ఇప్పుడు వీస్తున్న గాలి


మబ్బుల గమనాన్ని, పవనాల పయనాన్ని, సముద్రాల్లో అల్పపీడన భ్రమణాన్ని బట్టి వాతావరణాన్ని సూచిస్తారు. రాజకీయ వాతావరణాన్ని సూచించడానికి కూడా అటువంటి సంకేతాలు కొన్ని ఉన్నాయి. ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి ఎక్కువగా ఫిరాయింపులు జరుగుతున్నాయి? ఏ పార్టీల నాయకుల సభలు, ప్రసంగాలకు ఎక్కువగా స్పందన లభిస్తున్నది? ఏ పార్టీల వాదనలు, వాగ్దానాలు, హామీలు జనసమ్మతంగా ఉన్నాయి? ఇటువంటి అంశాలను పరిశీలించి రాజకీయ వాతావరణాన్ని అంచనా వేయవచ్చు

Telangana-map

మబ్బుల గమనాన్ని, పవనాల పయనాన్ని, సముద్రాల్లో అల్పపీడన భ్రమణాన్ని బట్టి వాతావరణాన్ని సూచిస్తారు. రాజకీయ వాతావరణాన్ని సూచించడానికి కూడా అటువంటి సంకేతాలు కొన్ని ఉన్నాయి. ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి ఎక్కువగా ఫిరాయింపులు జరుగుతున్నాయి? ఏ పార్టీల నాయకుల సభలు, ప్రసంగాలకు ఎక్కువగా స్పందన లభిస్తున్నది? ఏ పార్టీల వాదనలు, వాగ్దానాలు, హామీలు జనసమ్మతంగా ఉన్నాయి? ఇటువంటి అంశాలను పరిశీలించి రాజకీయ వాతావరణాన్ని అంచనా వేయవచ్చు. తెలంగాణలో ఇప్పుడు వీస్తున్న గాలి టీఆరెస్‌వైపు మళ్లుతున్నది. ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాయింపులు కాంగ్రెస్, టీఆరెస్‌లు…ండింటిలోకి జరిగినా టీఆరెస్‌లోకే ఎక్కువ మంది వచ్చి చేరారు. కాంగ్రెస్ నాయకులు కూడా కొందరు వచ్చి చేరారు. టీడీపీ నుంచయితే ఇక లెక్కేలేదు. వైసీపీ దాదాపు ఖాళీ అయింది. ఇంకా అవుతూ ఉన్నది. ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాయింపులు జరగడం పరిపాటే. గెలిచే అవకాశాలున్న పార్టీలలోకి గెంతులేసేవారు ఎక్కువగానే ఉంటారు. కానీ తెలంగాణలో టిక్కెట్ల పంపిణీ, నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత కూడా ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. శుక్రవారంనాడు నిజామాబాద్ జిల్లాలో నేరెళ్ల ఆంజనేయులుతో సహా పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు టీఆరెస్‌లో చేరారు. నల్లగొండ జిల్లాలో జరిగే బహిరంగ సభ సందర్భంగా మరికొంత మంది సీనియర్ నాయకులు టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి వచ్చి చేరతారని చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో కార్పొరేటర్లు కొందరు టీఆరెస్ జెండా పట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్‌లోకి కూడా అక్కడక్కడా ఫిరాయింపులు కొనసాగుతున్నా, టీఆరెస్‌కు వచ్చినంత ఊపుగా జనం రావడం లేదు. ఎందుకిలా జరుగుతోంది? టీఆరెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకమా? భవిష్యత్తులో అధికారపక్షంవైపు ఉండవచ్చన్న ఆలోచనా? ఎన్నికలు చివరి ఘట్టానికి చేరేదాకా పరిస్థితి ఇలాగే కొనసాగితే అదొక రాజకీయ తుపానుగా మారి తెలంగాణ అంతటా టీఆరెస్‌కు ఘనమైన ఫలితాలు లభించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిని నిలువరించడానికి కాంగ్రెస్ ఏమిచేస్తుందో చూడాలి? కాంగ్రెస్ ఎంతవరకు సంఘటితంగా పోరాడుతుందో చూడాలి.

