కేజ్రీవాల్ ఒక రోల్ మోడల్


అసాధ్యాలు సుసాధ్యమవుతున్న కాలం. నిలువ నీటిని కొత్త నీరు తరిమేస్తున్న కాలం. సామాన్యులు కూడా మాన్యులు కాగలరని నిరూపించిన కాలం. ప్రజాస్వామ్యం ఇంకా బతికుందని దేశానికి చాటిచెప్పిన కాలం. అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడొక రోల్ మోడల్. ఆయన ఎలా పరిపాలిస్తారు, చివరకు ఎక్కడ తేలుతారన్నది అనంతరం సమీక్షించుకోవలసిన విషయం. కానీ ఇప్పుడు మాత్రం దేశ రాజకీయాల్లో ఆయన ఒక ఆశను రేకెత్తించారు. మార్పు సాధ్యమేనని చూపించారు. నిలబడి కొట్లాడితే సవాలు చేయవచ్చునని రుజువు చేశారు. ‘వారు పోతే వీరు వీరు పోతే వారు’ కాకుండా, ఒక నికార్సైన ప్రత్యామ్నాయం సాధ్యమేనని నిరూపించారు. దేశ రాజధాని ఢిల్లీని చేజిక్కించుకున్నారు. తెలుగు సినిమా తరహాలో ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అంటే మొరటుగా ఉంటుంది. కానీ ఇవ్వాళ అరలు అరలుగా, పొరలు పొరలుగా చీలిపోయిన రాజకీయ వ్యవస్థలో ఏ రంగూ పూసుకోకుండా ఒక పార్టీని పెట్టి విజయం వైపు నడిపించాడే, అదీ అతని గొప్ప తనం. ఆయన తాతలు తండ్రులు రాజకీయాల్లో లేరు. వారసత్వ సంక్రమణం లేదు. కోటీశ్వరుడు కాదు. సొంతంగా ఏ ఇమేజీ లేదు. ఎదుర్కోవలసింది రెండు పెద్ద పార్టీలను. సువ్యవస్థిత పార్టీలను. పెద్ద పెద్ద ఐడియాలజీలను. కానీ ఆయన అవినీతి వ్యతిరేక పోరాట యోధుడుగా మొదలై నిబద్ధంగా, ధైర్యంగా పాత వ్యవస్థలను సవాలు చేశారు. ఓ మోస్తరు ఎన్నికల ఖర్చులతో పార్టీని జనంలోకి తీసుకెళ్లారు. జనం విశ్వాసం చూరగొన్నారు. జయించారు. మొత్తానికి మొత్తం ఓ కొత్త తరాన్ని చట్టసభల్లోకి తీసుకు వచ్చారు. ఆయన జటిలమైన సిద్ధాంతాలు చెప్పలేదు. ఢిల్లీ ప్రజలు ఏం ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకున్నాడు. ప్రజలకేం చేస్తాడో చెప్పాడు. సాధారణ భాషలో, ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాడు. అధికారంలోకి వచ్చారు. మాట మీద నిలబడ్డాడు. తను చెప్పినవి అమలు చేస్తున్నారు. ఆయనను రాజకీయంగా ఎంతకాలం బతకనిస్తారో తెలియదు. కానీ ఆయన రుజువు చేయదల్చుకున్నది రుజువు చేశారు. నిజాయితీగా ఎవరో ఒకరు ముందుకు వచ్చి పోరాడితే ప్రత్యామ్నాయం సాధ్యమేనని రుజువు చేశారు. మార్పు తేవచ్చునని రుజువు చేశారు. అందుకు ఆయనను దేశం గుర్తుపెట్టుకుంటుంది.
