నియంతలకోసమే 3వ అధికరణం


సీమాంధ్ర ఆధిపత్య శక్తుల అశ్శరభ శరభ

మెజారిటీ ప్రాంతాల దాష్టీకానికి మైనారిటీ ప్రాంతాలు బలికాకూడదన్న ముందుచూపు, చైతన్యంతోనే విభజనాధికారం కేంద్రం చేతిలో పెట్టారు. మెజారిటీ ప్రాంత నియంతలు, ఆధిపత్యవాదులు ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట పుట్టుకొస్తారనే ఈ ఏర్పాటు చేశారు. అందువల్ల కిరణ్‌కుమార్‌రెడ్డి లేక ఇతర సీమాంధ్ర ఆధిపత్య శక్తులు వేస్తున్న వికృతవేషాలు వారి స్వభావాన్ని బట్టబయలు చేస్తున్నాయే తప్ప తెలంగాణను ఆపలేవు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో వ్యతిరేకంగా తీర్మానం చేసినా, అనుకూలంగా తీర్మానం చేసినా, అసలు ఏ తీర్మానం చేయకపోయినా రాజ్యాంగ ప్రక్రియ ఆగదు. పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తారని, తెలంగాణ సభ్యులు మైనారిటీలో ఉంటారని కేంద్రానికి, కాంగ్రెస్‌కు, రాష్ట్రపతికి తెలియదా? ఇదేమైనా కొత్త విషయమా? రాజ్యాంగంలో 3వ అధికరణాన్ని పొందుపరిచిందే కిరణ్‌కుమార్‌రెడ్డి, జగన్‌బాబు, చంద్రబాబు, లగడపాటి వంటి ఆధిపత్యవాదులను దృష్టిలో పెట్టుకుని. ఓటింగ్‌పై ఆధారపడితే మెజారిటీ ప్రాంతం మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడివడేదా? ఓటింగ్ ప్రాతిపదిక అయితే మహారాష్ట్ర నుంచి గుజరాత్ ఏర్పాటు జరిగి ఉండేదా? అస్సాం ప్రాంతం వ్యతిరేకిస్తే అన్ని ఈశాన్య రాష్ట్రాలు ఏర్పడి ఉండేవా? పంజాబ్ ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తే హర్యానా రాష్ట్ర ఏర్పాటు ఆగిందా? మహారాష్ట్ర నుంచి విదర్భ ఎప్పటికయినా విముక్తి సాధించగలదా? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల నుంచి బుందేల్‌ఖండ్ ఎప్పటికయినా స్వేచ్ఛను పొందగలదా? మెజారిటీ ప్రాంతాల దాష్టీకానికి మైనారిటీ ప్రాంతాలు బలికాకూడదన్న ముందుచూపు, చైతన్యంతోనే విభజనాధికారం కేంద్రం చేతిలో పెట్టారు. మెజారిటీ ప్రాంత నియంతలు, ఆధిపత్యవాదులు ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట పుట్టుకొస్తారనే ఈ ఏర్పాటు చేశారు. అందువల్ల కిరణ్‌కుమార్‌రెడ్డి లేక ఇతర సీమాంధ్ర ఆధిపత్య శక్తులు వేస్తున్న వికృతవేషాలు వారి స్వభావాన్ని బట్టబయలు చేస్తున్నాయే తప్ప తెలంగాణను ఆపలేవు.

పునర్వ్యవస్థీకరణ బిల్లును అసెంబ్లీలో చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. రాష్ట్రపతి సందేశాన్ని అసెంబ్లీ కార్యదర్శి చదివి వినిపించారు. అందరికీ పత్రాలు అందజేశారు. బిల్లుపై అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. అంటే శాసనసభకు నివేదించే పని పూర్తయింది. చర్చను కూడా ప్రారంభించాలని శాసనసభ వ్యవహారాల మంత్రి కోరారు. డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడాల్సిందిగా పిలిచారు. అవేవీ జరగలేదని కిరణ్ ఇప్పుడు తొండి చేయవచ్చు. అభిప్రాయాలు చెబుతారా లేదా అన్నది కిరణ్ ఇష్టం. కానీ రాజ్యాంగంలోని 3వ అధికరణం స్ఫూర్తి ఏమంటే రాష్ట్ర విభజన సంబంధిత రాష్ట్ర శాసనసభకు తెలిసి(నాలెడ్జ్) జరగాలని! తెలియజేసే పని పూర్తయింది. వారికి ఇచ్చిన గడువు మాత్రమే మిగిలింది. చర్చ జరిగితే మంచిది. కిరణ్‌తో సహా సీమాంధ్ర నాయకత్వం వేసే ఎత్తులను, జిత్తులను పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. ఇది ప్రజస్వామ్యానికి, రాజ్యాంగానికి, పార్లమెంటుకు, కేంద్ర ప్రభుత్వానికి ప్రతిష్ఠకు సంబంధించిన సమస్య. తెలంగాణను నెగ్గించవలసిన బాధ్యత ఇప్పుడు ఈ వ్యవస్థలన్నింటిపై ఉంది.

