స్వేచ్ఛాప్రతీక గోల్కొండ


DSC_9680_F

శిఖరంపై గడ్డకట్టిన స్వచ్ఛమైన మంచుబిందువోలె
పాటలుపాడే పోక పిట్ట పచ్చని సిగ తళుకువోలె
ఫౌంటెన్ నుంచి ప్రసరించే సూర్యకిరణాల తరంగమోలె
తలతల మెరిసే వజ్రమొంటి గోల్కొండకు చెందినవారా-

గోల్కొండను కీర్తిస్తూ జాన్ కీట్స్ రాసిన పద్యానికి స్వేచ్ఛానువాదం ఇది. అప్పుడెప్పుడో 130 ఏళ్ల క్రితం ఒక కవి భావన ఇది. అవును. ఇది చరిత్ర పురుషులు నడయాడిన నేల. మునుపు గొల్లలేలిన మట్టి కొండ. కాకతీయుల గిరి దుర్గం. బహమనీ సుల్తానుల ప్రాంతీయ రాజధాని. కుతుబ్‌జాహీల స్వరాజ్య పట్టాభిషేకం జరిగింది ఇక్కడే. మల్కిభరాముడు ఏలింది ఇక్కడి నుంచే. ఔరంగజేబు కళ్లు కుట్టింది ఈ కోటను, ఈ సంపదలను చూసే. మొఘలులను ఎదిరించి భీషణ యుద్ధాలు జరిగింది ఇక్కడే. అసఫ్‌జాహీల తొలి ఏలుబడి ఈ కోట నుంచే జరిగింది. ఆధునిక రాజప్రాసాదాలు రాకముందు రత్నాలు రాసులుపోసింది ఈ కోటలోనే. ఒకనాడు కోహినూరు వజ్రాన్ని దాచిందీ ఈ కోటలోనే. గతాన్ని తలుచుకోవడం అంటే వెనుకకు వెళ్లడం కాదు. మనం ఏ పునాదులమీద లేచి నిలబడ్డామో తెలుసుకోవడం. ఢిల్లీలో ఎర్రకోటపై నుంచి పతాకాన్ని ఎగరేస్తున్నామంటే షాజహాను రోజుల్లోకి తరలిపోవడం కాదు. చరిత్ర పునాదులపై నిలబడి ఆత్మగౌరవాన్ని ప్రదర్శించుకోవడం. చెరిగిపోయిన, చెదరిపోయిన మన ఆనవాళ్లను మళ్లీ ఆవాహన చేసుకోవడం. ఈ గడ్డ గొప్పతనాన్ని ముందుతరాలకు చాటిచెప్పడం.

వలస భావజాలం నుంచి, ఆధిపత్య శక్తులు సృష్టించిన ముద్రల నుంచి, వారు మన మనసుల్లో నాటిన ప్రతీకల నుంచి విముక్తి పొందేందుకు చేసే ప్రయత్నంలో మరో ముందడుగు గోల్కొండ కోటలో పంద్రాగస్టు పండుగ చేయాలన్న నిర్ణయం. వలస ప్రభుత్వాలు పనిగట్టుకుని విస్మృతిపథంలోకి నెట్టిన మన చరిత్ర, సంస్కృతి, సాహితీ, జానపద సౌరభాలను మళ్లీ పునఃప్రతిష్టింపజేయడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీసుకున్న నిర్ణయం ఉపయోగపడుతుంది అని చరిత్ర పరిశోధకుడు ఒకరు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ చరిత్ర ఎలా విస్మృతికి గురైందో రాస్తే మహాభారతం అవుతుంది. సమైక్య రాష్ట్రంకోసం పదవులు త్యాగం చేసిన బూర్గుల రామకృష్ణారావు గురించి మనకు పెద్దగా తెలియదు. ఆంధ్ర రాష్ట్రంకోసం త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు చరిత్రను మాత్రమే మనం చదువుకున్నాం. లేపాక్షి ఘనత, కూచిపూడి నాట్య మాధుర్యమే తప్ప మన రామప్ప శిల్పకళా ప్రసిద్ధి గురించి, వేయిస్తంభాల గుడి ప్రాశస్త్యం గురించి, పేరిణి తాండవ విశేషాలను గురించి మనం తెలుసుకున్నది, మన పిల్లలకు నేర్పుకున్నది తక్కువ. అమరావతీ నగర అపురూప శిల్పాలను గురించి చదువుకున్నాం తప్ప కొలనుపాక, ఫిణిగిరి కొండ చుట్టూ నడయాడిన బౌద్ధబిక్షువుల ఆనవాళ్లను గుర్తుపట్టలేకపోయాం.

