గులాబీ సంకేతాలు


telangana_state

గత మూడు రోజులుగా ఒకటే లెక్క…ఏ పార్టీ గెలుస్తుంది? ఎవరికెన్ని సీట్లు వస్తాయి? ఎడతెగని చర్చలు…విశ్లేషణలు…బెట్టింగ్‌లు, చాలెంజ్‌లు. పదహారో తేదీవరకు ఆగక తప్పదు. కనీసం ఏడోతేదీ ఎగ్జిట్ పోల్స్ దాకా వేచి చూడాలి. అయినా తిట్టేవాళ్లను బట్టి, పొగిడేవాళ్లను బట్టి, కాడిపారేసిన వాళ్లను చూసి, ముఖం చాటేసిన వాళ్లను చూసి ఎవరు గెలుస్తారో కాస్తంత అర్థం చేసుకోవచ్చు. సీమాంధ్ర ఎన్నికల ప్రచారంలో కూడా కేసీఆర్‌నే ఎందుకు ఆడిపోసుకుంటున్నారు? ఆయన పేరు చెప్పే అక్కడ ఎందుకు ఓట్లు అడుక్కొంటున్నారు? ‘అక్కడ(తెలంగాణలో) కేసీఆర్ వస్తున్నారు, ఇక్కడ మమ్మల్ని గెలిపించకపోతే మీ ఇష్టం’ అని సీమాంధ్ర ప్రజలను బెదిరించడానికి. భావోద్వేగాలు రెచ్చగొట్టి బ్లాక్‌మెయిల్ చేయడానికి. పవన్ కల్యాణ్ అద్దెమైకులాగా అదేపనిగా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు. అది తెలంగాణలో కేసీఆర్ విజయ సూచన. ఇక్కడ ‘మా వళ్లే తెలంగాణ వచ్చింది’ అని చెప్పిన బిజెపి నేతలు, టీడీపీ నేతలు అక్కడికి వెళ్లగానే ‘జగన్ వళ్లే రాష్ట్రం చీలిపోయింది’ అని జనాన్ని రెచ్చగొడుతున్నారు. రాష్ట్ర విభజనపై తమ అజీర్తిని బయటపెట్టుకుంటున్నారు. ఇది కూడా తెలంగాణ విజయమే. ఈసారి నిర్వహించినన్ని ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ జరగలేదేమో. అన్ని జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. రాష్ట్ర విభజన జరిగిన సంధికాలంలో జరుగుతున్న తొలి చారిత్రక ఎన్నికలు కావడం వల్ల అన్ని మీడియా సంస్థలు ఈ ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాయి. ప్రాంతీయ మీడియా సంస్థలు, పత్రికలు అన్నీ కూడా టీఆరెస్‌కు 55 నుంచి 65 దాకా రావచ్చని అంచనాలకు వచ్చాయి. ఎంత ఉదారంగా అంచనా వేసినా కాంగ్రెస్‌కు వచ్చే సీట్ల సంఖ్య 40 దాటడం లేదు. టీడీపీ-బీజేపీలకు 12-20 స్థానాలదాకా ఊహిస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రసారంపై ఆంక్షలు ఉండడం వల్ల ఏ ఒక్కరూ ప్రసారానికి, ప్రచురణకు సిద్ధపడలేదు. రెండో దశ పోలింగ్ అయిపోయిన తర్వాత అంటే ఏడో తేదీ సాయంత్రం కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలుగుచూసే అవకాశం ఉంది. తెలంగాణలో టీఆరెస్ అనుకూల గాలి వీచిందని, అసెంబ్లీలో ఆ పార్టీ 70 స్థానాలకుపైగా గెల్చుకుంటుందని అంచనా వేసే వారూ ఉన్నారు.

