అస్తిత్వ చేతన జీవన జ్వాల హిమజ్వాల


నేను సాహితీ విమర్శకుడిని కాదు, సాహిత్యంతో నా పరిచయం కూడా పరిమితమైనదే.నేను ఒక పాఠకుడిగా, వడ్డెర చండీదాసు మాస్టారు విద్యార్థిగా ఆ పరిమితుల్లోనే, ఆ పరిధుల్లోనే హిమజ్వాల గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. మాస్టారు సాహిత్యంలో నేను ఎక్కువసార్లు చదివింది హిమజ్వాలనే. హిమజ్వాల ఒక సంక్లిష్ట జీవన వర్ణచిత్రం.
ఏ కొలమానాలకూ అందని, ఏ చెలియలి కట్టలకూ ఒదగని జీవన ప్రవాహం. ఏదో ఒక భావజాలం దృష్టితో చూస్తే అద్భుతాలు కనిపించకపోవచ్చు, కానీ భావుకత దృష్టితో చూస్తే ఈ నవల అసాధారణంగా కనిపిస్తుంది.

భావోద్దీపనలు, మధురోహలు, రస రాగరంజితమైన ప్రతిస్పందనలు మనుషులను ఏయే దారులలో నడిపిస్తే, ఆయా దారుల వెంట మనల్ని తీసుకెళతారు. నటన, కాపట్యం, కుహకాల సరిహద్దులు దాటి, మర్యాదల ముసుగులు తీసి, సంప్రదాయాల కుదురును దగ్ధం చేసి, బాహ్య అంతఃచేతనలో మనిషి నిజస్వరూపాన్ని బట్టబయలు చేసిన మనోవైజ్ఞానికుడాయన.

మనం ప్రపంచంలోని అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటాం. ఏం తినాలో, ఎలా తినాలో, ఏ బట్టలు వేసుకోవాలో, ఏ రంగు బట్టలు ధరించాలో, వాటిని ఎక్కడ కుట్టించుకోవాలో, ఏ వాహనం కొనుక్కోవాలో అందరం బాహాటంగా మాట్లాడుకుంటాం, చర్చోపచర్చలు చేసి, ఏరికోరి ఎంపిక చేస్తాం, ఎక్కడో ఎంగిలిపడతాం, చిరంజీవి సినిమా మొదలు హాలీవుడ్ సినిమాల వరకు అన్నింటి గురించీ అందరితో చర్చిస్తాం, కానీ మనిషి అత్యవసరాల్లో ముఖ్యమైనదీ, అత్యంత సహజమైనదీ అయిన సెక్సు గురించి మాత్రం మాట్లాడుకోవడానికి జంకుతాం. దానినొక జైవికావసరంగా గుర్తించం, అందులోని సాధకబాధకాల గురించి మన భావనలను ఎవరితోనూ పంచుకోం, ఆ జడత్వం, ఆ నియంత్రిత మనస్తత్వం, ఆ సంప్రదాయాల ఇనుపతెర సామాజిక సంబంధాలను హింసాత్మకం చేస్తుంది. వడ్డెర చండీదాసు ఆ టాబూను బద్దలు కొట్టారు సెక్సు గురించి మాట్లాడుకోగూడని అపోహల సామ్రాజ్యంపై ఆయన దాడి చేశారు. మనిషి చేతనావస్థలోనే కాదు, అంతః చేతనావస్థలో సంఘర్షించే స్పష్టాస్పష్ట భావాలను, పలవరింతలను, పీడకలలను, ముడి ఆలోచనలను ఆయన అక్షరబద్ధం చేశారు.

