ఆఖరిమెట్లు


పరమపద సోపానంలో ఆఖరి మెట్లు అతిప్రమాదకరమైనవి.

అక్కడ భారీ సర్పాలే తప్ప నిచ్చెనలు ఉండవు. ఆ సర్పాలకు చిక్కకుండా గమ్యం చేరకపోతే అథఃపాతాళానికి పడిపోయి, ప్రయాణం మళ్లీ మొదలుపెట్టాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇప్పుడు పరమపదసోపానంలో ఆఖరి మెట్లపైకి వచ్చింది. తెలంగాణ జీవితంలో ఈ మూడు వారాలు అతికీలకం. తెలంగాణ రాజకీయ శక్తులు, ఉద్యమశక్తులు, పౌరసమాజం ఐక్యంగా అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం ఇది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవడానికి, కనీసం నిలువరించడానికి ముగ్గురు నేతలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేయని ప్రయత్నం లేదు. కొండ చిలువ నోటికి చిక్కిన పొట్టేలు చందంగా తెలంగాణ పోరాడుతున్నది. ఈ కొండ చిలువలను వదిలించుకోకపోతే అవి పొట్టేళ్లను మాత్రమే కాదు మొత్తం తెలంగాణను మింగేస్తాయి. ఈ నాయకులను చూస్తుంటే విస్మయం కలుగుతున్నది. ఇంతకాలం మనలను పరిపాలించిన నాయకులు వీళ్లా? మన ముఖ్యమంత్రులుగా, మన ఉద్ధారకులుగా భావించింది వీళ్లనా? పరీక్షా సమయం వస్తే వీళ్లు ఎటువైపు నిలబడతారో పసిగట్టలేకపోయామే? ఏ విధానానికీ, ఏ ప్రజాస్వామిక ప్రక్రియకూ, ఏ సంప్రదింపుల క్రమానికీ లొంగని నియంతలనా ఇంతకాలం మనం మోసింది? వీళ్లకు ఏ నీతీ లేదు. ఒకరు బిజెపి వైపు నుంచి నరుక్కొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకొకరు దేశమంతా తిరిగి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించండని పార్టీలను కూడగడుతున్నారు. ‘అతడొక్కడే ఒక సైన్యమ’ట. ఆయన దేశాటన చూసి ‘విభజనవాదులు తలకిందులైపోతున్నార’ట. ఇవి ఆయన పత్రికల్లో రాసుకుంటున్నవే. ఇక కిరణ్‌కుమార్‌రెడ్డి అయితే సీల్డు కవర్ ముఖ్యమంత్రిగా వచ్చి తెలంగాణ భవిష్యత్తును తానే సీలు చేయగలనని భ్రమిస్తున్నారు. ‘ఆయన ముఖ్యమంత్రిగా కాదు ఫ్యాక్షనిస్టుకంటే ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నారు’ అని ఒక జర్నలిస్టు మిత్రుడు వ్యాఖ్యానించారు. కానీ ఆయనకు గానీ, ఆయనకు అనుచరులకుగానీ అర్థంకానిదేమంటే ఆయన ఇంకా పదవిలో కొనసాగడమే కేంద్రం దయాభిక్ష. రాష్ట్ర విభజన సమయంలో రాజకీయ మర్యాదలు దెబ్బతినకుండా వ్యవహరించాలని కేంద్రం ఆచితూచి అడుగేస్తున్నది. ఆయనను తప్పించి, పీలేరు పంపించడానికి కేంద్రానికి, కాంగ్రెస్‌కు ఒక్క క్షణం పట్టదు. కానీ సమస్యను జటిలం కాకుండా పరిష్కరించాలన్న ఏకైక కారణంతో, సహనంతో కేంద్రం అడుగులు వేస్తున్నది. కేంద్రం సహనాన్ని ఆయన తన బలంగా అనుకుంటూ ఉండవచ్చు. సొంత పార్టీలో పట్టుమని పదిమంది ఎమ్మెల్యేలను తన వెంట ఉంచుకోలేని నాయకుడు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని బీరాలు పలుకుతున్నాడు.

