మార్పుకోసం మన ఓటు వేద్దాం


1jpt3

స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రజలు తొలి పరీక్షను ఎదుర్కోబోతున్నారు. ఇవి అన్ని ఎన్నికల వంటివి కాదు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని ప్రకటించుకున్న చారిత్రక సంధికాలంలో జరుగుతున్న ఎన్నికలివి. ఈ ఎన్నికలు కొత్తకు, పాతకు మధ్య జరుగుతున్న సమరం. యథాతథవాదులకు, మార్పుకోరుతున్న వారికి మధ్య జరుగుతున్న సమరం. తెలంగాణను సాధించిన వారికి, వేధించినవారికి మధ్య జరుగుతున్న పోరు ఇది. ప్రతి ఓటరు ఎటువైపు నిలబడాలో తేల్చుకోవలసిన సమయం ఇది. రాష్ట్రాన్ని సాధించుకున్నంతనే సీమాంధ్ర ఆధిపత్య నీడలు తెలంగాణను వదిలే అవకాశాలు కనిపించడం లేదు. అదే నేతలు, అవే మాటలు, అదే దాడి కొనసాగుతున్నది. తెలంగాణపై ఇంకా సీమాంధ్ర రాజకీయ ఆధిపత్య ప్రకటన కొనసాగుతున్నది.

తెలంగాణ ఏర్పాటును ఆఖరు నిమిషం వరకు అడ్డుకున్నవాడు, తెలంగాణ రాష్ట్ర విభజన తనకు నచ్చలేదని బాహాటంగానే చెప్పినవాడు, తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తిని చంపి, తెలుగుతల్లి స్ఫూర్తికోసం కన్నీరు పెట్టేవాడు….ఇంకా ఇక్కడ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. తెలంగాణ ఎలా ఉండాలో, ఇక్కడ ఇక ముందు ఏమి జరగాలో ఎజెండాను నిర్ణయించడానికి వీరంతా కట్టగట్టుకుని ప్రయత్నిస్తున్నారు. కొన్ని పార్టీలు ప్రత్యక్షంగా, మరికొన్ని పార్టీలు పరోక్షంగా సీమాంధ్ర ఎజెండాను ఇంకా తెలంగాణపై రుద్దాలని చూస్తున్నాయి. తెలంగాణను తెలంగాణవాద శక్తుల చేతికి రాకుండా చూడాలన్న కుట్ర సీమాంధ్ర పార్టీలు, వారి ప్రచార, ప్రసార సాధనాలు నేరుగానే చేస్తున్నాయి. ఇక్కడ తమ కీలుబొమ్మలను, తోలుబొమ్మలను నిలబెట్టి వారి ద్వారా తెలంగాణవాదులపై దాడులను కొనసాగిస్తున్నాయి.

బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడి తెలంగాణకు ఒక మేలు చేశారు. ఆయన ఒక్కడే తెలంగాణకు ప్రచారానికి వచ్చి ఉంటే బిజెపికి తప్పనిసరిగా భారీగానే ఓట్లు వచ్చి ఉండేవి. బిజెపి తెలంగాణకు సహకరించడం, నరేంద్రమోడి గాలీ అన్నీ తోడై ఆ పార్టీకి అనుకూల వాతావరణం మరింత బలపడి ఉండేది. కానీ ఆయన తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన చంద్రబాబునాయుడును, తెలంగాణ ఏర్పడడాన్ని జీర్ణించుకోలేక కంటికి కడివెడుగా దుఃఖిస్తున్న పవన్ కల్యాణ్‌ను వెంటబెట్టుకుని తెలంగాణలో ఊరేగారు. వీరంతా కలిసి తెలంగాణ ఏర్పాటుపైనే దాడి చేశారు. స్వరాష్ట్రం ఏర్పడిందన్న ఆనందం తెలంగాణ ప్రజలకు లేకుండా చేశారు. తల్లిని చంపి పిల్లను బతికించారని చెప్పిన మోడీ తెలుగు స్ఫూర్తిని చంపారని కూడా చెప్పారు. ఆయన సీమాంధ్ర ప్రజల సానుభూతిని పొందే ప్రయత్నంలో తెలంగాణ స్ఫూర్తిని చంపుతున్నానని అనుకోలేదు. పైగా కుటుంబపాలను గురించి వీరంతా నీతులు చెప్పడం. చంద్రబాబు, ఆయన బావమరుదులు, కొడుకు, ఆయన బంధు మిత్రులంతా రాజకీయాల్లో చక్రాలు తిప్పవచ్చు. కుటుంబం కుటుంబమంతా సినిమా ప్రపంచాన్ని ఏలవచ్చు.