ఆయన దృష్టిలో వ్యక్తి నిజం, సమాజం కల్పితం. వ్యక్తిలేకుండా సమాజం లేదు. వ్యక్తి ఉన్నతమైతే సమాజమూ ఉన్నతమవుతుంది. వ్యక్తి కుళ్లిపోతే సమాజమూ కుళ్లిపోతుంది. వ్యక్తివాది గానే ఆయన సిద్ధాంతాలను కూడా వ్యతిరేకిస్తారు. సిద్ధాంతం సమాజం మార్పును కోరుతుంది. అందుకోసం సంఘటిత కార్యాచరణను బోధిస్తుంది. వ్యక్తివాదం వ్యక్తి మారాలని చెబుతుంది, మంచయినా చెడయినా వ్యక్తుల్లోనే ఉందని చెబుతుంది. రక్తమాంసాలున్న వ్యక్తిని సిద్ధాంతాలలో బంధించడం సాధ్యం కాదంటారాయన. ఆయన అభిప్రాయాలతో విభేదించే వారుండవచ్చు. సిద్ధాంతాలు మనుషుల జీవితానికి అతీతమైనవని, అవి మనుషులను ప్రభావితం చేయవని నేను కూడా అంగీకరించను. వ్యక్తివాదం కూడా ఒక సిద్ధాంతమే. నిర్మాణ కృషిలో వ్యక్తి,  సమాజం పరస్పరాశ్రీతాలు, సమాజం వ్యక్తిపై అజామాయిషీ చేస్తుంది. అనేకానేక రూపాల్లో! ఆయన అంగీకరించలేదు. సిద్ధాంతాల వెలుగులో పాత్రలు మూసపోసినట్టు నడుచుకుంటాయని, జీవితంలో మనుషులు అలా నడుచుకోవటం సాధ్యం కాదని ఆయన చెప్పేవారు. హిమజ్వాలలో మాత్రం సిద్ధాంతాలు నడిపిస్తే నడిచొచ్చిన పాత్రలు అట్టే కనిపించవు.

ఆయన 1960లో ఈ నవలను ప్రారంభించారు. 1961 ఆరంభంలో మొదటి అధ్యాయం పూర్తయింది. మళ్లీ 196లో ప్రారంభించి ఐదు మాసాల్లో పూర్తి చేశారు. ఏడేళ్లపాటు తనలో నలుగుడు పడుతూ, గుప్తంగా సెగ రగుల్చుతూ ఉండిపోయిన హిమజ్వాలను, ఆ భావాల సాంద్రత, వొత్తిడి, ఉక్కిరి బిక్కిరి చేస్తే  తప్పనిసరై రాశానని ఆయన అర్థాను(స్వా)సారంలో చెప్పుకున్నారు. ఆయన నవలకు నిర్వచనం ఇస్తూ, పీలగా అస్పష్టంగా ప్రారంభమైన ఉపనదులతో మొదలై వొడ్డులొరసి, పొంగిపొరలే ప్రవాహమై, చివరకు సుడులు తిరుగుతూ సముద్రంలో అదృశ్యమయ్యే నదిలాంటిది అంటారు. ఆయన దృష్టిలో రసానుభూతి సాహిత్య పరమావధి, యదార్థంలోంచి వడపోస్తుంది. సాహిత్యం, జీవితం ఎంతకీ తరగని స్వయం జ్వలిత హారతి కర్పూరం అంటారాయన. ఈ మరీచికా జీవితానికి అంతమంటూ లేదు అని ఆయనే చెబుతారు. సమాజంలో తారతమ్యాలు సహజం, ఆ తారతమ్యాలను అధిగమించేందుకు మనిషి చేసే ప్రయత్నంలో రగడ జరగడమూ అనివార్యమే. ఆ రగడకు అక్షర రూపమే హిమజ్వాల. ఆయాపాత్రలు మృగతృష్ణ కోసం సాగించిన ప్రయాణమే హిమజ్వాల.

