విలీనమా?స్వాధీనమా?


ఢిల్లీ నేతలు మాట్లాడుతున్న ఆధిపత్య భాష ఏమైనా భాగున్నదా? తెలంగాణ రాజకీయాలతో వారు ఆడుతున్న ఆటలు సీమాంధ్ర నాయకులు ఆడిన ఆటలకు భిన్నంగా ఉన్నాయా? ఒకనాడు తెలంగాణకు వ్యతిరేకంగా రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు వేసిన ఎత్తుగడలకు ఇప్పుడు ఎఐసిసి నేతలు వేస్తున్న ఎత్తుగడలకు ఏమైనా తేడా ఉన్నదా? పదమూళ్లుగా అనేక ఆటుపోట్లను, కష్టనష్టాలను తట్టుకుని రాజకీయంగా నిలదొక్కుకున్న ఒక రాజకీయ శక్తిని కేవలం ఫిరాయింపులు ప్రోత్సహించి, ఒత్తిడి పెంచి లొంగదీసుకోవడం సాధ్యమేనా? అది సాధ్యమైతే తెలంగాణ ఎందుకు?

trs

తెలంగాణ సాధించాము, సరే. అది ఎలా ఉండాలి? ఏమి చెయ్యాలి? ఎవరు చెయ్యాలి? చాలా మందిని ఈ ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణ వచ్చిన ఆనందం టీఆరెస్, కాంగ్రెస్ విలీనం ఊహాగానాలతో ఆవిరయింది. ‘తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం? రాష్ట్రాన్ని వానపాముల చేతిలో పెట్టడానికా? సోనియాగాంధీకి రుణపడి ఉండాలి సరే…తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఎందుకు రుణపడి ఉండాలి? తెలంగాణ కాంగ్రెస్ నాయకులు టీఆరెస్‌తో దీటుగా నిలబడి కొట్లాడి ఉంటే మరో ఐదారేళ్లు ముందుగా తెలంగాణ వచ్చి ఉండేది. ఇంతమంది పిల్లలు చనిపోయి ఉండేవారు కాదు’-ఇది ఒక తెలంగాణవాది ఆక్రోశం. నిజమే తెలంగాణ దేనికోసం? ఆత్మగౌరవంకోసం, స్వయంపాలనాధికారంకోసం. సీమాంధ్ర ఆధిపత్య శక్తుల నుంచి విముక్తికోసం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వీటన్నింటినీ పునరుద్ధరించుకునే అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని మళ్లీ ఢిల్లీకి తాకట్టు పెట్టాలా? ఢిల్లీ నేతలు మాట్లాడుతున్న ఆధిపత్య భాష ఏమైనా భాగున్నదా? తెలంగాణ రాజకీయాలతో వారు ఆడుతున్న ఆటలు సీమాంధ్ర నాయకులు ఆడిన ఆటలకు భిన్నంగా ఉన్నాయా? ఒకనాడు తెలంగాణకు వ్యతిరేకంగా రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు వేసిన ఎత్తుగడలకు ఇప్పుడు ఎఐసిసి నేతలు వేస్తున్న ఎత్తుగడలకు ఏమైనా తేడా ఉన్నదా? పదమూళ్లుగా అనేక ఆటుపోట్లను, కష్టనష్టాలను తట్టుకుని రాజకీయంగా నిలదొక్కుకున్న ఒక రాజకీయ శక్తిని కేవలం ఫిరాయింపులు ప్రోత్సహించి, ఒత్తిడి పెంచి లొంగదీసుకోవడం సాధ్యమేనా? అది సాధ్యమైతే తెలంగాణ ఎందుకు? సాధించుకుని ఏమి ప్రయోజనం? సోనియాగాంధీ తల్చుకోకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయ్యేది కాదన్నది వాస్తవం. ఆమెకు తెలంగాణ రుణపడి ఉండాలన్నది న్యాయమే. అందుకు ఆమె విగ్రహాలు పెట్టుకుందాం. ఆమెకు ఆపద వచ్చినప్పుడు అండగా ఉందాం. ఆమె కుమారుడు తెలంగాణ నుంచి పోటీ చేస్తే గెలిపించుకుందాం. కానీ రాజకీయ స్వాతంత్య్రాన్ని స్వాధీనపర్చడం తెలివైన పనికాదు.

