నుంచి పాలన సాగిస్తూ తెలంగాణ ప్రయోజనాలకు తూట్లుపొడిచే నిర్ణయాలు చేస్తున్నాడు. పనిగట్టుకుని వివాదాలు సృష్టించి తెలంగాణను ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు.

శ్రీశైలంలో వివాదం ఎందుకు వచ్చింది? ఎవరు కారణం? ఎవరిది న్యాయం? ఇవేవీ చూడనక్కరలేదా? తెలంగాణ చేస్తున్నది న్యాయమని చెప్పడానికి వంద ఆధారాలున్నాయి.

1) శ్రీశైలం రిజర్వాయరు అప్పటికీ ఇప్పటికీ ప్రాథమికంగా జలవిద్యుత్తు ప్రాజెక్టే. సీడబ్ల్యుసి, కేంద్ర జలవనరుల అభివృద్ధి ఏజెన్సీ(ఎన్‌డబ్ల్యుడీఏ), రాష్ట్ర ప్రభుత్వ జీవో 69….వీటన్నంటి సారం కూడా విద్యుదుత్పత్తిదే ప్రాధాన్యం.
FullSizeRender

2) శ్రీశైలం నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్తును తెలంగాణలో వ్యవసాయానికి, తాగునీరు సరఫరాకు ఉపయోగిస్తున్నది. అంటే శ్రీశైలంలో విద్యుదుత్పత్తికోసం ఖర్చు చేసే నీరు తెలంగాణలో పంటపొలాలను, ప్రజల గొంతులను తడుపుతున్నది. రాయలసీమ సాగునీరు, తాగునీరు గురించి ఆలోచించేవారు, ఆందోళన పడేవారు తెలంగాణ ప్రజల గురించి ఎందుకు ఆలోచించడం లేదు? శ్రీశైలంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ఖరీదు సుమారు 400 నుంచి 500 కోట్ల రూపాయలు ఉంటుందని నిపుణుల అంచనా.

3) శ్రీశైలంలో రాయలసీమకు ఎంత నీరిస్తున్నారో, తెలంగాణకు అంతనీరు రావాలి. కుడి ఎడమ కాలువలు ఒకేసారి మొదలుపెట్టారు. కానీ 1996 నుంచి కుడి కాలువకు, తెలుగుగంగకు నీరు తీసుకుంటున్నారు. 2006 నుంచి ఏటా వంద టీఎంసీలకుపైగా టీఎంసీల నీటిని తరలించుకు పోతున్నారు. తెలంగాణకు ఇంతవరకు బొట్టు నీరు రాలేదు. ఈ ఇరవై ఏళ్లలో తెలంగాణకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. శ్రీశైలం ఇప్పుడు తెలంగాణకు ఉపయోగపడుతున్నది ఒక్క విద్యుదుత్పత్తికోసమే. అది కూడా దక్కకుండా చేయాలని చూడడం ఎటువంటి న్యాయం?

4) శ్రీశైలం నుంచి తెలుగుగంగకు నీటి విడుదల షెడ్యూలు జూలై నుంచి అక్టోబరు వరకేనని ఇదే చంద్రబాబు ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఆపరేషన్ షెడ్యూలులో పేర్కొన్నారు. అక్టోబరు నెల అయిపోయింది. ఇప్పటికే తెలుగుగంగ ద్వారా సోమశిల రిజర్వాయరులో 46 టీఎంసీలు, కండలేరులో 27 టీఎంసీలు, వెలిగొండలో 10 టీఎంసీలు నిల్వ చేసుకున్నారు. ఈ లెక్కలు అక్టోబరు 31న ఆంధ్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లోనివే. ఈ రిజర్వాయర్ల ప్రథమ ప్రాధాన్యత తాగు నీరు ఇవ్వడమే.

