తెలంగాణకు ఇదే తరుణం


రాష్ట్రంలో ఒక సందిగ్ధావస్థ, ఒక అనిశ్చితి తలెత్తి ఇప్పటికి మూడేళ్లు. నిజానికి పదేళ్లు. తెలంగాణ ఉద్యమం అవతరించిన రోజు నుంచి ఎంతోకొంత ఈ పరిస్థితి ఉంది. 2009లో కేసీఆర్ దీక్ష, తెలంగాణ ప్రకటన, ఉపసంహారం తర్వాత ఈ పరిస్థితి తీవ్రమైంది. ఈ సందిగ్ధం  ఇంకా ఎంతకాలం కొనసాగాలి? పరకాల, పదిహేడు నియోజకవర్గాల ఉప ఎన్నికల తర్వాతయినా రాజకీయ పక్షాలు తెలివిడి తెచ్చుకుని వ్యవహరిస్తాయని ప్రజలు ఆశించారు. కానీ ఎప్పటి వేషాలే కొనసాగుతున్నాయి. తెలంగాణ విషయం తేలితే ఈ ఆరుమాసాల్లో తేలాలి. లేకపోతే ఇక 2014లోపు పరిష్కారమయ్యే అవకాశం లేదు. ఇప్పుడు పరిష్కారం కాకపోతే 2014 తర్వాత రాముడెవరో కృష్ణుడెవరో! 2014లో మొత్తం తెలంగాణవాదులే గెలవచ్చుగాక, కేంద్రంలో సమీకరణలు ఎలా ఉంటాయో? ఎవరు ఎవరిమీద ఆధారపడతారో? ఎవరు ఏ షరతులు పెడతారో? మన బలం ఎవరికయినా అవసరం అవుతుందో లేదో కచ్చితంగా చెప్పలేం. ఈ మూడేళ్ల అనిశ్చితి రెండు ప్రాంతాల్లో అభివృద్ధిని, ఇతర సమస్యలను తెరమరుగు చేశాయి. మరో రెండేళ్లు ఈ సమస్య ఇలాగే కొనసాగితే పరిస్థితి ఇంకా ఎలా విషమిస్తుందో చెప్పలేం. అందుకే ఇది చాలా కీలకమైన సమయం. 2014 ఏప్రిల్-మేలలో జరిగే సాధారణ ఎన్నిలకు ఇక మిగిలింది ఒకటిన్నర సంవత్సరాల కాలమే. 2014 జనవరి నుంచి ఎన్నికల సందడే ఉంటుంది. మిగిలేది 2013 మాత్రమే.

తెలంగాణపై ఈ రెండు మూడు నెలల్లో నిర్ణయం జరిగితేనే అది అమలు కావడానికి కొంత సమయం చిక్కుతుంది. రాష్ట్ర విభజనపై ఏవైనా ఆవేశకావేశాలు చెలరేగినా చల్లారడానికి, రాజకీయాలు కుదుటపడడానికి సమయం సరిపోతుంది. 2013లో తీరా ఎన్నికలు సమీపించేవేళ కేంద్రం లేక కాంగ్రెస్ తెలంగాణపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. కాంగ్రెస్‌కు ఇది నౌ ఆర్ నెవర్ పరిస్థితి. ఇప్పుడు నిర్ణయం తీసుకుంటేనే ఆ పార్టీకీ ప్రయోజనం. తెలంగాణలో నూకలు మిగిలి ఉంటాయి. కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి పొందడానికి వీలవుతుంది. టీడీపీకీ ఇదే అదను. తెలంగాణపై తన నిజాయితీని నిరూపించుకోవడానికి. జగన్‌మోహన్‌రెడ్డి అయినా సరే ఇప్పుడు తెలంగాణపై తేల్చకుండాఈ ప్రాంతంలో బాపుకునేదేమీ ఉండదు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లు ఆలోచించుకోవలసింది ఒక్కటే- తెలంగాణలో శాశ్వతంగా ‘ద్రోహముద్ర’ను మూటగట్టుకోవడమా? లేక తెలంగాణపై తమ వైఖరిని  స్పష్టంగా ప్రకటించి కొత్త చరిత్రను రాసుకోవడమా? పార్టీలు అంటే జెండాలు, ఆఫీసులు కాదు. వందల మంది రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారం. అధినేతలు అనుసరించే విధానపరమైన దివాళాకోరుతనం ఇంతమంది నాయకులను బలితీసుకుంటుందంటే అంతకంటే విషాదం లేదు. మూడు పార్టీల అధినేతలు ఇప్పుడు మాట్లాడకుండా తీరా ఎన్నికల వేళ మళ్లీ తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చినా, ప్రకటనలు చేసినా జనం రాళ్లతో కొడతారు. ఎన్నికల వేళ చేసే ప్రకటనలను ఓట్ల సముద్రాన్ని దాటడానికి ఉపయోగించే తెప్పలాగానే చూస్తారు. మళ్లీ మళ్లీ మోసపోవడానికి తెలంగాణ ప్రజలు ఇష్టపడడం లేదు.

