ఏది నైతికబలం? ఏది మందబలం?


తెలంగాణ గెలిచింది. గెలుస్తుంది. కుట్రలు, కుతంత్రాలు, మెజారిటీ అప్రజాస్వామిక దాష్టీకాలను జయించి రాష్ట్ర విభజన బిల్లు ఢిల్లీకి వెళ్లింది. మందబలం ముందు నైతిక బలం విజయం సాధించింది. అడ్డదారిలో దొడ్డిదారిలో ఒక నోటీసుపై సభలో ఓటింగు పెట్టి, అది గెలిపించుకున్నామనిపించుకుని, తెలంగాణ ఏర్పాటుకు నైతికత లేదని చెప్పేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు, ఆయన వందిమాగధ మీడియా మూకలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ బిల్లు పార్లమెంటులో నిలువదని నిపుణుల అభిప్రాయాల పేరుతో తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు ఈ క్షణంలో కూడా ప్రయత్నిస్తున్నాయి. వాస్తవానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, స్పీకర్ మనోహర్‌కు తెలంగాణ ప్రజలు ధన్యవాదాలు చెప్పుకోవాలి. వారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ బిల్లు విజయవంతంగా ఢిల్లీ వెళ్లడానికి సహకరించారు. ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఉండవచ్చు. అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేసి ఉండవచ్చు….రాష్ట్రపతిపాలన విధించేదాకా పరిస్థితి తీసుకెళ్లి, బిల్లును ముందుకు నడువకుండా చేసి ఉండవచ్చు…..ఇంకా అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నా వాటి జోలికి వెళ్లకుండా ముఖ్యమంత్రి పదవిని అంటిపెట్టుకుని బిల్లుపై చర్చ పూర్తి చేయడానికి సహకరించి, చివరికి ఒక తీర్మానం చేయించి ఢిల్లీకి పంపేందుకు సహకరించారు ఆయన. స్పీకర్ కూడా కట్టె విరగకుండా పాము చావకుండా తెలంగాణకోసం చర్చ జరిగింది, ఆంధ్రకోసం తీర్మానం జరిగింది అని అనిపించి కథ ముగించారు. ఈ తీర్మానంతో బ్రహ్మాండం బద్దలయిపోతుందని సీమాంధ్ర మీడియా ‘తిరస్కారం’ అన్న దాన్నే ఎక్కువ చేసి చూపించి, బిల్లుకు నైతికత లేదని, ఉండదని, కోర్టుల్లో నిలవదని అనిపించేందుకు ప్రయత్నిస్తున్నది. వాస్తవం ఏమిటి? నైతికబలం ఎటువైపు ఉంది?
image

మొదటిది, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై శాసనసభలో 50 రోజులపాటు చర్చ జరిగింది. 87 మంది సభ్యులు 50 గంటలపాటు బిల్లుపై చర్చించారు. దాదాపు అందరు సభ్యులూ లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఇవన్నీ సభ రికార్డుల్లో ఉన్నాయి. సభలో చర్చను ముగించి ఈ మొత్తం సమచారాన్ని కేంద్రానికి పంపుతున్నట్టు స్పీకర్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది బిల్లుకు లభించిన అంతిమ నైతిక విజయం.

