తెలంగాణలో దేశం,వైసీపీ ఖాళీ: ఆంధ్రాలో కాంగ్రెస్ పతనం


వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలు

రెండు రాష్ట్రాల ఏర్పాటు సరికొత్త రాజకీయ సమీకరణలకు తెరతీశాయి. రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ శక్తుల పునరేకీకరణ వేగంగా జరుగుతున్నది. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితిలోకి పెద్ద ఎత్తున వలసలు జరుగుతున్నాయి. ఆంధ్రలో టీడీపీ బలపడుతున్నది. కాంగ్రెస్ ఖాళీ అవుతున్నది. వలస పక్షుల రాక రాబోయే రాజకీయ మార్పులను సూచిస్తున్నది. వలసలు ఏ పార్టీలోకి ఎక్కువగా ఉంటే ఆ పార్టీ విజయావకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ పరిభాషలో అర్థం.

రాష్ట్ర విభజన రాష్ట్ర రాజకీయాల్లో పెను తుపాను సృష్టిస్తున్నాయి. రెండు రాష్ట్రాల ఏర్పాటు సరికొత్త రాజకీయ సమీకరణలకు తెరతీశాయి. రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ శక్తుల పునరేకీకరణ వేగంగా జరుగుతున్నది. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితిలోకి పెద్ద ఎత్తున వలసలు జరుగుతున్నాయి. ఆంధ్రలో టీడీపీ బలపడుతున్నది. కాంగ్రెస్ ఖాళీ అవుతున్నది. వలస పక్షుల రాక రాబోయే రాజకీయ మార్పులను సూచిస్తున్నది. వలసలు ఏ పార్టీలోకి ఎక్కువగా ఉంటే ఆ పార్టీ విజయావకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ పరిభాషలో అర్థం. కొందరు తిట్టు నేతలు, కొందరు సీట్లు లేని నేతలు తప్ప తెలుగుదేశంలో ఎవరూ మిగిలే అవకాశాలు కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహాత్మకమైన తప్పులేమీ చేయకపోతే ఆ పార్టీ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

KCR

45 నియోజకవర్గాలు ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏడెనిమిది నియోజకవర్గాల్లో తప్ప అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి బలంగా ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అండర్ కరెంట్ ఉన్నది. మహబూబ్‌నగర్‌లో కూడా తెలంగాణ పవనాలు వీస్తున్నాయి. ఒకప్పుడు టీడీపీకి బలమైన కేంద్రంగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఆ పార్టీ చతికిల బడిపోయింది. నల్లగొండ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఆ పార్టీ ముందంజలో ఉంది. పురపాలక ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు ఆ పార్టీకి అందివచ్చిన వరం. కిందిస్థాయిలో పార్టీ యంత్రాంగం లేక నానా యాతన పడుతున్న ఆ పార్టీ నియోజక వర్గ ఇంచార్జిలకు ఈ ఎన్నికలు వందలాది మంది నాయకులను తయారు చేశాయి. ప్రతి ఊళ్లో పార్టీ జెండా పట్టుకుని నిలబడేవారు తయారయ్యారు. ఉపయోగించుకున్నవారికి ఉపయోగించుకున్నంత. సీపీఐ, న్యూడెమాక్రసీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగితే టీఆరెస్‌కు మరింత అవకాశాలు మెరుగవుతాయి. ఖమ్మం జిల్లాలో కూడా ఈ కూటమికి విజయావకాశాలు మెరుగుపడతాయి. ఎన్‌డీటీవీతో పాటు గత రెండు మాసాల్లో వచ్చిన సర్వేలన్నీ టీఆరెస్‌కు 9 నుంచి 13 వరకు లోక్‌సభ స్థానాలు వస్తాయని సూచిస్తున్నాయి. టీఆరెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సాధారణ మెజారిటీని స్వయంగానే సంపాదించుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

అయితే టీడీపీ-బిజెపిలను, వాటికి మద్దతు ఇచ్చే మీడియాను, వారు ఆడిస్తే ఆడే కీలు గుర్రాలను తక్కువ అంచనా వేయరాదు. టీఆరెస్‌ను అడ్డుకోవడమే వీరి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆరెస్‌పైన, కేసీఆర్‌పైన దాడి చేసిన కిరాయి కోటిగాళ్లే ఇప్పుడు కూడా టీడీపీ-బీజేపీల పక్షాన వకాల్తా పుచ్చుకుని కేసీఆర్‌పై విరుచుకుపడుతున్నారు. సామాజిక ఎజెండాల గందరగోళాన్ని, నిర్మాణాలు, వినిర్మాణాల పంచాయతీని లేవనెత్తుతున్నారు. సొంతంగా పార్టీని పెట్టుకున్న దిలీప్‌కుమార్, టీఆరెస్ ఎవరికి టికెట్లు ఇవ్వాలో చెబుతుంటాడు. ఆయనే స్వయంగా టికెట్లు ఇచ్చి గెలిపించవచ్చు కదా. సొంతంగా పార్టీని పెట్టుకుని గర్జనలు చేస్తున్న నాయకుడు దళిత ముఖ్యమంత్రి విషయం కేసీఆర్ తేల్చాలంటాడు. తమ పార్టీని గెలిపించి దళితుడిని చేయవచ్చు కదా? ఎంతోకాలంగా అమరవీరుల కుటుంబాలను ఏదో ఉద్ధరిస్తామని చెబుతున్న టీడీపీ, వారికి టీఆరెస్ టికెట్లు ఇవ్వాలని డిమాండు చేస్తుంది. టీడీపీ టికెట్లు ఇవ్వవచ్చు కదా?