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇప్పటికీ ఈ సోయి వచ్చినట్టు కనిపించడం లేదు. వారిలో అనేక గుంపులు. వేర్వేరు ప్రాధాన్యాలు. వారికి తెలంగాణ ప్రాధాన్య అంశం కాదు. ద్వితీయ ప్రాధాన్యాంశం మాత్రమే. చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులకు తెలంగాణ సోయే లేదు. కొందరు తెలంగాణ రాదేమో జగన్‌వైపు దూకితే పోలేదా! అని లెక్కలు వేస్తున్నారు. సంప్రదింపులు జరుపుతున్నారు. అవకాశం కోసం, సందర్భంకోసం ఎదురుచూస్తున్నారు. నిజాయితీగా తెలంగాణకోసం పోరాడదామన్న స్పృహలేదు. ఇక్కడి ప్రజల విశ్వాసం చూరగొందామన్న ధ్యాసలేదు. పక్కదారుల్లో రాజకీయంగా ఎలా బతికి బట్టకడదామా అన్న ఆలోచన తప్ప. రాజమార్గంలో కొట్లాడే తెగింపు లేదు. ఇంకొందరు నేతలు, మంత్రులు ఉన్నారు. వారి ధ్యాసంతా నాయకత్వ మార్పుపైనే. ముఖ్యమంత్రిని మార్చితే తమకు అవకాశం వస్తుందా రాదా అన్న ఆరాటం తప్ప, అసలు తెలంగాణ సంగతి తేల్చుతారా లేదా అన్న పట్టింపు లేదు. ఢిల్లీ వెళతారు. రోజుల తరబడి ఢిల్లీ పెద్దలను కలుస్తారు. వీరేం చెబుతారో. వారేం వింటారో. ఇక్కడ జనానికి మాత్రం తెలంగాణ గురించి ఏమాత్రం భరోసా లభించదు. ఇంకొందరున్నారు-గల్లీలో వీరోచితంగా మాట్లాడతారు. ఢిల్లీలో పిల్లుల్లా వ్యవహరిస్తారు. గత రెండేళ్లుగా ఈ బాణీ మారడం లేదు. ప్రణబ్ ముఖర్జీ విషయంలో కనీసం బెట్టు చేయాలన్న ప్రయత్నమూ జరుగలేదు. ఇక్కడ తెలంగాణ వాదులు తుపాకులు, ట్రిగ్గర్లు అని మాట్లాడుతూ ఉంటే, బుల్లెట్లుగా మారాల్సినవారు మాత్రం బేషరతుగా ప్రణబ్ పంచన చేరిపోయారు. ‘ఇంత చేవచచ్చిన నేతలను ఎప్పుడూ చూడలేదు. ఎటు చూసినా సన్నాసితనమే. ఎంపీలు కాస్త నయం. అప్పుడప్పుడయినా మొనగాళ్లు అనిపించుకోవడానికి ప్రయత్నించారు. మంత్రుల పరిస్థితి మరీ అన్యాయం. పదవులు, పైరవీలు, మనకేమొస్తదన్న యావ తప్ప తెలంగానను ఏం చేద్దామన్న శ్రద్ధ ఎప్పుడూ కనబర్చలేదు. మనవాళ్లు అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఒక వేళ కేంద్రం అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చినా ఈ సన్నాసులకు ఓట్లు వేయడం నాకైతే కష్టమే’నని నల్లగొండ జిల్లాకు చెందిన ఒక అధ్యాపకుడు యాష్టపడ్డాడు. తెలంగాన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇప్పుడు కూడా సమయం మించిపోలేదు. తమ మీద ఏర్పడిన ఈ అపనమ్మకాన్ని తొలగించుకోవడానికి ఇప్పుడయినా వారు జనంలోకి రావాలి. ఈ ఆరుమాసాలు ముఖ్యం. ఈ సమయం గడచిపోతే ఇక చేయగలిగేది ఏమీ ఉండదు.