రెండవది, శాసనసభ ఆమోదించినట్టుగా చెబుతున్న నోటీసు ప్రభుత్వం ఇచ్చింది కాదు. అది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యక్తిగతంగా ప్రతిపాదించింది. ప్రభుత్వం నోటీసు ఇవ్వాలంటే అది కేబినెట్‌లో చర్చించి తీర్మానించి ఉండాలి. ఈ నోటీసుకు కేబినెట్ తీర్మానం లేదు. కేబినెట్ తీర్మానం లేని నోటీసు లీగల్‌గా చెల్లదు. ముఖ్యమంత్రి ఒక ప్రాంతీయ నాయకుడిగా ప్రతిపాదించిన నోటీసు అది. సభా సంప్రదాయాల ప్రకారం స్పీకర్ వాస్తవానికి ఇటువంటి నోటీసును అనుమతించకూడదు. రాష్ట్రపతి నివేదించిన అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు మధ్యలో ఇటువంటి తీర్మానాలు వస్తే తిరస్కరించాలి. మౌఖికంగాను, లిఖితపూర్వకంగానూ సభలో సభ్యులంతా తమ అభిప్రాయాలను చెప్పడానికి అవకాశం ఉన్నప్పుడు మళ్లీ ఇటువంటి తీర్మానం అనుమతించి ఉండకూడదు. కానీ స్పీకర్ కూడా ప్రాంతీయ ఒత్తిళ్లకు తలొగ్గి సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారు. అందువల్ల ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసుకు గానీ, సభలో చేసిన తీర్మానానికిగానీ ఎటువంటి నైతికత లేదు. మెజారిటీ ఆధిపత్యం ఉన్న సభలో తీర్మానం నెగ్గకుండా ఎలా ఉంటుంది? ఆ విషయం కేంద్రానికి, రాజ్యాంగ నిపుణులకు తెలియదా?

మూడవది, తెలంగాణ ఏర్పాటుకు కాన్సెన్సస్ లేదని ముఖ్యమంత్రి నోటీసులో ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు లభించినంత రాజకీయ కాన్సెన్సస్ ఏ రాష్ట్ర విభజనకు లభించలేదు. కాన్సెన్సస్ అంటే ‘విస్తృతాంగీకారం లేదా మెజారిటీ అంగీకారం’. ఏకగ్రీవ అంగీకారం కాదు. ఒక్క సిపిఎం తప్ప రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక సందర్భంలో తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించాయి. అభ్యంతరం లేదని చెప్పాయి. కాంగ్రెస్, బిజెపి, టీడీపీ, పీఆర్‌పీ, సిపిఐ మేనిఫెస్టోల్లో రాసుకున్నాయి. వైసీపీ తీర్మానం చేసింది. లోక్‌సత్తా తమకు కూడా అభ్యంతరం లేదని చెప్పింది. 2009 డిసెంబరులో అన్ని పార్టీల శాసనసభా పక్షాల నాయకుల సమావేశం తెలంగాణ ఏర్పాటుకు మద్దతు తెలుపుతూ తీర్మానం చేసింది. కాంగ్రెస్ శాసనసభా పక్షం తెలంగాణపై అంతిమ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం చేసింది. తెలంగాణపై కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి స్వయంగా అనేకసార్లు ప్రకటించారు. ఇక జాతీయ స్థాయిలో పార్లమెంటులో దాదాపు 400 మంది సభ్యుల బలం ఉన్న 3 రాజకీయ పక్షాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా లేఖలు ఇచ్చాయి. తెలంగాణకు ఇంతకంటే నైతిక బలం ఏం కావాలి? కోర్టులో న్యాయం కోసం కొట్లాడడానికి ఇవన్నీ చాలవా?

నాలుగవది, మెజారిటీ ప్రాంతాల దాష్టీకానికి మైనారిటీ ప్రాంతాలు బలికాకూడదన్న ఉద్దేశంతోనే రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల ఏర్పాటు అధికారాన్ని కేంద్రానికి అప్పగించారు. మెజారిటీ ప్రాంతాలు తాము అనుభవిస్తున్న వసతులు, వనరులు, ప్రయోజనాలను వదులుకోవడానికి సిద్ధపడవని, విభజన సమస్యను రాష్ట్రాలకు వదిలేస్తే మైనారిటీ ప్రాంతాలు ఎప్పటికీ స్వేచ్ఛను అనుభవించలేవని రాజ్యాంగ రచయితలు అప్పుడే భావించారు. ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష, దానికి మద్దతుగా ప్రారంభమైన పార్లమెంటరీ ప్రక్రియ మందబలం ముందు ఓడిపోతే ప్రజాస్వామ్యానికి అవి అంతిమ ఘడియలు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం. బలవంతంగా కలిపి ఉంచడం కాదు, స్వచ్ఛందంగా కలిసి జీవించడం సమాఖ్య స్ఫూర్తి.

