మనసులేని మహానగరం


దేశంలో జరుగుతున్న పరిణామాలకు న్యూఢిల్లీ కళ్లుమూసుకుని వ్యవహరిస్తోందేమో! తాను చేయదల్చుకున్నది చేస్తుంది. అందరినీ అడిగి చేస్తున్నట్టు, అందరి మాటలు వింటున్నట్టు నటిస్తూ ఉంటుంది.  ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజలకు ఏమి కావాలో న్యూఢిల్లీకి తెలియదని అనుకోలేము. పత్రికా సంపాదకులు ఏమి రాస్తున్నారో, ఏమని విశ్లేషిస్తున్నారో కూడా కేంద్రానికి తెలియకుండా ఉండే అవకాశం లేదు. కేంద్రంలోని మహాసచివులు అమాయకులనీ అనుకోలేము. పత్రికా సంపాదకుల సదస్సులో మంత్రుల ఉపన్యాసాలు, సంపాదకులు అడిగిన ప్రశ్నలు, అందుకు వారిచ్చిన సమాధానాలు విన్నతర్వాత కలిగిన అభిప్రాయం ఇది. వారు చెప్పదల్చుకున్నవి చెప్పారు. సంపాదకులు స్వేచ్ఛగా ప్రశ్నలడిగారు. మంత్రులు నిర్మొహమాటంగా సమాధానాలు చెప్పారు. కానీ ఎవరూ సంతృప్తి పడినట్టు కనిపించలేదు. అదంతా ఒక వృధా విన్యాసం మాదిరిగా కనిపించిందే తప్ప సంపాదకుల నుంచి ఏదో తెలుసుకుని సరిదిద్దుకోవడం కోసం జరిగింది కాదని అర్థమయింది. ఆర్థిక మంత్రి చిదంబరం ఉద్యమాలు చేస్తున్న ప్రజలను, వారికి మద్దతునిస్తున్న మీడియాను తప్పు పట్టారు. ఇలా అయితే అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. మలిదశ సంస్కరణలను వేగవంతం చేయడం అనివార్యమని నిర్దంద్వంగా చెప్పారు. అందుకు అందరూ సహకరించాలని కోరారు. బడ్జెట్‌లో చెప్పిన అంశాలను మరోసారి వల్లెవేశారు. నిజానికి మీడియా బడ్జెట్‌కు ముందు, బడ్జెట్ తర్వాత పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. ప్రజలు ఏమికోరుకుంటున్నారో పత్రికల్లో, చానెళ్లలో ప్రచురించారు, ప్రసారం చేశారు. అవేవీ బడ్జెట్‌లో కనిపించలేదు. కనీసం పరిశీలిస్తామన్న హామీ కూడా చిదంబరం మాటల్లో ధ్వనించలేదు. ప్రజల ఆత్మకు న్యూఢిల్లీ చాలా దూరంగా ఉందనిపించింది. రైల్వేబోర్డు చైర్మన్ మొత్తం రైల్వే బడ్జెట్ ప్రసంగాన్ని మరోసారి సదస్సులో కుమ్మరించారు. ఆ వివరాలన్నీ అప్పటికే సంపాదకులంతా విన్నారు. రాశారు. విశ్లేషించారు. మళ్లీ మొదటి నుంచీ ఆయన చెప్పుకొచ్చారు. ఆయన కూడా సంస్కరణల విషయంలో స్పష్టంగానే చెప్పారు. ఇంధన చార్జీలకు అనుగుణంగా టికెట్ల ధరలు పెరుగుతాయని చెప్పారు. బుల్లెట్ రైళ్లు ఆలోచన చేస్తున్నామని, ప్రైవేటు పెట్టుబడుదారులకోసం చూస్తున్నామని చెప్పారు. వందలాది ప్రాజెక్టులు ప్రారంభించి ఏదీ పూర్తి చేయకుండా పది పదిహేనేళ్లు సాగదీస్తూ పోతే ఆ పెట్టుబడి అన్‌ప్రొడక్టివ్ కావడం లేదా అని అడగాలనిపించింది. కానీ ఆఖరి ప్రశ్నతో చర్చ ఎక్కడో ఆగిపోయింది.

