కేసీఆర్ – చారిత్రక అనివార్యత


images

ప్రజలు ప్రకృతి వేర్వేరు కాదేమో. సహజ న్యాయం, సామాజిక న్యాయం పక్కపక్కనే ఉంటాయేమో. ప్రకృతిని, ప్రపంచాన్ని శాసించగలం అని విర్ర వీగినప్పుడు అదే ప్రకృతి విరుచుకుపడి మనలను ముంచేయడం చూశాం. భూమిని మింగాలని చూసినప్పుడు భూమి మనలను మింగేయడం చూశాం. ప్రజలకంటే నేనే గొప్ప అనుకున్నవాళ్లను అదే ప్రజలు పాతాళంలోకి తొక్కడం చూశాం. ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలు నిర్ణయించడంలో ఆంతర్యం ఇదేనేమో. ‘అక్కడ చంద్రబాబు గెలిచి, ఇక్కడ కేసీఆర్ గెలవకపోయి ఉంటే మన పరిస్థితి ఏమిటి?’ అని ఒక మిత్రుడు యథాలాపంగా ప్రశ్నించాడు. కానీ ఆ ప్రశ్నలో భయం ఉంది. ఆందోళన ఉంది. ఎందుకంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మాటల్లో ఇంకా ఆధిపత్య మనస్తత్వం పోలేదు. ఆ అహంకారం నశించలేదు. కేసీఆర్ తన వద్ద పనిచేసిన వాడంటారు. 2019లోనో, ఇంకా ముందేనో తెలంగాణలో అధికారంలోకి వస్తానంటాడు. తెలుగు ప్రజలను తిరిగి ఏకం చేస్తానంటాడు. ఇక్కడ అక్కడ తానే అభివృద్ధి చేస్తానంటాడు. కేసీఆర్‌కు అభినందనలు చెప్పడానికి కూడా ఆయనకు మనస్కరించలేదు. ఆయన జాతీయ పార్టీ నాయకుడిననుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడుకు ఒక విధంగా తెలంగాణ ప్రజలు రుణపడి ఉండాలి. చంద్రబాబు కత్తి అలా తెలంగాణపై వేలాడుతూ ఉండాలి. తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని అది సజీవంగా ఉంచుతుంది. తెలంగాణ ఉద్యమాన్ని ఇక ముందు కూడా కొనసాగించాల్సిన అవసరాన్ని ఎప్పటికప్పుడూ గుర్తు చేస్తూ ఉంటుంది. తెలంగాణకు కేసీఆర్ ఎందుకు అవసరమో, ఎంత అవసరమో తెలియజేస్తూ ఉంటుంది. చంద్రబాబు పెద్ద షో మాస్టర్. ఆయన షోను 70ఎంఎం డీటీఎస్‌లో చూపించడానికి ఒక పెద్ద ప్రసార, ప్రచార యంత్రాగం రెడీగా ఉంటుంది. అభివృద్ధికి ఆయనను నమూనాగా చూపించే ప్రయత్నం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. హైదరాబాద్‌లో మొదటి ఎస్‌టీపీఐని 1991లోనే హైద్రబాద్‌లోని మైత్రివనంలో ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వమని ఎవరూ గుర్తు చేయరు. మరో ఎస్‌టీపీఐకి 1992లోనే మాదాపూర్‌లో శంకుస్థాపన జరిగిందని ఎవరికీ తెలియదు. ఎవరికీ తెలియకుండా చరిత్రను కమ్మేయడంలో చంద్రబాబు, ఆయన మీడియా బ్యాండు సిద్ధహస్తులు.

