స్టేటస్‌కోయిస్టు రాజకీయాలొద్దు


పొత్తు చేటు, పోరు లాభం

images

తెలంగాణలో కొత్త రాజకీయాలకు బాటలు వేయాలి. గుణాత్మకమైన మార్పులకు పునాదులు వేయాలి. ముతక రాజకీయ శక్తులను పక్కనబెట్టి నవయువ పురోగామి రాజకీయ శక్తులను ప్రోత్సహించాలి.

ఇది కల కావచ్చు. ఆశ కావచ్చు. ఆశయమూ కావచ్చు. కానీ చాలా మందిలో వ్యక్తమవుతున్న భావన. తెలంగాణను సగౌరవంగా నిలబెట్టుకుంటామా? నవ్వుల పాలవుతామా? ఎవరు ఎన్ని చెప్పినా ఇది కేవలం నాయకుల చేతుల్లోనే ఉంది. నాయకుడిని బట్టే సమాజానికి, ప్రాంతానికి గౌరవం, గుర్తింపు. ఆలోచించుకునే సమయం లేదు. ఎన్నికలు మీదికొచ్చాయి. నాయకుల మంచితనం, దీక్షాదక్షతలకు వెంటనే ఒక పరీక్ష వచ్చింది. నాయకత్వానికి మంచి పేరు వచ్చినా, చెడ్డపేరు వచ్చినా అభ్యర్థుల ఎంపిక సమయంలోనే. ఈ పద్నాలుగేళ్ల తెలంగాణ పోరాటం ప్రజల్లో చాలా ఆకాంక్షలను పెంచింది. చాలా మంది నాయకులను తయారు చేసింది. ఉద్యమకారులను తయారు చేసింది. తెలంగాణ ఉద్యమం ‘న్యాయమైన వాటా(ఫెయిర్ షేర్)’ దక్కకపోవడం నుంచి మొదలయింది. అది రాజకీయ పదవుల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, పాలనలో కావచ్చు, నిధుల కేటాయింపులో కావచ్చు. కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి, అదే ఫెయిర్ షేర్ సూత్రాన్ని మన రాజకీయాలకూ వర్తింప జేయాలి. తెలంగాణలో కొత్త రాజకీయాలకు బాటలు వేయాలి. గుణాత్మకమైన మార్పులకు పునాదులు వేయాలి. ముతక రాజకీయ శక్తులను పక్కనబెట్టి నవయువ పురోగామి రాజకీయ శక్తులను ప్రోత్సహించాలి. టీఆరెస్, కాంగ్రెస్, బిజెపి అన్ని పార్టీలూ ఆ దిశగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా టీఆరెస్‌పై ఎక్కువ బారమూ, బాధ్యత ఉన్నాయి. పద్నాలుగేళ్లుగా ఉద్యమాన్ని అంటిపెట్టుకుని పోరాడినవాళ్లు, త్యాగాలు చేసినవాళ్లు ఆ పార్టీలో ఉన్నారు. రెండు ప్రాంతాలలో పార్టీ ఉన్నా సిపిఐ నాయకత్వం నిక్కచ్చిగా నిలబడి పోరాడింది. న్యూడెమాక్రసీ నాయకులు అన్ని ఉద్యమాలలో క్రియాశీలకపాత్ర పోషించారు. ఉద్యమాలలో ముందుండి పోరాడి, జీతభత్యాలను కోల్పోయిన వివిధ సంఘాల, జేయేసీల నాయకులూ ఉన్నారు. అన్ని కుల సంఘాలు, సామాజిక వర్గాలు ఉద్యమానికి అనేక సందర్భాల్లో అండదండగా నిలబడ్డాయి. వీరు సహజంగానే రాజకీయాల్లో ప్రాతినిథ్యం ఆశిస్తారు. అది వాంఛనీయం కూడా. పొత్తులు, ఐక్యతలు వీళ్లకు పరిమితం చేస్తే మేలు. ఐక్యతా యత్నాల్లో, అభ్యర్థుల ఎంపికలో అందరి ఆకాంక్షలూ ప్రతిఫలించాలి. అన్ని వర్గాలకూ ఫెయిర్ షేర్ లభించాలి. బయటివాడు వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకుండా ఎన్నికల పోరాటానికి వెళ్లాలి.