కృష్ణదేవరాయల పతనోన్నతాల గురించే కథలుకథలుగా చెప్పుకున్నాం తప్ప కాకతీయ వైభవ విభవాలను గురించిన ప్రస్తావన అరుదుగా మాత్రమే చదువుకున్నాం. రెడ్డిరాజుల ఔన్నత్యాన్ని కంఠస్థం చేశామే తప్ప రాజకీయ, సాహితీ, సాంస్కృతిక సౌరభాలకు ఆలవాలమైన రాచకొండ చరిత్రను కనీసం కాపాడుకోలేకపోయాము. నన్నయను ఆదికవిని చేసి, మన ఆదికవి పాల్కురికి సోమనాథుడిని మరచిపోయాం. మన పోతన, మల్లినాథ సూరి, భీమకవి, మారన, దాశరథి, ఆళ్వార్‌స్వామి మనకు ద్వితీయ ప్రాధాన్యం అయిపోయారు. తెలంగాణ చరిత్రను చెప్పుకోవడం అంటే ఆంధ్రుల చరిత్రను తక్కువ చేయడం కాదు. వారి చరిత్ర, సాహితీ, సాంస్కృతిక వారసత్వం తక్కువనీ కాదు. మన అస్తిత్వం ప్రకటించుకోవడం అంటే, మన స్వాభిమానాన్ని ప్రదర్శించడం అంటే ఎదుటివారిని తక్కువ చేయడం కాదు. ఆధిపత్య శక్తులు వక్రీకరించిన చరిత్రను, సంస్కృతిని, సాహిత్యాన్ని సరిదిద్దడం. మన ప్రాధాన్యాలను మనం పునర్నిర్వచించుకోవడం. మరుగునపడిన మన వైభవాలను మళ్లీ మళ్లీ మననం చేసుకోవడం. గోల్కొండ వెయ్యేళ్ల తెలంగాణ చరిత్రకు ప్రతీక. ఇక్కడి రాజులు మరాఠాల నుంచి, బహమనీల నుంచి, మొఘలుల నుంచి పదేపదే స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నది ఈ కోట బురుజుల నుంచే. అచ్చమైన తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం వచ్చింది ఇప్పుడే. అక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేయడం తెలంగాణ స్వేచ్ఛా పతాకాన్ని ఎగురవేయడమే.

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Political Commentary. Bookmark the permalink.

One Response to స్వేచ్ఛాప్రతీక గోల్కొండ

  1. yakaswamy.a says:

    గొల్కొండ కోట హిందూ ..ముస్లిం సమిష్టి వారసత్వ సంపద..ఒకరు ప్రారంభిస్తే…ఒకరు విస్తరించారు…వేయిసంవత్సరాల గొల్కొండ చరిత్ర తెలంగాణ చరిత్రకు…అస్థిత్వానికి ప్రతీక…ఎనిమిది నెలలు ఔరంగా జేబు కొటను ముట్టడించాలని ప్రయత్నించిన లొంగని ధీరత్వం ఈ కోటకే చెల్లింది..చరిత్రలో అంత ఎక్కవ కాలం మొఘల్ సైన్యాలకు లొంగని..చేధీంచలేని కొట మరోటి లేదేమో…చివరకు ద్రోహాబుద్దితో కొట తలుపులు తెరిచి వశపరుచుకున్నారు…మోటార్లు లేని సమయంలో..కొటలోకి పైపుల ద్వారా పైకి ఎక్కించిన ఇంజనీరింగ్…నిపుణత దీని సొంతం..ఇప్పటికైనా..వలస (బాబులు) పాలకులు గొల్కొండను గొల్ఫ్ కోర్సు చేస్తామి ప్రయత్నిస్తే..నేడి తెలంగాణ ప్రభుత్వం జాతీయ జెండా ఎగురవేయడానికి నిచ్చయించుకోవడం..ప్రతీ తెలంగాణ బిడ్డా గర్వించదగ్గ విషయం..త్వరలోనే…గొల్కొండ కోటకు..యునెస్కో..గుర్తింపు రావాలని ఆకాంక్షిస్తూ…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s