కేంద్ర సిబ్బంది, పబ్లిక్ గ్రీవెన్సెప్ శాఖ మంత్రి నారాయణస్వామి వచ్చీ రావడమే దాడి మొదలు పెట్టారు. చాలా హుషారుగా మాట్లాడారు. అవినీతి సమస్యను అన్నా హజారే ఎత్తుకోకముందే తాము లోక్‌పాల్ బిల్లును రూపొందించామని చెప్పారు. మీడియా ఎక్కువ చేస్తున్నదని, మీడియా ట్రయల్ మానుకోవాలని సూచించారు. ప్రభుత్వంలో అవినీతిని నిర్మూలించడానికి చాలా కష్టపడుతున్నట్టు చెప్పారు. సీబీఐ నిర్ణయాలతో తమకు సంబంధమే లేదని చెప్పారు. ఆయన ఎంత నిజాయితీగా మాట్లాడుతున్నారో అందరికీ అర్థమయింది. డిఎంకే స్టాలిన్ నివాసంపై దాడి చేయడాన్ని గుర్తు చేస్తే, అక్రమంగా కార్లు దిగుమతి చేసుకుంటే ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ ఆదేశాల ప్రకారం సోదాలు జరిగాయని మంత్రి సెలవిచ్చారు. ఎప్పుడో దిగుమతి చేసుకున్న కార్లకు, తీరా మద్దతు ఉపసంహరించుకున్న మరుసటిరోజు ఎందుకు సోదాలు చేశారంటే ఆయన గతుక్కుమన్నారు. ఈ సమయంలో చేయడం కరెక్టుకాదని ప్రధాని ఒప్పుకున్నారు కదా అని చెప్పారు. ఐఎఎస్, ఐపీఎస్‌ల పనితీరును పదిహేనేళ్లకు ఒకసారి, ఇరవై ఐదేళ్లకు ఒకసారి సమీక్షించి, పనికిరానివారిని ఇంటికి పంపిస్తామని అందుకు విధివిధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు. మంత్రులు కృష్ణ తీర్థ, అజయ్ మాకెన్‌లు చెప్పిన అంశాలు కొంత ప్రయోజనకరంగా ఉన్నాయి. అజయ్‌మాకెన్ గృహనిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన రంగంలో తేబోతున్న సంస్కరణల గురించి చాలా చెప్పారు.  ఆకర్షణీయంగా, జనరంజకంగా ఉన్నాయి. అయితే అమలు కావడమే కష్టమనిపించింది. పట్టణ పేదలు కొలేటరల్ సెక్యూరిటీ లేక ఇళ్లు కొనుక్కోలేకపోతున్నారని, వారికి సెక్యూరిటీ ఇచ్చేందుకు ఒక నిధిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రియల్ ఎస్టేట్  రెగ్యులేటరీ చట్టాన్ని తేబోతున్నామని చెప్పారు. కొనుగోలుదారుల రక్షణకోసం ఈ చట్టంలో చాలా మంచి ప్రతిపాదనలే చేశారు. కానీ చాలా మంది సంపాదకులు ‘ఈ బిల్లు చట్టరూపం దాల్చుతుందని నమ్ముతున్నారా? రియల్టర్లలో ఎక్కువమంది రాజకీయ నాయకులే ఉన్నారు కదా?’ అని అక్కడే సందేహం వ్యక్తం చేశారు. ఆయన తామయితే ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆయన మంచి విషయాలు చాలా చెప్పారు కాబట్టి, చెడ్డ విషయాల చర్చ ఎక్కువగా జరుగలేదు. ఈ సదస్సుకు కేవలం భాషా పత్రికల వారిని మాత్రమే పిలిచినట్టు స్పష్టమయింది.