టీఆరెస్, కాంగ్రెస్ విలీనంవల్ల తెలంగాణకు రెండు రకాల ప్రమాదాలున్నాయి. కాంగ్రెస్‌లో విలీనమైతే తెలంగాణ ప్రజలు ఇన్నేళ్లు ఏ స్వయంపాలనాధికారంకోసం పోరాడారో అది తెలంగాణకు దక్కదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో కొద్ది మంది ఎంపీలకు తప్ప చాలా మందికి తెలంగాణవాదానికి సంబంధించిన మూలాల గురించి అవగాహన ఎంతమాత్రం లేదు. వారంతా రాజకీయావసరాలకోసం తెలంగాణవాదం ఎత్తుకున్నవారే తప్ప, తెలంగాణవాదాన్ని నమ్మి, ఆకళింపు చేసుకుని జైకొట్టినవారు కాదు. వారిది పెట్టు తెలంగాణవాదమే తప్ప పుట్టు తెలంగాణవాదం కాదు. తెలంగాణవాదులు ఆశించిన లక్ష్యాలను అమలు చేయడానికి వారిలో ఏ ఒక్కరికీ నిబద్ధత లేదు. ఒకవేళ టీఆరెస్ కాంగ్రెస్‌లో కలిస్తే నిజమైన తెలంగాణవాదులకు అక్కడ పెత్తనం దక్కుతుందన్న నమ్మకం లేదు. అదొక మహాసముద్రం. వీళ్లూ అక్కడ గుంపులో గోవిందయ్యలు అయిపోతారు. తెలంగాణ ఎజెండా పలుచనయిపోతుంది. పైగా ఢిల్లీ పెద్దలు ఆడించినట్టల్లా ఆడాల్సి ఉంటుంది. వనరుల పంపిణీ, నదీ జలాల వంటి వివాదాలు తలెత్తినప్పుడు అధిష్ఠానం చెప్పినట్టల్లా ఆడవలసి వస్తుంది. సీమాంధ్ర ఆధిపత్య శక్తుల ప్రభావాన్ని తెలంగాణ నుంచి కడిగేయడం సాధ్యం కాదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో చాలామంది సీమాంధ్ర ఆధిపత్య శక్తులతో కలసి దందాలు చేసినవారే. వారి చెప్పుచేతల్లో, వారి అదుపాజ్ఞల్లో, వారి పోషణలో బతికినవారే. వారిని కాదని కాంగ్రెస్‌లో కొత్తగా చేరిన తెలంగాణవాదులు ఏమీ చేయలేరు. మొత్తంగా తెలంగాణలో మౌలికంగా ఎటువంటి మార్పులు సంభవించవు.