హిమజ్వాల రెండు ప్రధాన పాత్రల చుట్టూ చరిస్తుంది. గీతాదేవి- ఉన్నత విద్యావంతురాలు అందంలో అప్సరస. మధ్యతరగతి నేపథ్యం. బతికి చెడిన నేపథ్యం, గొప్ప భావుకత, సౌందర్యారాధన, సంగీతాభిలాష, రాగరంజితమైన రససిద్ధిని పొందాలన్న తపన మూర్తీభవించిన పాత్ర. ఆంగ్లంలో ఎం.ఎ. చదువుతుంది. పాశ్చాత్య సాహిత్యాన్ని, జీవితం లోతులను చదువుకుంది. కృష్ణ చైతన్య- ఫిలాసఫీ లెక్చరర్.  ఉన్నతమైన వ్యక్తిత్వం, వయసును మించిన పెద్దరికం, తాత్వికధోరణి ఆయన లక్షణాలు. ప్రాచ్యపాశ్చాత్య తాత్విక, సంగీత సంప్రదాయాలను ఔపోసన పట్టిన మేధావి. భావుకుడు, సౌందర్యారాధకుడు. వీరిద్దరూ ఒకానొక ప్రమాదవశాత్తూ కలుస్తారు, సన్నిహితులవుతారు. ప్రకృతి ఒడిలో వెన్నెల రాత్రుల్లో ఏకాంతంలో అనురాగవీణలు శ్రుతి అవుతాయి. గీతాదేవి తన మనసులో ఉన్నదేమిటో బయట పెడుతుంది. తనకు కావలసిందేమిటో స్పష్టం చేస్తుంది.

ఒకానొకరోజు తను సర్వస్వం అర్పించుకోవడానికి సిద్ధం అవుతుంది. కానీ కృష్ణ చైతన్యలో గూడుకట్టుకున్న వ్యక్తావ్యక్త అంతఃచేతనా ప్రకంపనలు ఆయనను అచేతనుడిని చేస్తాయి. ఆయన అడుగు ముందుకు వేయలేకపోతాడు. అభిమానం దెబ్బతిన్న గీతాదేవి, ప్రొఫెసరు గారూ మనిషికి ఆకలి వేసేది ఒక్క కడుపులోనే కాదు అని ఒక లేఖరాసి పెట్టి, బొంబాయిలో తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ నానా అగచాట్లు, అవమానాలు పడుతుంది. ఎక్కడా మోహించే వారే. వెకిలి చేష్టలతో వేధించేవారే, కృష్ణచైతన్య మిత్రుడు జర్నలిస్టు శశాంక సహాయంతో ఒక పత్రికలో సబ్ ఎడిటర్‌గా చేరుతుంది. అక్కడి నుంచి కొన్నాళ్లకు విశాఖలో ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా వెనుకకు వస్తుంది. అక్కడ అనుకోని సరిస్థితుల్లో శివరామ్‌ను పెళ్ళి చేసుకుంటుంది, శివరామ్ మామూలు మధ్యతరగతి జీవి. నాలుగు గోడల మధ్య అతి రహస్యంగా తప్ప సెక్సు గురించి మాట్లాడలేని సగటు మనిషి, గీతాదేవి రసజీవి, మనోజనిత భావ ప్రపంచంలో విహరించాలని ఆరాటపడే రాగరంజిత. సముద్రం వెంట స్వేచ్ఛగా విహరించాలని కోరుకునే సౌందర్యపిపాసి, ఒకసారి అరుకులోయ వెళతారు, అక్కడ అడవుల్లో విహరిస్తుంటారు, ఉన్నట్టుండి జోరువాన మొదలవుతుంది. గీతాదేవి రొమాంటిసైజ్ అవుతుంది. వర్షంలో ఆకాశాన్ని  వీక్షిస్తూ ఆ పచ్చిక బయలులో, వెల్లకిలా పడుకుంటుంది. శివరామ్ స్పందించడు. పైగా దూషిస్తాడు. బరితెగించిన ఆడదానివని నిందిస్తాడు. అడ్డగోలుగా మాట్లాడతాడు. ఇద్దరూ గొడవ పడతారు, శివరామ్ ఆమెను వదిలేసి వెళతాడు. గీతాదేవి ఆవేశంలో నడక ప్రారంభిస్తుంది. దారిలో విజయ సారథి  తారసపడతాడు. ఆమెను చేరదీస్తాడు. ఇద్దరూ హైదరాబాద్ వస్తారు. సారథి మాట, ధోరణి, నడవడి అన్నీ ఆమెను కరిగిస్తాయి. సారథి కూడా ఆమెలో కోల్పోయినదానిని వెతుక్కుంటాడు, గీతాదేవి కూడా స్పందిస్తుంది. దేహాలు, ఆత్మలు ఒక్కటవుతాయి.