సదస్సు ముగిసిన తర్వాత మరుసటిరోజు ఉదయం ఏడు గంటలకు ఒక జర్నలిస్టు మిత్రుడు, నేను వాకింగ్‌కు బయలు దేరాము. కొత్త ఢిల్లీని నడిచి చూస్తే కానీ అర్థం కాదని ఆ రెండు రోజుల అనుభవం తెలిపింది. ఆంధ్ర భవన్ నుంచి ఇండియాగేట్ అక్కడి నుంచి అక్బర్‌రోడ్, జన్‌పథ్, అక్కడి నుంచి కేంద్ర సచివాలయ భవనాలు, రాష్ట్రపతి భవనం, పార్లమెంటు భవనం…తిరిగి ఆంధ్రా భవన్ సుమారు 12 కిలోమీటర్లు నడిచాం. మధ్యమధ్యలో మిత్రుడు ఢిల్లీ విశేషాలు చెబుతున్నాడు. ‘ఇక్కడ సంఘజీవితం మిస్సవుతాం. పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు ఉంటాయి, కానీ ఎక్కువ జీవితానందాన్నిచ్చే చిన్నచిన్న ముచ్చట్లు కరువవుతాయి’ అంటారాయన. విశాలమైన రోడ్లు, అంతకంటే విశాలమైన భవంతులు. అక్కడ నడుస్తుంటే మనుషుల మధ్య నడుస్తున్నట్టు అనిపించలేదు. గోడల మధ్య నడుస్తున్నట్టు అనిపించింది. ‘అది ఆత్మలేని నగరం’  అని ఒక జర్నలిస్టు మిత్రుడు అంతకుముందు తరచూ అంటుండేవారు. ఆయన అలా ఎందుకు అనేవారో అక్కడ తిరుగుతుంటే అనిపించింది. అందమైన నగరం. అద్భుతమైన డిజైను. గీత గీసినట్టుండే రాజపథాలు, జనపథాలు, శాంతిపథాలు. షడ్భుజి జక్షన్‌లు. అడుగడుగునా గోల్ చక్కర్‌లు. రోడ్ల పొడవునా పూల తివాచీలు. బారులుతీరిన వృక్షాలు. కానీ మనుషులేరీ. ‘మా సారు(ఎంపీ) లేకుంటే మూడెకరాల ఇంట్లో ఉండడానికి మాకు భయమేస్తుంది’ అన్నాడో గార్డు. సోనియాగాంధీ నివసించే టెన్ జనపథ్ చాల పెద్ద భవంతి. దానికి మూడు దారులున్నాయి. ప్రధాన ద్వారం నుంచి సోనియా, ప్రధాని మాత్రమే ప్రవేశిస్తారట. మిగిలినవాళ్లంతా అక్బర్‌రోడ్డు వైపు ఉన్న మరో ద్వారం నుంచి ప్రవేశిస్తారట. సోనియాగాంధీ ఇంటిని ఆనుకుని అక్బర్ రోడ్డులో ఎఐసిసి కార్యాలయం ఉంటుంది. సోనియాగాంధీ ఎఐసిసి కార్యాలయానికి రావలసి వచ్చినప్పుడు రెంటి మధ్య ఉన్న ద్వారం నుంచి నేరుగా వస్తారట.

‘సోనియాగాంధీ చాలా మంది చాలా అనుకుంటారు కానీ వాస్తవానికి ఆమె బలహీనురాలు. చాలా సున్నిత మనస్కురాలు. ఎవరయినా కష్టాలు చెబితే కరిగిపోతారు. కన్నీరు పెడతారు. సాహసించి ఏ నిర్ణయమూ చేయలేరు. చుట్టూ ఉండేవారిపైనే ఎక్కువగా ఆధారపడతారు’ అన్నారు దారిలో కలిసిన మరో మిత్రుడు. ‘రాహుల్‌గాంధీ విడిగా ఉంటారు. ఆయన ప్రపంచం వేరే. ఆయన అప్పుడప్పుడూ తల్లి వద్దకు వచ్చిపోతుంటారు. ఆయనకంటే ప్రియాంకా గాంధీనే ఎక్కువగా తల్లితో గడుపుతుంటారు. ఇన్నేళ్లయినా రాహుల్‌గాంధీ ఎటువంటి ప్రత్యేక ముద్రనూ సంపాదించుకోలేక పోయారు. ఆయనకు ఏదో ఆటిట్యూడ్ ప్రాబ్లమ్ ఉన్నట్టు అనిపిస్తుంది’ అన్నారాయన. ఇంత విశాలమైన నివాసాల్లో ఉంటున్నా సొంతంగా వీళ్ల పేరుమీద ఒక్క ఆస్తి కూడా లేదట! మరోవైపు ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రాకు అంతులేని ఆస్తులు పోగయ్యాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. జనపథ్ మీదుగా రాజ్‌పథ్ చేరుకుని రైసినా హిల్స్ దాకా నడుస్తూ వెళ్లాము. ఆధునిక రాజప్రాసాదాల సముదాయం. ఒక పక్క సౌత్‌బ్లాక్. ఇక్కడ ప్రధాని, ఆంటోని, సల్మాన్ ఖుర్షీద్ ఆఫీసులు ఉంటాయి. మరో పక్క నార్త్ బ్లాక్ ఇక్కడ చిదంబరం, షిండే, తదితరుల కార్యాలయాలు ఉంటాయి. ఉదయం ఎనిమిది అవుతోంది. మంత్రుల చేంబర్లలో ఏరోజుకారోజు అలంకరించడంకోసం అప్పుడే పూలబుట్టలు వచ్చాయి. రంగురంగుల పూలబుట్టలు.  కేంద్ర బడ్జెట్ తయారయ్యేది నార్త్ బ్లాక్‌లోని ఒక నేలమాలిగలో అని మిత్రుడు చెబితే ఆశ్చర్యం వేసింది. ఆర్థిక నియంత్రణ వ్యవస్థలన్నీ ఆ భవనంలోనే ఉంటాయట.