5) కుడి కాలువ ద్వారా ఇప్పటికే అవుకు, గోరకల్లు రిజర్వాయర్లు నింపుకున్నారు. మైలవరం రిజర్వాయరు లెక్కలు బయటపెట్టలేదు. కర్నూలు, కడప జిల్లాలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ప్రాథమిక లక్ష్యం వరద నీరు వచ్చినప్పుడు నిల్వచేసుకుని తాగునీరు అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడం. తెలుగుగంగకు, కుడికాలువకు సాగునీటి లక్ష్యాలు పెద్దగా లేవు. ఉన్న కొద్దిపాటి లక్ష్యాలు కూడా అక్టోబరుకే అయిపోతాయి. ఇప్పుడు రిజర్వాయర్లలో ఉన్న నీరంతా తాగు నీటికోసమే. కానీ ఇంకా తాగునీటికి అవసరమవుతుందన్న సాకుతో తెలంగాణ విద్యుదుత్పత్తిని అడ్డుకోవడం విడ్డూరం.

6) శ్రీశైలం నుంచి రాయలసీమ తీసుకోవడానికి అవకాశం ఉన్న నికరజలాలు 34 టీఎంసీలు. అందులో కూడా 15 టీఎంసీలు తెలుగుగంగ ద్వారా చెన్నయ్‌కి ఇవ్వాల్సినవి. ఆ నీటిలో కూడా పది టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్రలు ఇచ్చే నీరు. అంటే రాయలసీమకు హక్కు ఉన్నది 19 టీఎంసీలే. అదనంగా వారు తీసుకోగలిగింది వరద నీరు మాత్రమే. వరద ఉన్నప్పుడు మాత్రమే వారు నీటిని తీసుకోవాలి. వరద 30 రోజులే ఉంటుంది కాబట్టి ఆ 30 రోజుల్లోనే వీలైనంత ఎక్కువ నీటిని తీసుకోవాలని వాదించే, అలాగని జీవోలలో పేర్కొని, రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ను విస్తరించారు. 30 రోజులు ఎప్పుడో అయిపోయింది. వరద ఆగిపోయింది. అయినా వంద రోజులుగా నీరు వెళుతూనే ఉన్నది. అక్కడ కృష్ణా బోర్డు కాదు కదా, ఏ బోర్డూ కాపలా కాయదు. 19 టీఎంసీలు కాదు కదా, 100 టీఎంసీలకు పైనే నీరు మళ్లించుకున్నారు. ఈరోజున సోమశిల, కండలేరు, వెలిగొండ నీటి నిల్వలే 83 టీఎంసీలు.

7) మరో ముఖ్యమైన అంశం ఏమంటే తెలుగుగంగ పేరుతో తీసుకెళుతున్న నీరు కూడా చెన్నయ్‌కి చేరడం లేదని, ఆ మధ్య బట్టబయలయిన ఒక నివేదిక పేర్కొంది. 1996 నుంచి 2002 వరకు ఏటా కనీసం 10 నుంచి 12 టీఎంసీల నీరు చెన్నయ్‌కి చేరాల్సి ఉండగా, మొత్తం ఆరేళ్లలో కలిపి 15 టీఎంసీల నీరు మాత్రమే వచ్చినట్టు ఆ నివేదిక పేర్కొంది.
FullSizeRender(1)
అది కూడా ప్రభుత్వ నివేదికే. అంటే ఆ నీటిని కూడా రాయలసీమలో ఉపయోగించుకుంటున్నారని అర్థం. రాయలసీమ ఎన్ని నీటిని ఉపయోగించుకున్నా తెలంగాణకు ఏమీ అభ్యంతరం లేదు. కానీ, లేని హక్కులు, కాని రోజుల్లో కోరడమే అన్యాయం. పెద్దరికం చేయాల్సిన కృష్ణాబోర్డు ఈ అంశాలేవీ పట్టించుకోకుండా ఉపరితల విన్యాసం చేసి, విద్యుదుత్పత్తిని ఆపేయాలని కోరడం దుర్మార్గం.

