మార్పు సంకేతాలు


nalgonda-district-map

‘ఆయన మంచోడేకానీ అది మన పార్టీ కాదు….’, ‘ఈయన గట్టోడే కానీ గెలిచెటోడు కాదు…చెడగొట్టేందుకొచ్చిండు…..’, ‘పాతాయన మాత్రం ఓడి పోవాలె…’, ‘ఈ సారికి మాత్రం పార్టీల్లేవు గీర్టీల్లేవు తెలంగాణకేస్తం. కారు గుర్తుకేస్తం….’-సూర్యాపేట పల్లెల్లో పర్యటించినప్పుడు వినిపించిన మాటలివి. ఈ నాలుగు వ్యాఖ్యలు నలుగురు అభ్యర్థులను ఉద్దేశించి అక్కడి కొందరు పౌరులు చేసినవి. పల్లెల్లో తొందరగా ప్రజలు పార్టీలు మార్చరు. నాయకులు ఎంత మోసం చేసినా, ఎన్ని పార్టీలు మార్చినా, పార్టీలు ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా తరాలతరబడి ఒకే పార్టీని నమ్ముకుని పనిచేసే నిజాయితీ పరులైన జనం తెలంగాణ పల్లెల్లో కనిపిస్తారు. కానీ చాలాకాలం తర్వాత ఈ సారి పల్లెల్లో ఒక సడలింపు ధోరణి ప్రజల్లో కనిపిస్తున్నది. ఇది ఒక చారిత్రక సందర్భం, చారిత్రక ఎన్నికలు కావడం వల్ల కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టే సంధికాలంలో ఉండడంవల్ల కావచ్చు. అన్ని రాజకీయ పార్టీల రాజకీయ పునాదుల్లో ఒక పెనుమార్పు కనిపిస్తున్నది. కొత్త గాలికి సూచన కావచ్చు. ‘ఈ ఒక్కసారి తెలంగాణ పార్టీకి అవకాశం ఇచ్చిచూద్దామ’న్న అభిప్రాయం చాలా మంది కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల్లో కూడా వ్యక్తమయింది. మేము జెండాలు పెట్టుకోలేదు. ఇద్దరు మిత్రులతో కలిసి సూర్యాపేట నుంచి చీదెళ్ల దాకా అనేక గ్రామాలు చూస్తూ వెళ్లాం.

అక్కడక్కడా జనంతో, స్థానిక నాయకులతో కలిసి మాట్లాడాం. యువకులు చాలా చురుకుగా రాజకీయ అభిప్రాయాలు చెబుతున్నారు. వారిలో చాలామందికి ఉస్మానియా ఉద్యమాల్లో పాల్గొన్న అనుభవం ఉంది. స్థానిక రైతులతో కూడా మాట్లాడాము. ‘మాకు కావలసిందల్లా కరెంటు, నీళ్లు.. మా రాయి చెరువు నిండాలె…మా పంటలు పండాలె….నాయకులకు చిన్న చిన్న సమస్యలను పరిష్కరించే తీరిక కూడా లేకుండా పోయింది. మా రాయిచెరువును నింపాలని ఇరవైయ్యేళ్లుగా కోరుతున్నాం. మాకు మూడు కిలోమీటర్ల దూరం నుంచి నాగార్జున సాగర్ కాలువ వెళుతుంది. లిఫ్ట్ ద్వారా నీటిని తెచ్చి చెరువును నింపితే ఆరేడు గ్రామాలకు తాగునీరు, సాగునీరుకు భరోసా లభిస్తుంది. కానీ పట్టించుకున్న నాథుడు లేడు’ అని ఒక రైతు నాయకుడు చెప్పారు. ‘ఇన్నేళ్లు కొట్లాడినా మా చెరువులు నింపలేదు. ఇప్పుడేమో ఇంకో కాలువ తవ్వుతున్నాం భూములివ్వండని కొలతలు వేస్తున్నారు. ఈ కాలువల ఖమ్మం నుంచి ఎదురు నీళ్లు తీసుకెళ్లి సాగర్‌ల కల్పుతరట. చుట్టూ కాలువలుండంగ మళ్లీ ఈ కాలువేంది? ఓ పక్క సాగర్ కాలువ. ఇంకోపక్క శ్రీరాంసాగర్ కాలువ. మళ్లీ ఇదేంది? బుద్ధి ఉండి చేస్తున్నరా ఇదంతా? మా ఎమ్మెల్యే ఇంతవరకు ఈ విషయంపై నోరుమెదపలేదు’ అని మరో రైతు చెప్పుకొచ్చాడు.

