రాజకీయ కార్పొరేట్ ఉగ్రవాదులు


image

పార్లమెంటులో అల్లరి చేసినవాళ్లంతా ఈ దేశంలో పెద్ద పెద్ద కంపెనీలు నిర్వహిస్తున్న వాళ్లే. రాజగోపాల్, సీఎం రమేశ్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి… వీరికి ఏ విలువల గురించీ, ఏ వ్యవస్థల గురించీ, ఏ అధిష్ఠానాల గురించీ భయం లేదు, భక్తి లేదు. ఉండదు.

పార్లమెంటు ఉభయసభల్లో తాజాగా జరిగిన పరిణామాలను గురించి కొత్తగా చెప్పుకోవలసింది ఏమీ లేదు. వాళ్లు ఎంతకయినా తెగించగల సమర్థులు. దేనినయినా అమ్మగలినవాళ్లు, కొనగలిగినవాళ్లు, మేనేజ్ చేయగలిగినవాళ్లు. ఎటువంటి వ్యవస్థలనయినా ధిక్కరించగల వాళ్లు. పార్లమెంటును, శాసనసభలను, అత్యున్నత న్యాయస్థానాలను సైతం తమ నోట్ల కట్టల బరువుతో తొక్కిపెట్టగలమని భావించేవాళ్లు. ప్రజాస్వామ్యాన్ని తమ కాళ్ల కింద తివాచీగా మార్చుకోగలిగినవాళ్లు. దేవతా వస్త్రాల్లో ఊరేగుతూ తమ పీతాంబరాలు చూడండని దేశాన్ని నమ్మించగలవాళ్లు. గుర్తుందా, ఎంత మంది ఎంపీలను కొంటే ప్రధాని కావచ్చు అని అడిగినవాడొకడు ఇప్పుడు జైళ్లో ఉన్నాడు. అటువంటి వాళ్లే ఇప్పుడు కొందరు పార్లమెంటులో ఉన్నారు. గమనించండి, పార్లమెంటులో అల్లరి చేసినవాళ్లంతా ఈ దేశంలో పెద్ద పెద్ద కంపెనీలు నిర్వహిస్తున్న వాళ్లే. రాజగోపాల్, సీఎం రమేశ్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి… వీరికి ఏ విలువల గురించీ, ఏ వ్యవస్థల గురించీ, ఏ అధిష్ఠానాల గురించీ భయం లేదు, భక్తి లేదు. ఉండదు. పార్లమెంటులో నిన్న జరిగిన సీక్వెన్సు చూడండి. సీమాంధ్ర ఎంపీల అల్లరి మధ్యే లోక్‌సభలో బిల్లును ప్రవేశపెడుతున్నట్టు హోం మంత్రి షిండే ప్రకటించారు. ఆ తర్వాత గొడవ మరింత తీవ్రమయింది. సభను వాయిదా వేశారు. ఈ పరిణామాలకోసమే కాచుకున్నవారిలా బిజెపి అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీ, ‘ఇటువంటి గందరగోళ వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం మరే బిల్లుల జోలికి పోకుండా కేవలం బడ్జెట్‌కు మాత్రమే పరిమితం కావాలి’ అని పిలుపునిచ్చారు. తెలంగాణ పిల్లల ఆత్మహత్యలపై చెలించి, అనేకసార్లు అమ్మలా స్పందించిన సుష్మా స్వరాజ్, ‘బిల్లు సభా వ్యవహారాల జాబితాలో లేదు. దాన్ని ప్రవేశపెట్టినట్లు నేను చూడలేదు’ అని చెప్పారు. బిల్లును ప్రవేశపెట్టినట్టు దేశమంతా టీవీల్లో ప్రసారం అయింది. లోక్‌సభ సచివాలయం ఆ తర్వాత ప్రకటన కూడా ఇచ్చింది. లోక్‌సభ కార్యకలాపాల సమాచార బులెటిన్‌లో సభలో జరిగినదంతా రికార్డయింది. ఆ బులెటిన్ లోక్‌సభ వెబ్‌సైట్‌లో యథాతథంగా పెట్టారు.

