కేసీఆర్ బలం ఏమిటి?


కేసీఆర్ బలం ఏమిటి? టీఆరెస్ పార్టీనా? టీజేయేసీనా?
కాంగ్రెస్ పార్టీనా? బీజేపీనా? కేంద్ర ప్రభుత్వమా? ఇవేవీ కాదు.

ఇచ్చినవారికి, మద్దతిచ్చినవారికి, తెచ్చినవారికి ధన్యవాదాలు. కానీ ఇవ్వడానికి, మద్దతివ్వడానికి, తేవడానికి ఏమిటి ప్రేరణ? ఏది మూలం? ప్రజల సమస్యను, ప్రజల భాషలో ప్రజలకు చెప్పి, ప్రజలను ఒప్పించగలగడం.
తెలంగాణ ప్రజలందరి చేత జై తెలంగాణ అనిపించగలగడం. ఓటును ఒక అస్త్రంగా మలిచి దేశంలోని పార్టీలన్నింటినీ తెలంగాణ ఓటు చుట్టు తిప్పగలగడం.
ప్రజలంతా జై తెలంగాణ అంటున్నారు కాబట్టి పార్టీలూ అనవలసి వచ్చింది. పార్టీలూ అన్నాయి కాబట్టి ప్రభుత్వాలు దిగివచ్చాయి.
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, అనేక మలుపుల మధ్య, ఉత్కంఠ, ఉద్రిక్త పరిణామాల మధ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
తెలంగాణ సాధనకు కేసీఆర్ ఒక కొత్త మార్గాన్ని కనిపెట్టారు. శత్రువు చేతికి చిక్కకుండా ఉద్యమ లక్ష్యాన్ని చేరే మార్గాన్ని ఆయన ఆచరణలో పెట్టి చూపారు.
అది గాంధీ చూపిన మార్గం, ప్రజాస్వామిక మార్గం. ఆత్మత్యాగాలే తప్ప రక్తపుటేరులు పారించని మార్గం.

kcr--621x414

గత ఏడు మాసాలుగా తెలంగాణ పడిన పురిటినొప్పులు చూసినవారికి ఆయన కృషి ఎంతగొప్పదో తెలుస్తుంది. ఆయన ఎంత బలవంతులతో పోరాడారో అర్థమవుతోంది. ఆయన ఎంతమందిని కూడగట్టారో కనిపిస్తోంది. ఎంతమందికి శత్రువయ్యారో తెలిసిపోతుంది. సీమాంధ్ర నేతలు, సీమాంధ్ర పార్టీల మేడిపండు స్వభావాన్ని ఆయన బట్టబయలు చేశారు. పత్రికలు, ప్రసారసాధనాలతో సాయుధులైన సీమాంధ్ర రాజకీయ నాయకత్వం గత దశాబ్దంలో అత్యంత ద్వేషించిన నాయకుడు కేసీఆర్. ఆయనపై జరిగినంత దాడి, ఆయనకు వ్యతిరేకంగా జరిగినన్ని కుట్రలు, ఆయనపై కురిపించినన్ని అసత్యాలు మరే నాయకుడిపైనా జరుగలేదు. ఒక దశాబ్దకాలపు రాజకీయ తుపానుకు ఆయనే కేంద్రబిందువు అయ్యారు.

మహానగరం చుట్టూ వందలాది ఎకరాల్లో రిసార్టులు, ఎస్టేట్‌లు, క్లబ్బులు, పారిశ్రామిక సామ్రాజ్యాలు నిర్మించుకున్న సీమాంధ్ర ఎస్టాబ్లిష్‌మెంట్ కేసీఆర్ ఒక్క వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకుంటే రెండేళ్లుగా కంటికి కడివెడుగా ఏడుస్తూ వచ్చింది. అదేదో నేరం చేసినట్టు ప్రచారం చేస్తూ వచ్చింది. పాలుపోసి పెంచుకున్న విషనాగులను ఆయనపైకి ఉసిగొల్పుతూ వచ్చింది. ఇదంతా కేసీఆర్‌పై దాడి కాదు. తెలంగాణవాదంపై దాడి.

