తెలంగాణ జెండా వర్సెస్ విద్రోహ ఎజెండా


223

పొద్దెరగని బిచ్చగాళ్లు

రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. అందరినీ చలింపజేస్తున్న సమస్య అది. కానీ అది తెలంగాణకు దీర్ఘకాలికంగా సంక్రమించిన సమస్య. వ్యవసాయ సంక్షోభం వల్ల కొనసాగుతున్న సమస్య. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చలేకపోవడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న దుర్గతి అది. రాష్ర్టాన్ని, దేశాన్ని ఇన్నేళ్లపాటు ఏలిన కాంగ్రెస్,టీడీపీ, బీజేపీలది ఈ పాపంలో ప్రధాన పాత్ర. రైతుల ఉసురుపోసుకోవడం వల్లనే బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలను గతంలో ప్రజలు తిరస్కరించారు. తెలంగాణను ఎండబెట్టిన దుర్మార్గం ఈ పార్టీలదే.

కొత్త బిచ్చగాడు పొద్దెరగడని సామెత. రాష్ర్టాన్ని ఐదున్నర దశాబ్దాలు పరిపాలించిన పార్టీలు, ఇప్పుడు దేశాన్ని ఏలుతున్న పార్టీలకు చెందినవారు తెలంగాణ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తున్నది. కొందరు నాయకులయితే అప్పుడే ఉన్మాద స్థితికి చేరుకుని మాట్లాడుతున్నారు. మెదక్ లోక్‌సభ ఉపఎన్నికల్లో పార్టీలు పోటీచేయడం, పరస్పర విమర్శలు చేసుకోవడం అనివార్యమే అయినా ఇంతగా బరితెగించాల్సిన పనిలేదు. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడి ఇంకా వంద రోజులు కాలేదు. ప్రభుత్వమే పూర్తిస్థాయిలో ఏర్పడలేదు. అధికారుల విభజనే పూర్తి కాలేదు. ఐఎఎస్, ఐపిఎస్‌లు ప్రభుత్వాల్లో చేరడానికి మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉంది. కమలనాథన్ కమిటీ ఇంకా సిబ్బంది విభజనకు సంబంధించి తుది మార్గదర్శకాలు ఖరారు చేయలేదు. తాత్కాలిక అధికారులు, తాత్కాలిక సిబ్బందితో మాత్రమే ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇన్ని పరిమితుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం అసాధారణ నిర్ణయాలు చేసింది. ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేయడానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. మునుపెన్నడూ లేని రీతిలో సర్వే నిర్వహించి పథకాల అమలుకు ఒక కట్టుదిట్టమైన ప్రాతిపదికను రూపొందించేందుకు ప్రయత్నించింది. అన్ని వర్గాల ప్రజలకు భరోసా ఇచ్చేందుకు కృషి చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలు తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అహర్నిశలూ పనిచేస్తున్నారు. నిజమే. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. అందరినీ చలింపజేస్తున్న సమస్య అది. కానీ అది తెలంగాణకు దీర్ఘకాలికంగా సంక్రమించిన సమస్య. వ్యవసాయ సంక్షోభం వల్ల కొనసాగుతున్న సమస్య. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చలేకపోవడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న దుర్గతి అది. రాష్ర్టాన్ని, దేశాన్ని ఇన్నేళ్లపాటు ఏలిన కాంగ్రెస్,టీడీపీ, బీజేపీలది ఈ పాపంలో ప్రధాన పాత్ర. రైతుల ఉసురుపోసుకోవడం వల్లనే బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలను గతంలో ప్రజలు తిరస్కరించారు. తెలంగాణను ఎండబెట్టిన దుర్మార్గం ఈ పార్టీలదే. కృష్ణా, గోదావరి నదుల నుంచి తెలంగాణకు రావలసిన వాటా నీటిని వినియోగంలోకి తీసుకు వచ్చి ఉంటే ఇవ్వాళ తెలంగాణ రైతులు ఇలా మృత్యువును ఆశ్రయించేవారు కాదు.