అయినా బిజెపి అగ్రనేతలు ఎందుకిలా మాట్లాడారు? తెలంగాణ బిల్లును తక్షణమే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని, తెలంగాణ బిల్లును గట్టెక్కిస్తామని అనేకసార్లు సవాలు చేసిన బిజెపి వైఖరిలో ఈ మార్పు దేనిని సూచిస్తున్నది? ఈ ప్రకటనలు చూసి తెలంగాణ బిజెపి నేతలు విలవిలలాడిపోయారు. రాజ్‌నాథ్‌సింగ్‌కు మొరపెట్టుకున్నారు. ఆయన వెంటనే వివరణ ఇచ్చారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, బిల్లు తెస్తే మద్దతు ఇస్తామని చెప్పారు. ఇందులోనూ మెలిక ఉంది. బిల్లు తెచ్చారు. బిల్లును వ్యతిరేకించేవారు సభలో ఆందోళన చేయడం కొత్తకాదు. ఉత్తరాఖండ్ బిల్లును వ్యతిరేకిస్తూ ఎన్‌డిఏ మిత్రపక్షాలైన లోక్‌తాంత్రిక్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఎస్‌పి, ఆర్జేడీ, యునైటెడ్ అకాలీదళ్ సభ్యులు వెల్‌లోకి వచ్చి బిల్లును ఆమోదించే ముందు ఉధమ్‌సింగ్‌నగర్‌ను ఉత్తరాఖండ్‌లో కలిపే విషయమై జార్జిఫెర్నాండెజ్ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించాలని ఆందోళనకు దిగారు. కానీ బిజెపి ఇవేవీ లెక్కచేయకుండా మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించింది. మరి బిజెపి ఇప్పుడెందుకు ఇలా విపరీతంగా ప్రవర్తిస్తున్నది. అవకాశం దొరికితే చాలు బిల్లును ఎగ్గొడదామని ఎందుకు చూస్తున్నారు? చంద్రబాబునాయుడు ఇప్పుడు ఢిల్లీలో తిష్ఠవేసి లోక్‌సభ సమావేశాలను ఎందుకు అంత క్లోజ్‌గా మానిటర్ చేస్తున్నారు? రాజ్యసభ సభ్యుడు కూడా కానీ కంభంపాటి రామ్మోహన్‌రావు బిడ్డ రిసెప్షన్‌ను ఢిల్లీలోనే ఏర్పాటు చేసి ప్రత్యేకంగా బిజెపి అగ్రనాయకులనే ఎందుకు పిలిచారు? అసలు ఏం జరుగుతున్నది?

సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు కాంగ్రెస్ అధిష్ఠానం మాట మాత్రమే కాదు, వాళ్లు బిజెపిలో ఉంటే బిజెపి అధిష్ఠానం మాట కూడా వినేవాళ్లు కాదు. గాలి జనార్దనరెడ్డికి, లగడపాటి రాజగోపాల్‌కు అట్టే తేడా లేదు. వాళ్లు వినదల్చుకునేవాళ్లు కాదు. తాము కోరినట్టు ప్రపంచం నడచుకోవాలని శాసించేవాళ్లు. తెలంగాణ అడ్డుకోదల్చినవాళ్లు. తెలంగాణను అడ్డుకోదల్చినవాళ్లతో బిజెపి అంటకాగుతుందా లేదా అన్నది తేల్చుకోవాలి.

