త్యాగాల సాలుపోసిన నేల


image

‘కొమురం భీమ్ ఈ కొండల నుంచే నిజాం సేనతో ఆఖరియుద్ధం చేసినట్టు చెబుతారు. ఇక్కడి నుంచి పెద్ద పెద్ద బండలను నిజాం సైనికులపైకి దొర్లించి భీమ్ సేన పోరాడిందట’

కొమురం భీమ్ ఈ కొండల నుంచే నిజాం సేనతో ఆఖరియుద్ధం చేసినట్టు చెబుతారు. ఇక్కడి నుంచి పెద్ద పెద్ద బండలను నిజాం సైనికులపైకి దొర్లించి భీమ్ సేన పోరాడిందట అని మిత్రుడు మల్లేశ్ చెబుతున్నాడు. భీమ్ స్మారక చిహ్నం పక్కనే ఉన్న కొండపైకి కాస్త కష్టమైనా ఇష్టపడే ఎక్కాము. కొండ చాలా నిటారుగా ఉంది. భీమ్ నడయాడిన కొండలపై మేమూ తిరుగుతున్నాం. ఏదో గొప్ప భావన. ఇదంతా త్యాగాల సాలుపోసిన భూమి. ఇక్కడికి అసిఫాబాద్ కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ దట్టమైన అడవి, లోయలు దాటుకుని రావాలి. రోడ్డు లేదు. నిజాం సైన్యం 1940లోనే అసిఫాబాద్ వరకు రైలులో వచ్చి, అక్కడి నుంచి అడవి ద్వారా జోడేఘాట్ చేరుకుని భీమ్ నిర్మించుకున్న స్వేచ్ఛా రాజ్యంపై దాడికి దిగింది. ఉట్నూరు వైపు నుంచి రావాలంటే దుర్గమారణ్యాలను దాటుకుని చాలా దూరం ప్రయాణించాలి. భీతిని గొలిపే కెరామెరి ఘాట్‌ల ద్వారా ఎత్తైన కొండలు దిగి జోడేఘాట్ మైదానంలోకి ప్రవేశించాలి. అక్కడక్కడ విసిరేసినట్టు కొండవాలులను ఆనుకుని ఎర్రటి పెంకుటిండ్లతో చిన్నచిన్న గూడేలు కనిపిస్తాయి.

జోడేఘాట్ వద్ద నిలబడి చూస్తే కనుచూపు మేర చుట్టూ పచ్చని కొండలు, వాటిని ఆనుకుని మధ్యలో లొద్దిలు(లోయలు). అక్కడక్కడావొంపుసొంపుల మైదానాల్లో పరుచుకున్న జొన్న చేలు. పత్తి చేలు…కొండలపై ఎటు చూసినా టేకు వనాలు. జోడేఘాట్‌లో మొత్తంగా ముప్పై ఇళ్లు ఉంటాయేమో. ఇటీవలి సర్వేలో వారి నుంచి కూడా వివరాలు సేకరించారట. పచ్చని మైదానంలో చిన్నచిన్న పెంకుటిండ్లు భూమితల్లికి ఎర్రని బొట్లు పెట్టినట్టు…ఏదో పెయింటింగు గీసినట్టు సుందర దృశ్యం. కానీ ఆ ఊరికి చేరుకోవడానికే చాలా కష్టమైంది. అక్కడికి బస్సు కూడా నడుస్తున్నది. కానీ రోడ్డు బాగా లేకపోవడంతో అక్కడికి ప్రభుత్వ సిబ్బంది రావడానికి ఇష్టపడరు. భీం సమాధికి సమీపంలోనే ఆశ్రమ పాఠశాల ఉంది. రవీందర్, మరో అధ్యాపకుడు పిల్లలతో ఉన్నారు. 130 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పిల్లల ముఖాల్లో కళ ఉంది. చదువుకోవాలన్న ధ్యాస ఉంది. భీం సమాధి ముందు నిలబడి జయజయహే తెలంగాణ జననీ జయకేతనం…. గండరగండడు కొమురం అని పాడుతుంటే మనస్సు పులకించిపోయింది.