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రైతులపైన, తెలంగాణ ప్రజలపైన ఒలకబోస్తున్న ప్రేమను చూస్తుంటే విస్మయం కలుగుతున్నది. పొన్నాల లక్ష్మయ్య నిన్నమొన్నటి వరకు నీటిపారుదల మంత్రి. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు. జానారెడ్డి పంచాయతీరాజ్ మంత్రి. గతంలో హోంమంత్రి. పదేళ్లపాటు రాష్ర్టాన్ని ఏలారు. ఏం సాధించారు? ఎన్ని లక్షల ఎకరాల భూమిని సాగులోకి తెచ్చారు? ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి మూడంటే మూడే సంవత్సరాల్లో పోతిరెడ్డిపాడు కాలువను ఒక నదిలా మళ్లించుకుపోతుంటే జానారెడ్డి శ్రీశైలం ఎడమకాలువ టన్నెలు పనులను పదిశాతం కూడా పూర్తి చేయించలేకపోయారు. ఏఎంఆర్పీని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురాలేకపోయారు. ఇప్పటికీ ఉదయసముద్రం పూర్తిస్థాయిలో నిండదు. డిస్ట్రిబ్యూటరీలకు నీరు అందదు. మూసీకి నీరు ప్రవహించదు. అసలు మన నాయకులకు నీటి సోయి ఎక్కడుంది? మనకు కాంట్రాక్టులు వచ్చాయా? కమిషన్లు వచ్చాయా లేదా అన్నదే ఆనాటి చాలా మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఆరాటం. ఇవ్వాళ రైతులు చనిపోతున్నారని గొంతు చించుకుంటే ఏమిటి ప్రయోజనం? సాగునీరు, తాగునీరుకు సంబంధించి సోయిని కల్పించింది తెలంగాణ ఉద్యమం, కేసీఆర్. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నీటి ప్రాజెక్టుల గురించి ప్రణాళికలు రచిస్తున్నది, అధికారులతో సమీక్షిస్తున్నది కేసీఆర్, హరీశ్‌రావు. ఉద్యమ స్ఫూర్తితో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. అయితే ప్రాజెక్టులు రాత్రికి రాత్రి పూర్తికావు. సమయం పడుతుంది. ప్రాజెక్టులు పూర్తయ్యే దాకా రైతులు ఇలా రాలిపోవలసిందేనా? కంటింజెన్సీ ప్రణాళికను రూపొందించి తక్షణం రైతులకు ఆత్మైస్థెర్యం కల్పించే చర్యలు చేపట్టాలి. తెలంగాణ ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం రాజధాని వదిలి జనం వద్దకు వెళ్లాలి. మీడియా, పౌర సమాజం మంచి రోజులు వస్తాయన్న ఒక నమ్మకాన్ని కలిగించాలి. ప్రభుత్వం వీరందరినీ కూడగట్టేందుకు ప్రయత్నించాలి. సమస్యలను ఎన్నికల నుంచి విడదీసి వాటిని పరిష్కరించడానికి పూనుకోవాలి.

కాంగ్రెస్ కాలం చెల్లిన పార్టీ. ఏ అవకాశాన్నీ అందిపుచ్చుకోలేని వృద్ధాప్యం ఆ పార్టీని పీడిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఇక్కడ గెలవలేకపోవడమే ఆ పార్టీ చేతల నిర్వాకానికి నిదర్శనం.

