రాజకీయ స్వేచ్ఛ అక్కర లేదా?


megaphone

వాళ్లు విషం కక్కనివ్వండి….
మనం మాత్రం అమృతం పంచుదాం…
వాళ్లు విద్వేషాన్ని చిమ్మనివ్వండి….
మనం మాత్రం ప్రేమను పంచుదాం…
వాళ్లు అహంకారంతో చెలరేగనివ్వండి….
మనం మాత్రం మమకారాన్నే పంచుదాం…
అవును… సంయమనంతో వ్యవహరించాల్సింది ఇటువంటి సందర్భాల్లోనే. సంస్కారాన్ని ప్రదర్శించాల్సింది ఇటువంటప్పుడే. వంద నోముల ఫలాన్ని ఒక్క ఆవేశం బలితీసుకుంటుంది. వంద మంచి పనుల ఫలాలను ఒక్క తొట్రుపాటు వెనుకకు ఈడ్చుతుంది. రాజకీయాల ఎజెండాలు మారిపోతాయి. అల్పమైన, అంగుష్ఠ మాత్రమైన ఎజెండాలు ముందుకు వస్తాయి. మీడియాపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలపై చిలువలు, పలువలుగా చర్చ జరుగుతున్నది. ఎవరూ లోతుల్లోకి వెళ్లడం లేదు. సమస్యను అర్థం చేసుకోవడం లేదు. టైమ్సు నౌ ప్రధాన వ్యాఖ్యాత అర్నబ్ గోస్వామి అయితే పూనకం వచ్చినవాడిలా ఊగిపోయారే తప్ప ఎవరినీ మాట్లాడనివ్వలేదు. ఆయన హావభావ ప్రదర్శన మయసభ సీనులో దుర్యోధన ఏకపాత్రాభినయంలాగా అనిపించింది. అరుపులు తప్ప ఆలోచన లేని చర్చాగోష్టి అది. కారణం చూడకుండా కేవలం కార్యంపై మాత్రమే రంకెలు వేసే జర్నలిజం అది. తెలంగాణ నాయకత్వం సున్నితంగా ఉండడంలోనూ, ఆవేశ పడడంలోనూ అన్యాయం ఏమీ లేదు. పద్నాలుగేళ్లు పోరాడి సాధించుకున్న రాష్ట్రం. అస్తిత్వ చైతన్యానికి ప్రతీకగా అధికారంలోకి వచ్చిన నాయకత్వం. వారు ప్రజాస్వామ్యం నాలుగు స్తంభాల నుంచి కాస్త మర్యాదను ఆశించడంలో తప్పేముంది? వారితో సున్నితంగానే వ్యవహరించాలని ఎవరు చెప్పాలి?