ఐదవది, అసెంబ్లీ తీర్మానాలతో నిమిత్తం లేకుండా కేంద్రం నిర్ణయాలు చేయడం ఇదే మొదలు కాదు. ఇప్పటివరకు 1 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ప్రతి సందర్భంలో ఏదో ఒక వివాదం రావడం, కోర్టులు తీర్పులు ఇవ్వడం జరుగుతూనే ఉంది. మహరాష్ట్ర, గుజరాత్ విభజన సందర్భంగా మూడు రాష్ట్రాల(బొంబాయి, మహారాష్ట్ర, గుజరాత్) ఏర్పాటు బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీ చర్చించి పార్లమెంటుకు పంపింది. కేంద్రం ఆ బిల్లును పక్కనబెట్టి అంతిమంగా రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేస్తూ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించి ఆమోదింపజేసింది. పంజాబ్ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కంటే ఓవరాక్షన్ చేశారు. ఇందిరాగాంధీ అక్కడి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి, రాష్ట్రపతి పాలన విధించి రెండు మాసాల్లో రాష్ట్ర విభజన ప్రక్రియను పూర్తి చేసింది. రాష్ట్ర విభజన విషయంలో అంతిమ నిర్ణయం కేంద్రానిదేనని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి తీర్మానానికి ఎటువంటి విలువాలేదు, సీమాంధ్రలో పాలాభిషేకాలు జరుగడం తప్ప.

ఆరు, ముఖ్యమంత్రి ఏ నైతిక విలువలు లేని వైరుధ్యాల పుట్ట. రాష్ట్రపతి ఆరువారాల సమయం ఇచ్చారు. దానిని వృధా చేయడమే కాకుండా మళ్లీ సమయం పొడిగింపు కోరారు. రాష్ట్రపతి మరో వారం గడువు ఇచ్చారు. మొత్తం ఈ యాభై రోజుల్లో కనీసం నాలుగైదుసార్లు గంటలు గంటలు మాట్లాడారు. ఒకవైపు చర్చ జరుగుతుండగానే మళ్లీ సమయం పొడిగించాలని కోరారు. ఆ లేఖ ఢిల్లీ చేరకముందే బిల్లును తిరస్కరించాలని నోటీసు ఇచ్చారు. ఇదంతా ఒక ప్రభుత్వానికి నాయకునిగా కాదు, కేవలం ఒక వ్యక్తిగా. చివరకు నోటీసుపై తూతూ మంత్రంగా తీర్మానం చేయించారు. ఇదంతా అసెంబ్లీ రికార్డుల్లో భద్రంగా ఉంది. ఇది నీతి అంటే అంతకంటే దౌర్భాగ్యం లేదు.

సీమాంధ్ర నాయకత్వం చేస్తున్నవాదనలేవీ న్యాయ పరీక్షకుగానీ, ప్రజాస్వామ్య పరీక్షకు గానీ నిలబడలేవు. వారు చెబుతున్నదాంట్లో నీతిలేదు, నిజం లేదు. తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే సమయం ఆసన్నమైంది. సీమాంధ్ర రాజకీయ ఆర్థిక ఆధిపత్యం నుంచి విముక్తిపొందే తరుణం సమీపిస్తున్నది. ఇంతదూరం వచ్చిన తర్వాత ఇక ఎవరూ తెలంగాణను ఆపలేరు. ఆపే ప్రయత్నం చేసినవారెవరూ తెలంగాణలో రాజకీయంగా బతికిబట్టకట్టలేరు. న్యాయం, ధర్మం మన పక్షాన ఉన్నాయి. విజయం కనుచూపు మేరలో ఉంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు.

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s