జోడేఘాట్‌ను పర్యాటక స్థలంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించి ఉంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా చాన్నాళ్ల క్రితం జోడేఘాట్ కొమురం భీం స్మారక స్థలాన్ని సందర్శించి నివాళులర్పించారని స్థానికులు గర్వంగా చెప్పుకున్నారు. ఏ ప్రాంతమయినా అభివృద్ధి చెందడానికి ప్రధాన ప్రాతిపదిక అక్కడికి రాదారి పోదారి ఉందా లేదా అన్నదే. జోడేఘాట్‌కు తారు రోడ్డు మంజూరయిందట. కానీ అటవీ అనుమతులు లభించక పోవడం వల్ల మధ్యలోనే పనులు ఆగిపోయాయి. ఇప్పటికీ చినుకుపడితే చాలు బాట బందవుతది. బస్సుల రాకపోకలు నిలిచిపోతయి. సెలయేళ్లు పొంగుతాయి. బాట దిగబడుతుంది. రోగాలు నొప్పులు వస్తే అక్కడికి డాక్టర్ చేరాలన్నా, డాక్టర్ దగ్గరికి రోగిని తీసుకు పోవాలన్నా కష్టమే. ప్రధాన జీవన స్రవంతికి, గిరిజనుల జీవన స్రవంతికి మధ్య కొన్ని ఆమడల దూరం ఇప్పటికీ మిగిలే ఉంది. దానిని తగ్గించగలిగింది రోడ్డు, దాని ద్వారా వచ్చే అభివృద్ధి…

అంతకు ముందు గుడి హత్నూరు నుంచి ఉట్నూరు మార్గంలో ప్రయాణం సాగిస్తున్నాం. ఎందుకో ఈసారి ఈ ప్రయాణం కొత్తగా అనిపించింది. మన గడ్డపై ప్రయాణిస్తున్నామన్న భావన మనసును తేలికపరుస్తున్నది. అక్కడక్కడా తెలంగాణ ప్రభుత్వ బోర్డులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సూచికగా అన్ని చోట్ల కొత్తగా రంగువేసిన బోర్డులు. దారి పొడవునా తరిగిపోతున్న అడవి… రోడ్డుకిరువైపులా పల్చ పల్చగా చిగురిస్తున్న టేకు చెట్లు… పచ్చని తివాచీ పరుచుకున్నట్టు నేల కనిపించకుండా జొన్న చేలు, పత్తి చేలు…. త్వరలో మనం ఇంద్రవెల్లి చేరుకోబోతున్నామని మిత్రుడు మార్కండేయ చెప్పారు. అవును…పొరకల సార్లగురించి, వారు సాగించిన ఉద్యమాల గురించి, వారి త్యాగాలను గురించి విన్నది కన్నదీ, చదివినదీ ఒక్కసారిగా ఆలోచనల కలబోత. ఈ రోడ్డుకే ఒక మహత్తు ఏదో ఉన్నట్టు అనిపించింది. ఈ త్యాగాల సాలు ఇంద్రవెల్లితో మొదలయి జోడేఘాట్ దాకా సాగిపోయింది. ఇంద్రవెల్లి స్థూపం చూసినప్పుడు ఒక స్ఫూర్తి, ఒక నిర్వేదం, ఒక వేదాంతం… అన్నీ మనసును మెలిపెట్టాయి.