ఇంతకాలం తాము ఆడింది ఆటగా, పాడింది పాటగా చెలాయించుకున్న మీడియా సామ్రాజ్యాలు ఇప్పుడు చెల్లకపోయే సరికి కుతకుతలాడుతున్నాయి. మేము నియంత అని పేరుపెడితే, మీరు ఓట్లేసి ఆయనను ముఖ్యమంత్రిని చేస్తారా? మేము పౌండ్రక వాసుదేవుడని నిందిస్తే ఆయనను ఏకంగా కృష్ణ పరమాత్మను చేస్తారా? మేము పాపి, పరమ పాపి అని దూషిస్తే మీరు నెత్తినెత్తుకుంటారా? తెలంగాణలో టీఆరెస్ గెలుపును జీర్ణించుకోలేని శక్తులు పాత పద్ధతుల్లోనే తెలంగాణ నాయకులను ఎగతాళి చేయ జూశాయి. మీడియా స్వేచ్ఛకు ఏదో జరిగిందని ఇంత గోలపెడుతున్నారే, తెలంగాణ ప్రజల రాజకీయ మనోభావాలపై ఇష్టారాజ్యంగా దాడి చేయవచ్చా? మీడియా స్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛ రెండూ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛనుంచి పొందినవే కాదా? తెలంగాణ నాయకత్వంపై అత్యంత ఉన్మాదపూరితమైన వ్యాఖ్యలు విశ్లేషణలు చేస్తూ వచ్చాయి. వీళ్లు ఇలా చెలరేగడానికి వీరిలో పాతుకు పోయిన దృష్టిలోపం ప్రధాన కారణం. పత్రికలు, చానెళ్లు చేతిలో ఉన్నాయి గనుక మేము ఏమైనా అంటాం… ఎటువంటి తీర్పులైనా చేస్తాం… మేము నీతి బోధకులం… మేము శాసకులం… రాజకీయ నాయకులు పనికి మాలిన వాళ్లు. అవినీతి పరులు. అల్పులు. వారిని ఏమైనా అనవచ్చు. వారికి ఏ పేర్లయినా పెట్టవచ్చు. వారిపై ఎన్ని ఠావులైనా రాసుకోవచ్చు. ఎంత వాగుడైనా వాగవచ్చు అని కొందరు పత్రికాధిపతులు, చానెళ్ల అధిపతులు భావిస్తూ ఉంటారు. కానీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ రాజకీయ నాయకులదే ఉన్నతస్థానం. మంచి చేసినా చెడు చేసినా నాయకులదే భారం. వాళ్లదే బాధ్యతాయుత స్థానం. జనానికి జవాబు చెప్పుకోవలసిన బాధ్యత నాయకులదే. ప్రజలకు గుణాత్మకమైన మేలు చేయగలిగిందీ వారే. మంచి చేసి చరిత్రకెక్కేదీ వారే, చెడు చేస్తే పతనమయ్యేదీ వారే. ఏ బాధ్యత తీసుకోకుండా చెలరేగే అవకాశాలు మీడియాకు ఉన్నట్టు రాజకీయ నాయకులకు ఉండవు. అందుకే జర్నలిస్టులుగా మనం ఎన్ని విమర్శలు చేసినా నాయకులకు అల్లంత దూరంలో ఉండి మాత్రమే చేయగలం. నాయకులకంటే ఉన్నతులం ఎప్పటికీ కాలేము.