హైదరాబాద్‌లోనూ, దేశంలోని మరో పద్నాలుగు నగరాల్లోనూ ఐటీ అభివృద్ధికి పునాదులు వేసింది ఎస్‌టీపీఐ విధానమేనని ఇవ్వాళ చాలకొద్ది మందికి తెలుసు. చంద్రబాబు రాజకీయాల్లోకి రాక ముందు నుంచే ఈ దేశంలో, రాష్ట్రంలో సీఎంసీ అనే సంస్థ కంప్యూటర్ సేవలు అందిస్తున్నదన్న సంగతి చాలామందికి తెలియదు. చెప్పుకునే తెలివి తేటలూ, చెపితే ప్రచారం చేసే యంత్రాగం కాంగ్రెస్‌కు లేవు. చంద్రబాబు వచ్చిన తరువాత పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలకు భూములిచ్చి హైదరాబాద్‌కు తీసుకొచ్చిన మాట నిజం. కానీ కంప్యూటర్ కనుగొన్నది ఆయనే అన్నట్టుగా జరిగిన ప్రచారం చరిత్రకు మసి పూసింది. అసలైన పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు ఆయన ఒక కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇక్కడ తెలంగాణకు ‘ఆయన వద్ద పనిచేసిన’ కేసీఆర్ ముఖ్యమంత్రి. ఎవరు ఏమి చేయబోతున్నారన్న అంశాన్ని ప్రజలు వేయికళ్లతో కనిపెడుతుంటారు. 1999లో తన పార్టీ మద్దతు తప్పని సరిగా అవసరమైనప్పుడు చంద్రబాబు ఎన్‌డీఏ ప్రభుత్వంలో చేరలేదు. ఐదేళ్లు టీడీపీ ఎంపీలను ప్రభుత్వానికి దూరంగా ఉంచారు. ఇప్పుడు ఎన్‌డీఏకు చంద్రబాబు మద్దతు అవసరం లేదు. అయినా అందరికంటే ముందుగా ప్రభుత్వంలో చేరతానని ప్రకటించారు. ఈ ఉత్సాహమే తెలంగాణవాదులను కలవరపెడుతున్నది. ఎన్‌డీఏను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఏమయినా సమస్యలు సృష్టిస్తారేమోనన్న అనుమానం తెలంగాణవాదుల్లో ఉంది. ఇటువంటి పరిణామ దశలో తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడడం చారిత్రక అనివార్యత. తెలంగాణ ఎలా దెబ్బతిన్నదో, ఎందుకు దెబ్బతిన్నదో, ఏమి చేస్తే తెలంగాణ బాగుపడుతుందో తెలిసినవారు కేసీఆర్. పద్నాలుగేళ్లు అన్ని రాజకీయ తుపాన్లను తొణకక బెణకక ఎదుర్కొనే స్థైర్యం ఉన్నవారు ఆయన. ఎక్కడ నిలబడాలో, ఎక్కడ తగ్గాలో తెలిసినవారాయన.

కేసీఆర్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయకపోవడం ఎంత సమంజసమో ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. కాంగ్రెస్ నెత్తిన ఎంత పాపభారం ఉందో ఆ పార్టీ అపజయం చెప్పకనే చెబుతున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పుణ్యం కూడా జయించలేనంత అప్రతిష్టను ఆ పార్టీ మూటగట్టుకున్నది. కేసీఆర్ ఒకవేళ కాంగ్రెస్‌తో విలీనం అయితే తెలంగాణలో బీజేపీ-టీడీపీలు అధికారంలోకి రాకపోయినా బలమైన ప్రతిపక్షంగా బలపడి ఉండేవి. కాంగ్రెస్ వ్యతిరేక గాలి ఇంకా గట్టిగా కొడితే బీజేపీ-టీడీపీలు అధికారంలోకి కూడా వచ్చి ఉండేవి. విలీనాన్ని, పొత్తులను తోసిపుచ్చి కేసీఆర్ తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ కాంక్షను కాపాడారు. పద్నాలుగేళ్లు అవిశ్రాంతపోరాటం చేసిన తెలంగాణవాదుల ఆత్మకు శాంతిని, ఊరటను చేకూర్చారు. కొత్త రాష్ట్రంలో కొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ‘రాష్ట్రం.. రాష్ట్రం అన్నారు. ఏం సాధించారు? ఉపన్యాసం ఇవ్వకుండా సూటిగా చెప్పండి’ అని ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటిరోజు పదవీ విరమణ చేసిన ఒక సీనియర్ అధికారి నిలదీశారు. ఇంకా ఇటువంటివారు చాలామందే ఉండి ఉంటారు. హైదరాబాద్‌లో ఇంకా చాలామందికి తెలంగాణ ఎందుకు అవసరమో అర్థం కానట్టు ఆయన మాటలను బట్టి తెలుస్తున్నది. ‘అవును…వంద మాటలు అనవసరం. 119 ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీల్లో సుమారు సగం మంది కొత్తవాళ్లు ఎన్నికయ్యారు. అందునా తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ నుంచి ఎక్కువమంది కొత్తవాళ్లు ఎన్నికయ్యారు. వీరిలో చాలా మంది పేద, మధ్యతరగతివాళ్లు ఉన్నారు. రాజకీయాధికారం సమాజంలోని దిగువ వర్గాలకు ప్రసరిస్తున్నదనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమి కావాలి? 193 తర్వాత రాజకీయాల్లోకి కొత్తనీరును తీసుకువచ్చిన ఘనత తెలంగాణది, కేసీఆర్‌దే’ అని చెబితే ఆయన సమాధానపడ్డారు.

