వైఎస్, కిరణ్- సేమ్ టు సేమ్, చేవచచ్చిన టీ కాంగ్రెస్ నేతలు


రిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. పోగాలము దాపురించినవాడు కనడు, వినడు. వెనుకటికి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ఎంతమాట వస్తే అంత మాట మాట్లాడేవాడు. చంద్రబాబును పట్టుకుని అమ్మ పేరుతో తిట్టాడు. ఈటెల రాజేందర్‌ను పట్టుకుని తలకాయ ఎక్కడపెట్టుకుంటావని నోరుపారేసుకున్నాడు. చనిపోవడానికి రెండు రోజుల ముందు ప్రతిపక్షాలను ఫినిష్ చేస్తానని ప్రగల్బాలు పలికాడు. విధి బలీయమైనది. ఆయననే తీసుకెళ్లింది. ఆయన కడపజిల్లా నేత. అధికారం తలకెక్కిన అగ్రకుల దురహంకారం, ఫ్యాక్షనిస్టు సంస్కారం ఆయన మాటల్లో ధ్వనించేది.

ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అదే బాణీలో వెలుతున్నారు. రాజశేఖర్‌రెడ్డిలాగా బలమైన నాయకుడిని అనిపించుకోవాలనుకుంటున్నాడు. ఈ ప్రాంతానికి ‘ఒక్క పైసా ఇవ్వను ఏం చేస్కుంటావో చేసుకో’ అని అసెంబ్లీలో హరీష్‌రావును ఉద్దేశించి మాట్లాడారు. ‘బయ్యారం గనుల మెమొను రద్దు చేయను ఏం చేస్తావో చేసుకో’ అని కేసీఆర్‌కు సవాలు విసిరారు. ‘భూకంపం సృష్టిస్తాడట. దానిని ఎదుర్కొనే శక్తి మాకుంది’ అని బెదిరించారు. ఆయన ధోరణి ఎలా ఉందంటే, ఆయనేదో ఆయన సొంత సొమ్ము ఇస్తున్నట్టు, ఆయన సొంత ఆస్తులు పందేరం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అహంకారానికి పరాకాష్ఠ. బయ్యారం గురించి ఒక్క టీఆరెస్ కాదు, టీడీపీ, సిపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌లోనే తెలంగాణ నాయకులు మాట్లాడారు.

ఆయన సవాలు విసిరింది ఒక్క టీఆరెస్‌కే కాదు. అందరికీ. ఈయన కడప సరిహద్దుల్లోనే ఉన్న చిత్తూరు జిల్లా కలికిరి నేత. ఇద్దరిదీ ఒకటే సామాజిక వర్గం. ఇద్దరిదీ ఒకటే సంస్కారం. ఆయన లక్ష్యమూ తెలంగాణ ఉద్యమాన్ని తొక్కేయడమే. ఈయన లక్ష్యమూ తెలంగాణ ఉద్యమాన్ని ఆగం పట్టించడమే. శ్రీ కృష్ణ కమిటీ రహస్య అధ్యాయం ప్రకారం సాగదీసి, చీల్చి, కూల్చి, తెలంగాణ లేదనిపించాలని ఈయన లక్ష్యం. కాంగ్రెస్‌లో ఆ లక్ష్యం నెరవేరింది. ఇంతకుముందు మెజారిటీలు కొట్లాడేవారు. ఇప్పుడు మూడు వర్గాలు. ఒకటి భజనవర్గం. రెండవది చెంచాగిరి వర్గం. మూడవది ఉట్టికీ స్వర్గానికీ మధ్య ఊగుతున్న వర్గం.

తెలంగాణ మంత్రులు ఏమయ్యారో తెలియదు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడ పడుకున్నారో తెలియదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి పాదాల వద్ద వానపాముల్లా పాకుతున్నారు. ఆయన వికటాట్టహాసం చేస్తున్నారు. రాయలసీమ నాయకులు పాలించడానికి పుట్టారు. తెలంగాణ నేతలు పాకడానికి పుట్టారు. వాళ్లు సవారీ చేయడానికి పుట్టారు. వీళ్లు సవారీ మోయడానికి పుట్టారు. వాళ్లు సింహాసనంపై కూర్చుంటే వీళ్లు వింజామరలు విసురుతుంటారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అస్తిత్వాన్ని కోల్పోయిన జాతి. తమను తాము మరచిపోయిన జాతి. సవాలు చేయలేని జాతి.

అయినా ప్రతి కుక్కకూ తీర్పులు చెప్పే రోజొకటి వస్తుంది. ప్రతి మనిషికి జవాబు చెప్పే తరుణం ఒకటి వస్తుంది. ప్రతినేతకు పతనం ఎక్కడో రాసిపెట్టే ఉంటుంది. కిరణ్‌కుమార్‌రెడ్డి అందుకు అతీతం కాదు. ‘ఐదూళ్లు కూడా ఇవ్వను పో’ అని ధూర్తించిన ధుర్యోధనుడు ఏమయ్యాడు. ‘చేతనయితే యుద్ధం చేయమనండి. ఈ సంధి రాయబారాలెందుకు’ అని సంధి ప్రయత్నాలను ఎగతాళి చేసిన కురువంశం చివరకు ఎలా అంతమయింది. పాండవులు యుద్ధం చేయలేక కాదు. ధర్మం కోసం వనవాసం చేశారు. అజ్ఞాతవాసం చేశారు. సంజయరాబారం అయింది. శ్రీకృష్ణ రాయబారం అయింది. అన్ని ప్రయత్నాలు విఫలమయిన తర్వాత కురుక్షేత్రం అనివార్యం అయింది. కురుక్షేత్రం మొదలయిననాడు ఈ కిరణ్‌కుమార్‌రెడ్డికి ఒక్కడు ఒక్కడు మిగలడు. పీలేరులో ఆయన గెలిస్తే బ్రహ్మాడం. అప్పుడు తెలుస్తుంది-అయ్యవారి సత్తా!  భూకంపం ఎలా ఉంటుందో, భూమి కింద మట్టి ఎలా కదిలిపోతుందో అప్పుడు కానీ అర్థం కాదు. అప్పటిదాకా ఈ మిడిసిపాటు తప్పదు.

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s