ఆయనతో రాజకీయంగా విభేదించేవారుండవచ్చు. ఆయన వ్యవహారశైలి నచ్చనివారుండవచ్చు. కానీ ఆయన సాధించిన విజయంతో ఎవరూ విభేదించరు.

ఆయన అనేవాడు అలా దృఢంగా, చెదరక, బెదరక, నిలబడి, కొట్లాడి ఉండకపోతే తెలంగాణ సాధన సాధ్యమయ్యేది కాదు. ఆయన మరే పార్టీలో ఉన్నా ఈ పని చేయగలిగేవారు కాదు. కాంగ్రెస్, టీడీపీలలోని తెలంగాణ నేతలు పరాన్న జీవులు. స్వయంప్రకాశక శక్తిలేని నేతలు. తెగించి ఏ పనీ చేయలేని అశక్తులు. టికెట్లకోసం, నిధులకోసం సీమాంధ్ర ఆధిపత్య శక్తుల ఊడిగానికి అలవాటుపడిన అసహాయులు. బరిగీసి కొట్లాడడం తెలియని వానపాములు. కేసీఆర్ చేసిన పనే తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకులు చేసి ఉంటే తెలంగాణ రెండేండ్ల ముందుగానే వచ్చి ఉండేది. ఇంత మంది తెలంగాణ యువకులు బలిదానం జరిగి ఉండేది కాదు.

కాంగ్రెస్, టీడీపీల్లోని తెలంగాణ నేతల్లో ఏ కొద్ది మందికో తప్ప వాళ్లలో చాలా మందికి తెలంగాణ సమస్య తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. వారికి తెలంగాణ ఆత్మ లేదు. తెలంగాణ గురించిన విజన్ లేదు. ఎవరో రాసిస్తే ప్రసంగాలు చదవడం తప్ప, తెలంగాణ సమస్యను అర్థం చేసుకుని, ఆకళింపుచేసుకుని, గుండెల్లోంచి మాట్లాడే దమ్మున్న నాయకుడు ఒక్కడంటే ఒక్కడు ఆ పార్టీల్లో లేకపోయారు. వారెవరూ చేయని పని కేసీఆర్ చేశారు. ఈ పుష్కరకాలమంతా రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే ప్రధాన ఎజెండాగా నిలబెట్టారు.

తెలంగాణ జెండనెత్తికెత్తుకున్నప్పుడు ఆయనను గేలిచేసినవాళ్లున్నారు. ఆయన వల్ల ఏమవుతుందని తేలికగా తీసుకున్నవారున్నారు. ఇది బతికి బట్టకట్టదన్నారు. మున్నాళ్ల ముచ్చటేనని ప్రకటించారు. కానీ ఆయన మూలాల నుంచి మొదలు పెట్టారు. తెలంగాణ జీవనాడుల్లో అప్పటికే ప్రవహిస్తూ ఉన్న అసంతృప్తినీ, అసమ్మతినీ వెలికి తీసి భూమార్గం పట్టించారు. అంతకుముందు తెలంగాణ నినాదాలు చేసి సీమాంధ్ర ఎస్టాబ్లిష్‌మెంట్ చేతిలో చావుదెబ్బలుతిన్న ప్రగతిశీల శక్తులన్నింటినీ పోగేశారు. రాజకీయ, భావజాల ఉద్యమాలను కలబోసి, కలనేసి జనం మధ్యకు వెళ్లారు. అక్కడి నుంచి పంచాయతీలకు, అసెంబ్లీలకు, పార్లమెంటుకు, జాతీయ రాజకీయాల్లోకి తెలంగాణ నినాదాన్ని ఒక వాదంగా తీసుకెళ్లారు. ఎన్ని గడపలు ఎక్కారో, ఎన్ని గడపలు దిగారో, ఎందరు నేతలను ఒప్పించారో తెలంగాణకు మద్దతుగా ఆయన సేకరించిన లేఖలు చూస్తే అర్థం అవుతుంది. రాజకీయ ఏకాభిప్రాయ సాధనకోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. తొలుత కాంగ్రెస్‌ను, తరువాత తెలుగుదేశం పార్టీని, ఆ వరుసలో బిజెపి, సిపిఐలను తెలంగాణ ముగ్గులోకి తీసుకువచ్చి నిలిపారు. తెలంగాణ రాష్ట్ర నినాదానికి మద్దతు ప్రకటించకుండా తెలంగాణలో ఓట్లు అడుగలేని స్థితిని సృష్టించారు.