పవన్ కల్యాణ్‌ది మరీ గురివింద నీతి. ఆయన సినిమాల్లో తొలుత అడుగుపెట్టింది, విజయాలు సాధించింది కుటుంబ సినిమా రాజకీయాలద్వారానే. ఆయన కుటుంబం సినిమాలను ఎలా శాసిస్తున్నదో జగమంతా తెలిసినవిషయమే. అంతేకాదు కుటుంబం కుటుంబం అంతా నటించి, జీవించి ఒక రాజకీయ పార్టీని పెట్టి, తొలి ఎన్నికల్లోనే తలా ఒక కౌంటరు పెట్టి టిక్కెట్లు అమ్ముకున్నారని అడ్డమైన తిట్లు తిట్టించుకుని, పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో కలిపేసిన ఘనమైన రాజకీయ కుటుంబ కథా చిత్రం ప్రజలు ఇంకా మరచిపోలేదు. మాటమీద నిలబడడంలో కూడా వీరు చంద్రబాబు రికార్డులను బద్దలుకొట్టారు. తెలంగాణపై మొట్టమొదట మాటమార్చిన ఘన చరిత్ర చిరంజీవి కుటుంబానిదే. మోడీ ఇటువంటి వారిని వెంటబెట్టుకుని ప్రచారం చేయడం ద్వారా తెలంగాణ ప్రజలు ఎక్కువగా అయోమయానికి గురి కాకుండా చేశారు. మోడీ తెలంగాణలో పర్యటిస్తూ సీమాంధ్రలో చేయాల్సిన ప్రసంగాలు చేశారు. తెలంగాణను దీవించడానికి బదులు నిష్ఠురాలు మాట్లాడారు. తెలంగాణ ప్రజలను అభినందించడానికి బదులు విభజనపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో మోడీ తన ప్రభావాన్ని తానే తగ్గించుకున్నారు.

తెలంగాణలో బిజెపి, టీడీపీలది బలవంతపు పెళ్లి. టీడీపీలో బలమైన అభ్యర్థులు ఉన్న ఓ పది పదిహేను స్థానాల్లో తప్ప మిగిలిన చోట్ల చేతులెత్తేశారు. చంద్రబాబు కూడా తన శక్తియుక్తులన్నింటినీ సీమాంధ్రకు మళ్లించారని, ‘మమ్మల్ని వదిలేశార’ని సీనియర్ టీడీపీ నాయకుడే వాపోయారు. బిజెపి అభ్యర్థులున్న చోట టీడీపీవాళ్లు సహకరించడం లేదు. ఇక పోటీ ప్రధానంగా జరుగుతున్నది టీఆరెస్, కాంగ్రెస్‌ల మధ్యనే. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ ఎదురీదుతున్నది. కాంగ్రెస్ ప్రచారానికి ఒక దిక్కూదివాణం లేదు. చేతనైనవారు పోరాడుతున్నారు. చేతగానివారు ఖర్చులు జాగ్రత్తపడుతున్నారు. దక్షిణ తెలంగాణలో తేలికగా బయటపడతామనుకున్న చాలా మంది కాంగ్రెస్ దిగ్గజాలు ఇప్పుడు చెమటలు కక్కుతున్నారు. జైపాల్‌రెడ్డి వంటి నాయకుడు కూడా తన నియోజకవర్గాన్ని దాటి బయటకు రాలేని పరిస్థితి. జానారెడ్డి కూడా నియోజకవర్గాన్ని దాటి బయటికి రాలేదు.

మరోవైపు టీఆరెస్ అధినేత కేసీఆర్ ఒక్కరే ఈసారి పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచార సమరాన్ని సాగిస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రచారం చేయలేరని, టీఆరెస్ ఎలా గట్టెక్కుతుందోనని సందేహాలు వ్యక్తం చేసినవారందరూ ఇప్పుడు కేసీఆర్ పడుతున్న శ్రమను చూసి ఆశ్చర్యపోతున్నారు. రోజుకు పదేసి సభల్లో మాట్లాడుతున్నారు. వారం రోజుల్లో అరవైకి పైగా సభల్లో ప్రసంగించారు. అన్ని చోట్లా సావధానంగా మాట్లాడుతున్నారు. ఆయన పాల్గొంటున్న సభలకు జనం కూడా బాగా కదలివస్తున్నారు. ప్రజల్లో చలనం కనిపిస్తున్నది. టీఆరెస్ అభ్యర్థులు ఎక్కడికి వెళ్లినా స్వచ్ఛంద మద్దతు లభిస్తున్నది.

నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌లలో టీఆరెస్ అనుకూల పవనాలు వీస్తున్నాయని, అవి మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి రూరల్ జిల్లాల్లో కూడా విస్తరిస్తే టీఆరెస్ విజయావకాశాలు ఇంకా మెరుగుపడతాయని జిల్లాల్లో పర్యటించి వచ్చిన సీనియర్ ఆంగ్ల జర్నలిస్టు ఒకరు విశ్లేషించారు. ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ టీఆరెస్‌నే పెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని అంచనాలు వేశాయి.

ఒకటి మాత్రం వాస్తవం-తెలంగాణ జెండాను, ఎజెండాను, భవిష్యత్తును రూపుదిద్దగల ఒక దార్శనిక నాయకుడు తెలంగాణకు అవసరం. పాత రాజకీయాలకు పాతర వేసి కొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టే శక్తులు ఈ ఎన్నికల్లో గెలవాలి. సీమాంధ్ర ఆధిపత్యమూలాలను పెకలించే వ్యక్తులు ఈ ఎన్నికల్లో గెలవాలి.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

2 thoughts on “మార్పుకోసం మన ఓటు వేద్దాం”

  1. superb analysis and observation……..hope so that TRS would get full majority to form a govt. unlike Kejrival govt. in delhi.certain sections comment that both kcr and kejrival have successfully steered the movement , but do they manage?

  2. Telangana people has only one option in front of them. Nothing to think much, just voting for CAR is the safest without any second thought.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s