కృష్ణ చైతన్య గీతాదేవి వెళ్లిపోయిన తర్వాత వికలుడై ఊటీ వెళతాడు. అక్కడ చిదంబరావు అనే ఒక రోగితో ఆయనకు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం స్నేహం అవుతుంది. చిదంబరావు మరికొంత కాలానికి చనిపోతాడని డాక్టర్లు చెబుతారు. మందులతో బతుకుతుంటాడు. తరచూ ఇంటికి వచ్చి వళ్ళే కృష్ణచైతన్యకు చిదంబరావు భార్య మాధురీదేవితో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఒకనొక రోజు రాత్రి ఆ ఇంటిలో బస చేయాల్సి వస్తుంది. భర్తకు మత్తుమందు ఇచ్చిన మాధురీదేవి కృష్ణచైతన్యను ముగ్గులో దించుతుంది. చైతన్య ఎప్పటిలాగే మనోవికల్పితమైన జాడ్యంతో తొలుత ప్రతిఘటిస్తాడు. మాధురీదేవి ఆయనను లొంగదీస్తుంది. తొలిసారి ఆయన రససిద్ధి పొందుతాడు. తాను గీతాదేవి వద్ద కోల్పోయింది ఏమిటో ఆయన తెలుసుకుంటాడు. చిదంబరావు మరణిస్తే  మాధురితోనే జీవితం అనుకుంటాడు. చిదంబరావు ఒక బైరాగి ఇచ్చిన మూలికమందుతో కోలుకుని భార్యను తీసుకుని వెళ్లిపోతాడు. మరోసారి వికలుడైన కృష్ణచైతన్య అఖిలానంద ఆశ్రమానికి చేరతాడు.
ఒకరోజు తన తండ్రి సారథి గుండెపోటుతో మరణించడంతో కృష్ణచైతన్య ఇంటికి వస్తాడు. గీతాదేవి అక్కడే ఉంటుంది. ఆశ్చర్యపోతాడు. తాను ఎక్కడెక్కడో వెతుకుతున్న మనిషి తన ఇంటిలో ఉండటం ఆయనకు సంతోషం కలిగిస్తుంది. సారథి బంధువులంతా గీతాదేవిని ఆడిపోసుకుంటూ ఉంటారు. చైతన్య మాత్రం ఆమెను దగ్గరకు తీసుకుని తన పాత ప్రేయసిలా పరిగణించబోతాడు. తాను సారథి ప్రేయసినని, తనకు ఏమీ కాననీ చెబుతుంది. తాను నమ్మడం లేదంటాడు. గతాన్ని వదిలేయమంటాడు. బంధువులను దిగబెట్టడానికి రైల్వే స్టేషన్‌కు వెళతారు. అక్కడ పిచ్చివాడి రూపంలో శివరామ్ తారసపడి నానా గొడవ చేస్తాడు. ఇంటికి తీసుకొస్తారు. శివరామ్ గీతాదేవి ఒక గదిలో మాట్లాడుతూ ఉంటారు. తనతో వచ్చేయమంటాడు. తాను రానంటుంది. ‘సరోవరం లాంటి హృదయంలో ఉండాల్సిన నేను నీ గాజు గుండెలో ఉండాలని కోరుకోనని తెలియదేమో నీకు! నువ్వొక కాగితం పువ్వువి. నాక్కావలసిన పరిమళం లభ్యం కాదు. నువ్వొక రంగు పువ్వులు చెక్కిన గాజు హృదయానివి. కానీ నాక్కావల్సింది పచ్చని పచ్చిక హృదయం. ప్రపంచంలో ఏ ఒక్కరికోసమూ నన్ను నేను వంచించుకోలేను. కానీ ఒక్క రసస్పందనకోసం, ఒక్క వెన్నెల కోసం, రసహృదయపు లోలోతుల పలవరింతలకోసం నా సర్వస్వాన్ని అర్పించుకోగలను. అది లభ్యం కానపుడు నాకు ఏదీ లక్ష్యం కాదు. నువ్వే కాదు ఎవరితోనూ నా జీవితాన్ని బండరాయిలా చేసి పడేసుకుని నన్ను నేను క్షమించుకోలేను. ప్రపంచం హృదయమంత విశాలమైంది, అన్వేషిస్తూ సెగలాంటి బాధతో సాగిపోతాను. నా జీవితం అంతా అడవి కాచిన వెన్నెలే అయిపోతుంది, అవనీ, అనుభవంతో పుష్పించకుండా, పండిన అనుభూతిలా రాలిపోతాను. కానీ ముందు గాజు గుండెకి’ అని తన మనోతాత్వికతను బట్టబయలు చేస్తుంది గీత. శివరామ్ సగటు మనిషిలా, పశువులా రెచ్చిపోతాడు. తన తలను ఆమె తలతో మోదుతాడు. ఇద్దరూ నేలకొరుగుతారు. స్వేచ్ఛకూ, కట్టడికీ మధ్య జరిగిన సమరం అక్కడ ఆగిపోతుంది.
చండీదాస్ మాస్టారు వర్ణనలు అద్భుతం. గడ్డిపోచ మొదలుకుని తారుపూసుకున్న ఆకాశం వరకు ఆయన దేనిని అలంకార రహితంగా వర్ణించలేదు, నవ్వును, మాటను, మనిషి కదలికలను, దేహపరిమళాన్ని గొప్ప సౌందర్య దృష్టితో వర్ణించారు.