శ్రీశైలంలో అసలు వివాదమే లేదు. జల వివాదానికి ఆస్కారమే లేదు. ఆంధ్ర ప్రదేశ్‌కు అన్ని విషయాలూ తెలుసు. కృష్ణాబోర్డు అధికారులు కూడా అమాయకులు కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కావాలని అడ్డగోలుగా మాట్లాడుతున్నది. గిల్లి కజ్జాలు పెడుతున్నది. తొండిగా, మొండిగా వ్యవహరిస్తున్నది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో లాబీయింగ్ చేసి తెలంగాణను ఇబ్బందులపాలు చేయాలని చూస్తున్నది. వారి అనుకూల మీడియా కూడా చంద్రబాబు తానా అంటే తందానా అంటున్నది. 2002-03 అక్టోబరులో ఇదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగానే శ్రీశైలంలో 799.70 అడుగులు, 2003-04లో 840 అడుగుల దాకా నీటిని వినియోగించారు. ఇప్పుడు సుద్దులు చెబుతున్నారు.
FullSizeRender (2)

కార్మికనిధి మళ్లింపు మరీ బరితెగింపు. హైదరాబాద్ నుంచి పాలన సాగిస్తూ ఒక రాష్ర్టానికి సంబంధించిన నిధిని మరో రాష్ర్టానికి బదిలీ చేయడం నేరం. విభజన అనంతరం ఏయే నిధులను ఎలా నిర్వహించాలో పునర్విభజన చట్టం స్పష్టంగా నిర్వచించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి మరీ నిస్సిగ్గుగా తనకు తెలిసే జరిగిందని చెబుతున్నారు. ఇటువంటి పనే తెలంగాణ ప్రభుత్వం చేసి ఉంటే చంద్రబాబు ఏమి చేసి ఉండేవారు? ఆంధ్ర మీడియా ఎలా శివాలెత్తి ఉండేది? ఏమి రాతలు రాసేది? తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంతగా బద్నాం చేసి ఉండేవారు? కానీ అంతా కూడబలుక్కున్నట్టుగా చంద్రబాబు, ఆంధ్ర మీడియా, తెలంగాణ తెలుగుదేశం, సీపీఎం, సీపీఐ…అందరూ తేలుకుట్టిన దొంగల్లా మౌన ముద్ర దాల్చారు. నిధుల మళ్లింపు పెద్ద విషయం కానట్టుగా నటిస్తున్నారు. చంద్రబాబు, రోజూ అబద్ధాలు చెప్పడానికి ఆయన నియమించుకున్న బంట్రోతులు, తప్పును సరిదిద్దడానికి బదులు బుకాయింపులకు, దబాయింపులకు దిగుతున్నారు. దొంగలను వెనుకేసుకువస్తున్నారు. వీరి కుట్రలు ప్రజలకు అర్థం కాకుండాపోవు. నాయకుల వేషాలు, పత్రికల రంగులు రోజురోజుకు మరింత తేటతెల్లమవుతున్నాయి. తెలంగాణ రైతులు ఎంతగా ఆందోళన చెందుతున్నారంటే, చంద్రబాబు, ఆ పత్రికోడు, ఈ పత్రికోడు హైదరాబాద్‌ల ఉండుకుంట ఇంత దగా చేస్తుంటే మనం ఏమి చేయలేమా సార్. కరెంటు రానియ్యరు, నీళ్లు రానియ్యరు, నిధులు దోచుకపోతరు. మన సీఎం కరెంటులేక ఇబ్బందులు పడతడు. మన ఏసీలు పీకేయమంటడు… ఎందుకుసార్? చంద్రబాబు ఇంటికి, ఎన్‌టిఆర్ భవన్‌కు, ఆంధ్ర సెక్రటేరియట్‌కు, పత్రికాఫీసులకు కరెంటు పీకేయమనండి సార్…ఏంది సార్ ఇది? కరెంటులేక మేమెందుకు బాధపడాలె సార్? ఈడ ఉండుకుంట, ఈడ తినుకుంట అక్కడి పాట పాడుతుంటే ఎందుకు భరించాలె సార్… అని ఒక రైతు ఫోనులో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన ప్రచారకర్తలు ఎప్పటికయినా అర్థం చేసుకుంటారో లేదో తెలియదు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

One thought on “తెలంగాణకు తాగునీరు అక్కరలేదా?”

  1. avasaram vasthey andhra antha okkati ayeethdi vadu CPM kani CPI kani ……etu vachi mana karma mana banisa leaders eppudu marutharo

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s