తెలంగాణపై కక్షగట్టారా?


trs

‘మీరు బిజెపికి ఓటేశారా? మేము చెబుతున్నా వినకుండాటీఆరెస్‌కు వేశారు. గెలిపించారు. తెలంగాణకు ఏం కావాలో కేసీఆర్‌ను అడిగి చేయించుకోండి. బిజేపీని ఎందుకు అడుగుతున్నారు? నరేంద్రమోడీని ఎందుకు నిందిస్తున్నారు?’ -బీజేపీ వీరాభిమాని ఒకరు twiట్టర్‌లో
చేసిన వ్యాఖ్య ఇది. బీజేపీ నాయకత్వానికి కూడా ఇటువంటి ఆలోచనే ఉందేమోనన్న అభిప్రాయం ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే అనిపిస్తున్నది. ఏదో కక్ష కట్టినట్టు, ప్రతీకారం తీర్చుకుంటున్నట్టు బీజేపీ వ్యవహరిస్తున్నది. పోలవరం ముంపు గ్రామాలపై ఆర్డినెన్సును
చట్టబద్ధం చేయడం కొత్త విషయం ఏమీ కాదు. కానీ తెలంగాణ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను కనీసం వినడానికి కూడా నిరాకరించడం, రాజ్యాంగ ప్రాథమిక నియమాలను కూడా పట్టించుకోకపోవడం, షెడ్యూల్డు ప్రాంతాల ప్రజల ప్రాథమిక హక్కులకు గడ్డిపోచ విలువ కూడా
ఇవ్వకపోవడం చూస్తే బీజేపీ అగ్రనాయకత్వానికి కూడా తెలంగాణపై ప్రత్యేకమైన కోపం ఉందేమోనన్న భావన కలుగుతున్నది. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడే మొదలుపెట్టింది కాదు. ఎప్పుడో మొదలు పెట్టారు. ప్రాజెక్టుపనులు కూడా మధ్యలో ఉన్నాయి. మొదటి ఆలోచన ప్రకారం
ఖమ్మం జిల్లాలో ఆరు మండలాల్లోని 134 గ్రామాలు మాత్రమే ముంపునకు గురవుతాయని ప్రభుత్వం జీఓ జారీ చేసింది కూడా. ఇప్పుడు ఏడు మండలాల్లోని 534 గ్రామాలు, నాలుగు మండలాలను పూర్తిగా ఆంధ్రలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవడం విపరీత పరిణామం.
ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ చట్టానికి సవరణలు చేయాలంటే కూడా తిరిగి ఆ సవరణలను రెండు రాష్ట్రాల శాసనసభలకు నివేదించాలి.

రాష్ట్రాల సరిహద్దులు మారిన ప్రతి సారీ సంబంధిత రాష్ట్రాల అభిప్రాయం కోరడం రాజ్యాంగబద్ధమైన బాధ్యత. కేంద్రం ఆ బాధ్యతను విస్మరించి ఏకపక్షంగా సవరణ చట్టాన్ని ఆమోదించడం ఈ వివాదంలో కీలకమైన అంశం. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం పోయిన సంవత్సరమే భూసేకరణ, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్ చట్టం తీసుకువచ్చింది. ఆ చట్టం ప్రకారం ఏదైనా ఒక ప్రాంతంలో భూసేకరణ చేయాలంటే ఏమేమి చేయాలో ఆ చట్టం సవివరంగా పేర్కొంది. ‘ప్రాజెక్టుకు అవసరమైనదానికంటే ఎక్కువ భూమిని సేకరించవద్దు. సేకరించదల్చుకున్న భూములను అనుభవిస్తున్న రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయో అధ్యయనం చేయాలి. ఆ ప్రాంతంలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించి ప్రజాభిప్రాయం తీసుకోవాలి. గ్రామ సభల అనుమతి పొందాలి. మెజారిటీ ప్రజల ఆమోదం పొందాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత సేకరణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయాలి. రైతుల పునరావాసం, రీసెటిల్‌మెంట్ ఎలా చేయబోతున్నారో ప్రకటించాలి. ఆ తర్వాతనే భూమిని సేకరించాలి’…స్థూలంగా చట్టం చెబుతున్నది ఇది. కానీ ఖమ్మం ఏడు జిల్లాల ప్రజల విషయంలో ఎందుకో కేంద్రం మొండిగా, బండగా వ్యవహరిస్తున్నది. ఏ ప్రక్రియనూ సరిగా నిర్వహించలేదు. స్థానిక ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని కూడా ప్రయత్నించలేదు. ఇవన్నీ చూసినప్పుడు కచ్చితంగా కేంద్రం చర్యలు ప్రతీకారేచ్ఛతో చేస్తున్న చర్యలుగా కనిపిస్తాయి. నిజానికి తెలంగాణ బీజేపీ నాయకత్వం టీడీపీతో సావాసం చేయడానికి నిరాకరించింది. కానీ వీరి శక్తికి మించిన శక్తులు నరేంద్రమోడీని, బీజేపీని ప్రభావితం చేస్తున్నట్టు ఎన్నికలకు ముందు నుంచి అర్థమవుతూనే ఉంది.

