అంతిమ ఉద్యమరూపంగా ఎన్నికలు


సూర్యాపేట, మార్చి 29; ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్న సభ. నేతలంతా ప్రసంగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి ప్రసంగిస్తూ ముఖ్యమంత్రిని ఆకాశానికెత్తారు. 2014 తర్వాత కూడా కిరణ్‌కుమార్‌రెడ్డే ముఖ్యమంత్రి అని సెలవిచ్చారు. ఇంకా మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనమండలి ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్, ఇంకా చాలా మంది మాట్లాడారు. తెలంగాణ ఊసు లేదు. సభలో చప్పుడు లేదు. చప్పట్లు లేవు. ఉక్కపోత తప్ప. గుత్తా సుఖేందర్‌రెడ్డి లేచి, ‘ఇక్కడి ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్యమంత్రి సహకరించాలి. రెండు రాష్ట్రాలు ఏర్పడితే ఆంధ్రాకు కిరణ్ ముఖ్యమంత్రి కావచ్చు’ అని మాట్లాడారు. సభలో ఒక్కసారిగా హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. మహిళలు, పురుషులు అన్న తేడా లేదు. ఈలలు, కేరింతలు, జై తెలంగాణ నినాదాలు … ఒకటే అలజడి. ‘ఇది…ఇలా మాట్లాడాలి. మగాడంటే ఈయన’…పక్కన కూర్చున్న వ్యక్తి చాలా ఆవేశంగా అంటున్నాడు. వేదిక మీద ఉన్న మిగిలిన నేతల ముఖాలు మాడిపోయాయి. ఈ సభ తెలంగాణ ప్రజల అంతరంగాన్ని తెలియజేస్తుంది. ఈ సభకు వచ్చిన వారంతా ప్రభుత్వ యంత్రాంగం, దామోదర్‌రెడ్డి సమీకరించుకున్న వారే.  ఎవరు సమీకరించారన్నది కాదు. ఏ పార్టీ సభ అన్నది కూడా సమస్య కాదు. తెలంగాణే సమస్య. గుండె గుండెలో నిండిపోయిన నినాదం అది. ఆ పేరెత్తగానే జ్వలించిపోయే జనం ఇప్పుడూ ఊరూరా ఉన్నారు. ప్రతిసభలో ఉన్నారు. తెలంగాణవాదానికి అండగా నిలబడమని వాళ్లకు ఇప్పుడు ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికలు వస్తే ఎవరికి ఓటేయాలో వీరికి ఎవరయినా చెప్పాల్సి అవసరం ఉంటుందా? కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే రేపు సుఖేందర్‌రెడ్డినయినా ఇప్పుడు జైకొట్టిన ప్రజలు సహిస్తారా? ఇన్నేళ్లు కొట్లాడినా తెలంగాణ రాలేదని ఆశోపహతులైన ప్రజానీకం తమ ఆగ్రహాన్ని ఎలా వ్యక్తీకరించాలి? అందుకు ఓటు ఆయుధం కాదా? ఈ ఆయుధంతో ఎవరి తలలు తెగిపడతాయి? ఎవరు బలపడతారు?

టీఆరెస్‌కు కేడర్ లేదు అన్న ఒక మిథ్యను సృష్టించి, మంత్రించి, ఉధృతంగా ప్రచారం చేసి, తెలంగాణవాదాన్ని దెబ్బకొట్టాలని చంద్రబాబు అండ్ సీమాంధ్ర మీడియా అదేపనిగా ఎత్తులు వేస్తున్నది. అందుకే వలసలను ప్రోత్సహిస్తున్నారని టీఆరెస్‌ను వీరు సంయుక్తంగా ఆడిపోసుకుంటున్నారు. రాజశేఖర్‌రెడ్డి టీఆరెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు వీరికి అది వీరోచిత చర్యగా కనిపించింది. ఎందుకంటే ఆయన తెలంగాణవాదాన్ని దెబ్బకొట్టడానికి ఎమ్మెల్యేలను కొన్నాడు కాబట్టి ఆయన సాహసి అయ్యాడు. చంద్రబాబునాయుడు 1994-2004లలో చేసిందేమిటి? మామ పార్టీ అల్లుడి పార్టీగా ఎలా మారింది? ఎవరిని ఎలా మానేజ్ చేశారు? కాంగ్రెస్ నుంచి గెలిచిన మోత్కుపల్లి నర్సింహులు తెలుగుదేశంలో ఎలా చేరారు? చెన్నమనేని రాజేశ్వర్‌రావు ఏ ప్రలోభాలతో తెలుగుదేశం పార్టీలో చేరారు? మైసూరారెడ్డి కాంగ్రెస్‌లో ఎందుకు చేరారు? నూకారపు సూర్యప్రకాశరావుకు రాత్రికి రాత్రి అనకాపల్లి టికెట్ ఎలా వచ్చింది? గాలి ముద్దు కృష్ణమనాయుడు ఏ పార్టీలో మొదలయ్యారు? కాంగ్రెస్‌లోకి ఎందుకెళ్లారు? ఇప్పుడు  ఏ పార్టీలో తేలారు? అందువల్ల పార్టీలు మారడం గురించి, వలసల గురించి, కొనుగోళ్ల గురించి, రాజకీయ విలువల గురించి ఈ గురివిందలు మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశంలు మాట్లాడ్డానికేమీ లేదు. వారు ఈ పదేళ్లూ ప్రేక్షకపాత్రను, రాజీల డ్రామాను నడిపారు తప్ప ఏ సందర్భంలోనూ తెలంగాణకోసం కొట్లాడింది లేదు. కనీసం తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాడింది కూడా లేదు.