బిజెపి అధికారంలోకి రావాలనుకోవడం, మిత్రులను వెదుక్కోవడం చాలా సహజం. సీమాంధ్రలో టీడీపీ ఆ పార్టీకి ఉపయోగపడేమాట వాస్తవం. కానీ టీడీపీ పొత్తుతో నిమిత్తం లేకుండా తెలంగాణ ఇస్తామని చెప్పిన బిజెపి ఇప్పుడెందుకు టీడీపీ బాటలో నడుస్తున్నది. చంద్రబాబునాయుడు మాయను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నది? చంద్రబాబు నాయుడు ఈ నెలరోజుల వ్యవధిలో అనేక పార్టీల అగ్రనాయకులను కలిశారు. ఆయన కనీసం నలుగురైదుగురు ప్రాంతీయ నేతలను ప్రధానిని చేస్తానని ఊరించాడు. జయలలిత, ములాయంసింగ్, మమతా బెనర్జీ…గతంలో నితీష్‌కుమార్…ఇలా అనేక మందికి ఆయన ఆశలు పెట్టి ఉన్నాడు. తాను ఎవరినయినా ప్రధానిని చేయగలనని ఆయన నమ్ముతూ ఉన్నాడు. నిజానికి ఇప్పుడు ఆయనకే దిక్కులేదు. ఆయనకే ఎవరో ఒకరు ఆసరా కావాలి. ప్రాంతీయ పార్టీల నాయకుల ఆసరా ఆయనకు చాలదు. మోడి నాయకత్వంలోని బిజెపి ఒక్కటే ఆయనకు కొంత ప్రాణం పోయగలదు. కానీ ఆయన విజయవంతంగా ఎదుటివారికే తన అవసరం ఉన్నట్టుగా నమ్మించగలరు. ‘సీమాంధ్ర, తెలంగాణాల్లో అత్యధిక లోక్‌సభ స్థానాల్లో బిజెపి పోటీచేస్తుంది. అత్యధిక శాసనసభ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది’- బిజెపి, టీడీపీల మధ్య స్థూలంగా ఇదీ అంగీకారం. బిజెపి రాష్ట్రం నుంచి కనీసం 20 లోక్‌సభ స్థానాలను గెలుస్తామని అంచనా వేసుకుంటున్నది. అదెలా సాధ్యం అనిపించవచ్చు. కానీ సీమాంధ్ర తిరుగుబాటు కాంగ్రెస్ ఎంపీలంతా బిజెపిలో చేరితే? బిజెపి, టీడీపీ, తిరుగుబాటు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఒక్కటయితే? ఇదీ లెక్క. అందుకే బిజెపి అయోమయానికి గురవుతున్నది. అతలాకుతలం అవుతున్నది. తెలంగాణకు దూరంగా జరగడానికి ఏ అవకాశం వచ్చినా వదులుకోకుండా స్పందిస్తున్నది. ఆ తర్వాత గొంతు సవరించుకుని సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. రాజకీయాలు ఎంత నిర్దయగా ఉంటాయో ఈ పరిణామాలు చూస్తే అర్థం అవుతుంది. ఒక్కటి మాత్రం నిజం బిజెపి నిజాయితీగా వ్యవహరించడం లేదని సామాన్యుడికి కూడా తెలిసిపోతున్నది. అవకాశవాదంతో వ్యవహరిస్తున్నదని వారి ప్రకటనలు తెలియజేస్తున్నాయి. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు కాంగ్రెస్ అధిష్ఠానం మాట మాత్రమే కాదు, వాళ్లు బిజెపిలో ఉంటే బిజెపి అధిష్ఠానం మాట కూడా వినేవాళ్లు కాదు. గాలి జనార్దనరెడ్డికి, లగడపాటి రాజగోపాల్‌కు అట్టే తేడా లేదు. వాళ్లు వినదల్చుకునేవాళ్లు కాదు. తాము కోరినట్టు ప్రపంచం నడచుకోవాలని శాసించేవాళ్లు. తెలంగాణ అడ్డుకోదల్చినవాళ్లు. తెలంగాణను అడ్డుకోదల్చినవాళ్లతో బిజెపి అంటకాగుతుందా లేదా అన్నది తేల్చుకోవాలి.

ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగిపోయే ప్రసక్తి లేదు. ఆ బిల్లును నెగ్గించవలసిన బాధ్యత అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ది, ఇంతకాలం సవాళ్లు విసురుతూ వచ్చిన ప్రధాన ప్రతిపక్షం బిజెపిది. తెలంగాణను నెగ్గించవలసిన బాధ్యత పార్లమెంటుది, ప్రజస్వామ్యానిది. సీమాంధ్ర నాయకత్వం పార్లమెంటు సాక్షిగా తమ బరితెగింపును ప్రదర్శించి ఇంతకాలంగా తెలంగాణ ఎలా అన్యాయానికి గురవుతూ వచ్చిందో దేశానికంతా తెలియజెప్పారు. సీమాంధ్ర నాయకత్వం దాష్టీకాన్ని జాతీయ మీడియా కూడా కళ్లారా చూసింది. వారి వాదనల్లోని డొల్లతనం, వారి చేష్టల్లోని హీనత్వం అందరికీ తెలిసి వచ్చాయి. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ఆగిపోతే అందుకు అన్ని పార్టీలు భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. తెలంగాణలో అడుగుపెట్టలేని పరిస్థితి వస్తుంది. చంద్రబాబునాయుడు తెలంగాణ మీద ఆశలు పెట్టుకోలేదు. ఆయనకు కావలసింది సీమాంధ్ర. ఆయన అయితే గియితే ముఖ్యమంత్రి కావలసింది అక్కడే. తెలంగాణ ఏమయిపోయినా పట్టించుకోదల్చుకోలేదు. తెలంగాణ టీడీపీ నేతలకు అర్థం కాకపోయినా ప్రజలకు ఆ విషయం అర్థం అవుతున్నది. ఈ రాష్ట్రంలో బిజెపిని ఎప్పుడయినా తెలంగాణే ఆదరించింది. అంత గడ్డుకాలంలో కూడా బిజెపికి ఒక్క తెలంగాణలోనే మూడు స్థానాలు లభించాయి. 2009 ఎన్నికల్లో బిజెపికి సీమాంధ్రలో ఎక్కడా డిపాజిట్లు కూడా రాలేదు. మొత్తంగా 1.2 శాతానికి మించి ఓట్లు రాలేదు. తెలంగాణలో 5.6 శాతం ఓట్లు వచ్చాయి. ఈ వాస్తవాలను విస్మరించి బిజెపి ఇప్పుడు కొత్త నేస్తాల మోజులో ఏదయినా చేయడానికి సిద్ధపడితే, తెలంగాణ ప్రజలకు అర్థం కాకుండాపోదు. తెలంగాణలో బిజెపి బతకడానికి చావడానికి ఇదొక పరీక్ష.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