తెలంగాణ ఏర్పాటును జీర్ణించుకోలేని శక్తులతో మోడీ చేతులు కలిపినప్పుడే తెలంగాణ విషయంలో ఆయన మనసు కలుషితం అయింది. ఆయన తెలంగాణ గడ్డమీద తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారు. తెలంగాణను వ్యతిరేకించే శక్తులను వెంటేసుకుని తిరిగారు. అధికారంలోకి వచ్చిన తర్వాతయినా ఆ ధోరణి మారుతుందని తెలంగాణ ప్రజలు ఆశించారు. బీజేపీ పెద్దరికం ప్రదర్శిస్తుందని భావించారు. కానీ పోలవరం ఆర్డినెన్సుతో మొదలు పెట్టి రైల్వే బడ్జెట్, ఆర్థిక బడ్జెట్, నిన్న ముంపుగ్రామాలను లాగేసుకోవడం దాకా తెలంగాణ మొరను ఆలకించే ప్రయత్నమే జరుగలేదు. బహుశా చంద్రబాబునాయుడు ఎక్కిస్తున్న తెలంగాణ వ్యతిరేక భావజాలం వారిపై పనిచేస్తూ ఉన్నదేమో! చంద్రబాబు నాయుడు తెలంగాణపై తన అక్కసును అంతకంతకూ పెంచుతూ ఉన్నారు. రెండు ప్రాంతాలను తానే అభివృద్ధి చేస్తానని, 2019లో తిరిగి అధికారంలోకి వస్తానని పదేపదే చెబుతున్న పెద్ద మనిషి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ఒక్కసారి కూడా ఒక్క మాట మాట్లాడిన పాపానపోలేదు. పైగా ఈయన కేంద్రానికి రాసిన లేఖలు చూస్తే మనకు కళ్లు దిమ్మతిరిగి పోతాయి. ఇటీవల సమాచార హక్కు ఉద్యమ కార్యకర్త రాకేష్ రెడ్డి కేంద్రానికి ఒక అర్జీపెట్టి చంద్రబాబు ఇటీవల రాసిన లేఖలన్నీ సంపాదించారు.

చంద్రబాబు లేఖల్లో ఆంధ్రకు జరిగిన ‘అన్యాయాల’ను పదేపదే ఏకరువుపెట్టారు. ‘అన్యాయమైన విభజన’ వల్ల ఆంధ్ర ఎలా నష్టపోయిందో, ఎలా బాధితప్రాంతమైందో వివరిస్తూ వచ్చారు. విభజన కారణంగా ఆంధ్ర సర్వం కోల్పోయిందని, ప్రధాన ఆస్తులన్నీ తెలంగాణలోనే ఉండిపోయాయని, ఆదాయం కోల్పోయిందని, అప్పులు కూడా తీర్చలేని స్థితిలో ఉందని, హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని చంద్రబాబు తన లేఖల్లో కోరారు. ఒక్కటంటే ఒక్క లేఖలో కూడా తెలంగాణ ప్రస్తావన తీసుకురాలేదు. పోలవరం గురించి పదేపదే రాశారు. రెండువేల కోట్లు విడుదల చేసి తక్షణమే ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారు. కానీ ప్రాణహిత చేవెళ్ల ప్రస్తావన ఎక్కడా చేయలేదు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఇద్దరూ ఆంధ్రపక్షమే వహించి కేంద్రాన్ని ప్రభావితం చేస్తున్నారు. విభజన వల్ల ఆంధ్రకు ఏదో నష్టం జరిగిందని, తెలంగాణ ఏదో బాగుపడిపోయిందని ఇద్దరూ జాతీయస్థాయి నాయకత్వాన్ని నమ్మించగలిగారు. పునర్వ్యవస్థీకరణ చట్టానికి అనుకూలంగా ఓటేయాలని టీడీపీ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. తెలంగాణ నుంచి ఎన్నికైన ఏకైక టీడీపీ సభ్యుడు సభలో కనిపించలేదు. ముంపుగ్రామాలను లాగేసుకునే చట్టంపై టీఆరెస్, కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు కొట్లాడుతుంటే తెలంగాణ బిడ్డ దత్తన్న ప్రేక్షకపాత్ర వహించారు. చివరికి ఖమ్మం వైసీపీ ఎంపీ కూడా లేచి నిలబడి నినాదాలు చేశారు. పాపం తెలంగాణ బీజేపీ నాయకులకు అక్కడ మాట చెల్లడం లేదు. తెలంగాణ టీడీపీ నాయకులకు ఇక్కడ ముఖం చెల్లడం లేదు. వారు తెలంగాణలో చంద్రబాబును, ఆయన దాష్టీకాన్ని సమర్థించడానికి అష్టవంకరలు పోతున్నారు. కాలం చెల్లిన విమర్శలతో ఇంకా కేసీఆర్‌ను ఏదో చేయాలని తాపత్రయపడుతున్నారు.

