ఆ గొంగడి తగలేద్దాం


logof

సంకల్పం ఉంటే సప్త సముద్రాలను అలవోకగా దాటవచ్చు. నాయకుడు దీక్షాదక్షుడైతే జనాన్ని సైన్యంలా నడిపించవచ్చు. ఎటువంటి లక్ష్యాలనైనా సాధించవచ్చు. ఒకేరోజు రాష్ట్రంలోని 4 లక్షల ఇళ్లకు వెళ్లి సర్వే నిర్వహించాలన్న ఆలోచనే అసాధారణమైనది, విప్లవాత్మకమైనది. బడ్జెట్ రూపకల్పనకోసం, సంక్షేమ పథకాల అమలుకోసం, నిధుల కేటాయింపుకోసం ఇప్పటి వరకు జరుగుతున్న సర్వేలన్నీ శాంపిల్ సర్వేలు. ఉజ్జాయింపు సర్వేలు. జనాభా లెక్కల సేకరణ ఒక్కటే సమగ్ర సర్వే. కానీ అందులో ప్రభుత్వానికి అవసరమైన అనేక వివరాలు సేకరించడం లేదు. అందులో కూడా పౌరులు చెప్పింది రాసుకోవడమే. పరిశీలనాత్మక సర్వే లేదు. సరైన, సమగ్రమైన సమాచారం లేకుండానే కొన్ని దశాబ్దాలుగా మన ప్రభుత్వాలు రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఏటా లక్షలాది ఇళ్ల నిర్మాణం ప్రకటిస్తారు. ఏటా కొత్తగా వేలు లక్షలు రేషన్ కార్డులు ఇస్తారు. ఏటా సామాజిక పెన్షన్ల సంఖ్య పెరుగుతూ పోతుంది. వీటికి అంతులేకుండా పోతున్నది. నిజమైన లబ్ధిదారులను గుర్తించడంలో తీవ్రమైన వైఫల్యం జరుగుతున్నది. అందుకే 84లక్షల గృహస్తులు ఉన్న మన రాష్ట్రంలో ఇప్పటికే 54 లక్షల ఇళ్లు నిర్మించినా ఇంకా ఇళ్ల నిర్మాణానికి లక్షలాది దరఖాస్తులు ఎదురుచూస్తున్నాయి. రేషను కార్డుల సంఖ్య కోటికిపైగా ఉన్నాయి.

సమస్యకు ఇదొక పాarshvaమైతే మరో పాarshvam అవినీతి. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ రెండున్నర దశాబ్దాల క్రితం ఒక మాటన్నారు. సంక్షేమ పథకాలకోసం కేటాయిస్తున్న నిధుల్లో ప్రతి రూపాయిలో పదిహేను పైసలు మాత్రమే లబ్థిదారులకు చేరుతున్నదని. ఆ తర్వాత వచ్చిన పీవీ నరసింహారావు కూడా అదే మాట చెప్పారు. ప్రణాళికా సంఘం పెద్దలు చెబుతున్నదీ అదే. మిగిలిన 85 పైసలు ఏమవుతున్నాయన్నదే అసలు సమస్య. దుర్వినియోగం లెక్కలు చెప్పారు కానీ ఏ ఒక్కరూ ఆ సమస్య మూలాల్లోకి వెళ్లడానికి ప్రయత్నించలేదు. ఎక్కడ మొదలు పెట్టాలో యోచించలేదు. దేశంలోనే మొదటిసారి కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అందుకు పూనుకున్నారు. ఇది ఒక సాహసం అనే చెప్పాలి. ఇదొక ప్రయోగం. ఇది ఎంతవరకు సత్ఫలితాలనిస్తుంది? సరైన సమాచార సేకరణ జరుగుతుందా? సమగ్ర వివరాలు వస్తాయా? అన్న అనుమానాలు ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి ఆదేశించిన విధివిధానాల ప్రకారం సమాచార సేకరణ జరిగితే సమాచార సేకరణలో అక్రమాలు జరిగే అవకాశం లేదు. ఈ ప్రయత్నం విజయవంతం అయితే దేశానికే ఆదర్శం అవుతుంది. ఒక కొత్త మార్గాన్ని చూపించినట్టవుతుంది. కానీ ఇంటింటికి వెళ్లే ప్రతి అధికారి కేసీఆర్ మనస్సుతో ఆలోచించాలి కదా!