మెదక్‌లో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ఎన్నయినా చెప్పనివ్వండి. ప్రజలు ఇప్పుడప్పుడే వారిని నమ్మే అవకాశం లేదు. ఎందుకంటే తెలంగాణ అనుభవిస్తున్న సమస్యలన్నింటికీ వారసత్వ హక్కులు కాంగ్రెస్, టీడీపీలకే ఉన్నాయి. బీజేపీది అరవగోల. తెలంగాణకు మద్దతు ఇచ్చిందన్న పేరే తప్ప అన్ని సందర్భాల్లోనూ తెలంగాణకు ఖిలాఫ్ వ్యవహరించిన పార్టీ అది. నరేంద్రమోడీ హైదరాబాద్‌కు వచ్చి మాట్లాడిన అంశాలూ ఎవరూ మరవలేదు. పార్లమెంటులో వెంకయ్య నిర్వహించిన పాత్ర అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్‌ను వెంటేసుకుని తెలంగాణలో తిరిగిన నాడే బీజేపీ తెలంగాణవాదం వెలసి పోయింది. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపించిన శక్తులన్నిటికీ కేంద్రబిందువు టీడీపీ. పెప్పర్ స్ప్రే కుట్రదారులు కూడా ఆ పార్టీతోనే ఉన్నారు. అటువంటి టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు మెదక్ ఎన్నికలో ఒక తెలంగాణ ద్రోహికి బీజేపీ టికెట్ ఇచ్చింది. బీజేపీ తెలంగాణ ప్రజలకు దూరం జరుగుతూ వచ్చిందే తప్ప, వారికి దగ్గర కావడానికి ప్రయత్నించలేదు. తొలి తెలంగాణ ప్రభుత్వంపట్ల పాటించాల్సిన కనీస మర్యాదలు కూడా ఆ పార్టీ పట్టించుకోవడం లేదు. ద్రోహులతో కలసి విచ్చలవిడిగా చెలరేగుతున్నది. వీళ్ల చేతికి ఒక్క ఓటు ఇచ్చినా, ఒక్క సీటు ఇచ్చినా దండుగే అని తూప్రాన్‌కు చెందిన ఒక అధ్యాపకుడు వ్యాఖ్యానించారు. కానీ బీజేపీ, టీడీపీలు ఒక సామాజిక వర్గానికి చెందిన వారిని రెచ్చగొట్టడానికి, ఓట్లు వేయించుకోవడానికి అదేపనిగా ప్రచారం చేస్తున్నాయి. ఒక ఉన్మాదపూరితమైన ఆరోపణలు కురిపిస్తున్నాయి. ఇటువంటి విద్వేషపూరిత శక్తులను తెలంగాణ తొలిదశలోనే వదిలించుకోవలసి ఉంది. లేదంటే నవ తెలంగాణ నిర్మాణంలో వీళ్లు పల్లేర్లు చల్లుతారు. అడుగడుగునా అవరోధాలు సృష్టిస్తారు. రేవంత్‌రెడ్డికి, జగ్గారెడ్డికి ఏం విధానాలున్నాయి? తెలంగాణకు వారు ఏం చేయగలరు? ఎవరో ఒకరికి కీలుబొమ్మలుగా వ్యవహరించే వీళ్లు తెలంగాణకు ఏం పనికొస్తారు? అని ఆ అధ్యాపకుడు ప్రశ్నించాడు. అవును…వీళ్లు ఏ విలువలకోసం నిలబడ్డారు? దేనికోసం కొట్లాడారు? ఏం సాధించారు? ఎందుకు ఓటేయాలి? అని విచక్షణాపరులకు ఎవరికయినా అనిపిస్తుంది.