సీమాంధ్ర ఎస్టాబ్లిష్‌మెంట్ చేతికి చిక్కకుండా ఉద్యమాన్ని కాపాడుతూ వచ్చారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడినప్పుడల్లా కేసీఆర్ విమర్శలు ఎదుర్కొన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చుతున్నారని, రాజీపడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. దొంగలే దొంగా దొంగా అని నిందించారు. అయినా కేసీఆర్ చెలించలేదు. ఉద్యమం హింసాత్మక రూపం తీసుకుంటే సీమాంధ్ర ఎస్టాబ్లిష్‌మెంట్ ఏమి చేయగలదో కేసీఆర్‌కు బాగా తెలుసు. నక్సలైటు ఉద్యమాలను అణచివేసిన తీరు ఆయనకు బాగా గుర్తు. సీమాంధ్ర ఎస్టాబ్లిష్‌మెంట్ పోలీసు వ్యవస్థను ఎంత దుర్మార్గంగా, ఎంత కఠోరంగా ఉపయోగించుకుంటుందో ఆయనకు అనుభవమే. తెలంగాణ జనసభ ఆరంభించిన తెలంగాణ ఉద్యమంపై ఎంత పాశవిక దాడి జరగిందో అప్పటికే అందరికీ తెలుసు. విద్యుత్ ఉద్యమంపై చంద్రబాబు జరిపించిన కాల్పులు ఆయనకు అనేక గుణపాఠాలు నేర్పాయి. అందుకే ఎన్నికల మార్గాన్ని ఎంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర డిమాండును ఎన్నికలకు ముడేసి ఒక్కొక్క పార్టీనీ ఆ గడిలోకి తీసుకొచ్చి నిలిపారు. ఎన్నికలతో తెలంగాణ రాదని చాటిచెప్పడానికి సీమాంధ్ర ఎస్టాబ్లిష్‌మెంట్ చేయని ప్రయత్నం లేదు. ఎమ్మెల్యేలను కొనుగోలుచేసింది. పార్టీని చీల్చేందుకు కుట్రలు చేసింది. డబ్బు సంచులతో ఎన్నికలను ప్రభావితం చేయాలని చూసింది. ఎన్ని ఆటుపోట్లు ఎదురయినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఆయన మళ్లీ మళ్లీ ఎన్నికల చుట్టే తెలంగాణను తిప్పారు. ఇది రాజకీయ ప్రయోజనం ఆశించి చేసింది కాదు, తెలంగాణ సాధనను ఆశించి, ఆ సాధనకు ఇదొక విధానంగా భావించి ఆయన అమలు చేశారు. ఆయన తాను గీసుకున్న గీత నుంచి పక్కకు జరుగకుండా ఢిల్లీతో పోరాడుతూ వచ్చారు.

మన మిత్రులు, మన శత్రువులు ఏమనుకుంటున్నారో గమనిస్తే మనమేమిటో తెలుస్తుంది. కేసీఆర్ సాధించిందేమిటో, కేసీఆర్ విశిష్టత ఏమిటో తెలుసుకోవాలంటే ఆయన మిత్రులేమనుకున్నారో, ఆయన శత్రువులేమి చేశారో చూస్తే మనకు అర్థమవుతుంది. అనేక మంది తెలంగాణ నాయకులు, మేధావులు ఆవేశపడిన సందర్భాలున్నాయి. ఆయన మధ్యలో కాడిపారేశారని తిట్టినపోసిన సందర్భాలు ఉన్నాయి. మరో చెన్నారెడ్డి అవుతారని ఆడిపోసుకున్న వారున్నారు. సీమాంధ్ర దొరల తోకలుగా మారిన తెలంగాణ మేధావులు కొందరు ఆయననొక దొరగా చిత్రీకరించి, తెలంగాణ నుంచి ఆయనను దూరం చేయడానికి ప్రయత్నించిన సందర్భాలున్నాయి. ఆయన పోలవరం ప్రాజెక్టుకు సకల జనుల సమ్మెను తాకట్టు పెట్టారని, రాజీపడుతున్నారని అబద్ధాలను కుండపోతగా కుమ్మరించినవారూ ఉన్నారు. తాడోపేడో తేల్చుకోవడానికి ఆయన ప్రయత్నించడం లేదని, వీలైనన్ని రోజులు సాగదీసి ఆయన రాజకీయంగా మనుగడ సాగించాలనుకుంటున్నారని విమర్శించినవారూ ఉన్నారు. ఉద్యమం ఉధృతంగా జరుగుతుంటే ఆయన వెనుకకు లాగుతున్నారని ఆగ్రహించినవారూ ఉన్నారు.