నాయకులను ఉన్నతులుగా గుర్తించడానికి ఎంత సంస్కారం కావాలి? ఎంత సద్భుద్ధి కావాలి? ఎంత విశాల దృక్పథం కావాలి? వాటి కొరత చాలా తీవ్రంగా ఉందని గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. మార్పు జరిగిన ప్రతిసందర్భంలోనూ మార్పు ఫలితాలు చేతికందడానికి కొంత సమయం పడుతుంది. ప్రతి నాయకుడికీ, ప్రతి ప్రభుత్వానికీ కొంత గ్రేస్ పీరియడ్ ఉంటుంది. కానీ తెలంగాణలో విచిత్రంగా ప్రభుత్వం వచ్చిన రెండవ రోజు నుంచే పంచాయితీ మొదలైంది. రుణమాఫీపై గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించారు. కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, కొత్త మంత్రులు… కొంతకాలం ఆగుదాం అన్న సోయి ఎవరికీ లేకపోయింది. అధికారుల విభజన, సిబ్బంది విభజన జరుగలేదు. సచివాలయంలో పని మొదలు కానే లేదు-వేచి చూద్దాం అన్న స్పృహే లేకపోయింది. సందుదొరికితే చాలు ఓ బండ మీదేసి చంపేద్దామన్న కసి అటు మీడియాలోనూ, ఇటు కొన్ని రాజకీయ పక్షాల్లోనూ కనిపించింది. వందరోజుల నాటికి ఇది మరింత ముదిరింది. కేసీఆర్ ఒక దొర అని మహాజన సోషలిస్టు నేత మంద కృష్ణ చేసిన వ్యాఖ్యే ఒక టీవీ చానెల్ ప్రధాన శీర్షిక అవుతుంది. కేసీఆర్‌ను హిట్లర్‌తో పోల్చాలని తెలుగుదేశానికి వచ్చిన ఆలోచనే ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి వస్తుంది. టీవీ9కు అనిపించినట్టే పొన్నాల లక్ష్మయ్యకు అనిపిస్తుంది. పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ ప్రభుత్వంపై ఏకంగా వంద వైఫల్యాల జాబితా విడుదల చేశాడు. ధర్నాలు ఘెరావులు ప్రకటించారు. తిరుగుబాటు చేస్తామని ఆవేశపడ్డారు. కాంగ్రెస్ కోయిలలు తొందరపడి కూస్తున్నాయని సామాన్యులకు సైతం అర్థం అవుతున్నది. బీజేపీ కిషన్‌రెడ్డి కూడా కెమెరాలు కనిపిస్తే చాలు ఆవేశపడిపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చీకటి పాలన సాగిస్తోందని చెబుతున్నారు. ఆ చీకటి పాలనలో కేంద్రాన్ని పాలిస్తున్న తమ పార్టీకి కూడా వాటా ఉందని ఆయన ఎందుకు గుర్తించడంలేదో అర్థం కాదు. టీడీపీ వాళ్ల సంగతి ఇంకా చెప్పనలవి కాదు. వాళ్లు ఎవరిని మెప్పించడానికి మాట్లాడుతున్నారో, ఎవరికోసం మాట్లాడుతున్నారో చూసే వారికి ఇట్టే కనిపిస్తున్నది. వారందరి ముఖాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కనిపిస్తున్నారు.

వీళ్ల సంగతి ఎలా ఉన్నా మీడియాతో ఘర్షణ శాశ్వతం కాకూడదని ముఖ్యమంత్రి గుర్తించాలి. మీడియా సమాజాన్ని బాగు చేయకపోవచ్చు, ఎన్నికల్లో జయాపజయాలను ప్రభావితం చేయకపోవచ్చు, కానీ చెడగొట్టగలదు, రెచ్చగొట్టగలదు. ఎన్ని వైరుధ్యాలున్నా మీడియాతో సహజీవనం తప్పని సరి. మీడియా ఒక వాస్తవం. మీడియా స్వేచ్ఛ కూడా వాస్తవమే. ముఖ్యమంత్రి పెద్దరికం చూపాల్సింది ఇటువంటి సందర్భాల్లోనే. మెడలిరిసి అవతలేస్తం, పదికిలోమీటర్ల లోతున పాతరేస్తం అన్నవి యథాలాపంగా అన్న మాటలే. మీడియా ఇంతకంటే దారుణమైన వ్యాఖ్యలే కేసీఆర్ గురించి ప్రసారం చేసింది. పత్రికల్లో రాశారు. కేసీఆర్‌ను పౌండ్రకునితో పోల్చిన వారిని ఏమనాలి? ఎన్నికల్లో ప్రజల తీర్పును పొందిన నాయకుడిని పట్టుకుని నియంత అని నిందిస్తే తప్పు కాదా? మూడు దశాబ్దాలుగా ప్రజల తీర్పుతో రాజకీయాల్లో కొనసాగుతున్న ఒక నేతను పట్టుకుని దొరగిరా అని రాతలు రాస్తే నేరం కాదా? పాపి, మహాపాపి అని కేసీఆర్ బొమ్మపై నేపథ్య గీతాన్ని ప్రసారం చేయడాన్ని ఏమనాలి? ఏ ప్రజల తీర్పు పొందకుండానే మీడియా ఇలా రెచ్చిపోయి వాగుతూ ఉ ంటే ప్రజల తీర్పు పొంది రాష్ర్టాన్ని ఏలుతున్న నాయకుడు ఏమనుకోవాలి? కేసీఆర్‌ను రెచ్చగొట్టిందెవరు? తన పర్యటనకు పదేపదే అడ్డంపడడానికి ప్రయత్నించడాన్ని చూసి ఆయన ఒకింత అసహనానికి గురయి ఉండవచ్చు. కానీ ఆ వ్యాఖ్యలు ఒక పథకం వేసి, వ్యూహం పన్ని అన్న మాటలు కాదు.

