తెలంగాణ ప్రభుత్వంలోనే 90 శాతం మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ ఒక నివేదిక ఇచ్చింది. దేశంలోనే ఇది రికార్డు అని కూడా ఆ నివేదిక పేర్కొంది. అయితే ఆ నివేదికను రూపొందించిన మేధావులకు తెలంగాణ ఆవిర్భావ నేపథ్యం గురించి కానీ, తెలంగాణ ఉద్యమం గురించి కానీ కనీసం అవగాహన లేదని, వారికి కేసుల లెక్కలు తప్ప ఇంగితజ్ఞానం ఇసుమంతయినా లేదని ఆ నివేదికను చూస్తే అర్థమవుతుంది. ఏడీఆర్ ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని అర్థం చేసుకున్న తీరిది. ఇంకేం కోతికి కొబ్బరికాయ దొరికిన చందంగా తెలంగాణపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్న టైమ్స్ ఆఫ్ ఇండియా వ్యాపార శిశువు ఎకనమిక్ టైమ్స్ ఇప్పుడు మళ్లీ ఆ నివేదికను తవ్వి తీసి ఒక వార్తను వండి వార్చింది.
తెలంగాణ మంత్రులపై కేసులు ఎందుకు వచ్చాయి? కేసులు పెట్టింది ఎవరు? వాళ్లు నేరాలు ఎప్పుడు చేశారు? ఎందుకు చేశారు? ఇప్పుడు తెలంగాణలో మంత్రులుగా ఉన్నవారిలో అత్యధికులు ప్రభుత్వంలోకి రావడం ఇదే ప్రథమం. వారు గత పద్నాలుగేళ్లుగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఉద్యమం సందర్భంగా సీమాంధ్ర ప్రభుత్వం నుంచి అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నారు. సీమాంధ్ర ప్రభుత్వం వేలాదిమంది తెలంగాణ ఉద్యమకారులను అనేక కేసుల్లో ఇరికించింది. కొందరిపై పీడీ చట్టాలనూ ప్రయోగించింది. ఒక్కొక్కరిపై వందలాది కేసులు నమోదు చేసింది. అత్యధిక కేసులు ఇలా పెట్టినవే. ఆ కేసులన్నీ లెక్కవేసి తెలంగాణ ప్రజాప్రతినిధుల్లో అత్యధికశాతం మంది నేరగాళ్లే అని తీర్పులు ఇస్తే వారిని మేధావులు అనుకోవాలా లేక వాస్తవాలు చూడడానికి నిరాకరించే మరుగుజ్జులు అనుకోవాలా? ఇటువంటి వారు ఎటువంటి ప్రజాస్వామిక సంస్కరణలు ప్రతిపాదిస్తారో అర్థం కాదు.
అసలు ఇలాంటి దుకాణాల్ని ఎవడు, ఎందుకు తెరుస్తారో అర్థం కాదు…వీటి సర్వేలకు ప్రయోజనం, పరమార్థం ఏమిటో తెలియవు….అసలు ఇవాళ మీడియాలొ (టివి సహా)కొన్ని వార్తల్ని ఇలాంటి ప్రమాణాలతో సర్వే చేస్తే కుళ్ళు, కుట్రలు నేపథ్యంగా లేని ఒక్క చానెల్, లేదా పత్రిక అయినా కనిపిస్తుందా????