ఒకటి మాత్రం వాస్తవం. భద్రాద్రి రాముడిని జలదిగ్బంధానికి గురిచేస్తూ, ఖమ్మం జిల్లా గిరిజనులను నీట ముంచుతూ తీసుకున్న నిర్ణయం కేంద్రానికి, ఆంధ్ర రాష్ట్రానికీ శాపమై తీరుతుంది. అడవులను మింగేయాలని చూసినవాళ్లు, గిరిజనులకు అన్యాయం చేసినవాళ్లు ఎప్పుడో
ఒకప్పుడు ఆగమైన చరిత్ర మనం చూసే ఉన్నాం. గతంలో రెండు మూడుసార్లు గోదావరి నదికి గట్టిగా వరదలు వస్తేనే భద్రాచలం రామాలయంలోకి నీళ్లొచ్చాయి. ఇప్పుడు ఏకంగా భద్రాచలం గ్రామం తప్ప ఆ మండలంలోని మొత్తం గ్రామాలను ముంపుగ్రామాలుగా నిర్ధారిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత భద్రాద్రి రాముడిని గోదావరి ముంచకుండా ఉంటుందని ఎలా నమ్మగలం? ప్రాజెక్టు ఎత్తు తగ్గించి ముంపును తగ్గించే అవకాశం ఉన్నా కేంద్రం దూకుడుగా నిర్ణయాలు చేయడం చూస్తే దేవుడికంటే, మనుషులకంటే రాజకీయ ప్రయోజనాలే ప్రభుత్వాలను నడిపిస్తాయని అర్థమవుతున్నది.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

3 thoughts on “తెలంగాణపై కక్షగట్టారా?”

 1. “రాముడి పేరు చెప్పుకుని ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీకి ఈసారి ఆ రాముడి అవసరం లేకుండా పోయింది. తిరుపతి వెంకన్నతో పెట్టుకొని ఒక్కడు ముక్కలు ముక్కలు అయిపోయాడు. ఇంకొకడు చావు తప్పి కన్నులొట్టబోయి బతికి పోయాడు. అయినా ఆ మనుషులకు బుద్ధి రాలేదు. ఈసారి భధ్రాద్రి రాముడితో పెట్టుకుంటున్నారు, నామరూపాలు లేకుండా పోతారు!”

 2. The way you interpret the article is good enough to read and followed by many people.
  What we interpret is followed by many people.
  We are living in a country India.
  Every one should feel and like to be part of India.
  The political parties for their vested interests are creating divisions in such a way that Kings and Kings are happy but the normal soldiers die in the war field in the name of patriotism
  It’s is no use blaming any one.
  But here the Telangana pro writers in Pro Telangana way.
  The pro Andhra Pro Writers express in Pro Andhra way.
  In this way we are dividing ourselves.
  Our patriotism is only limited to our Caste/religion/local/state?
  In what way do you feel our country will develop.
  Are we teaching the same hatred to our next generatio?
  This is a blow to our country unity and integrity?
  Here the TELANGANA/AP; KARNATAKA/TN;KARNATAKA/MAHARASTHRA;MAHARASTHRA/BIHAR?
  Are we heading towards slavery?
  No body is discussing about the important national issues like prie rise,high cost,salary,living standards ,sandals/
  Are we voting for the bad people who want only their business when country is sinking at the cost of unity?
  Did we not the bad treatment meted out to Tamilian,Biharis in Maharsthra in Mumbai?
  If we want to develop then we should forget local/caste/religion feeling if we want to really develop India

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s