ఎలా అన్నా ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. వాటిని ఉపసంహరించుకోవడం మంచిది. పత్రికా స్వేచ్ఛపై గౌరవాన్ని ప్రకటించడం ఉత్తమం. ఈ సందర్భంగా నాకు పోలిక గుర్తుకు వస్తున్నది. ప్రతిపక్షాలు, ప్రతిపక్ష మీడియా 2004 ఎన్నికల తర్వాత రాజశేఖర్‌రెడ్డి విషయంలో ఎలాంటి తప్పులు చేసిందో మళ్లీ ఇప్పుడు అదే తప్పులు చేస్తోంది. చంద్రబాబు పదేళ్ల పాలనతో రోసిపోయిన ప్రజలు రాజశేఖర్‌రెడ్డిని గెలిపించారు. రాజశేఖర్‌రెడ్డిని కొంతకాలంపాటు ఏమీ అనకుండా ఉండాల్సింది. కానీ తొలి మాసం నుంచే ఆయనపై దాడిని మొదలు పెట్టారు. తమ వద్ద ఉన్న ఆయుధాలన్నీ వైఎస్‌పై ప్రయోగించారు. 2009లో తీరా ఎన్నికలు వచ్చే సరికి వారి వద్ద ఆయుధాలేమీ మిగల్లేదు. పత్రికలను ప్రతిపక్షాల పుత్రికలని ముద్రేసి భ్రష్టుపట్టించాడాయన. ప్రతిపక్షాలు, పత్రికలు అన్నీకలిసినా 2009లో ఆయనను ఏమీ చేయలేకపోయాయి. ఆ అనుభవం నుంచి గుణపాఠాలు నేర్చుకున్నట్టు లేరు. లేడికి లేచిందే పరుగులాగా తెలంగాణ ప్రభుత్వంపైన దాడి ప్రారంభించారు. ఈ ధోరణి ఎవరికీ మేలు చేయదు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

5 thoughts on “రాజకీయ స్వేచ్ఛ అక్కర లేదా?”

 1. చాలా మంచిగా రాసారు సార్…కేసీఆర్ పై వీరు చేసే దుష్పచారం ప్రజల గమనిస్తున్నారు…పసుపు..కాషాయ…పార్టీలకు అండ ఉన్నీమీడీయాతో దాన్ని ఎక్కవ చేసాయ్… కేసీఆర్ గారి వ్యాక్యలపై టైమ్స్ నౌ ఛానల్లో చర్చలో అర్నభ్ (అరిచే) గోస్వామి కరీంనగర్ ఎంపీ వినోద్ కూమార్ తో వ్యవహారించిన తీరు చాలా సిగ్గుచేటు…పేయిడ్ చర్చలతో తెలంగాణ బ్రాండ్ దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారు…మీడీయా స్వేచ్చ ముసుగులో తెలంగాణ పై దాడి చేయాలని చూస్తున్నారు…ప్రెస్ కౌన్సిల్ కు ఎలక్ట్రానిక్ మీడియాని నియంత్రించే అధికారం ఉందా…అని నా అనుమానం…అది ట్రాయ్ చూసుకుంటుంది కదా…ఎన్ బీఏ..చూసుకుంటుంది. అసులు ఎలక్ట్ర్రానిక్ మీడియాకు స్వీయ నియంత్రణ ఉంది కదా….తెలంగాణ వ్యతిరేఖి అయిన…అమర్ నాథ్ ను ప్రెస్ కౌన్సిల్ నియమించిన కమిటిలో వేయడం ఉద్దేశం ఏమిటి…పని గట్టుకొని ఐజేయు అమర్..జవడే కర్ ను కలువడం..ప్రశ్నలు గుప్పిచుకోడం ఎందుకు అల్లం గారి మీద ఉన్న కోపాన్ని కేసీఆర్ వ్యాక్యలను అలుసుగా తీసుకొని వ్యక్తపరచడానికా. …..టీ జేఏఫ్ నుంచి టీవీ9..ఏబీఎస్ జర్నలిస్టును తమవైపుకు తిప్పుకునే కుటిన ప్రయత్నాలు కన్పిస్తున్నాయి…