కాంగ్రెస్ కాలం చెల్లిన పార్టీ. ఏ అవకాశాన్నీ అందిపుచ్చుకోలేని వృద్ధాప్యం ఆ పార్టీని పీడిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఇక్కడ గెలవలేకపోవడమే ఆ పార్టీ చేతల నిర్వాకానికి నిదర్శనం అని ఒక విశ్లేషకుడు ఇటీవల టీవీ చర్చల్లో కుండబద్దలు కొట్టాడు. నిజమే… పదేండ్లు నాన్చి, వెయ్యిమందికి పైగా యువకులను బలితీసుకుని, వేలాది మంది యువకులపై కేసులు పెట్టి, తెలంగాణ ప్రజలు విసిగి వేసారి పోయినదాకా సాగదీసి తెలంగాణ ఇస్తే క్రెడిట్ ఎలా దక్కుతుంది? తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం బరిగీసి కొట్లాడి ఉంటే తెలంగాణ రావడంలో ఇంత జాప్యం జరిగేది కాదు. తెలంగాణ ఇంత క్షోభ అనుభవించాల్సి వచ్చేది కాదు. తెలంగాణ కాంగ్రెస్ చేజారిపోవడానికి ఇక్కడి కాంగ్రెస్ నాయకత్వం చేతగానితనం కూడా కారణమే. మా అనుభవం ముందు మీరెంత? మాకున్న అవగాహన మీకెక్కడుంది అని కొందరు కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ జబ్బలు చరుచుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడని అనుభవం ఎందుకు? పనులు చేయించలేని అవగాహన దేనికి? వీళ్లకు కొత్త ఆలోచనలు లేవు. కొత్త నాయకత్వమూ లేదు. తెలంగాణ రాజకీయ అస్తిత్వానికి సంబంధించిన పట్టింపులు లేవు. తెలంగాణకు ఏదో చేయాలన్న తాపత్రయమూ లేదు. తెలంగాణ అస్తిత్వ చైతన్యమూ లేదు. వారు ఇప్పుడప్పుడే మారే అవకాశం గానీ, తెలంగాణ ఆత్మను అర్థం చేసుకునే అవకాశం కానీ లేదు. అందువల్ల కాంగ్రెస్‌కు ఓటు బూడిదలో పోసిన పన్నీరు.

తెలంగాణ రాజకీయ అస్తిత్వ పతాకాన్ని నెత్తికెత్తుకుని, తెలంగాణకోసం ఒక నవనిర్మాణ ఎజెండాతో అడుగులు వేస్తున్న టీఆరెస్ ఒక్కటే అప్పటికీ ఇప్పటికీ తెలంగాణ ముందున్న ప్రత్యామ్నాయం. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఉప ఎన్నిక ఇది. కేసీఆర్ ఖాళీ చేసిన సీటు. ఆయన సొంత నియోజకవర్గం. తెలంగాణ పునర్నిర్మాణంకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ వంద ఆలోచనలు చేస్తున్న తరుణం ఇది. తెలంగాణ ఆత్మకు ఇప్పటికీ ప్రతినిధి టీఆరెస్సే. ఈ ఎన్నికల్లో టీఆరెస్‌ను గెలిపించడం అంటే తెలంగాణ ఎజెండాను గెలిపించడం.

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Political Commentary. Bookmark the permalink.

3 Responses to తెలంగాణ జెండా వర్సెస్ విద్రోహ ఎజెండా

  1. N Anil Reddy says:

    Yes TRS is the only party, truly working the welfare of telangana socitey, with innovative thoughts. I support them as a citizen of telangana.

    Like

  2. a.yakaswamy says:

    అప్పుడే పుట్టిన బిడ్డను పరుగు పందేంతీయమన్నట్టు ఉంది…తెలంగాణ..కాంగ్..కాషాయ..పసుపు పార్టీల తీరు..రాష్ట్ర ఏర్పడి వంద రోజులైనా కాలేదు..అప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం రాలేదని అనేవాన్ని ఏమనాలో అర్దంకావడంలేదు..ముర్ఖపు రాజకీయాలతో ప్రజల్లో పలుచన కావడం తప్ప..వారు సాధించేది ఏమిలేదు..సార్…ఎంత పెద్దరోగానికైనా సరైన వైద్యం అందితే..నయం అవుతుంది..దీర్ఘకాలంగా తెలంగాణకు పట్టిన రోగాన్ని కేసీఆర్..మందులతో..లేక శస్త్రచికిత్సతో నయం చేస్తుండు…కాస్తా సమమం పడుతంది…పలితం వచ్చే వరకు వేచి చూడాలి..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s