ఆ పల్లెలకు రోడ్లు వచ్చాయి. పెద్ద గ్రామాలకు స్కూళ్లు వచ్చాయి. కానీ చాలా తండాల్లో ఇంకా స్కూళ్లు లేవు. వైద్య సదుపాయాలు లేవు. తాగునీరు లేదు. కరెంటు సమస్య తీవ్రంగా ఉంది. పెన్‌పహాడ్ వెళుతున్న దారిలో అకస్మాత్తుగా ఒక గ్రామంలో ఒక మంచంపై ఒక శవాన్ని మోసుకుని నడిరోడ్డుపైకి వచ్చి ధర్నా ప్రారంభించారు. దిగి తెలుసుకుంటే…. ఆ ఊరి షేక్‌సిందు అప్పుడే కరెంటు షాకుతో చనిపోయాడట. ఆ కుటుంబం అంతా దుఃఖంలో ఉంది. యువకులు ఆవేశంగా ఉన్నరు. పోలీసులు వచ్చి ఏదో సర్ది చెబుతున్నరు. దారి ఇచ్చే అవకాశం కనిపించలేదు. వెనుకకు వచ్చి మరోదారిలో ప్రయాణం మొదలుపెట్టాం. తెలంగాణలో కరెంటు షాకులతో మరణించిన వారి జాబితా తయారు చేస్తే ఒక యుద్ధంలో చనిపోయినంత మంది ఉంటారు. ఎప్పుడొస్తదో తెలియని కరెంటు, నేలను తాకే కరెంటు లైన్లు, చాలీచాలని సిబ్బంది…వందలు, వేల మంది రైతుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. వీరికి పరిహారం ఇచ్చే విధానం కూడా లేదు. వేలకోట్ల రూపాయల చార్జీలు వసూలు చేస్తున్న విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ ఉత్పాతాలకు ఎటువంటి బాధ్యతను తీసుకోవడం లేదు. సర్వీసు ఉన్న ప్రతిరైతుకు పదిలక్షల గ్రూపు ఇన్సూరెన్సును ప్రవేశపెట్టి వారి కుటుంబాలను ఆదుకోవచ్చు. ఇందుకేమీ లక్షలకోట్లు ఖర్చుకావు. కావలసింది చిత్తశుద్ధి, ప్రజలపట్ల సహానుభూతి.

కానీ రైతుల మరణాలను ప్రభుత్వమే సీరియస్‌గా తీసుకోనప్పుడు వ్యాపారాత్మకంగా మారిన విద్యుత్ కంపెనీలు ఎందుకు పట్టించుకుంటాయి? ‘కాలువల నీరే ఉంటే నాకు కరెంటు అవసరం ఉండేదా? మన వాళ్లు ఇంత మంది చనిపోయేవారా’ అని ఒక రైతు ప్రశ్నించాడు. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో కరెంటు షాకుతో మరణించినవాళ్లు చాలాచాలా తక్కువ. అక్కడ రైతుల ఆత్మహత్యలు కూడా తక్కువ. నిజమే మనకు కాలువలు రావాలన్న సోయి మన నాయకులకు ఎప్పుడు కలుగుతుంది? సూర్యాపేటది మరీ విషాదం. ఒక పక్క మూసీ రిజర్వాయర్ ఉంటుంది. ఇంకోపక్క పాలేరు రిజర్వాయర్ ఉంటుంది. దక్షిణంగా సాగర్ ఎడమకాలువ ప్రయాణిస్తుంది. ఇప్పుడు సూర్యాపేటకు మణిహారంలాగా చుట్టూ శ్రీరాంసాగర్ కాలువను తవ్వారు. కానీ సూర్యాపేటలో మంచి నీళ్ల సమస్య తీరలేదు. ‘అయ్యా… ఇక్కడ కొన్న నీళ్లు కూడా తాగలేని పరిస్థితి’ అని ఆరోవార్డులో ఒక మహిళ వాపోయింది. మాధవరెడ్డి కాలువను మూసీకి అనుసంధానం చేసి సంవత్సరానికి రెండుసార్లు ఆ రిజర్వాయర్‌ను నింపాలి. మూసీకి మురుగునీరు రాకుండా అనేకచోట్ల కత్వలు కట్టి నీటిని శుద్ధి చేసే ప్రయత్నం చేయాలి. అన్నింటికంటే ముందు మూసీ రిజర్వాయర్ షట్టర్లు బాగు చేయించాలి. మూసీ కింద ఆయకట్టును స్థిరీకరించడానికి, సూర్యాపేటకు నమ్మకంగా కృష్ణానీటిని అందించడానికి అప్పుడు అవకాశం కలుగుతుంది.