ఇంకోవైపు కేసీఆర్ వల్లనే ఈ సమస్య ఇంత దూరం వచ్చిందని సీమాంధ్ర ఆధిపత్య శక్తులు విమర్శిస్తూవచ్చాయి. ఆయనను ఫినిష్ చేస్తే ఉద్యమం అదే చల్లారిపోతుందని భావించారు. ఆయన ప్రతిష్ఠను, ఆయన పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కుట్రలు చేస్తూ వచ్చారు. ఎమ్మెల్యేలను కొన్నారు. వాళ్లచేతే తిట్టించారు. ఉద్యమం లేదని చెప్పడానికి 2007 ఉప ఎన్నికల్లో టీఆరెస్‌ను చావుదెబ్బతీశారు. ఆ క్షణంలో కేసీఆర్ నిజంగా చెదరిపోయారు. మానసికంగా కృంగిపోయారు. కన్నీరు పెట్టుకున్నారు. తానిక ముందుకు సాగలేనని భావించారు. కానీ మళ్లీ ఉద్యమ శక్తులు అందించిన నైతిక బలం, పార్టీ అందించిన రాజకీయ బలంతో ఆయన తిరిగి ఉద్యమబాట పట్టారు. 2009 ఎన్నికల్లో మరోసారి ఎదురుదెబ్బ. ఈ సారి మిత్రపక్షంగా వచ్చి శత్రుపక్షంగా వ్యవహరించిన టీడీపీ నుంచి వెన్నుపోటు. అయినా ఆయన వెరవలేదు. ఎన్నికల తర్వాత నాలుగు మాసాలకే రాజశేఖర్‌రెడ్డి చనిపోయారు. కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్నారు. అక్కడి నుంచి ఇక ఉద్యమం వెనుదిరిగి చూడలేదు. రాజశేఖర్‌రెడ్డి బతికి ఉంటే కేసీఆర్ దీక్ష చేయగలిగేవారా? తెలంగాణ సాకారమయ్యేదా? అని కొంతమంది ప్రశ్నిస్తుంటారు. రాజశేఖర్‌రెడ్డి హటాత్తుగా చనిపోయి జనంలో ఆయన బతికిపోయారు. ఆయన బతికి ఉంటే తెలంగాణపాలిట రావణాసురుడుగా అపఖ్యాతి మూటగట్టుకునేవారు. మనిషి బతికి ఉన్నా రాజకీయంగా మరణించేవారు. కేసీఆర్ ఉద్యమ దీక్షకు మరింత ప్రాధాన్యత లభించి ఉండేది. నాయకుడుగా కేసీఆర్ మరింత బలమైనవాడుగా ఎదిగేవారు. అయినా అంగబలం, అర్థబలం, అధికారబలం అన్నీ ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఏం చేయగలిగారు? నన్ను మించిన నాయకుడు లేడని విర్రవీగే చంద్రబాబునాయుడు తెలంగాణ నేతలకు రోస్టర్ వేసి మరీ తిట్టించారు. పచ్చి అబద్ధాలు, కారుకూతలు, జుగుప్సాకరమైన ఆరోపణలు చేయిస్తూ వచ్చారు. కానీ ఏం జరిగింది? టీడీపీ నేతలతో సహా తెలంగాణ వ్యతిరేకులు నిందించే కొద్దీ కేసీఆర్ అంతకంతకు ఎదుగుతూ వచ్చారు. కేసీఆర్ సీమాంధ్ర నాయకుల వాదనల్లోని డొల్లతనాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చారు. వారికి ఇంకేమాత్రం సహేతుకమైన వాదనలు లేకుండా చేశారు. తెలంగాణ చదరంగంలో ఆడలేక, ఆడరాక సీమాంధ్ర నాయకులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పూటకో మాటమార్చి వారు తమనుతాము కోల్పోయారు. విశ్వసనీయత లేని నాయకులుగా మిగిలిపోయారు. కాంగ్రెస్, బిజెపిలకు తెలంగాణ డిమాండును అంగీకరించక తప్పని పరిస్థితిని కేసీఆర్ తెలంగాణలో సృష్టించగలిగారు. అది ఆయన విజయం. తెలంగాణ ప్రజల విజయం.