కొండా మురళి వంటి వారిని చేర్చుకుని టీఆరెస్ ఇంతకాలం కూడబెట్టుకున్న నైతిక బలాన్ని, ఉద్యమశక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసింది. టీఆరెస్ సాధారణ రాజకీయ పార్టీ అయితే వలసలను పెద్దగా పట్టించుకునే వారు కాదు. తమది ఉద్యమపార్టీగా ఆ పార్టీ నాయకులు ఇంతకాలం చెబుతూ వచ్చారు. అందుకే తెలంగాణ ద్రోహులకు ప్రతీకగా పేరుతెచ్చుకున్న కొండా మురళి వంటి వారిని అక్కున చేర్చుకోవడం తెలంగాణవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ నిర్ణయం రాజకీయంగా సరైనదేమో కానీ, నైతికంగా సరైనది కాదు. ఆయన శక్తిని తగ్గించే నిర్ణయం అది. కానీ బీసీలను వీలైనంత ఎక్కువమందిని పార్టీలోకి తీసుకురావాలన్న ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ వారిని చేరదీసినట్టుగా చెబుతున్నారు. జైపాల్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, కొండామురళి, సురేఖ… ఆ జాబితాలోకే వస్తారని టీఆరెస్ వర్గాలు చెబుతున్నాయి. సీట్ల పంపిణీలో ఈసారి తప్పులు జరుగకుండా చూసుకోవలసిన బాధ్యత కేసీఆర్‌పూ ఉంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు తగినంత ప్రాతినిధ్యం ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి.

కూడదీసుకుంటున్న కాంగ్రెస్

తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే కూడదీసుకుంటున్నది. టీఆరెస్‌పై ఎదురుదాడి ప్రారంభించింది. ఎన్నికలు సమీపించే కొద్దీ రెండు పక్షాల మధ్య వాగ్యుద్ధం పెరగవచ్చు. ఆ పార్టీ ఇప్పటికీ ఒక్కతాటిపైకి వచ్చి పనిచేస్తున్నట్టు కనిపించలేదు. పార్టీ ఎన్నికల కమిటీల సమావేశాలకు సీనియర్ నాయకులు దూరం దూరం ఉంటున్నారు. తొందరగా అభ్యర్థుల సంగతి తేల్చి బరిలోకి దిగితే కానీ కాంగ్రెస్‌కు మేలు జరగదు. తెచ్చింది మేము ఇచ్చింది సోనియాగాంధీ అని అట్టడుగు ఓటరు దాకా తీసుకు వెళ్లేందుకు సమయం పడుతుంది. ప్రతిరోజూ విలువైనదే. కాంగ్రెస్‌లో చాలా సమస్యలు ఉన్నాయి. పదేళ్లుగా అధికారంలో ఉండడం వల్ల అన్ని జిల్లాల్లో గ్రూపుల గొడవలు ఉన్నాయి. ఒకరిని ఓడించడానికి మరొకరు కుట్ర చేసే అలవాటు కాంగ్రెస్‌లో ఉంది. గత పదేళ్లుగా కొనసాగుతున్న ఎమ్మెల్యేలపై యాంటీ ఇన్‌కంబెన్సీ కూడా ఉంది. వీటన్నింటినీ అధిగమించి గెలవాలంటే కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డి పోరాడాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌కు ఏకపక్షంగా విజయం చేకూర్చి పెట్టే జిల్లాలేవీ కనిపించడం లేదు. నల్లగొండ, హైదరాబాద్, మెదక్, మహబూబ్‌నగర్‌లలో మాత్రమే కొంత అనుకూల పరిస్థితి ఉంది.

సీమాంధ్రలో టీడీపీ సందడి

సీమాంధ్రలో టీడీపీ అన్ని పార్టీలలోని అసంతృప్తులకు గేట్లు బార్లా తెరిచింది. ఇక్కడ టీఆరెస్ చేస్తున్న పనే అక్కడ టీడీపీ చేస్తున్నది. ఆరు నూరైనా జగన్‌ను ప్రతిఘటించి గెలవాలన్న పట్టుదల టీడీపీ శిబిరంలో కనిపిస్తున్నది. అక్కడ టీడీపీ పొలిటికల్ గ్రాఫ్ క్రమంగా పెరుగుతున్నది. అధికారంలోకి వచ్చేంత బలంగా పెరుగుతుందా లేదా అన్నది మరికొద్ది వారాలలో తెలిసిపోతుంది. టీడీపీకయినా, జగన్‌కయినా ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య. ఈ ఎన్నికల్లో గెలవకపోతే వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీలు మనుగడ సాగించడం కష్టం. అందుకే రెండు పార్టీలూ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. టీడీపీకి బిజెపి, పవన్ కల్యాణ్ తోడయితే ఆ పార్టీ పరిస్థితులు ఇంకా మెరుగవుతాయి. అక్కడ అధికారంలోకి వస్తామన్న భరోసా ఇచ్చే తెలంగాణలో కూడా తన పార్టీని కొంత కాపాడుకుంటున్నారు. సీమాంధ్రలో జగన్ వ్యతిరేకులంతా టీడీపీ వెనుక ర్యాలీ అవుతున్నారు. చంద్రబాబు వ్యతిరేకులంతా జగన్ వెంట ర్యాలీ అవుతున్నారు. అక్కడ పోటీ ప్రధానంగా ఈ రెండు పక్షాల మధ్యనే ఉంటుంది. కాంగ్రెస్, కిరణ్ పార్టీలు సోదిలోకి కూడా మిగిలే అవకాశాలు లేవు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s