అదేవిధంగా శ్రీరాంసాగర్‌కు ప్రతిఏటా నీరొచ్చే మార్గాలను అన్వేషించాలి. కాకతీయ కాలువ నీటి ప్రవాహ సామర్థ్యాన్ని ఇప్పుడున్న 11000 వేల క్యూసెక్కుల నుంచి(వాస్తవానికి వచ్చేది 000 క్యూసెక్కులే) 25000 వేల క్యూసెక్కులకు పెంచాలి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చే కాలం నెలరోజులు మాత్రమే ఉంటుంది. ఆ నెలరోజుల్లో సాధ్యమైనంత ఎక్కువ ప్రవాహాన్ని కాలువలోకి మళ్లించి మొత్తం చెరువులు, రిజర్వాయర్లు నింపుకోగలిగితే అంతకంటే గొప్ప మేలు ఉండదు. అంతేకాకుండా దేవాదుల, కంతానపల్లి ప్రాజెక్టులను పూర్తిచేసి ఎత్తిపోతల ద్వారా కూడా శ్రీరాంసాగర్ కాలువకు నీళ్లివ్వవచ్చు. మన నాయకులు నీళ్లు వచ్చే మార్గం చూడకుండా ముందుగా కాలువలు తవ్వారు. కాలువలు తవ్వడం తేలికగా అయ్యే పని, లాభసాటి పని కాబట్టి వాటిని ముందుగా చేశారు. ప్రజలు మాత్రం ఎప్పటిలాగే నీటికోసం ఎదురుచూడవలసిన పరిస్థితి. ప్రజల సమస్య ఏమిటో, అందుకు ఏమి చేయాలో తెలిసిన నాయకత్వం మనకిప్పుడు కావాలి. తెలంగాణ ఉద్యమం అటువంటి నాయకులను తయారు చేసింది. కొట్లాడి సాధించినవాడికే తెలుస్తుంది కోల్పోయిందేమిటో, సాధించాల్సిందేమిటో… ఆ మధ్య చాలా సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఒక జర్నలిస్టు పోతిరెడ్డిపాడుపై మీ అభిప్రాయం ఏమిటి? అని అడిగాడు. ‘దానితో మనకేం సంబంధం…మన నియోజకవర్గానికి ఏమి సంబంధం…దాని గురించి నాకు పెద్దగా తెలియదు’ అని సమాధానం ఇచ్చాడు. ఆయన పాలకపక్షంలో ఉన్నాడు. ప్రభుత్వంలో ఉన్నాడు.

పోతిరెడ్డిపాడు శ్రీశైలం రిజర్వాయర్ వెనుక నుంచి కృష్ణానదిని రాయలసీమకు తరలించుకుపోయే కాలువ. దానిని సమర్థించుకోవడానికి, శ్రీశైలం రిజర్వాయర్‌ను తెలంగాణకు శాశ్వతంగా కాకుండా చేయడానికే దుమ్ముగూడెం నుంచి సాగర్ వరకు కాలువ తవ్వే ప్రాజెక్టును ముందుకు తెచ్చారు. రాజశేఖర్‌రెడ్డి గోదావరి నీళ్లు మనకు ఇచ్చి, శ్రీశైలం రిజర్వాయర్‌ను కాజేద్దామని ఈ ఎత్తు వేశాడు. అది మన నాయకులకు అర్థం కాకపోతే మనం ఎలా కొట్లాడగలం? తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న నాయకులకు తప్ప మరెవరికీ ఈ సమస్యల సోయి లేదు. ‘మా సమస్యలు తెలిసినోడు కావాలె. మాకు అందుబాటులో ఉండేనాయకుడు కావాలి. ఐదేళ్లకోసారి వచ్చేవాడు కాదు. మాకు ఎప్పుడు ఆపదొస్తే అప్పుడు అందుకునేటోడు కావాలె’ అని ఒక రైతు అన్నాడు. తెలంగాణ పార్టీ ఈ ఖాళీని భర్తీ చేస్తుందన్న నమ్మకం చాలా మందిలో కనిపిస్తున్నది. ఒక చోట తండా ప్రజలు ఐదారుగురు కనిపించారు. మీరు ఈసారి ఎవరికి ఓటేస్తారు అని ప్రశ్నిస్తే ‘ఈసారికి మాత్రం తెలంగాణకే’ అని ఒక యువకుడు సమాధానం ఇచ్చాడు. చాలా చోట్ల ఇదే ధోరణి వ్యక్తమయింది. ఈ భావన బలంగా ఉంది. ఇది క్రమంగా బలపడి, ఒక శక్తిగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. అదంతా టీఆరెస్ శ్రేణులు, తెలంగాణవాదులు చివరి పదిరోజుల్లో చేసే శ్రమపైన, ఈ శక్తిని ఈవీఎంలలోకి మళ్లించగల శక్తి సామర్థ్యాలపైన ఆధారపడి ఉంటుంది.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

One thought on “మార్పు సంకేతాలు”

  1. only local leaders who can understand the local problems with depth can solve the problems. unfortunately there are few leaders with vision in telangana state. intellectuals from this soil should come out with ideas and blue prints for the development of telangana keeping in view of available resources .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s