టీఆరెస్‌కు అనుకూలంగా కనిపిస్తున్న మరో అంశం కేసీఆర్, హరీశ్‌రావు వంటి వారి ప్రసంగాలకు లభిస్తున్న స్పందన. టీఆరెస్ అభ్యర్థులు ఎక్కడ నామినేషన్లు వేసినా ఉత్సవ వాతావరణం కనిపిస్తున్నది. గద్వాలలో కృష్ణమోహన్‌రెడ్డి అనే అభ్యర్థి నామినేషన్ వేస్తే ఆ పట్టణం కిటకిటలాడిపోయిందని చెబుతున్నారు. కాంగ్రెస్ నాయకులు నిక్కినీల్గి జనాన్ని పోగేయాల్సి వస్తోంది. టీఆరెస్ నాయకులు ప్రసంగిస్తుంటే హర్షధ్వానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల ప్రసంగాలకు అంతటి స్పందన కనిపించడం లేదు. పొన్నాలను ఎవరూ సీరియస్‌గా తీసుకోకపోవడం కాంగ్రెస్‌కు పెద్ద మైనస్. ఇంకా విషాదం ఏమంటే తెలంగాణ అంతటా తిరిగి ప్రచారం చేసే మొనగాడు నాయకుడు కాంగ్రెస్‌కు లేకపోవడం. జానారెడ్డికి ఆ శక్తి సామర్థ్యాలు కొంత ఉన్నా ఆయనకు బాధ్యతలు లేవు కాబట్టి, ఆయన తన నియోజకవర్గంపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. పైగా ఆయనకు నోముల నర్సింహయ్యవంటి గట్టి ప్రత్యర్థి వచ్చి కూచున్నాడు. దామోదర రాజనరసింహ పరిస్థితి కూడా దాదాపు ఇదే. డి.శ్రీనివాస్, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అందరూ ఒక్క నియోజకవర్గం నాయకులే అయిపోయారు. తమ శిబిరాలు చెదిరిపోకుండా చూసుకోవలసిన అగత్యంలో పడిపోయారు. టీఆరెస్‌కు కేసీఆర్ పెద్ద బలం. ఆయన తర్వాత శ్రేణిలో కూడా మరో నలుగురైదుగురు నాయకులు జనాన్ని తమ ప్రసంగాలతో ప్రభావితం చేయగలరు. టీఆరెస్ నాయకత్వం ఎంత విస్తృతంగా ప్రచారం చేసుకుంటే అంతగా బలపడే అవకాశాలు, గెలిచే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ సాధించిన పార్టీగా ఆ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలన్న భావన బలంగా ఉంది. దానిని సమీకరించి, సంఘటిత పరచి, ఓట్లుగా మల్చుకోగలిగితే టీఆరెస్‌కు తిరుగుండదు.