6 thoughts on “రాజకీయ కార్పొరేట్ ఉగ్రవాదులు”

 1. ఎందుకో ఈ మధ్య మీ రాతల్లో నిష్పాక్షికత లోపిస్తున్నది. రాతలన్ని ఏకపక్షంగా ఉంటున్నాయి.

 2. correcte eka pakshamgane vunnayee … nyaamu anaaymu lo …. nyaamu pakshanaa mee burre ye pakshmu meeru telchukondi

 3. Being an unbiased person, I see this article is 100% unbiased and very true. Even every common man in Telangana is thinking exactly same as described in the article.

 4. మీరు రాసే ఆర్టికెల్స్ చాలా నిష్పక్షపాతంగ, రాజకీయ దుర్మార్గులను ఎండకట్టేవిదంగా సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావటం చాలా గర్వించదగ్గ విషయం.

 5. One can explain to ignorant but not to intelligent mavericks in disguise..
  Its fooling ourselves beyond a point as the motives and the reasons behind the changed colors is obvious and naked to an extend

 6. తెలంగాణా బిల్లు : కుతంత్రాలే ఆయుధాలుగా కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకమా ఇదంతా ?

  కాంగ్రెస్ పార్టీ పకడ్బందీ స్క్రిప్ట్ తో లోక్ సభలో నడిపిన డ్రామాను గమనించారా?.. ఇందులోని కుట్రను ఒకసారి విశ్లేషించి చూడండి.. ఇందులో బీజేపీని బలి పశువును చేసే కోణం కూడా ఉంది..

  తెలంగాణ బిల్లు గురువారం నాటి ఎజెండాలో లేదు.. అనుబంధ ఎజెండాలో చేర్చారు.. ప్రధాన ప్రతిపక్షం బీజేపీకి మాత్రం 3 గంటల వరకూ ఈ ఎజెండా కాపీ ఇవ్వలేదు.. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు.. మరోవైపు మధ్యాహ్నం12 గంటలకు సభ ప్రారంభం కాగానే పలువురు కాంగ్రెస్ ఎంపీలు పోడియానికి ఇతర సభ్యులకు మధ్య వలయాకారంలో నిలబడ్డారు.. ఎల్.కే.అద్వానీ, సుష్మా స్వరాజ్.. హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేలు ఎదురెదురుగా కూర్చొని ఉన్నా, ఒకరికి ఒకరు కనబడని పరిస్థితి..

  హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ బిల్లు సభలో ప్రవేశ పెడుతారని స్పీకర్ మీరా కుమార్ ప్రకటిస్తుండగానే కలకలం మొదలైంది.. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ గ్యాస్ వదలడంతో మార్షల్స్ హడావుడిగా అద్వానీ, సుష్మాజీలను బయటకు తీసుకెళ్లారు.. ఈలోగా బిల్లు ప్రవేశ పెడుతున్నట్లు షిండే సభలో ప్రవేశపెట్టడం చేయడం, స్పీకర్ ప్రకటన చేయడం జరిగిపోయాయి.. అదే సమయంలో సభలో బాహా బాహీలు జరిగిపోయాయి.. దీంతో స్పీకర్ మీరా కుమార్ సభను వాయిదా వేసేశారు..