‘నవ్వితే… సెలయేరు మలుపు తిరిగిన ధ్వని
ఎండమావి మాట్లాడినట్టనిపించింది
సరస్సులో చేపలు కొట్టుకుంటున్నట్టుగా
నీటిబుడగ చిట్లినట్టుగా,’

‘పింక్ షాంపేన్ నింపిన గ్లాసులా తెల్లని బ్లౌజులోంచి జబ్బలు’

‘లాలిత్యాన్ని, అనురాగాన్ని, సౌందర్యాన్ని , శృంగారాన్ని , మాధుర్యాన్ని
యేకం చేసి రెప్పల కింద దాచుకున్న ఆ కళ్లు, యే స్వప్నంలోనో కారుణ్య స్రవంతి ఐ ప్రవహిస్తాయేమో!’

‘తారు పూసినట్టు ఆకాశంలో మబ్బులు.’

‘జుట్టు విప్పుకుని, పొగరంగు చీర కట్టుకుని , విషాదం పుక్కిలింతలు చేస్తే, పొర్లు కొచ్చిన కన్నీటితో, కొండలను కూచోబెట్టి, తలలో ఎండిపోయిన పూలను తీసి, తలంటు పోస్తున్నాయి మేఘాలు ’- వర్షాలు వస్తున్నాయని చెప్పడానికి ఎంత సీను క్రియేట్ చేశారో చూడండి.

‘కాలం యెదురు దెబ్బలు తిన్నట్టుగా కుంటినడకలు సాగిస్తోంది.’
‘నిద్ర చిట్లిన మేఘంలా విడిపోతుంది.’
‘కౌగిలి విడిపించుకుని దూరంగా నిలిచిన ప్రేయసిలా కనిపించే ఆకాశానికి, నిరీక్షణతో కుంగిపోయిన ప్రియుడిలా అనిపించే భూమికీ మధ్య గాలి చలనంతో ఆకారాన్ని పొందిన
నిరావరణం.’

‘ఈ రూపం, ఈ లాలిత్యం, ఈ మహోజ్వల రసఘనీభవపు సౌందర్యం నీకు లభ్యం కాదు. ఆమె ఆకారం ఒంపులలో చిక్కుకుంటున్న తన చూపును గుంజు కుంటూ నడిచాడు.’
‘అన్ని రకాల మనస్తత్వాలూ చర్చించే తనలోకే చూసుకోలేక పోయి వ్యర్థ విజ్ఞానినై, వాళ్ళలోనే ఉంటూ  వాళ్లకి దూరంగా…’చైతన్య సాధించలేనిది మాధురి సాధించింది. గీత సిద్ధింపజేయలేనిది మాధురి సాధించింది. భాషకు భావుకతను అబ్బారు. అక్షరాలకు ప్రాణం పోశారు.