 2. వీళ్ల సంగతి ఎలా ఉన్నా మీడియాతో ఘర్షణ శాశ్వతం కాకూడదని ముఖ్యమంత్రి గుర్తించాలి. మీడియా సమాజాన్ని బాగు చేయకపోవచ్చు, ఎన్నికల్లో జయాపజయాలను ప్రభావితం చేయకపోవచ్చు, కానీ చెడగొట్టగలదు, రెచ్చగొట్టగలదు. ఎన్ని వైరుధ్యాలున్నా మీడియాతో సహజీవనం తప్పని సరి. మీడియా ఒక వాస్తవం. మీడియా స్వేచ్ఛ కూడా వాస్తవమే. ముఖ్యమంత్రి పెద్దరికం చూపాల్సింది ఇటువంటి సందర్భాల్లోనే…..తప్పుఒప్పులుజరిగాయి సమ్యమనంతొ సర్దుబాటు చేసుకొవాలి. media విలువైన సమయం..యికా పత్రిక విలువైన స్తలం తేలంగాణా,అంధ్రా, ప్రజల ప్రగతికి అవసరం అయినn మార్గదర్సిగా,సలహలు,సుచనల,తప్పుఒప్పులు వస్తే సున్నితంగా తెలుపుతు ప్రజలకు మేలుజరిగేవిదంగ ప్రభుత్యాలకుబాసటగా నిలవాలని …ఆకాం,క్ష ..ఇట్లు ,..తాతంగారి మురళిధర్..(అనందగోత్రుడు) My …. నా మాట .

 3. @ muralidhar reddy : gharshan aneevaryam media ku edho athitha shakthu lunnai ani meeru nammadam maneyandi …. pani gatttu konni padu cheddam anukune vanitho sardu batu enti …. eee vishayamu lo KCR stand samrdhaneeyame … andhra jyothy tv 9 media lu chusi retcthi poye sthayee ni Telangana eppudo dati vachindhi prajalu …. Idhi parbuthvaniki media ku gala sanagrashana kadu telangana asthithvaniki andhra ahankaraniki jarguthunna snagarshanaa

 4. వైఎస్ సీఎం గా అయినప్పుడూ ఏబీఎన్ ధోరణి మారలేదు… అయినా రెండు సార్లు గెలిచిండు.. ఇప్పడు కేసీఆర్ పైనా… కుక్క తోక వంకర అంటే ఇదేనేమో…..

  ఒక సారి తెలంగాణ బిడ్డ… సగం తెలంగాణ బిడ్డ అయిన రాధాకృష్ణ గారిని ఒక ప్రశ్న అడిగిండు… అది ఏమిటంటే…

  సార్ మీరు చంద్రబాబు సపోర్టుగా ఉంటారు ఎందుకని..
  ఆర్కే: ఆయన మంచి చేస్తున్నాడు.. అవసరం రాలేదు.. రేపు చెడు చేస్తే ఆయననూ వదలను… అని అన్నాడు..

  హ్హా.. హ్హా.. హ్హా.. హ్హా.. హ్హా.. నాకు అప్పడు బాగా నవ్వొచ్చింది… చెడ పుట్టిండు సార్.. మన తెలంగాణలో వీడు..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s