అసెంబ్లీ సమావేశం జరగకుండా, జరిగినా ఆలస్యంగా జరిగే విధంగా చేయాలన్నది ఆయన ఆఖరి యత్నం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రారంభంలోనే తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలన్నది యూపీఏ ప్రభుత్వం ప్రయత్నం. సమావేశాలు డిసెంబరు 5న మొదలవుతాయి. డిసెంబరు మొదటివారంలోపు బిల్లును అసెంబ్లీకి పంపి, తిరిగి వెనుకకు వచ్చేట్టు చూడాలన్నది కేంద్రం యోచన. కానీ కిరణ్ కొత్త కుట్రలు చేస్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాలను ‘నిరవధికంగా వాయిదాపోరోగ్)’ వేస్తూ నోటిఫికేషన్ జారీ చేయలేదు. అంటే స్పీకర్ ఎప్పుడంటే అప్పుడు సమావేశాలను పిలువచ్చు. కానీ ఇప్పుడు స్పీకర్ దిష్టిబొమ్మలు తగులబెట్టించి, ఆయనను విలన్‌గా చిత్రించి, ఆయనపై ఒత్తిడి తెచ్చి, ఇప్పటికిప్పుడు అసెంబ్లీని ప్రోరోగ్ చేయించేందుకు పావులు కదుపుతున్నారు. ఒకసారి ప్రోరోగ్ అయితే మళ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలంటే ముఖ్యమంత్రి నుంచి లేఖ వెళ్లాలి. ఆయన లేఖ రాయకపోవచ్చు. రాసినా స్పీకర్ పిలవాలి. అదంతా పూర్తికావడానికి కనీసం వారంరోజులు, అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. పార్లమెంటు సమావేశాలు డిసెంబరు 20తో ముగుస్తాయి. ఆ లోపు అసెంబ్లీ సమావేశం కాకుండా చూడడం, ఒకవేళ సమావేశం అయినా పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా అసెంబ్లీ నుంచి తిరిగి బిల్లు వెళ్లకుండా చూడడం వంటి వికృత ఆలోచనలు ఆయన చేస్తున్నారని ఆయన పార్టీవారే చెబుతున్నారు. తాటిని తన్నేవాడుంటే, వాడి తలను తన్నేవాడొకడు ఉంటాడు. ఇది చావు తెలివి. కేంద్రం శీతాకాల సమావేశాలను మరోవారం రోజులు పొడిగిస్తే కిరణ్ తల ఎక్కడ పెట్టుకుంటాడు? పార్లమెంటు సమావేశాల దాకా ఎందుకు? జీవోఎం నివేదికను సమర్పించడం, కేంద్ర మంత్రివర్గం ముసాయిదా బిల్లును ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం, రాష్ట్రపతి అసెంబ్లీకి నివేదించడం కిరణ్ ఆపగలడా? ఇవన్నీ జరిగిన తర్వాత కిరణ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిలువరించగలడా? నిలువరించి హైదరాబాద్‌లో ప్రభుత్వం నడుపగలడా? రాజకీయ సంక్షోభం తలెత్తకుండా చూడగలడా? తన ప్రభుత్వాన్ని తాను కాపాడుకోగలడా? అసలు తానే అధికారంలో కొనసాగగలడా? కిరణ్‌ది మేకపోతు గాంభీర్యం. కేవలం బుకాయింపు.

నిజానికి, సూక్ష్మంగా గమనిస్తే ముగ్గురు నేతలు ఇప్పుడు తమ సొంత రాష్ట్రంపైన దృష్టిని కేంద్రీకరించారు. రాష్ట్ర విభజనకు మానసికంగా సిద్ధమయ్యారు. ఒకాయన కుప్పం నుంచి యాత్రలు మొదలుపెట్టారు. ఇంకొకాయన కుప్పం నుంచి ఇచ్ఛాపురం యాత్రలు చేస్తానని ప్రకటించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పీలేరు నుంచి ప్రచారం మొదలు పెట్టారు. అక్కడ ‘వీర సమైక్య ఛాంపియన్’గా పేరు కొట్టేయాలన్నదే అందరి ఆరాటం. చివరి వరకు పోరాడి ఓడిపోయానని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి తాపత్రయపడుతుండవచ్చు. కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసి పార్టీ పెడతారన్న ప్రచారమూ జరుగుతున్నది. కానీ ఆయన జరుపుతున్న సభల్లో జనం స్పందన గమనించినవారెవరికీ ఆయన ప్రజానాయకుడిగా ఆమోదం పొందుగలరన్న నమ్మకం కలుగదు. కాంగ్రెస్‌ను ఎదిరించి మాట్లాడుతున్నందుకు సీమాంధ్రలో ఆయన ప్రసంగాలకు జనం ఊగిపోవాలి. కానీ అటువంటి హర్షధ్వానాలేవీ కనిపించడం లేదు. చంద్రబాబు, జగన్‌బాబు పరిస్థితి కొంచెం మెరుగు. ఈ నేతలు అక్కడ జనాన్ని ఉర్రూతలూగించలేకపోవడానికి కారణం స్వయంకృతం. వీరు చెప్పిన అబద్ధాలు, వీరు చేస్తున్న మోసం, వీరు మార్చుతున్న మాటలు వీరిపై జనంలో నమ్మకం సడలేట్లు చేశాయి. విభజన విషయంలో ఈ ముగ్గురిలో ఒక్క నాయకుడంటే ఒక్క నాయకుడు నిర్మాణాత్మకంగా వ్యవహరించలేదు. ‘ఈ సంక్షోభం ఇంకెన్నాళ్లు మోద్దాం? నేనున్నాను. నవ్యాంధ్రను నిర్మిద్దాం’ అని భరోసా ఇవ్వలేకపోయారు. సీమాంధ్రలో పనబాక లక్ష్మి, డొక్కా మాణిక్యవరప్రసాద్, కొండ్రు మురళి, బాలరాజు వంటి దళిత నాయకులు చూపిన ధైర్యాన్ని కూడా వీళ్లు చూపలేకపోయారు. ఇప్పుడు ఈ క్షణంలో కూడా సమైక్యాంధ్రను కాపాడతామనే భ్రమల జెండాలు పట్టుకుని తిరుగుతున్నారు. ఈ మోసపూరితమైన వైఖరే వారిని బలితీసుకుంటుంది.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

One thought on “ఆఖరిమెట్లు”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s