  ఈలోగా బయట మీడియాతో మాట్లాడిన సుష్మా స్వరాజ్ లోక్ సభలో జరిగిన ఘటనలపై ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.. మార్షల్స్ సభ నుండి హడావుడిగా బయటకు తీసుకొచ్చిన కారణంగా ఆ తర్వాత జరిగిన పరిణామాలు వెంటనే ఆమె దృష్టికి రాలేదు.. తెలంగాణ బిల్లు సంగతి ఏమిటని ప్రశ్నించగా సభలో బిల్లు ఇంకా ప్రవేశ పెట్టలేదని చెప్పేశారు సుష్మాజీ..

  మరోవైపు అద్వానీజీ జరిగిన సంఘటనలపై మీడియాతో విచారం వ్యక్తం చేశారు.. తెలంగాణ సంగతి ఏమిటి అని ప్రశ్నిస్తే మా అధ్యక్షుడు చెప్పారు కాదా అన్నారు.. (తెలంగాణకు మద్దతు విషయంలో ఎలాంటి మార్పులేదని అర్థం).. కానీ మీడియా ఈ పాయింట్ వదిలేదిలేసింది.. సభలో ఇలాంటి పరిస్థితులు ఉంటే అన్ని అంశాలు పక్కన పెట్టి ఆర్థిక బిల్లును మాత్రమే పరిశీలించాలి అనే విషయాన్ని మాత్రమే మీడియా హైలైట్ చేసింది..

  ఆ తర్వాత సుష్మా స్వరాజ్ స్పీకర్ చాంబర్ కి వెళ్లగా అక్కడ షిండే, కమల్ నాథ్ కనిపించారు.. తెలంగాణ బిల్లు సంగతి ఏమిటని ఆమె అడిగితే,, సభలో ప్రవేశ పెట్టాం కదా అని తాపీగా చెప్పారు.. అవాక్కవడం సుష్మా వంతైంది.. ఈలోగా కమల్ నాథ్ మీడియా ముందుకు వచ్చి తెలంగాణ బిల్లుపై బీజేపీ వెనక్కి తగ్గిందని, సుష్మా ప్రకటనతో ఈ విషయం తేలిపోయిందని దుష్ప్రచారం ప్రారంభించేశాడు..

  గమనించారు కదా? ప్రధానమైన తెలంగాణ బిల్లు విషయంలో అధికార పక్షం బీజేపీతో ఎలా దోబూచులాడిందో.. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ముందు రోజు ప్రధానితో జరిగిన విందు సమావేశంలో స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ నేతలు బీజేపీతో ఎందుకు ఈ కపట నాటకాలు ఆడినట్లు?

  అత్యంత ప్రధానమైన తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టే సమయంలో సభా నాయకుడైన ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ సభలో లేనే లేరు.. పైగా గందరగోళం మధ్య ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ ను బయటకు తీసుకెళ్లారు.. ముఖ్యమైన వ్యక్తులు ఎవరూ లేకుండానే సభలో లేకుండానే, సొంత పార్టీ ఎంపీలు పరస్పరం కొట్టుకుంటున్న సమయంలో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టి చేతులు దులుపుకోవడంలోని ఆంతర్యం ఏమిటి?

  మంచి జరిగే మాకు.. చెడు జరిగితే బీజేపీకి.. ఇదేనా కాంగ్రెస్ పార్టీ విధానం.. మేమైతే బిల్లు పెట్టాం.. ఆమోదం పొందక పోతే అందుకు బాధ్యత బీజేపీది అంటున్నారు కాంగ్రెస్ నేతలు.. అంటే తెలంగాణపై కాంగ్రెస్ పార్టీలో అప్పటికే ఉన్న విబేధాలు, పరస్పర దాడులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. కానీ ఏమైనా నష్టం జరిగితే బీజేపీని బాధ్యురాలిని చేయడమే వారి ఉద్దేశ్యం అని తేలిపోయింది..

  ఇప్పడు తెలిసి పోయింది కదూ.. కాంగ్రెస్ కుట్ర తంత్రం ఎలాంటిదో.. రేపు ప్రధాన ప్రతిపక్షాన్ని ఇలాగే మభ్య పెట్టి మత హింస లాంటి వివాదాస్పద బిల్లులను కాంగ్రెస్ పార్టీ ఆమోదింపజేసుకుంటే దేశానికి ఎంత నష్టం జరిగే ప్రమాదం ఎలా ఉందో ఆలోచించండి.. కాంగ్రెస్ పార్టీ తాను చేస్తున్న తప్పులు, కుతంత్రాలకు మూల్యం చెల్లించక తప్పదు..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s