అవి దాటుకుని మరో యాభై అడుగులు ముందుకు వెళితే రాష్ట్రపతి భవనం. ‘ప్రణబ్ ముఖర్జీ రాక ముందు రాష్ట్రపతి భవనం వైపు రావాలంటే ఎన్నో ఆంక్షలు, నిబంధనలు ఉండేవి. ఆయన వచ్చిన తర్వాత అన్నీ సడలించారు. మీడియాను లోపలికి అనుమతిస్తున్నారు. వచ్చీపోయే నాయకులు కూడా ఎక్కువే. ఢిల్లీ రాజకీయాలపై తన పట్టును కొనసాగించే ఉద్దేశంతోనే ఆయన రాష్ట్రపతి భవన్‌కు రాకపోకలను సులభతరం చేశారని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు’ అని మరో సీనియర్ జర్నలిస్టు వివరించారు. న్యూఢిల్లీని కింగ్ జార్జి 5 ఆదేశాల మేరకు ల్యూటెన్ అనే ఆర్కిటెక్ట్ ప్లాన్ చేశారు. 1911లో నిర్మాణం మొదలు పెట్టి 1931లో పూర్తి చేశారు. భారత దేశంలో తమ అధికారం శాశ్వతం అనుకుని నిర్మించినట్టున్నారు. ఎక్కడా రాజీ పడలేదు. అద్భుతమైన లే అవుట్. సచివాలయ భవనాలు తప్ప, నివాసభవనాలన్నీ ఒకే అంతస్తుతో నిర్మించారు. అక్కడక్కడా కొందరు కొత్తగా రెండో అంతస్తులు నిర్మించారు. నార్త్ బ్లాక్‌ను దాటుకుని ముందుకు వస్తే పార్లమెంటు భవనం. అక్కడి నుంచి మరికొంత దూరం నడిస్తే కృషిభవన్. ఆ పక్కనే పచ్చిక బయళ్లు. ఫౌంటెన్‌లు. రోడ్డు వెంట వరుసగా వృక్షాలు. రాజపథానికి సమాంతర పథం అది. మోస్ట్ హాపెనింగ్ సిటీ. రక్షక వాహనాలు ఎప్పుడు పరుగులు తీస్తుంటాయి. రాత్రి పన్నెండు దాకా జనం బిరబిరా తిరుగుతూ ఉంటారు. తెల్లవారుజామున రెండు నుంచి మళ్లీ రోడ్లు కళకళలాడుతూనే ఉంటాయి.  అయినా అక్కడ ఎవరికి ఎవరు?

కృషి భవన్‌కు అల్లంత దూరంలో ఒక చెట్టు. అక్కడే ఒక గుండె తన్లాడింది. అక్కడే ఒక హృదయం వికలమైంది. అక్కడే ఒక యువకుడు ఉరితాడును ముద్దాడింది. ఆ చెట్టుకు ఒక శవం వేలాడింది. ఆ శవం తెలంగాణది. ఆ యువకుడు యాదిరెడ్డి. దుర్భేద్యమైన ఢిల్లీ ఆత్మను బద్దలు కొట్టి తెలంగాణవాదాన్ని వినిపించడానికి యాదిరెడ్డి వెయ్యిమైళ్లు ప్రయాణించి వచ్చాడు. పార్లమెంటుకు యాభై మీటర్లదూరంలో మృత్యుపాశాన్ని అలుముకున్నాడు. అయినా ఘనీభవించిన ఆ ఆత్మలు చెలించలేదు. చివరికి యాదిరెడ్డి శవాన్ని తీసుకోవడానికి ఆంధ్ర భవన్ కూడా నిరాకరించింది. అవును- ప్రధానిగా పనిచేసిన పివి నరసింహారావుకే ఆరడుగుల నేల ఇవ్వని నగరం ఇది. ఇది ముమ్మాటికీ ఆత్మలేని నగరమే. ప్రజలకు ఢిల్లీ ఎంతో దూరం. ఇక్కడ సమిష్టి ఆత్మ(COLLECTIVE SOUL) లేదు.

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily

2 thoughts on “మనసులేని మహానగరం”

  1. It is very impressive and very good narration of Atma leni nagaram ….New Delhi. Corrupted people ruling the country…..People must be educated and vote only the people who are committed and dedicated and who will respect the praja Vani…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s