Aam_Aadmi_Party7073
ఆయన వెనుక ఎవరో ఉన్నారని, ఆయనకు ఎన్నికల నిధులు కుప్పలు తెప్పలుగా వచ్చాయని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఆయన అమెరికా ఏజెంటు అని ముద్రలు వేస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో లెక్కలు తీస్తే అన్ని పార్టీలు వందసార్లు గంగలో మునిగినా వాటి మురికి వదలిపోదు. ఏ పార్టీ ఎన్ని నిధులు బ్లాకులో, ఎన్ని నిధులు వైట్‌లో ఖర్చు చేస్తున్నాయో అంచనా వేస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ప్రతిపార్టీ వెనుక ఎవరో ఒకరు ఉన్నారు. బహుళజాతి కంపెనీలు అన్ని పార్టీలకు ఎన్నికల నిధులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో బట్వాడా చేస్తూనే ఉన్నాయి. హవాలా మార్గంలో ఎవరికి ఎన్ని నిధులు వస్తాయో ఎన్‌ఐఏ కూడా కనిపెట్టలేదు. ఇవి కాకుండా జనంపై పడి ‘మాకు ఇన్ని నిధులు కావాలి. అందరూ ఇవ్వాల్సిందే’ అని గోళ్లూడగొట్టి వసూలు చేసిన ముఖ్యమంత్రులు దేశంలో ఉన్నారు. మరొక్క మాట ఈ దేశంలో అణు ఒప్పందానికి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లుకు ఓటు వేసిన వాళ్లంతా అమెరికా ఏజెంట్లేనని కమ్యూనిస్టు పార్టీలు అప్పుడే ఆరోపించాయి. వాల్‌మార్ట్ లాబీయింగ్‌కు, వారిచ్చే డాలర్లకు అమ్ముడుపోయినవాళ్లు కేజ్రీవాల్‌ను నిందిస్తే ఎలా? అందువల్ల ప్రధాన పార్టీలు బిజెపి, కాంగ్రెస్‌లు ఆమ్ ఆద్మీ పార్టీపై చేస్తున్న విమర్శలు పెద్దగా చెల్లుబాటు కాబోవు. ఎవరినీ నమ్మించలేవు. ఎవరి ఏజెంటయినా పర్వాలేదు, కానీ ఆయన సంస్కరణల ఎజెండాకు భిన్నంగా పనులు మొదలు పెట్టాడు. పేదలకు తాగునీటిని ఉచితంగా ఇచ్చిన మొదటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు. మన నాయకులు, మన జర్నలిస్టులు కొందరు ఎంతగా పుచ్చిపోయారంటే తాగునీటిని ఉచితంగా ఇవ్వడాన్ని కూడా సహించలేకపోయారు. జనాకర్షక ఎజెండా మొదలు పెట్టాడనీ, దేశాన్ని వెనుకకు తీసుకెళుతున్నాడని నిందించారు. తాగునీరు సహజవనరు. దేశంలో ప్రతిపౌరుడి హక్కు. ఉచిత విద్య, ఉచిత వైద్యం కంటే ముందుగా ఇవ్వాల్సింది ఉచితంగా తాగునీరు. ఉచిత లాప్‌టాప్‌లు, ఉచిత టీవీల కంటే పేదలు బతకడానికి అత్యంత అవసరమైనది తాగునీరు. అందరికీ కూడు, గూడు, గుడ్డ అందించడాన్ని మించిన గొప్ప ఎజెండా ఏదీ లేదు.

కానీ కేజ్రీవాల్‌పై ఇప్పుడు తీవ్రస్థాయిలో దాడి మొదలైంది. అవినీతి, అప్రదిష్టలను మూటగట్టుకుని పతనావస్థలో ఉన్న కాంగ్రెస్ నుంచి కంటే కొత్తగా అధికారంలోకి రావాలని చూస్తున్న బిజెపి నుంచి ఈ దాడి ఎక్కువగా ఉంది. తమకు రావలసిందేదో రాకుండా అడ్డుపడుతున్నాడని కేజ్రీవాల్‌పై బిజెపి నాయకత్వం రకరకాల విమర్శలు గుప్పిస్తున్నది. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి, ఢిల్లీలో కాంగ్రెస్‌ను కదిలించలేకపోయిన బిజెపి, కాంగ్రెస్‌ను సవాలు చేసేవాడొకడు వచ్చినందుకు సంతోషించాలి. కాంగ్రెస్‌ను దిక్కుతోచని స్థితిలో నిలబెట్టినందుకు అభినందించాలి. కానీ కేజ్రీవాల్ బలపడితే తమ ఓటు బ్యాంకు చీలిపోతుందని, తమ విజయావకాశాలు తగ్గిపోతాయని బిజెపి భావిస్తున్నది. మొగ్గలోనే ఆ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయాలన్న ఆతృత బిజెపి నేతల్లో కనిపిస్తున్నది. అందుకే పాత చింతకాయ పచ్చడిలాంటి ఆరోపణలు, కాలం చెల్లిన విమర్శలు ఆయనపై కుమ్మరిస్తున్నది. హుందాతనాన్ని విస్మరిస్తున్నది. బిజెపి, నరేంద్రమోడి తమ విశ్వసనీయతను పెంచుకోవడానికి ప్రయత్నించాలే తప్ప, ఎదుటివారిపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీసి ఎదగాలనుకోవడం గొప్ప కాదు. పైగా కేజ్రీవాల్ కాంగ్రెస్ మాదిరిగా పదేళ్లు అధికారంలో లేడు, మీరు విమర్శించలు గుప్పించడానికి! రాజకీయల్లో పరస్పర సంఘర్షణ అనివార్యమే. కానీ ఆ సంఘర్షణ విధానాలపై జరగాలి. వ్యక్తులు కేంద్రంగా కాదు. మార్పును, కొత్తను ఆహ్వానించని పార్టీ ఏదయినా పాత రాజకీయాలను కొనసాగించాలని చూస్తున్నట్టే భావించాలి. మార్పు మన పాదాల కింద మట్టిని కొట్టేసినా సరే అది దేశానికి మంచిదయితే స్వాగతించాలి. కేజ్రీవాల్ పార్టీని బతకనివ్వండి. వర్ధిల్లనివ్వండి. ప్రత్యామ్నాయ రాజకీయాలను ఎదగనీయండి.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s