చంద్రబాబునో, కిరణ్‌కుమార్‌రెడ్డినో కాపాడడానికి, మోయడానికి పాటుపడ్డారుత ప్ప తెలంగాణ ప్రజల పక్షాన నిలబడడానకి ప్రయత్నించలేదు. అందుకే తెలంగాణ ఉద్యమంపై బురదజల్లే ఏకైక కార్యక్రమానికి దిగుతున్నారు. నిజానికి టీఆరెస్‌కు వలసలపై ఆధారపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. టీఆరెస్‌కు కొరవడింది కేడర్ కాదు, ఆత్మవిశ్వాసం. బయటిపార్టీల నుంచి ఎవడో మహానాయకుడు వస్తేనే పార్టీ గెలుస్తుందని భావించడమే తప్పు. ఇప్పటిదాకా టీఆరెస్ వైపు రాలేదంటేనే వారు తెలంగాణ తెగదెంపుల సమరంలో ఎప్పుడూ ముందుకు రాలేదని అర్థం. వారంతా తెలంగాణ సమరానికి ద్రోహం చేసినవారని అర్థం. టీకాంగ్రెస్, టీటీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తెగించి నిలబడి ఉంటే తెలంగాణ ఇప్పటికే వచ్చి ఉండేది. అలా రాకుండా దోబూచులాడినవారిని, నాటకాలాడినవారిని ఇప్పుడెందుకు దగ్గరికి తీయడం!  కేడర్ లేకుండా, పార్టీ యంత్రాంగం లేకుండాగెలిచిన సందర్భాలు మన అనుభవంలోనే అనేకం ఉన్నాయి. టీఆరెస్ సొంత అనుభవమే అందుకు ఉదాహరణ. 2001 పంచాయతీ ఎన్నికలకు ముందు టీఆరెస్ ఆవిర్భవించింది. అప్పుడు కేడర్ ఎక్కడిది? పార్టీ యంత్రాంగం ఎక్కడ ఉంది? అయినా 4 జడ్‌పీటీసీలను, 1043 ఎంపీటీసీలను, రెండు జిల్లా పరిషత్‌లను గెల్చుకోగలిగింది. కేసీఆర్ రేకెత్తించిన తెలంగాణ చైతన్యం, ఉద్యమ వాతావరణం ఆ రోజు పార్టీని గెలిపించాయి.