ఇక టీఆరెస్‌కు చెప్పుకోవడానికి చాలా ఉంది. సాధించింది చాలా ఉంది. తెలంగాణ పునర్నిర్మాణంకోసం కేసీఆర్ చేస్తున్న ప్రతిపాదనలు కొంత అతిశయంగా ఉన్నా అవి జనానికి పడుతున్నాయి. కొట్లాడినవాళ్లకే కోల్పోయిందేమిటో తెలుస్తుంది. తెలంగాణ సమస్యలు టీఆరెస్‌కు అర్థమయినంతగా కాంగ్రెస్ నాయకులకు అర్థం కాలేదు. కొందరు కాంగ్రెస్ నాయకులయితే చాలా సరళమైన అంశాన్ని కూడా ఎంత కఠోరంగా చెబుతారో అందరికీ అనుభవంలో ఉన్నదే. దామోదర రాజనరసింహ వంటివారు గత నాలుగైదు మాసాల కాలంలో తెలంగాణ సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. మిగిలిన వాళ్లెవరికీ తెలంగాణ సమస్య అర్థం కాలేదు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ను ఎందుకు వ్యతిరేకించాలో తెలియనివారు ఇప్పుడు పీసీసీ అధ్యక్షునిగా ఉన్నారు. తెలంగాణ ప్రాధాన్యాలేమిటో అర్థం కాని పెద్ద మనిషి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. సమస్య తెలిస్తే కదా పరిష్కరించడం తెలిసేది. టీఆరెస్ నాయకత్వానికి తెలంగాణ సమస్యలకు సంబంధించి, భవిష్యత్తు తెలంగాణకు సంబంధించి ఒక ఎజెండా ఉంది. గత పద్నాలుగేళ్లుగా ఆ సమస్యలను పదేపదే మాట్లాడి ఉంది. ఇప్పుడు కూడా జనం వద్దకు వెళ్లి వాళ్లు మాట్లాడితేనే చప్పట్లు వినిపిస్తున్నాయి. అందువల్ల మూడో సంకేతం కూడా టీఆరెస్‌కే అనుకూలంగా ఉంది. కాంగ్రెస్ కేసీఆర్‌పైన దాడిని తీవ్రతరం చేసింది కానీ దాడి చేస్తున్నవారికి క్రెడిబిలిటీ లేదు. వాళ్లంతో ఏదో ఒక సందర్భంలో తెలంగాణవాదులతో ఛీకొట్టించుకున్నవాళ్లే. ఒక మంత్రి విద్యార్థులపై లాఠీలను ఉసిగొల్పితే, మరొక మంత్రి గుండాలతో దాడి చేయించాడు. మరొక మంత్రి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పోలీసు స్టేషన్లో పెట్టించాడు. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలంగాణ వద్దేవద్దు, సమైక్యాంధ్రే ముద్దు అన్నాడు. మరో ఎమ్మెల్యే ఎప్పటికీ కిరణే మా ముఖ్యమంత్రి అని సూర్యాపేటలో సభ పెట్టి మరీ ప్రకటించాడు. ఇటువంటి వాళ్లు కేసీఆర్‌ను తిడితే అవి దీవెనలవుతున్నాయి. జనం వాటిని సీరియస్‌గా తీసుకోవడం లేదు.

ఇక టీడీపీ-బిజెపిల పరిస్థితి దయనీయంగా ఉంది. బీ ఫార్మ్ తీసుకుని బయటికి వచ్చిన ఒక ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు చెబితే, ఏమి చేసుకోను ఈ బీ ఫార్మ్‌తో అని నిర్లిప్తంగా సమాధానం ఇచ్చారు. సీట్ల పంచాయతీ కోతిపుండు బ్రహ్మరాక్షసిగా మారింది. ఇరుపక్షాల మధ్య బంధుత్వం పొసగడం లేదు. ఇది బలవంతపు పెళ్లిలా తయారైంది. మొన్నమొన్నటి దాకా మోడీ హవాతో ఏదేదో చేసేద్దామనుకున్న తెలంగాణ బిజెపి నాయకులు చతికిలబడిపోయారు. సీట్లు రాక కొందరు, సీట్లు వచ్చినా టీడీపీ సహకరిస్తుందో లేదో నన్న భయంతో ఇంకొందరు బిజెపి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ప్రజల్లో టీడీపీ మీద ఉన్న వ్యతిరేకత తమకు శాపంగా మారుతుందేమోనన్న భయం వారిని వెంటాడుతున్నది. టీడీపీ ఎన్నికలు రాకముందే సగం ఓడిపోయింది. 45 సీట్లు వదిలేసుకోవలసి వచ్చింది. ఉన్న సీట్లలో కూడా చంద్రబాబు ఘనంగా ప్రకటించిన ఏ సూత్రాలూ పాటించలేదు. ఈ పరిణామాలన్నీ టీఆరెస్‌కు అనుకూలంగా పరిణమిస్తున్నాయి. టీఆరెస్ ఒక్కటే సంఘటితంగా ఎన్నికల పోరాటరంగంలోకి దూకింది. మిగిలిన పార్టీలన్నీ ఇంకా సర్దుకునే స్థితిలోనే ఉన్నాయి. ఎన్నికల సమరానికి ఇక మిగిలింది 17 రోజులే. కోలుకున్నా కూలిపోయినా ఈ పదిహేడు రోజుల్లోనే.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s