భారత జాతి, భారత మాతకు పోటీగా తెలుగు జాతి, తెలుగు తల్లిని రంగంపైకి తెచ్చి రాజకీయాలు చేసినప్పుడు ఈ ఏడుపులు, పెడబొబ్బలు ఏమయ్యాయి? తెలుగు ప్రాంతీయవాదానికి, తెలంగాణ ప్రాంతీయవాదానికి వైరుధ్యం ఏముంది? మీరు చేస్తే ఒప్పు మేము చేస్తే తప్పా? చివరికి కొందరు మార్క్సిస్టు మేధావులు సైతం ఇదే ఉన్మాదానికి లోనుకావడం విచిత్రంగా ఉంది.

తెలుగు జాతి సర్వనాశనమైపోయిందని బాధపడుతున్నవాళ్లను చూస్తుంటే జాలేస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమంటే తెలుగుజాతిని నాశనం చేయడమని కొందరు నేతలు వాదిస్తున్నారు. ప్రాంతీయ నినాదాలకోసం ఒక జాతిని బలి చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. భారత జాతి, భారత మాతకు పోటీగా తెలుగు జాతి, తెలుగు తల్లిని రంగంపైకి తెచ్చి రాజకీయాలు చేసినప్పుడు ఈ ఏడుపులు, పెడబొబ్బలు ఏమయ్యాయి? తెలుగు ప్రాంతీయవాదానికి, తెలంగాణ ప్రాంతీయవాదానికి వైరుధ్యం ఏముంది? మీరు చేస్తే ఒప్పు మేము చేస్తే తప్పా? చివరికి కొందరు మార్క్సిస్టు మేధావులు సైతం ఇదే ఉన్మాదానికి లోనుకావడం విచిత్రంగా ఉంది. ఆధిపత్యవాదాన్ని సమర్థించేందుకు, వివక్షను కొనసాగించేందుకు, వికేంద్రీకరణను వ్యతిరేకించేందుకు ముందుకు రాకపోగా భాషాదురహంకార శక్తులలాగా తెలుగువాళ్లంతా కలసి ఉండాలని వాదిస్తున్నారు. కిరణ్, జగన్, చంద్రబాబు, జయప్రకాశ్ నారాయణ్ వంటి రాజకీయ నాయకులు మొదలు ఏబీకే ప్రసాద్, డిఎన్‌ఎఫ్ హనుమంతరావు, వంగపండు వరకు అంతా ఒకే బాణీలో మాట్లాడుతున్నారు.

సీమాంధ్ర మీడియా అయితే ఇక చెప్పనవసరమే లేదు. ఒక్కొక్కడు ఒక్కో వీర సమైక్యవాదిలాగా అశ్శరభ శరభ అని గత మూడు మాసాలుగా వీరంగం వేస్తున్నారు. సీమాంధ్ర మీడియా ఎన్ని వికృత వేషాలు వేసిందంటే- ఒకవైపు అనేక అబద్ధాలను ప్రచారం చేసి సీమాంధ్ర జనాన్ని రెచ్చగొడుతూ వచ్చింది. సీమాంధ్ర నాయకులను చేతగాని దద్దమ్మల్లా, చేవచచ్చిన పీనుగుల్లా తిడుతూ వచ్చింది. కేంద్రానికి ఎన్ని రకాలుగా శాపనార్థాలు పెట్టాలో అన్ని రకాలుగా శాపనార్థాలు పెట్టింది. కొంత మంది సీమాంధ్ర మేధావులు, దళిత ప్రజా సంఘాల నాయకులు తప్ప ఒక్కడంటే ఒక్కడు వాస్తవిక దృష్టితో పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించలేదు. అబద్ధాలు, బుకాయింపులు, వంచనలు, నాటకాలతో కాలం గడుపుతున్నారు తప్ప, వాస్తవిక పరిస్థితిపై చర్చించడానికి ముందుకు రావడం లేదు. సీమాంధ్రలో ఒకరిని మించి ఒకరు సమైక్యవాదులుగా బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప, ప్రత్యామ్నాయ ఎజెండా గురించి ఒక్కరు మాట్లాడడం లేదు.