మీరు మావోయిస్టులను సమర్థిస్తారా అని ఫేస్ బుక్‌లో అమరుల స్థూపం ఫోటో పెట్టాడాన్ని చూసి ఒక మిత్రుడు ప్రశ్నించాడు. మావోయిజం ఈ కాలానికి పనికి రాదని నమ్ముతాను. కానీ వారి నిజాయితీ, వారి త్యాగాలు, అవి సాధించిన విజయాలను కొనియాడకుండా ఉండలేను. వాళ్లకు స్వార్థం లేదు. పేదల పట్ల పక్షపాతం ఉంది. ప్రాణాలకు తెగించి అడవిబాట పట్టినవారికి ఏరకమైన దురుద్దేశాలను ఆపాదించగలం? ప్రజాయుద్ధ పంథా ఆచరణ సాధ్యం కానిదని మాత్రమే ఎవరయినా విమర్శించగలిగింది. 1940లలో తెలంగాణ సాయుధ పోరాటం, 1970లలో మావోయిస్టుల పోరాటం తెలంగాణ సమాజాన్ని ప్రజాస్వామ్యీకరించ డానికి బలమైన పునాదులు వేశాయి. అత్యంత కర్కశమైన భూస్వామ్య పునాదులను బద్దలు కొట్టాయి. వెట్టిని, దాష్టీకాన్ని తరిమికొట్టాయి. భూ సంస్కరణలను వేగవంతం చేశాయి. కులాల అంతరాలను తగ్గించాయి. ఇవన్నీ కమ్యూనిస్టు ఉద్యమాలు సాధించిన పరోక్ష విజయాలు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఆ పునాదుల పైనే నడిచింది. విజయం సాధించింది. ఇంద్రవెల్లిలో ఎంత మంది మరణించారో ఇప్పటికీ లెక్క తెలియదు. ప్రభుత్వం లెక్కకు, వాస్తవిక లెక్కకు పొంతనలేదని మావోయిస్టు సానుభూతిపరులు చెబుతారు. అక్కడి నుంచి ఉట్నూరుకు చేరుకున్నాం. ఉట్నూరులో ఐటీడీఏ ప్రాంగణానికి కొమురం భీమ్ ప్రాంగణంగా నామకరణం చేశారు. ఉట్నూరులో విలేకరుల సమీక్షా సమావేశం తర్వాత మధ్యాహ్నం జోడేఘాట్‌కు వెళ్లాం. అక్కడ నుంచి తిరిగి గెస్ట్ హౌజ్‌కు చేరేసరికి రాత్రి ఎనిమిదిన్నర గంటలయింది.

అంతా నాయకులతోనే సార్. ఇక్కడ అభివృద్ధి జరగకపోవడానికి నాయకులే కారణం. కోట్లకు కోట్లు నిధులు ఇస్తున్నట్టు, వస్తున్నట్టు పత్రికల్లో వార్తలు వస్తాయి. కానీ గ్రామాలకొచ్చి చూస్తే ఆ కోట్ల ఆనవాళ్లు ఏమీ కనిపించవు. మౌలికమైన మార్పులేమీ గ్రామాల్లో కనిపించవు. ఉట్నూరు డివిజనులో ఏ పనులూ జరగకుండా అధికారులను బెదిరించి, నిలువరించే రాజకీయ నాయకులు జిల్లాలో ఉన్నారు. ఏ పనులూ సాగనివ్వరు. అందుకే ఈ ప్రాంతం ఇంకా వెనుకబడి ఉంది అని స్థానిక నాయకుడొకరు చెప్పారు. ఈ ప్రాంతానికి ఉన్న ప్రకృతి సొబగులను చెదరకుండానే ఇక్కడ టూరిజం అభివృద్ధి చేయవచ్చు. కేసీఆర్ సార్ అన్నట్టు ఇక్కడ ఆరుమాసాలపాటు కశ్మీరును మించిన అందాలు కనువిందు చేస్తాయి. అభివృద్ధికి చిహ్నంగా మారిన రోడ్ల వ్యవస్థను ఈ ప్రాంతాలన్నింటా విస్తరిస్తే ఇతర వసతులు, వనరులు అవే ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. కేసీఆర్‌గారు తన మాటను నిలబెట్టుకుంటారన్న నమ్మకం మాకు ఉంది అని ఆ యువకుడు చెప్పారు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s