ఆ ఒక్కడు….


01_KCR (3)_1

మొదట వారు ఆయన ఉనికిని నిరాకరించారు. ఆ తర్వాత ఆయనను ఎగతాళి చేశారు. ఆయన వేషభాషలను గేలి చేశారు. వ్యక్తిత్వంపై దాడి చేశారు. ఆరోపణల వర్షం కురిపించారు. ఆయనను రాజకీయంగా అంతంమొందించడానికి యుద్ధం చేశారు.

ఎన్ని కుట్రలు,
ఎన్ని దెబ్బలు,
ఎన్ని గాయాలు,
ఎన్ని ఉద్విగ్న క్షణాలు…
అయినా ఆయన ప్రజాస్వామిక పంథాను వీడలేదు. ఒక లక్ష్యంకోసం ఇన్ని అవమానాలను, ఇన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్న నేత సమకాలీన చరిత్రలో మరొకరు లేరు. వందలాది మంది పిల్లలు మృత్యుపాశాన్ని కౌగిలించుకుంటుంటే ఆయన దుఃఖంతో చలించిపోయారే తప్ప హింసామార్గం ఎంచుకోలేదు. పోలీసులు తన కాళ్లూ చేతులూ పట్టుకుని బస్తాలా విసిరేసినప్పుడూ, మృత్యువు చివరి మెట్టుపై నిలబడినప్పుడూ కూడా సంయమనం కోల్పోలేదు. రాజకీయ సమీకరణే ఎప్పటికయినా తెలంగాణా సాధిస్తుందని ఆయన నమ్మాడు. ఉద్యమాలకు బెదరనివాడు అధికారం పోతుందంటే భయపడతాడని ఆయన బలంగా విశ్వసించాడు. చాలాసార్లు ఇటు తెలంగాణవాదులూ, అటు తెలంగాణ ద్రోహులూ ఇద్దరూ ఒకే గొంతుకతో ఆయనపై విరుచుకుపడ్డారు. కిందపడిన ప్రతిసారీ వెయ్యి ఏనుగల బలంతో లేచాడు. జారిపోతున్న శక్తులను కూడదీసుకుని మళ్లీ మళ్లీ పోరాడాడు. అందరినీ తెలంగాణ చక్రబంధంలోకి తీసుకొచ్చి నిలిపాడు.

చివరకు ఆయనే గెలిచాడు.

ఆ ఒక్కడు కేసీఆర్!

DSC_0055
పన్నెండేళ్ల క్రితం ఆయన ఒక సాధారణ నాయకుడు. మెదక్ జిల్లా తప్ప బయట పెద్దగా సంబంధాలు లేని నాయకుడు. వెనుక బలమైన సామాజిక వర్గంలేదు. తరగని ఆస్తులు లేవు. గట్టిగా గాలొస్తే కొట్టుకుపోయేంత బక్కపల్చటి మనిషి. మరోవైపు చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, డి.శ్రీనివాస్, జానారెడ్డి, దేవేందర్‌గౌడ్ వంటి బడాబడా నేతలు రాజకీయాలను ఏలుతున్నకాలం. అన్నింటా పాతుకుపోయిన బలమైన సీమాంధ్ర పారిశ్రామిక వర్గం. పగబట్టిన చానెళ్లు, పత్రికలు. బుసలు కొట్టే సామాజిక వర్గాలు. అందుకే తెలంగాణ సాధన ‘చెన్నారెడ్డి వల్లనే కాలేదు, ఈయన వల్ల ఏమవుతుంది?’ అందరూ తీసిపారేసిన రోజులవి. నిజమే చెన్నారెడ్డి, జానారెడ్డి, ఇంద్రారెడ్డి, నరేంద్ర…ఇలా చాలా మంది తెలంగాణ పతాకాన్ని అర్ధంతరంగా వదిలేసి పోయారు. ఇన్ని భుజంగాలను దాటుకుని, ఏరులాగా మొదలైన ఉద్యమాన్ని నదిలాగా మార్చి తీర్చి, తెలంగాణ పతాకాన్ని ఢిల్లీ పురవీధుల్లో ఊరేగించిన ఘనత కేసీఆర్‌ది. భావజాల వ్యాప్తి, ఉద్యమవ్యాప్తి, రాజకీయ అస్తిత్వ కాంక్షలను కలబోసి, కలనేసి ఒక దివ్యాస్త్రంగా మలిచిన నాయకుడు కేసీఆర్. సీమాంధ్ర ఆధిపత్య శక్తులు ఐదున్నర దశాబ్దాలుగా తెలంగాణపై రుద్దిన అనేక మిథ్యలను బద్దలు కొట్టి, ప్రత్యామ్నాయ సాంస్కృతిక చిహ్నంగా తెలంగాణ తల్లిని ఆవిష్కరించి అందరినోళ్లూ మూయించారాయన.