నిజానికి చంద్రబాబునాయుడుకు అటువంటి అవకాశం ఉండింది. ‘విభజన ప్రక్రియకు సహకరిస్తాన’ని తొలిరోజే ప్రకటించిన ఏకైక సీమాంధ్ర నాయకుడాయన. కానీ మీడియా, జగన్, కిరణ్ సృష్టించిన ఫోబియాలో పడిపోయి ఆయన కూడా మాటమార్చారు. నానా పిల్లిమొగ్గలు వేశారు. కిరణ్, జగన్‌లను దోషులుగా నిలబెట్టి, వాస్తవిక పరిస్థితిని చెప్పి, ‘నవ్యాంధ్రను నేను నిర్మిస్తాన’ని భరోసా ఇచ్చి ఉంటే సీమాంధ్ర అయినా ఆయనతో ఉండేది. తెలంగాణలో కూడా కొంత ముఖం చెల్లి ఉండేది. ఇప్పటికయినా ఆయనకు సీమాంధ్రలో స్పేస్ ఉంది. ఇన్ని ఇక్కట్లకు తల్లికాంగ్రెస్, పిల్లకాంగ్రెస్ కారణమని ఆయన బలంగా చెప్పగలిగితే జనం స్వీకరించే అవకాశం ఉంది. సీమాంధ్రకు ఏమి కావాలో బలంగా వినిపించగలిగితే జనం హర్షించే అవకాశం ఉంది. విభజన గురించి భయపడాల్సింది లేదని భరోసా ఇస్తే ప్రజలు ఆదరించే అవకాశం ఉంది. ఇప్పుడు సీమాంధ్రకు కావలసింది వాస్తవాలు చెప్పి, భరోసా ఇచ్చే ఒక బలమైన నాయకుడు. అబద్ధాలు చెప్పి, ఆవేశాలు రెచ్చగొట్టే అవకాశవాది కాదు. జోడు గుర్రాల స్వారీ ఎప్పుడూ ఎవరికీ లాభం చేయదు.

సీమాంధ్ర టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమైక్యాంధ్రకోసం రకరకాల వేషాలు వేస్తుంటే, చంద్రబాబు కూడా వారితోనే యాత్రలు చేస్తుంటే ఇక్కడ తెలంగాణలో టీడీపీని ప్రజలు ఎలా విశ్వసిస్తారు? టీడీపీని రెండు రాష్ట్రాల పార్టీగా బతికించాలని చంద్రబాబు యోచిస్తూ ఉండవచ్చు. కానీ రాష్ట్రాల విభజన తర్వాత రాజకీయ సమీకరణలు మారిపోతాయి. ప్రాధాన్యతలు మారిపోతాయి. కిరణ్, జగన్‌లతోపాటు చంద్రబాబుకు తెలంగాణకు సంబంధం ఏమిటి అని ప్రశ్నించే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. వారు రిలవెన్స్ కోల్పోతారు. రాజకీయ విముక్తి లేకుండా రాష్ట్ర విముక్తి ఉండదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబే పెత్తనం చేసేట్టయితే కొత్త రాష్ట్రం ఎందుకు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. తార్కికంగా ఆలోచిస్తే అర్థమయ్యే విషయం ఇది. కానీ తర్కం చేదుగా, కటువుగా ఉంటుంది. అంత తొందరగా జీర్ణం కాదు. జీర్ణించుకు వ్యవహరించివాళ్లు విజ్ఞులవుతారు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

2 thoughts on “నియంతలకోసమే 3వ అధికరణం”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s