ఇలా ఒక్క రాజకీయాల్లోనే కాదు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో మన పనులు మనం చేసుకోవడం మొదలు పెడితే, ఏడాదిలోపే ఫలితాలు చూపించగలిగితే పరిస్థితిలో ఎంత మార్పు కనిపిస్తుంది? తదుపరి జరుగబోయే సివిల్ సర్వీసు పరీక్షల్లో, గ్రూప్స్‌లో తెలంగాణకు సొంత కేడర్ అధికారులు వస్తే పరిస్థితి ఎంత సానుకూలంగా మారుతుంది? సీమాంధ్ర ఎస్టాబ్లిష్‌మెంట్ నిర్వాకాల కారణంగా చిన్నచిన్న బడ్జెట్‌లు కూడా కేటాయింపులు జరుగక ఆగిపోయిన ప్రాజెక్టులు పూర్తిచేసి ఏడాదిలోపు కొన్ని వందల చెరువులకు నీరివ్వగలిగితే ఎలా ఉంటుంది? సీమాంధ్ర నుంచి విడివడడం వల్ల తెలంగాణ ప్రభుత్వ విభాగాల కేంద్ర కార్యాలయాల్లో, సచివాలయంలో తలెత్తే ఖాళీలకు, విద్యాసంస్థల్లో ఏర్పడే ఖాళీలకు ఏకకాలంలో భారీగా రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తే ఎలా ఉంటుంది? తెలంగాణలో రైతులు కరెంటుకోసం, సాగునీటి కోసం లక్షలాదిరూపాయల పెట్టుబడులు పెట్టనవసరంలేని విధంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చగలిగితే, తెలంగాణను విత్తనోత్పత్తి రాష్ట్రంగా అభివృద్ధి చేస్తే పల్లెల్లో ఎన్ని గుణాత్మకమైన మార్పులు వస్తాయి? తెలంగాణ రాష్ట్రం వస్తే చాలా ప్రయోజనాలు పొందుతామని ఇక్కడి ప్రజల్లో భారీ ఆకాంక్షలు ఉన్నాయి. స్వేచ్ఛా ఫలాలు అందరికీ దక్కుతాయని ఆశలు పెంచుకున్నారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాలు, వనరులు తెలంగాణ ప్రజలకు అక్కరకు వస్తాయని భావిస్తున్నారు. ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటికి తగినవిధంగా మసలుకోవడం చాలా కష్టంతో కూడిన పని. ఉద్యమాలు నడపడం కంటే ప్రభుత్వాలు నడుపడం చాలా క్లిష్టమైన పని. ఉద్యమకాలంలో మాటలు ఎక్కువగా చెబుతాం, చేతలు తక్కువగా ఉంటాయి. ఇక్కడ మాటలు తక్కువగా చెప్పి చేతల్లో ఎక్కువగా చూపించాల్సి ఉంటుంది. కేసీఆర్ ఆ పనిచేయగలరని తెలంగాణవాదులు నమ్ముతున్నారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఆయనకు ఒక స్పష్టమైన దృక్పథం, ఎజెండా ఉన్నాయి. ఆయన కాకుండా ఇప్పుడు మరెవరు అధికారంలోకి వచ్చినా తెలంగాణకు అన్యాయం జరిగి ఉండేదని తెలంగాణవాదులు భావిస్తున్నారు. సీమాంధ్ర ఆధిపత్య నీడలు తెలంగాణలో కొనసాగినంతకాలం కేసీఆర్ అవసరం తెలంగాణకు కొనసాగుతున్నది. బీహార్ నుంచి విడివడిన తర్వాత జార్ఖండులో లాలూప్రసాద్, నితీశ్‌కుమార్‌ల పార్టీలు అంతరించడానికి ఐదేళ్లు పట్టింది. తెలంగాణవాదులు తప్పులు చేయకపోతే ఇక్కడా అదే జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

2 thoughts on “కేసీఆర్ – చారిత్రక అనివార్యత”

 1. good article …. chandra babu naydu moyadaniki vani vargam media eppudu mundhu vunatadhi … ee veedu nene hyderabad nene hyderabad nu develope chesinaa antunte nuthi meedha kottala nipisthdhi … are apuraaa IT develpoment period lo vuapudu nuvvu CM gaa vunnavu appudu kevalama hyderbadb lo ne kadu chennai bangaloore pune lo mana kanna ekkuva IT company lu vachinai muthi meedha guddi chapala ni pistadi . 400 endla charitra vundi 1950 kante mundhu konni vandala parshramalaa vunna hyderabad nu vadu develope cheyadma endhi ….. veeni palana lo Telanagana palle lu smahshanlu ayeenai anna vishyam oka kamma + andhra media ku gurthu ku radhu ….. telnagana prajalu KCR ku thodu vundali ani korukuntu ….

 2. Who is the “ACTUAL” DHORA ?
  Dear sir
  The actual dhora is not the person who is born in velama / reddy
  castes. The real dhoras are the people who display arrogance & domination.
  As per this criterion, the real dhoras are the people-who think
  -that they have developed hyderabad
  – that they have taught us the telugu
  -that they have taught us to get up early
  Etc
  -Dr. M. V. Rajendra

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s