……….

చివరగా చండీదాసుగారి గురించి నాలుగు మాటలు – ఆయన ఒక సముద్రం. ఆయన సాహిత్యం ఒక సాగరం. సముద్రం ఎంత గుంభనంగా, అంతుబట్టకుండా ఉంటుందో ఆయనా అలాగే అనిపించేవారు. వచ్చీ పోయే అలల్లాగా ఆయన క్లుప్తంగా, తాత్వికంగా మాట్లాడేవారు. ఆయన మాటల్లో వెంటనే సమాధానం దొరకదు.

‘మీరు కృష్ణచైతన్య కాదు కదా’
‘అటువంటి వారు ఎందరో’
‘గీతాదేవిని ఎందుకు చంపారు?’
‘నేను చంపలేదు,  ఆమె చనిపోయింది’
‘గీతా దేవిలా ప్రవర్తిచే వారందరికీ అదేగతి పడుతుందని చెప్పదల్చుకున్నారా’
‘ఏమో చెప్పలేం.అందరికీ అదేగతి పట్టాలని లేదు’
‘గీతదేవి స్వార్థపరురాలు’
‘స్వార్థం సహజం’
‘త్యాగం అబద్ధమా’,
‘కృత్రిమం, కల్పితం’
‘నవల ప్రయోజనం ఏమిటి?’
‘బయటికి కనిపించేదంతా జీవితం కాదు. అసలు జీవితం బయటికి కనిపించడం లేదు. నిజమైన  జీవితాలను దర్శింపజేయడమే లక్ష్యం’
‘నవలలోని జీవితాలు సామాజిక వాస్తవికతకు దూరంగా ఉన్నాయి’
‘ఏది సామాజికమో అది జీవితం కాదు. వాస్తవికమూ కాదు’
వ్యక్తి అస్తిత్వమూ, సామాజిక అస్తిత్వమూ రెండూ జీవితాల్లో ఉన్నాయి. చైతన్య, శివరామ్ అలా వ్యవహరించడానికి సామాజిక అస్తిత్వం తాలూకు స్పృహే కారణం.
సామాజిక సంస్కారమే మనిషిని బందీని చేస్తూ ఉంటుంది. అలాగని వారిలో వ్యక్తి అస్తిత్వ చైతన్యం లేదని చెప్పలేం. మనిషిని ఎప్పుడు ఏ చైతన్యం డామినేట్ చేస్తుందన్నదే సమస్య.
చండీదాస్‌గారు ఈ వాదనను ఒప్పుకునేవారు కాదు. కమ్యూనిస్టులు వ్యక్తిని సమాజానికి ముడిపెట్టకుండా ఆలోచించలేరు అనేవారు.ఆయనతో చర్చలు అనంతంగా సాగిపోయేవి.  ఎంత గట్టిగా కొట్లాడినా, ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా ఆయన మనుషుల్ని ప్రేమించేవారు. మమ్మల్ని దీవించేవారు. ఇప్పుడాయన లేరు. ఆయన మాకిచ్చిన తాత్విక స్ఫూర్తి ఉంది.

kattashekar@gmail.com

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

4 thoughts on “అస్తిత్వ చేతన జీవన జ్వాల హిమజ్వాల”

  1. ***Thank’s sir for sharing…సాహిత్య పరమావధి, యదార్థంలోంచి వడపోస్తుంది. సాహిత్యం, జీవితం ఎంతకీ తరగని స్వయం జ్వలిత హారతి కర్పూరం,సమాజంలో తారతమ్యాలు సహజం, ఆ తారతమ్యాలను అధిగమించేందుకు మనిషి చేసే ప్రయత్నంలో రగడ జరగడమూ అనివార్యమే. ఆ రగడకు అక్షర రూపమే హిమజ్వాల.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s