తెలంగాణవాద శక్తులన్నీ సంఘటితమై కాంగ్రెస్, టీడీపీ, తదితర రాజకీయ పక్షాల పునాదులను బద్దలు కొట్టకపోయి ఉంటే ఇవ్వాళ తెలంగాణ సాధ్యమయ్యేది కాదు. సాయుధ పోరాటాలకు గద్దె దిగనివాడు ఓటు ఆయుధంతో గద్దె దిగుతాడన్న ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలంగా నమ్మినవారు కేసీఆర్. సరిగ్గా ఈ సూత్రం ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయ గరిమనాభిపై నిలబడి అన్ని రాజకీయ పక్షాలనూ తెలంగాణ నినాదానికి ఒప్పించారు. రాజకీయ విస్తృతాంగీకారాన్ని సాధించారు. తెలంగాణ సమాజంలో మునుపెన్నడూ లేని ప్రత్యేక రాష్ట్ర చైతన్యాన్ని నాటగలిగారు. స్వీయ రాజకీయ అస్తిత్వం లేకపోతే ఏమవుతుందో, సీమాంధ్ర నేతల నాయకత్వంలోని పార్టీలు ఎప్పుడు ఎలా ఎందుకు వ్యవహరిస్తాయో ప్రజలకు అర్థమయ్యేలా చాటిచెప్పగలిగారు. తెలంగాణ ఎవరు ఇచ్చినా ఎవరు తెచ్చినా ఇవ్వడానికి, తేవడానికి భూమికను రూపుదిద్దినవారు కేసీఆర్. తెలంగాణలో అన్ని పార్టీలూ, నాయకుల రాజకీయ భవిష్యత్తును తెలంగాణ రాష్ట్ర డిమాండుతో ముడివేసి, ఎవరూ ఇటూ అటూ కదలలేని స్థితిని తీసుకువచ్చారు. రాజకీయాలు, ఉద్యమాల మధ్య తులాదండం ఏదో ఒకవైపు జారిపోకుండా చెయ్యిపట్టుకుని నడిపించారాయన. వేయిపడగల శత్రు సర్పానికి చిక్కకుండా ప్రత్యేక రాష్ట్ర డిమాండును ఆశయాల తీరానికి చేర్చారు.

తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను చెప్పడమంటే ఇతరుల పాత్రను గుర్తించకపోవడం కాదు. మహాభారత యుద్ధం అర్జునుడొక్కడే గెలవలేదు. శ్రీకృష్ణుడు, భీముడు, అభిమన్యుడు, ద్రుష్టద్యుమ్నుడు…వీరంతా లేరా? యుధిష్ఠిర, నకుల, సహదేవులు లేరా? అందరూ పోరాడినవారే. కానీ అర్జునుడే ప్రధాన పాత్రధారి, శ్రీకృష్ణుడు సూత్రధారి. యుద్ధాన్ని అనేక మలుపులు తిప్పి, విజయానికి బాటలు వేసింది వారే. తెలంగాణ సాధన పోరాటంలో వీరంతా ఉన్నారు. కానీ ఎక్కడ మొదలయ్యామో, ఏయే మలుపులు తిరిగామో గుర్తుచేసుకోకపోతే అది చరిత్రకాదు. తెలంగాణ రాజకీయ, విద్యార్థి, ఉద్యోగ, కుల సంఘాల జేయేసీలు నిర్వహించిన పాత్ర శ్లాఘనీయమైనది. కొన్ని కారక శక్తులు, కొన్ని ప్రేరక శక్తులు. కొన్ని చోదక శక్తులు, మరికొన్ని సాధక శక్తులు- ఈ విజయం అందరిదీ.

