అభ్యర్థుల ఎంపికలో టీఆరెస్ పైచేయి


VRK_0557

అభ్యర్థుల ఎంపిక సందర్భంగా ప్రతిసారి టీఆరెస్‌పై వచ్చే విమర్శలేవీ ఈసారి రాలేదు. అక్కడక్కడా చిన్నచిన్న అసంతృప్తులు తప్ప ఎక్కడా పెద్ద గొడవలు జరుగలేదు. కాంగ్రెస్, టీడీపీ-బిజెపి శిబిరాల్లో మాత్రం కల్లోలమే చెలరేగింది. కాంగ్రెస్ కూడా ఉన్నంతలో సాధ్యమైనంత వివాదరహితంగానే అభ్యర్థులను ఎంపిక చేసింది. ఎటొచ్చీ కొత్తగా తీర్థం పుచ్చుకున్నవారిపనే కుడితిలో పడ్డ ఎలకచందంగా తయారైంది. సుదీర్ఘకాలంగా ఎమ్మెల్యేలుగా ఉండి ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్న 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి కొత్తవారికి అవకాశం ఇస్తారని మధ్యలో కొంత ప్రచారం జరిగింది. దాంతో హేమాహేమీలంతా ఢిల్లీ వెళ్లి నానా తంటాలుపడి దాదాపు సిట్టింగులందరికీ టిక్కెట్లు ఇప్పించుకున్నారు.

కాంగ్రెస్ జాబితాలో స్థానాలు దక్కుతాయనుకున్న జేయేసీ నాయకులు చాలా మందికి టిక్కెట్లు దక్కలేదు. ఒక్క క్రిశాంక్ ఇందుకు మినహాయింపు. అద్దంకి దయాకర్ వంటివారికి కూడా నిరాశే ఎదురయింది. టీడీపీ తెలంగాణలో 45 స్థానాలు బిజెపికి వదలడంతో అక్కడ సగం పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. బిజెపిలో కూడా చాలా మంది ఆశావహులు టీడీపీతో పొత్తు వల్ల పోటీ చేసే అవకాశం లేకుండా పోయిందని మండిపడుతున్నారు. టీడీపీ-బిజెపి పొత్తు వెనుకటికి మహాకూటమి పొత్తులాగా అతకని బొంత అవుతుందేమోనని నిన్న, ఇవ్వాళ జరిగిన గొడవలని బట్టి చూస్తే అర్థం అవుతుంది. టీడీపీ తెలంగాణకు ఇంకా పూర్తి జాబితా ప్రకటింలేదు. ప్రకటిస్తే ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో (వేరే పార్టీల్లోకి) తెలియదు.

చంద్రబాబు వీరభక్త హనుమాన్ రేవంత్‌రెడ్డి కూడా చివరకు మల్కాజిగిరి ఇవ్వకపోతే తడాఖా చూపిస్తాంటూ మీడియాకు లీకులు ఇచ్చారని చెబుతున్నారు. ఆయన ఒకప్పటి తన సొంతపార్టీ టీఆరెస్ గూటికి చేరతారని కూడా ఊహాగానాలు జరిగాయి. ఉమామాధవరెడ్డి కూడా అలక వహించిందట. మోత్కుపల్లి మాటే ఎక్కువగా చెల్లుబాటవుతోందని, తనను నిర్లక్ష్యం చేశారని ఆమె బాధపడుతున్నారట. ఇప్పటికి సేఫ్ జోన్‌లో ఉన్నది ఒక్క టీఆరెస్ మాత్రమే. తుది జాబితా వచ్చిన తర్వాత అక్కడ కూడా కొన్ని రణగొణ ధ్వనులు వినిపించవచ్చు, కానీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటికయితే ఆ పార్టీ మంచి మార్కులే సంపాదించింది. తొలి నుంచి ఉద్యమాన్ని, పార్టీని నమ్ముకున్నవాళ్లకే కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు.

మలి ఉద్యమ తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు, టీజేయేసీ నేతలు శ్రీనివాస్‌గౌడ్, టీఎస్‌జేయేసీ నేత పిడమర్తి రవి, డాక్టర్ల జేయేసీ నేత డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ధూంధాం ఉద్యమకారుడు రసమయి బాల్‌కిషన్, వేణుగోపాల్‌రెడ్డి ఆత్మహత్య సందర్భంగా నిరసనోద్యమానికి నాయకత్వం వహించి జైలు పాలైన అనురాగ్ విద్యాసంస్థల అధినేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి వంటి వారిని ఎన్నికల బరిలో దింపి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. టీఆరెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలన్న భావనతో పాటు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత కనుక గట్టిగా పనిచేస్తే, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి పైచేయి సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s