జయశంకర్‌సార్ భావజాల శక్తి
index
123068
కేసీఆర్ తెలంగాణ రాజకీయ శక్తి అయితే, జయశంకర్ సార్ తెలంగాణవాదానికి సిద్ధాంత శక్తి. భావజాల వ్యాప్తికి ఆద్యుడు. కేసీఆర్‌కు నైతిక బలంగా వెన్నంటి ఉన్నవారు. కోదండరామ్ ఉద్యమ శక్తుల ఛోదక శక్తి. తెలంగాణ జ్వాలను ఆరిపోకుండా చేతులు అడ్డంపెట్టి కాపాడుతూ వచ్చినవారు. మిలియన్ మార్చ్, సాగరహారం తెలంగాణ ఉద్యమపథంలో గొప్ప మైలు రాళ్లు. గద్దర్ ఒక సాంస్కృతిక యుద్ధ నౌక. గజ్జెకట్టి, పాటపాడి తెలంగాణ భావజాల వ్యాప్తిలో ముందు పీఠిన నిలబడినవాడు. గొరేటి వెంకన్న, అంద్శై, దేశపతి శ్రీనివాస్,రసమయి బాలకిషన్, విమలక్క తెలంగాణ ఆర్తిని అక్షరాల్లోకి, స్వరాల్లోకి, తెలంగాణ జనావళి నరాల్లోకి ప్రవహింపజేసిన సాంస్కృతిక సేనానులు. ఈ దశాబ్దంలో తెలంగాణ మాత్రమే ఆడింది, పాడింది, కలాలకు పదనుపెట్టి అక్షరగోళాలు విసిరింది. సాహితీ సృజన తెలంగాణ రక్తంలోనే ఉంది, అయినా ఇంత సాహిత్యం మునుపెన్నడూ రాలేదు. ఇంతమంది కళాకారులు మునుపెన్నడూ వేదికలెక్కి పాడలేదు, ఆడలేదు. పేర్లు రాయవలసి వస్తే ఈ పేజీలు చాలవు.
index3

భావజాల యుద్ధంలో ‘నమస్తే తెలంగాణ’ నిర్వర్తించిన పాత్ర అసాధారణమైనది. సీమాంధ్ర మీడియా అసత్యాలు, అర్ధ సత్యాలు, వక్రీకరణలు గుప్పించి తెలంగాణ ప్రజాబాహుళ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో ‘నమస్తే తెలంగాణ’ నేనున్నానంటూ వచ్చింది.