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily

14 thoughts on “ఆ ఒక్కడు….”

  1. చాల బాగా చెప్పారు …ఉద్యమ నిర్మాణంలో ఎదుర్కొన్న ఆన్ని సమస్యలను అక్షరరూపంగా మలిచితే బాగుంటుంది..మీరు చేస్తారన్న విశ్వాసం ఉంది

  2. కరెక్ట్ సర్ ! కేసీఆర్ ను పూర్తిగా అవగాహన చేసుకోవాలంటే…ఫిలాసఫీ, చరిత్ర, ప్రపంచ ఉద్యమ విజయాల మీద కనీస అవగాహన ఉండి, ఉండాలి. మెజారిటీ జనంలో అంత అవగాహన లేకపోవడం వల్లే ఆయన అపార్ధమయ్యాడు. వర్తమాన చరిత్రలో ఆయనంతగా అపార్దమైన వ్యక్తి, నాయకుడు మరొకరు లేరేమో. ఉద్యమాన్ని పడుకోబెడుతుంటాడనీ, ఫాంహౌస్్లో రెస్టు తీసుకుంటుంటాడనీ, రాజకీయ ప్రయోజనాలు చూస్కుంటుంటాడని ఎన్నెన్నో మాటలన్నారు. కానీ అవన్నీ ఉద్యమ ప్రయాణంలో తప్పనిసరి భాగాలని నిజాయతీగా గుర్తించినవారు మీలాంటి అతికొద్ది మంది మాత్రమే. రోజూ ఉద్యమం నడిస్తే…తెలంగాణ జనంలో విసుగొస్తుందని గుర్తించినవారెందరు! రాజకీయ మార్గం ద్వారానే తెలంగాణ సాధ్యమని అప్పట్లో గుర్తించినవారెందరు! ( గద్దర్ లాంటి వాళ్లు సైతం కేసీఆర్ ను అపార్దం చేసుకున్నారు. ). ఉద్యమం ద్వారా రాజకీయం, రాజకీయం ద్వారా ఉద్యమం….ఈ రెండూ బొమ్మా – బొరుసుల్లాంటివి. ప్రత్యేక తెలంగాణ అనే నాణెం చెల్లాలంటే ఆ బొమ్మా – బొరుసులు రెండూ తప్పనిసరిగా ఉండాలని గుర్తించినవారెందరు.

    ఫైనల్్గా చెప్పాలంటే…వాడు మగాడురా బుజ్జీ, మొక్కకు అంటుకట్టినట్టు.., గాయానికి శస్త్ర చికిత్స చేసినట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా ఉద్యమం, రాజకీయం నడిపాడు. వాడు మగాడురా బుజ్జీ ( సరదాగా )

  3. ఒక్క మాటలో చెప్పాలంటే …
    కెసిఆర్ లేని తెలంగాణా ను
    ఊహించుకోలేం ….

  4. Yes. But this Spoorthi Should be Continued for the Devolopment of TS. If not so, Guntakada Pandikokkulu ready Ga Unnaru.

  5. గొప్ప వివరణ సర్…చాలా బాగా వివరించారు..నాయకత్వం మొదలు విజయం వరకు అన్ని శక్తులు…ఓడించడానికి చేసిన కుయుక్తులు..విజయ సారధులు..సైనికులు. …అన్ని కోనాలను గొప్పగా వివరించారు. ..

Leave a comment