తెలంగాణ ప్రజాసమితి అనుభవం కూడా టీఆరెస్‌కు తెలిసిన పాఠమే. తెలంగాణ ప్రజాసమితికి ఎంత మంది కార్యకర్తలు ఉన్నారు? 1969లో ఉద్యమం జరిగితే, రెండేళ్ల తర్వాత 1971లో పది లోక్‌సభ స్థానాల్లో తెలంగాణ ప్రజాసమితి నాయకులను గెలిపించారు. వారిలో చాలా మంది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినవారే. ఒక పార్టీకి ఉండాల్సిన హంగులేవీ లేవు. కమిటీలు, యంత్రాంగం పూర్తిగా ఏదీ లేకుండానే ఆ రోజు తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో తమపై జరిగిన దమనకాండకు ప్రతీకారంగా, రాష్ట్ర సాధన కాంక్షకు ప్రతిబింబంగా అప్పట్లో తెలంగాణ ప్రజలు టీపీఎస్‌ను గెలిపించారు.  ఆ తర్వాత 192లో ఎన్‌టిఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కేడర్ ఎక్కడ ఉంది? పార్టీ యంత్రాంగం ఎక్కడుంది? టీపీఎస్‌తో పోల్చినా, టీడీపీతో పోల్చినా ఇప్పుడు టీఆరెస్ అంతకంటే బలంగా ఉంది. తెలంగాణవాదం ఇప్పుడు ఎప్పుడూ లేనంతగా సమాజంలో ఇంకిపోయింది. చాలా చోట్ల కమిటీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో తెలంగాణవాదులు ఉన్నారు. జేయేసీలు ఉన్నాయి. తెలంగాణ విషయంలో అన్ని పార్టీలూ మోసపూరితంగా వ్యవహరించాయన్న కోపం ప్రజల్లో ఉంది. అనేక ఉద్యమాలు, వెయ్యి మంది యువకుల బలిదానాలు కళ్ల ముందు మెదలుతున్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్‌లలో ఏ పార్టీ నాయకులను గెలిపించినా వాళ్లు ఆంధ్ర నాయకుల కనుసన్నల్లోనే మెలగుతారన్న అవగాహన గత మూడేళ్లలో బాగా పెరిగింది. తెలంగాణలోని ఈ పార్టీల నాయకులు తెగించి ఉంటే తెలంగాణ ఇప్పటికే వచ్చేదన్న స్పష్టతా జనానికి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక ఎజెండాగా పనిచేస్తున్న టీఆరెస్‌కు తగినంత బలం లేకపోవడం వల్లనే ఇన్ని పాట్లూ పడాల్సివస్తున్నదని జనం భావిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్‌లకు ఉన్న ఎమ్మెల్యేల బలం 0కి పైనే. ఆ ఎమ్మెల్యేలే టీఆరెస్‌కు ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఇది సహజనంగా జనంలో జనించే ప్రశ్న.

టీఆరెస్ ఆలోచించాల్సిందల్లా ఎన్నికలకు ఉద్యమ రూపం ఇవ్వడం ఎలా అన్నదే.  ఇందుకు కూడా అస్సాం గణ పరిషత్ అనుభవం మనకు పనికి వస్తుంది. ఒక ఉద్యమం రాజకీయ శక్తిగా అవతరించడానికి ఉదాహరణ అస్సాం గణ పరిషత్. అస్సాం జాతీయవాది దళ్, అస్సాం సాహిత్య సభ, అస్సాం కర్మచారి పరిషత్,  అస్సాం జాతీయవాది యువ ఛాత్ర పరిషత్, ఆల్ అస్సాం సెంట్రల్ ఎంప్లాయీస్ అసోసియేషన్….ఇలా అనేక సంఘాల ప్రతినిధులు అస్సాం గణ పరిషత్‌గా ఆవిర్భవించి ఎన్నికల బరిలో నిలిచారు.  ఉద్యమంలో ముందు భాగాన నిలబడిన అన్ని వర్గాలను ఎన్నికల బరిలో దింపి గణ పరిషత్ ప్రయోజనం పొందింది. విద్యార్థులు, అధ్యాపకులు, మేధావులు, రాజకీయ నాయకులు అందరూ సంఘటితంగా ఎన్నికల బరిలోకి వచ్చారు. అది సత్ఫలితాలను ఇచ్చింది. టీఆరెస్ అదే నమూనాను ఇక్కడ స్వీకరించడం అవసరం. టీఎన్‌జీవో నేత స్వామిగౌడ్‌ను, ఉపాధ్యాయ నేత సుధాకర్‌రెడ్డిని ఎన్నికల బరిలో దింపి టీఆరెస్ ఇప్పటికే అటువంటి సంకేతాలను ఇచ్చింది. రేపు సాధారణ ఎన్నికల్లో ఆ ప్రయత్నం ఇంకా  పెద్ద ఎత్తున జరగాలి. ఇతర పార్టీల నుంచి వలసలు వస్తున్న నాయకులు గత పదేళ్లుగా తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్న నాయకులకంటే గొప్పవాళ్లు కాదు. వీళ్ల కంటే ప్రజాదరణ ఉన్నవాళ్లు కాదు. ఉద్యమాల నుంచి నాయకులను ఎంపిక చేసుకోవాలి. కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలి. ఈ ఎన్నికలను తెలంగాణపై తీర్పుగా, సీమాంధ్ర పార్టీలకు, సీమాంధ్ర నాయకత్వాలకు భరతవాక్యం పలికే మార్పుగా మల్చాలి. సీమాంధ్ర నాయకత్వాల నుంచి తెలంగాణ రాజకీయ రంగాన్ని విముక్తి చేస్తే రాష్ట్ర సాధనలో సగం పని పూర్తయినట్టే. పార్టీ యంత్రాంగాన్ని, ఉద్యమ శక్తులను ఏకోన్ముఖంగా నడిపించేందుకు టీఆరెస్ నడుం కట్టాలి.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s