బిల్లుకు బిజెపి పీటముళ్లు వేస్తుందా?
హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేస్తూ కేంద్రం చేసిన ప్రతిపాదనపై బిజెపి కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నది. ఉమ్మడి రాజధాని అన్న పదం రాజ్యాంగంలో లేదు కాబట్టి, రాజ్యాంగ సవరణ చేసి అందులో ‘ఉమ్మడి రాజధాని’ని తెలంగాణ నుంచి విడదీసి, గవర్నర్ అధీనంలో ఉంచాలని బిజెపి కోరుతున్నది. ‘ఉమ్మడి రాజధాని’కి రాజ్యాంగబద్ధత కల్పించకుండా అక్కడ శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించడం సాధ్యం కాదని బిజెపి వాదిస్తున్నది. అంటే బిజెపి పరోక్షంగా హైదరాబాద్‌ను ‘కేంద్రపాలిత ప్రాంతం’గా మార్చాలని కోరుతున్నది. హైదరాబాద్‌కు ‘ఉమ్మడి రాజధాని’ హోదా కల్పించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి. బిజెపి ఆంతర్యం అర్థమవుతోంది కదా! బిజెపిది అత్యంత ప్రమాదకరమైన ప్రతిపాదన. హైదరాబాద్‌ను తెలంగాణకు దూరం చేసే కుట్ర. రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగిన సందర్భంగా బిజెపి వ్యవహరించిన తీరుకు, ఇప్పుడు ఢిల్లీలో బిజెపి వ్యవహరిస్తున్న తీరుకు ఏమైనా పోలిక ఉందా? తెలంగాణలో బిజెపిని బలిపెట్టి అయినా టీడీపీతో పొత్తు సంపాదించుకోవాలని బిజెపి అగ్రనాయకత్వం ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తున్నది.
చంద్రబాబు వలలో బిజెపి
నిన్నటిదాకా చంద్రబాబు చేసిన వాదనలే ఇప్పుడు బిజెపి చేస్తున్నది. సీమాంధ్రకు న్యాయం చేసిన తర్వాతనే బిల్లును ముందుకు తేవాలని చెబుతున్నది. పది రోజుల ముందు వరకు ఒక్కటిగా కనిపించిన బిజెపి క్రమంగా రెండు గొంతులు వినిపించడం మొదలు పెట్టింది. సీమాంధ్ర నాయకులు ఒక వాదన చేస్తే, తెలంగాణ నాయకులు మరోవాదన చేస్తున్నారు. టీడీపీతో ఎన్నికల పొత్తును ఆశించి, టీడీపీ ఆలోచనలకు అనుగుణంగా ఎలాగైనా ఈ సమావేశాలలో బిల్లు ఆమోదం పొందకుండా చూడాలన్న తాపత్రయం బిజెపిలో కనిపిస్తున్నది.
బిజెపి ఇంకా గొప్పగా పరిష్కరిస్తుందా?
‘ఇప్పుడే ఇన్ని వేషాలు వేస్తున్న బిజెపి కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ సమస్యను పరిష్కరిస్తుందని ఎలా నమ్ముతాం?’ అని టీజేఏసీ నాయకుడు ఒకరు ప్రశ్నించారు. ‘ఇప్పుడు బిల్లు ఆమోదం పొందకపోతే కాంగ్రెస్, బిజెపిలు రెంటినీ తెలంగాణలో బొందపెట్టడం ఖాయం’ అని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లును ఆమోదింప జేయాల్సిన బాధ్యత ఇప్పుడు రెండు జాతీయ పార్టీలదేనని ఆయన అన్నారు.
ఇది ఆర్థిక బిల్లు కాదు
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆర్థిక బిల్లు కాదు. అది రాజ్యాంగంలోని 3వ అధికరణం ప్రకారం ప్రతిపాదిస్తున్న శాసనపరమైన బిల్లు. ఆర్థికంగా ఈ బిల్లు ద్వారా ఎటువంటి కెటాయింపులు జరగవు. ప్రతిపాదనలు మాత్రమే ఈ బిల్లులో ఉంటాయి. ఈ విషయం అర్థం కాని కొందరు గొంతెమ్మలు బిల్లును ముందుగా రాజ్యసభలో ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రపతి పేరు చెప్పి కొందరు ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.