కాంగ్రెస్, బిజెపిలదీ ఇదే పరిస్థితి. ఈ సంఘాలు, వర్గాలు ఆ పార్టీల నుంచి కూడా రాజకీయ భవిష్యత్తును ఆశిస్తున్నాయి. బిజెపిలోకి కొత్త రక్తం చాలా వస్తున్నది. పొత్తును కోరడమంటే బిజెపి తన గొయ్యిని తాను తవ్వుకోవడమే. 1998లో 18 శాతం ఓట్లు తెచ్చుకున్న బిజెపి 1999లో చంద్రబాబుతో పొత్తుపెట్టుకుని ఎలా పతనమయిందో ఆ పార్టీకి గుర్తుండి ఉండాలి. టీడీపీ, వైఎస్సార్‌సీపీలు తెలంగాణలో భవిష్యత్తు లేని పార్టీలు. సీమాంధ్ర నాయకత్వంలో నడిచే ఆ పార్టీలను తెలంగాణ ప్రజలు ఇక ఎన్నటికీ ఆదరించరు. తెలంగాణ ఉద్యమస్ఫూర్తికి ఆ పార్టీల మనుగడ వ్యతిరేకం. అక్కడో ఇక్కడో నాయకుల వ్యక్తిగత బలంతో కొంతమంది నెగ్గుకు రావచ్చు, కానీ దీర్ఘకాలికంగా అవి మనలేవు. ఇవన్నీ జరగాలంటే ఎన్నికల పొత్తుల గురించి ఆలోచించడం మానాలి. పొత్తులు ఎవరికీ మేలు చేయవు. పొత్తులతో గతంలో తెలంగాణవాదులకు చాలా నష్టం జరిగింది. టీఆరెస్ పదేపదే మోసపోయింది. ఈ పొత్తులే కొత్త రాజకీయాలు ఆవిర్భవించకుండా, కొత్త శక్తులు ఎదగకుండాఅడ్డుకున్నాయి. పొత్తులు యథాతథస్థితిని కొనసాగిస్తాయి. రాజకీయాల్లోకి కొత్త నీరు రాదు. రెండు పెద్ద పార్టీలు పొత్తులు పెట్టుకున్నా ఒక పార్టీ ఓట్లు మరోపార్టీకి బదిలీ కావు. ఒకవేళ వేద్దామనుకున్నా నాయకులు వేయనివ్వరు. 2009 ఎన్నికల్లో టీడీపీ కావాలని పొత్తు పెట్టుకుని ఒక పద్దతి ప్రకారం టీఆరెస్ అభ్యర్థులను ఓడించడానికి పనిచేసింది. టీఆరెస్ అభ్యర్థులకు ఓట్లు పడకుండా చూడడానికి ఎన్‌టిఆర్ భవన్ నుంచి ప్రత్యేక ప్రయత్నాలు జరిగాయి. కాంగ్రెస్‌లో కూడాఅటువంటి ఘనులు ఉన్నారు. ఆ పార్టీలోనే ప్రతిజిల్లాకు రెండు మూడు గ్రూపులు ఉన్నాయి. ఒకరి కాళ్లు ఒకరు నరుక్కోవడానికి వాళ్లు చాలాకాలంగా కాచుకుని కూర్చున్నారు. అది కాంగ్రెస్ సమస్య. తెలంగాణలో నిలబడాలంటే ఆ పార్టీ కూడాఇటువంటి పరిస్థితి నుంచి బయటపడకతప్పదు. కానీ అది కూడా స్వతంత్రంగా ఎన్నికలకు వెళ్లినప్పుడే సాధ్యం. తెలంగాణ కాంగ్రెస్‌కు ఒక సమర్థ నాయకత్వం ఎదగలేదు. ఎదిగే అవకాశం రాలేదు. అందరూ గుంపులో గోవిందయ్యల్లాగే ఉండిపోయారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎవరో ఒకరు నాయకత్వాన్ని అందిపుచ్చుకోవాలి.