లోక్‌సభ స్థానాలకు వచ్చే సరికి అంచనాల్లో తేడా కనిపిస్తున్నది. వేర్వేరు మీడియా సంస్థలు టీఆరెస్‌కు 6 నుంచి 10 స్థానాల వరకు అంచనాలు వేశాయి. కాంగ్రెస్‌కు 4 నుంచి 6 స్థానాలు, బిజెపికి 2 నుంచి మూడు స్థానాలు, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, ఎంఐఎంలకు ఒక్కొక్కటి చొప్పున అంచనా వేస్తున్నారు. చాలా చోట్ల అసెంబ్లీకి టీఆరెస్ అభ్యర్థులకు వేసి, లోక్‌సభకు కాంగ్రెస్‌కో లేక బిజెపికో వేశారని విశ్లేషణలు జరుగుతున్నాయి. అయితే క్రాస్ ఓటింగ్ గెలిపించేంత మోతాదులో జరుగుతుందా అన్నది ప్రశ్నార్థకం. 2009 ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కారణంగానే తెలంగాణలో కేవలం 53 అసెంబ్లీ స్థానాలను గెల్చుకున్న కాంగ్రెస్ 12 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెండు శాతం ఓట్లు అదనంగా వచ్చాయి. సమ ఉజ్జీల మధ్య ముఖాముఖి పోటీ ఉన్నప్పుడు ఒక శాతం ఓటు క్రాస్ అయినా ఫలితాలను తారుమారు చేస్తాయి. కానీ త్రిముఖపోటీలు, చతుర్ముఖ పోటీలు ఉన్నప్పుడు క్రాస్ ఓటింగ్ గెలిపించేంత భారీగా ఉండడం అనుమానమే. అంతేగాక క్రాస్ ఓటింగ్ ఏదో ఒక్క పార్టీకి జరిగితే ఫలితాలు తారుమారవుతాయి. అలాగాక కాంగ్రెస్‌కు కొన్ని, బిజెపికి కొన్ని క్రాస్ ఓటింగ్ జరిగితే ప్రధాన అభ్యర్థికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఏది ఏమైనా తెలంగాణలో టీఆరెస్ వర్సెస్ ఆల్ అన్నట్టుగా ఎన్నికల సమరం జరిగిందని ఈ విశ్లేషణలన్నీ తెలియజేస్తున్నాయి. బెట్టింగ్‌లు, చాలెంజ్‌లు అన్నీ టీఆరెస్‌కు ఎన్ని స్థానాలు వస్తాయి? ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేస్తుందా? ఎవరి మద్దతుతోనైనా చేస్తుందా? వంటి అంశాలపైనే జరుగుతున్నాయి. పొగడ్తలు తెగడ్తలు అన్నీ టీఆరెస్‌కే లభిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు టీవీ తెరల ముందుకు రావడం తగ్గిపోయింది. తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ఎందుకు ఇటువంటి ఆత్మరక్షణ ధోరణిలో ఉండిపోయింది? ఎందుకు ప్రజాభిమానాన్ని కూడగట్టలేకపోయింది?

కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంది. తెలంగాణ ప్రజలు పద్నాలుగేళ్లుగా తెలంగాణకోసం పోరాడుతున్నారు. ప్రజలు వీధుల్లో ఉంటే, కాంగ్రెస్ నాయకులు పదవుల్లో ఉన్నారు. తెలంగాణ ప్రజలను ముప్పుతిప్పలు పెట్టి, ఎంతగా హింసపెట్టాలో అంతగా హింసపెట్టి రాష్ట్రం ఇచ్చింది. చివరి నాలుగేళ్లలో తెలంగాణ సమాజం ఎంత క్షోభ అనుభవించిందో! కమిటీలు వేసి, ఇన్‌చార్జిలను మార్చి, కుప్పుస్వామి అయ్యర్ మేడిట్ డిఫికల్టీ లాగా రాష్ట్ర విభజనను రోజు రోజుకు జఠిలంగా మార్చి, ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో విభజనను పూర్తి చేసింది. 2009 డిసెంబరు 9 ప్రకటనకు కట్టుబడి ఏడాదిలోపు మొత్తం ప్రక్రియను పూర్తి చేసి ఉంటే కాంగ్రెస్‌కు ఇలా పీకలమీదికి వచ్చి ఉండేది కాదు. తెలంగాణలో ఇంతమంది పిల్లలు మరణించి ఉండేవారు కాదు. కాంగ్రెస్‌పై ఇంత వ్యతిరేకత బలపడి ఉండేది కాదు. సీమాంధ్రలో కూడా ఇంత రచ్చ జరిగి ఉండేది కాదు. భావోద్వేగాలు కూడా ఎన్నికల నాటికి కొంత సర్దుకుని ఉండేవి. తెలంగాణ సమస్యను చివరినిమిషం దాకా సాగదీయడం, తమ సొంత ఇంటిని సరిదిద్దుకోలేకపోవడమే ఇవ్వాళ అక్కడా ఇక్కడాఆ పార్టీ ఇబ్బందులపాలు కావడానికి కారణం. కాంగ్రెస్‌కు కాంగ్రెసే ప్రతిపక్షంలాగా వ్యవహరించింది. కిరణ్‌కుమార్‌రెడ్డిలాంటి వాళ్ల నిర్వాకం వల్ల కాంగ్రెస్ అక్కడా ఇక్కడా ప్రజల దృష్టిలో విలన్‌గా నిలబడాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఏం జరిగినా అది ముమ్మాటికీ కాంగ్రెస్ మేనేజర్ల చేతగానితనమే.

ఇక బిజేపి-టీడీపీల కూటమి పరిస్థితి కూడా అటువంటిదే. బిజేపి తెలంగాణ బిల్లుకు బాహాటంగా మద్దతు ఇచ్చింది. బిజేపి సహకారం వల్లనే బిల్లు ఆమోదం పొందిందన్నది వాస్తవం. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బయటమద్దతు ఇచ్చి, లోపల కుట్రలు చేసిన చంద్రబాబుతో కలవడమే తెలంగాణలో బిజేపికి శాపంగా పరిణమించింది. తెలంగాణ ఏర్పాటుపై తన దుఃఖాన్ని దాచుకోలేని పవన్ కల్యాణ్ అనే వైరుధ్యాల పుట్టను పక్కన పెట్టుకోవడం ఇంకా ఇక్కట్లపాలు చేసింది. బిజేపీ ఒంటరిగా పోటీచేసి నరేంద్ర మోడీ ఒక్కరే తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి దిగి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. టీడీపీ ఖాళీ అయి ఉండేది. చాలా శక్తులు బిజేపీతో కలిసి వచ్చి ఉండేవి. సొంతంగా బలపడి ఉండేది. టీడీపీ ఊపిరి పోతుందనుకున్న ప్రతిసారీ చంద్రబాబు ఇటువంటి పొత్తుల మిత్తర ఏదో ఒకటి ముందుకు తెచ్చి చర్మరక్షణ చేసుకోవడం అలవాటుగా మారింది. గత ఎన్నికల్లో టీఆరెస్‌ను అలాగే గత్తర పట్టించారు. ఈసారి బిజేపీని గత్తర పట్టించారు. నరేంద్ర మోడీ రాజకీయ భావాలతో విభేదించవచ్చు, కానీ ఆయన వస్తారు, రావాలి అన్న భావన ఒకటి జనంలో ప్రబలింది. అదికాస్తా ఈ ప్రతీపశక్తుల ప్రభావానికి కుదేలయింది. టీడీపీ-బిజేపీలు కొన్ని సీట్లు గెలిస్తే గెలవవచ్చు. కానీ బిజేపీ ఒక బలమైన శక్తిగా ఎదిగే అవకాశాన్ని కోల్పోయింది. ఎన్నికల ఫలితాలు వస్తే కానీ ఎవరు ఎంత లాభపడిందీ, ఎవరు ఎంత నష్టపోయిందీ మరింత స్పష్టంగా బోధపడుతుంది.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

2 thoughts on “గులాబీ సంకేతాలు”

  1. SAME GOING TO BE REPEATED IN SEEMANDHRA.
    MISTRUST FOR CBN INDIRECTLY GOING TO MAKE LOSS FOR MODI….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s