ఇది నడవదని, నాలుగురోజుల్లో మూతపడుతుందని ఎగతాళి చేసిన సీమాంధ్ర పెద్ద మనుషులు ఉన్నారు. పత్రికను నడపడం తమకు మాత్రమే తెలిసిన విద్య అని విర్రవీగినవారున్నారు. నిజమే పత్రిక నడపడం అంటే కోట్లు కుమ్మరించి రూపాయలు ఏరుకోవడం. తెలంగాణలో అలా చేయగలిగినవారెవరూ లేరని సీమాంధ్ర యాజమాన్యాల ధీమా. అవును. సీఎల్ రాజంగారు పత్రిక భారాన్ని తన భుజస్కంధాలపై వేసుకోకపోతే తెలంగాణ తన గొంతును ఎప్పుడో కోల్పోయి ఉండేది. ఆయన స్వయంగా తెలంగాణ వాది. 1969లో జైలుకెళ్లినవారు. తెలంగాణ రావాలని పంతం ఉన్నవారు. అందుకే ఆయన పట్టుదలగా ఈ పత్రికను మీదేసుకుని నడిపించారు. తెలంగాణ గొంతుకగా, ఆత్మగౌరవ ప్రతీకగా ‘నమస్తే తెలంగాణ’ సీమాంధ్ర మీడియా దాడులను ఎప్పటికప్పుడు పూర్వపక్షం చేస్తూ వచ్చింది. ఉద్యమ శక్తులకు చారిత్రక సత్యాలను, సమాచారాన్ని, వాదాలను అందిస్తూ వచ్చింది. ‘బాబూ. నాకు డెబ్బయ్యేళ్లు. ఉద్యమాలు చెయ్యలేను. శ్రీశైలం కుడి ఎడమ రెండూ ఆంధ్రవే అన్న వార్తను చూసినప్పటి నుంచి నా మనసు కుతకుత ఉడికిపోతోంది. ఇవ్వాళ పొద్దున మన పత్రిక చూసిన తర్వాత మనసు కుదుటపడ్డది. మన పత్రిక లేకపోతే మేమేమై పోయేవాళ్లమో’ అని ఒక పెద్దమనిషి చెప్పిన మాట ‘నమస్తే తెలంగాణ’ జన్మను సార్థకం చేసింది. సీమాంధ్ర మీడియా నిరాశ నిస్పృహలను, అపజయ భావనను తెలంగాణపై రుద్దేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ ఆశల పతాకాన్ని భుజానవేసుకుని, నమ్మకమనే కాగడాను ముందుపెట్టుకుని తెలంగాణ ప్రజలతో కలిసి నడిచింది ‘నమస్తే తెలంగాణ’.

ఉద్యోగుల త్యాగాలు
Telangana-Millenium-March-Photo-Gallery-19
కేసీఆర్ రాజకీయ శక్తిగా ఎదగడానికి సమరశీల ఉద్యమాలు నిర్మించి నైతిక బలాన్ని అందించిన శక్తులు విద్యావంతులు, విద్యార్థులు, ఉద్యోగులు, అధ్యాపకులు, న్యాయవాదులు, వైద్యులు, ఇంజనీర్లు, జర్నలిస్టులు. మల్లేపల్లి లక్ష్మయ్య, స్వామిగౌడ్, దేవీప్రసాద్, విఠల్, శ్రీనివాసగౌడ్, పిడమర్తి రవి, సుమన్, కిశోర్….. అందరూ తమతమ శ్రేణులను ఉద్యమరంగంలో ముందుండి నడిపించిన యోధులే. ఉద్యమం చల్లబడిపోయిందనుకున్న ప్రతిసందర్బంలోనూ ఉప్పెనలా ఎగసి తెలంగాణ సత్తాను చాటిన శక్తులు వీరే. ఉద్యోగులు, అధ్యాపకులు చేసిన సకల జనుల సమ్మె చరిత్రాత్మకమైనది. ఉస్మానియా, కాకతీయ కేంద్రాలుగా విద్యార్థులు జరిపిన ఉద్యమాలు సీమాంధ్ర ఎస్టాబ్లిష్‌మెంట్‌ను నిద్రకు దూరం చేశాయి.

అమరవీరులకు జోహార్లు

srikanth-chary
శ్రీకాంతాచారితో మొదలైన బలిదానాలు నిన్నమొన్నటివరకు కొనసాగుతూనే ఉన్నాయి. సుమారు 1200 మంది తెలంగాణ యువతీయువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మంటల్లో తగులబడిపోయినవాళ్లు, రైళ్లకు ఎదురేగి నిరసనతెలిపినవాళ్లు, పార్లమెంటుకు కూతవేటు దూరంలో ఉరేసుకున్న యాదిరెడ్డి, ఉస్మానియాలో సజీవదహనమైన ఇషాన్‌రెడ్డి, విషం సేవించి మరణించినవాళ్లు….ఎన్ని విషాదాలు, ఎంత గుండెకోత…నిజానికి అవి ఆత్మహత్యలు కాదు. ధిక్కారస్వరాలు. వారి మరణవాంగ్మూలాలు నిరసన నినాదాలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వారికి నిజమైన నివాళి.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

11 thoughts on “కేసీఆర్ బలం ఏమిటి?”