కానీ ఆలోచించాలి. ఆలోచించే విధంగా అధికార యంత్రాంగం అంతా ఉద్యోగ సైన్యాన్ని సిద్ధం చేయాలి. సంక్షేమ పథకాల అమలులో దుర్వినియోగాన్ని అరికట్టగలిగితే మిగిలే నిధులతో రాష్ట్రంలో అద్భుతాలు చేయవచ్చు. నిజమైన బంగారు తెలంగాణ నిర్మించుకోవచ్చు. ఒక్క ఫీజు రీయింబర్సుమెంటు ఏం ఖర్మ – తెలంగాణ పిల్లలందరికీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించవచ్చు. వృద్ధులు, వికలాంగులు, వితంతులకు ఇప్పుడు ఇస్తున్నదానికంటే ఎక్కువ మొత్తంలో సామాజిక పెన్షన్లు ఇవ్వవచ్చు. దళితులకు మూడెకరాల భూమిని సేకరించి పంచవచ్చు. జిల్లాకో మెడికల్ కళాశాలను స్థాపించవచ్చు. ఇచ్చంపల్లి, కంతానపల్లితో సహా గోదావరి పొడవునా ప్రాజెక్టులు నిర్మించుకుని, కృష్ణా నదిపై ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి చేసుకుని నీటిపారుదల, విద్యుత్ రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించవచ్చు. ప్రతి పంపుకు, ప్రతి ఇంటికి నిరాటంకంగా కరెంటు సరఫరా చేయవచ్చు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలందరికీ ఉచిత బియ్యం పంపిణీ చేయవచ్చు. ఇండ్లు లేని నిజమైన పేదలకు రెండు బెడ్‌రూముల ఇండ్లు నిర్మించి ఇవ్వవచ్చు. దశాబ్దాల తరబడి చేసిన పనే చేయడం, నిధులు పోసిన చోటనే పోయడం అలవాటయింది.

సృజనాత్మకంగా ఆలోచించడం, అవినీతి తొర్రలను పూడ్చడం, ఒకసారి ఒక పనిచేస్తే మరోసారి అటుదిశగా చూడవలసిన అవసరం లేకుండా పథకాలు అమలు చేయడం అన్నది ఇప్పటివరకు లేదు. పైగా మనం గత ఐదున్నర దశాబ్దాలకు పైగా సమైక్యాంధ్ర గొంగడిలో కూర్చుని ఉన్నాం. వారి ఆలోచనలే, వారు సేకరించిన సమాచారమే, వారు రూపొందించిన పథకాలే మనకు ఇప్పటిదాకా ప్రాతిపదికగా ఉన్నాయి. వారి అవినీతి పునాదుల మీదనే ఇవన్నీ అమలవుతున్నాయి. అవి ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు బూడిదలో పోశామో మనకు తెలుస్తూనే ఉన్నది. ఫీజు రీయింబర్సుమెంటుకోసం ఇంజనీరింగు కళాశాలలు, ఆరోగ్యశ్రీకోసం ఆస్పత్రులు, దళారీలు, కాంట్రాక్టర్లకోసం ప్రాజెక్టులు, ఇండ్ల నిర్మాణం, డీలర్లకోసం రేషన్ షాపులు…. ఇదంతా రివర్సులో జరుగుతూ వచ్చింది. సమైక్యాంధ్ర ప్రభుత్వాలు అన్నీ తెలిసి మధ్య దళారీ వ్యవస్థలను పెంచి పోషిస్తూ వచ్చాయి. ప్రభుత్వ రంగంలో విద్య, వైద్య వ్యవస్థలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రైవేటుకు నిత్యకల్యాణం పచ్చతోరణం అన్నట్టు స్వాగత సత్కారాలు చేశారు. ప్రభుత్వ నిధులతో ప్రైవేటు రాజ్యాలు బలపడుతూ వచ్చాయి. ఈ కంపును కడుక్కోకుండా, ఈ గొంగడిని తగలేయకుండా అందులోనే కూర్చుని మళ్లీ మొదలు పెట్టడమంటే మనం చేరాల్సిన లక్ష్యాలకు ఎప్పుడూ చేరలేము. ఆశించిన ఫలితాలను ఎప్పటికీ సాధించలేము. ముఖ్యమంత్రి సరిగ్గా ఆ ప్రయత్నమే మొదలు పెట్టారు.