ఇక రెండవ ప్రమాదం. ఇది పెద్ద ప్రమాదం కూడా. టీఆరెస్ కాంగ్రెస్‌లో విలీనమైతే తెలంగాణలో రాజకీయ శూన్యత ఏర్పడుతుంది. ఆ రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి టీడీపీ, వైఎస్సార్సీపీ ఎప్పటిలాగే శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాయి. ఇప్పటికీ ఆ పార్టీల సీమాంధ్ర నాయకత్వం చుట్టూ తోకలు ఊపుతూ తిరిగే బానిస రాజకీయ సంతతి తెలంగాణలో ఉంది. విభజన నోటిఫికేషన్ ఆపాలని యనమల రామకృష్ణుడు కోరుతున్న సమయానికే తెలంగాణ తెచ్చిన ఘనత తమ చంద్రబాబుదేనని ఎర్రబెల్లి దయాకర్‌రావు అక్కడ వరంగల్‌లో ప్రకటిస్తుంటాడు. ఇంకా ప్రమాదం ఏమంటే, తెలుగుదేశాన్ని గెలిపిస్తే తిరిగి తెలుగు ప్రజలను ఏకం చేస్తామని గాలి ముద్దుకృష్ణమ, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ప్రకటిస్తారు. చంద్రబాబునాయుడు తెలుగుజాతి పేటెంట్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా తనను 30 స్థానాల్లో గెలిపిస్తే తెలుగు ప్రజలను ఏకం చేస్తానని చెబుతారు. తాము సమైక్యవాదులమేనని టీడీపీ, వైఎస్సార్‌కాంగ్రెస్ అగ్రనాయకులు ఇప్పటికీ చెబుతున్నారు. రేపెప్పుడయినా తెలంగాణలో, ఆంధ్రలో ఈ రెండు పార్టీలకు మెజారిటీ స్థానాలు వస్తే తెలుగుజాతి ఏకీకరణ ఉద్యమం మొదలుపెడితే తెలంగాణ ఏం కావాలి? పోరాడి సాధించుకున్న స్వయంపాలనాధికారం ఏంకావాలి? తెలంగాణలో ఈ రెండు పార్టీల ఉనికిని ప్రశ్నించకుండా తెలంగాణ రాజకీయాల్లో మౌలిక మార్పులు రావు. జార్కండ్‌లో లాలూప్రసాద్‌యాదవ్, నితీష్‌కుమార్‌లకు ఎదురయిన అనుభవం ఇక్కడ చంద్రబాబు, జగన్‌లకు ఎదురుకావాలి. చంద్రబాబు, జగన్‌రెడ్డిల సైగలకు నాట్యాలు చేసే నాయకులు ఇంకా తెలంగాణకు అవసరమా? ఆ పార్టీల డీఎన్‌ఏను నిర్మూలించకుండా తెలంగాణ విముక్తి ఎలా అవుతుంది? తెలంగాణవాదులు ఆలోచించుకోవాలి. టీఆరెస్ కాంగ్రెస్‌లో విలీనమైతే తెలంగాణవాదులు ఆలోచించడానికి ఇంకా ఏమీ మిగలదు. చంద్రబాబు, జగన్‌ల నెత్తిన పాలుపోసినవారవుతారు. అటువంటి పరిణామం తెలంగాణకు ఎంతమాత్రం మంచిది కాదు.

తెలంగాణ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పులు రావాలంటే అందుకు కేసీఆరే నడుం కట్టాలి. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్ద పీట వేసే పార్టీగా టీఆరెస్ బలపడాలి. ‘దొరల’ రాజ్యం వస్తుందని, ‘భూస్వాముల పాలన’ వస్తుందని ప్రత్యర్థులు, కిరాయి మూకలు చేస్తున్న దాడిని తిప్పికొట్టాలి. సామాజిక తెలంగాణ సాధనకు కృషి చేయాలి. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినవాళ్లు వచ్చిన తెలంగాణకు నాయకత్వం వహించకపోతే తెలంగాణ ప్రజలు మూన్నాళ్లకే భంగపడవలసి వస్తుంది. తెలంగాణ సమస్య రాష్ట్రం ఏర్పాటుతో పూర్తి కాదు. చేయవలసిందంతా రాష్ట్రం వచ్చిన తర్వాతనే. మన అస్తిత్వాన్ని మనం ప్రకటించుకోవాలి. మన చరిత్ర మనం రాసుకోవాలి. మన సాంస్కృతిక మూలాలను తిరిగి ప్రతిష్టించుకోవాలి. మనపై రుద్దిన ఆధిపత్య సాంస్కృతిక మూలాలను కడిగెయ్యాలి. మన నీళ్లు, నిధులు, వనరులు, ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకు దక్కేందుకు కంకణం కట్టుకుని పనిచేయకపోతే తెలంగాణ ప్రజలు త్వరలోనే ప్రత్యేక రాష్ట్రంపై భ్రమలుకోల్పోయే ప్రమాదం ఉంది.

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily

2 thoughts on “విలీనమా?స్వాధీనమా?”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s