  1. TELANGANA jatipita SRI Kalvakuntla ChandraShekar rao. Eee bhoomi vunnnata kaalam eee jati maruvadu athadi tyaganirathini,poratapatimani.He is the IRON MAN OF TELANGANA. JAI TELANGANA.

  2. కె.సి.ఆర్ టి.ఆర్.ఎస్ ను ఇచ్చినమాట ప్రకారం నిజాయితితొ కాంగ్రెస్ లొ విలినం చేసిన ఏ గొంతుకలైతె తమ ప్రయోజనాల కోసం కె.సి.ఆర్ చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ లో విలీనం కావాలె అని టి.వి డబ్బల ముందు వాగుతున్నయొ అవె గొంతుకలు రేపు కె.సి.ఆర్ తన స్వలాభం కోసం తన కుటుంబానికి ప్యాకేజి మాట్లాడుకొని తనను నమ్ముకున్న పార్టి కార్య కర్తలను నట్టేట్లొ ముంచి టి.ఆర్.ఎస్ ను కాగ్రెస్ లొ విలీనం చేసిండ్రు అనె పేరు ప్రచారం లోకి తెసతరు తప్ప విలీనం వల్ల ఇరు పార్టిలకు తెలంగాణ లొ ఒరిగేది ఏమి ఉండదు విలీనం తప్పని సరి అనుకుంటె పార్టిని రద్దు చేసి టి.ఆర్.ఎస్ కార్యకర్తలకు స్వేచ్చగ నిర్నయం తీసుకునె అవకాషం కల్పించడం ఉత్తమం….

  3. టి.ఆర్.ఎస్ ను కాంగ్రెస్ లొ విలీనం చేసె పరిస్తితె తలెత్తితె టి.ఆర్.ఎస్ ను కె.సి.ఆర్ రద్దు చేయడం ఉత్తమం అది చరిత్రలొ తెలంగాణ సాదించిన సంస్తగ మిగిలిపోతుంది అలాగె టి.ఆర్.ఎస్ కార్య కర్తలకు తమ బవిస్యత్తును తామె నిర్నయించుకునె అవకాషం దొరుకుతుంది తెలంగాణ ప్రత్యేక రాస్ట్రం గ ఎందుకు ఏర్పడాలొ పూర్తి అవగాహన ఉన్న ఈటెల రాజెందరన్న, హరిషన్న,,,,,,,,లాంటి నాయకుల నాయకత్వం కూడ తెలంగాణ కు అవసరం వాల్లను తమ స్వంత నిర్నయానికి వదిలి పెడితెనె మంచిది టి.ఆర్.ఎస్ కాంగ్రెస్ లొ విలీనం వల్ల ఇరు పార్టిలకు ఒరిగేది ఏమి ఉండదు అవకాషం కొసం ఎదురు చూస్తున్న ఆంద్రా పార్టిలకు రాజమార్గాన్ని చూపినిచినట్టె అవుతుంది టి.ఆర్.ఎస్ పార్టి కొనసాగించడమ లేద రద్దు చేయడమ ఏదో ఒకటి నిర్నయించుకోవాలి మెజారిటి తెలంగాణ ప్రజలైతె టి.ఆర్.ను కొనసాగించాలనె కోరుకుంటున్నారు…………జై తెలంగాణ

  4. తెలంగాణా కల సాకారం కేవలం కెసిఆర్ గారు అవలంభించిన వోట్/ఎలక్షన్ రాజకీయాల వలెనే సాధ్యం అయింది. ఒక్కడుగా మొదలయి, శక్తిగా ఎదిగి, శత్రువులను మట్టికరిపించిన ధీశాలి. ఇందులో వ్యూహం ఉంది, వోపిక ఉంది.అకున్తిథమయిన శ్రమ ఉంది.
    ై కెసిఆర్.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s