పొత్తుల వల్ల తెలంగాణకు మరో నష్టం కూడా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్-టీఆరెస్ పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చినా కేంద్రంలో ఎన్‌డీఏ వస్తే తెలంగాణ ప్రతిపక్ష రాష్ట్రమయిపోతుంది. తెలంగాణకు ఏదైనా సాధించుకోవడం కష్టమవుతుంది. పొత్తు సోనియాగాంధీ రుణం తీర్చుకోవడంకోసమే అయితే టీఆరెస్ ఎన్నికల తర్వాత కూడా తీర్చుకోవచ్చు. రాహుల్‌గాంధీ అధికారంలోకి రావడానికి టీఆరెస్ మద్దతు అవసరమయితే అప్పుడు తప్పనిసరిగా సమర్థించవచ్చు. కానీ ఇప్పుడు రెండు పెద్ద పార్టీల మధ్య పొత్తులు తెలంగాణకు ఏవిధంగానూ మేలు చేయవు. తెలంగాణలో బహుముఖ పోటీలు జరగనీయండి. పెద్ద పార్టీలు పొత్తులు పెట్టుకుని వారిన్ని, వీరిన్ని సీట్లు తెచ్చుకుని తొలి అసెంబ్లీనే కప్పల తక్కెడగా మార్చకుండా ఉంటే మంచిది. తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా చేయాల్సింది చాలా ఉంది. తెలంగాణ నుంచి సీమాంధ్ర ఆధిపత్య మూలాలను సమూలంగా తొలగించడానికి చాలా సమయం పడుతుంది. ఇవన్నీ జరగాలంటే ఉద్యమస్ఫూర్తిని మరో పదేళ్లయినా పుణికి పుచ్చుకుని పనిచేయాల్సి ఉంటుంది. ప్రజలు ఆశిస్తున్నవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఏదైనా నిర్ణయాత్మకంగా వ్యవహరించాలంటే ఏదో ఒక పార్టీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావాలి. అందుకోసమైనా టీఆరెస్, కాంగ్రెస్, బిజెపిలు వేర్వేరుగానే ప్రజల తీర్పును కోరడం తెలంగాణ భవిష్యత్తుకు మంచిది. తమకు ఎవరు కావాలో ప్రజలను నిర్ణయించుకోనిద్దాం. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణానికి అన్ని పార్టీలూ తమ ఎజెండాలను ప్రకటించాలి. మనకు ఏయే అన్యాయాలు జరిగాయని చెప్పి ఇంతకాలం పోరాడామో, ఆ అన్యాయాలను సరిదిద్దడానికి ఏమి చేస్తారో, ఎప్పటిలోగా చేస్తారో అన్ని పార్టీలూ మేనిఫెస్టోల్లో ప్రకటించాలి. తెలంగాణ ఉద్యమం తెలంగాణ సమాజాన్ని మునుపెన్నడూ లేనంత జాగృతం చేసింది. ప్రజలకు మాట్లాడే స్థైర్యాన్ని, పోట్లాడే ధైర్యాన్ని, ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది. వారి మనసును తెలుసుకుని, అందుకు అనుగుణంగా రాజకీయ వ్యవస్థలను నిర్మించుకోవలసిన బాధ్యత నాయకులదే. తెలంగాణను సమున్నతంగా నిలబెట్టినా, నగుబాటు చేసినా అది నాయకుల మీదనే ఆధారపడి ఉంటుంది.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

One thought on “స్టేటస్‌కోయిస్టు రాజకీయాలొద్దు”

  1. Shekar,  Good write up, sharp and very focused. Let’s remain in touch,   Dr. K. Indrasena Reddy Prof. of English Mo# +91-9849730925

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s