అయితే చంద్రబాబునాయుడు గానీ, తెలంగాణలో ఆయనకు వంతపాడుతున్న టీటీడీపీ, టీబీజేపీ గణాలు కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశాంతంగా పనిచేయనిచ్చేట్టు లేరు. వీలైనన్ని సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదట గవర్నర్ పాలన, తర్వాత విద్యుత్ పీపీఏలు, ఇప్పుడు ఫీజు రీయింబర్సుమెంటు, ఇంజనీరింగ్ కౌన్సెలింగ్… ఎక్కడ వీలైతే అక్కడ చిక్కుముడులు వేయడానికి ప్రయత్నిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడ వారికి భజన చేసే వారు మిగలడం ఆశ్చర్యకరంగా ఉంది. ఎంత విడ్డూరమంటే ప్రభుత్వం వచ్చి రెండు మాసాలు కాలేదు. రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఉద్యోగుల తుది కేటాయింపు జరగలేదు. ఐఏఎస్, ఐపీఎస్‌ల విభజన జాబితాలు మొన్ననే కేంద్రం సిద్ధం చేసింది. ఆ జాబితాలపై అభ్యంతరాల పరిశీలన జరుగుతోంది. ఏ అధికారి ఏ రాష్ట్రంలో ఉంటారో ఇంకా స్పష్టత రాలేదు. సచివాలయంలో తెలంగాణ మంత్రులు, తెలంగాణవాదుల సందడి తప్ప అధికార యంత్రాంగం ఇంకా పూర్తిస్థాయిలో పనిచేసే పరిస్థితి లేదు. చాలా శాఖలకు కార్యదర్శులను కేటాయించలేదు. ఒక్కో అధికారి మూడు నాలుగు శాఖలను చూస్తున్నారు. అయినా సీమాంధ్ర నాయకత్వానికి సర్వకాల సర్వావస్థల్లో విధేయులుగా పనిచేస్తున్న తెలంగాణ నేతలు కొందరు పనులు జరగడం లేదంటూ రాగాలు తీస్తున్నారు. చంద్రబాబు పక్క రాష్ట్రంలో ఏం చేసినా ఏం చేయకపోయినా నోరుమూసుకుని పడి ఉన్న బీజేపీ నాయకులు ఇక్కడ ఎగిరెగిరి పడుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని అననుకూల పరిస్థితుల్లో సైతం ఒకే క్యాబినెట్ సమావేశంలో ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించి 43 నిర్ణయాలు చేసింది. వాటిని అమలు చేయడానికి మరికొంత వ్యవధి పట్టవచ్చు. రైతుల ఆత్మహత్యలు తెలంగాణకు కొత్త సమస్య కాదు. తెలంగాణకు సమైక్యాంధ్ర సాధించిపెట్టిన పాపం. సమైక్యాంధ్ర సృష్టించిన వ్యవసాయ సంక్షోభానికి కొనసాగింపు. ఐదున్నర దశాబ్దాలుగా వ్యవసాయాన్ని దండుగగా మార్చిన పర్యవసానం. 1994 నుంచి 2014వరకు రెండు దశాబ్దాల్లో అత్యధికంగా 25 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రెండు దశాబ్దాలు రాష్ట్రాన్ని ఏలింది చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి మొదలు కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు అందరూ సమైక్యాంధ్ర నేతలే. వ్యవసాయ రంగంలో వారు పెంచి పెద్ద చేసిన సంక్షోభమే ఇప్పటికీ తెలంగాణ రైతులను వెంటాడుతున్నాయి. పారే నీళ్లున్న గోదావరి జిల్లాల్లో రైతు ఆత్మహత్యలు జరుగవు. అప్పులు చేసి, బోర్లు వేసి వ్యవసాయం చేసే తెలంగాణ జిల్లాల్లోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఈ పరిస్థితిని నివారించాలంటే ప్రతిపొలానికి సాగునీరు ఇవ్వగలగాలి. ప్రతి చెరువును బాగుచేసి సాగునీటిని ఇవ్వగలగాలి. వ్యవసాయాన్ని పండుగలాగా మార్చగలగాలి. అది జరగాలన్నా సమయం పడుతుంది. అప్పటిదాకా రైతులకు భరోసా కలిగించేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రచారం సాగించాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే సర్వే కూడా రైతులకు ధైర్యం చెప్పే ఒక సందర్భం కావాలి. ఈ సర్వే సర్వజనావళికి మేలు చేయాలి. తెలంగాణకు ఒక కొత్త మార్గాన్ని చూపించగలగాలి.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

One thought on “ఆ గొంగడి తగలేద్దాం”

  1. గ్రామ ప్రణాళిక, కుటుంబాల సర్వే ఆహ్వానించ దగిన, అవసరమైన గొప్ప నిర్ణయాలు. కానీ నిర్వహణ ఇంకాస్త పకడ్బందీగా సమయంతో సన్నగ్ధమై చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s