మరో విడ్డూరం ఏమంటే- పరకాలలో కొండా సురేఖ ఇచ్చిన పోటీని చూసి తెలంగాణ కాంగ్రెస్, తెలుగుదేశంలలోని అసంతృప్తులకు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ ఒక ఆశాజ్యోతిలాగా కనిపిస్తున్నది. జగన్ మాత్రమే తెలంగాణవాదాన్ని ఎదుర్కోగలడన్న ఒక ప్రచారాన్ని ఈ శక్తులే ప్రచారంలో పెట్టాయి. పరకాల వేరు, మిగతా తెలంగాణ వేరన్న విషయాన్ని వీరు మరచిపోతున్నారు. నిశ్చయంగా పరకాలలో కొండా మురళి-సురేఖల ఉమ్మడి కృషి, బలం కారణంగానే వారు టీఆరెస్‌ను ఆ మాత్రం ఎదిరించగలిగారు. తెలంగాణలో మరే నియోజకవర్గంలోనూ కొండా మురళి మాదిరిగా నెట్‌వర్కింగ్ చేయగల నాయకుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో లేరు. అందులో చేరాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్, తెలుగుదేశం నేతల్లో కూడా అటువంటివారు లేరు. అందువల్ల పరకాల ప్రోటోటైప్  వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు తెలంగాణ అంతటికీ పనికిరాదు. తెలంగాణవాదుల ఓట్లు ఛిన్నాభిన్నమైన పరిస్థితుల్లో, పూర్తి శాంతికాలంలో జరిగిన ఎన్నిక. ఒంటరిగా టీఆరెస్ విజయం సాధించింది. బిజెపి, కారును పోలిన ఆటో గుర్తుతో ఒక ఇండిపెండెంట్ 13 వేల ఓట్లు చీల్చుకున్నా(ఇవన్నీ తెలంగాణవాదుల ఓట్లే) టీఆరెస్ మాత్రమే గెలిచింది. పన్నెండు నియోజకవర్గాల విజయం కంటే, ఆరు నియోజకవర్గాల విజయం కంటే పరకాల విజయమే మిన్న. పన్నెండు నియోజకవర్గాల ఉప ఎన్నికలనాటికి తెలంగాణవాదులంతా ఒక్కతాటిపై ఉన్నారు. ఆ ఎన్నికలు పూర్తిగా ఉద్యమకాలంలో, ఒక వడిలో జరిగాయి. ఆరు నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పోటీలో లేదు. అన్ని రాజకీయ శక్తులు బరిగీసి నిలబడిన ఎన్నికలు పరకాల మాత్రమే. ఎంతోదూరం ఎందుకు? నిన్న జరిగిన సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ఎన్నోఏళ్లుగా పాతుకుపోయిన జాతీయ సంఘాలను కాదని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఎన్నుకోవడం దేనికి సంకేతం! తెలంగాణ ఇవ్వకపోతే 2014 ఎన్నికల దృశ్యం కూడాపరకాల మాదిరిగానే, సింగరేణి నమూనాలోనే ఉంటుంది. టీఆరెస్‌కు పరకాల వంటి టఫ్ నియోజకవర్గాలు తెలంగాణ మిగిలిన జిల్లాల్లో చాలా తక్కువ. తెలంగాణ రాకపోతే ఈ రెండేళ్లు తెలంగాణవాదులు, టీఆరెస్ శాంతియుతంగా ఉండే అవకాశం లేదు. తెలంగాణకు అవరోధంగా ఉన్న శక్తులను ఎండగట్టకుండా ఉండలేరు. ఉద్యమ ఉధృతిని పెంచకుండా 2014 ఎన్నికలకు వెళ్లలేరు. అందువల్ల జగన్‌తో చేరాలనుకునేవారికి కూడా ఒక స్పష్టత అవసరం.

తెలంగాణపై వైఖరి చెప్పకుండా జగన్ పార్టీలో చేరినా కాంగ్రెస్, తెలుగుదేశంలలో ఉన్నా పెద్దగా తేడా ఉండదు. ఆ పార్టీలకు ఉండే బలహీనతే జగన్ పార్టీకి కూడా ఉంటుంది. జగన్‌కు తెలంగాణలో అసలు బలం లేదని, ఉండదనీ కాదు. అది ఎంత అన్నదే సమస్య. తెలంగాణ ఏర్పాటుపై ఆయన వైఖరి తేలకుండాఇక్కడి ప్రజలు ఆయనకు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజశేఖర్‌రెడ్డికే సాధ్యం కాలేదు. 2009 సాధారణ ఎన్నికల్లోనే తెలంగాణలో రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు 33 శాతం. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఇంకా దిగజారింది. ఇప్పుడు జగన్ వచ్చినా బ్రహ్మాండం బద్దలయ్యే అవకాశం లేదు. రాజకీయ శక్తుల సమీకరణలు మారవచ్చు. బలహీనపడిన కాంగ్రెస్, టీడీపీల నుంచి కొందరు జగన్ గూటిలోకి దూకవచ్చు. రాజశేఖర్‌రెడ్డిని అభిమానించే కొన్ని వర్గాల ప్రజల్లో జగన్‌పై సానుకూలత ఉండవచ్చు. కానీ అది విజయానికి సరిపోయేంత సానుకూలత కాదు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో తెలంగాణవాదమే ప్రధాన ఎజెండా. తెలంగాణకోసం పోరాడుతున్నవారికి, తెలంగాణను అడ్డుకున్నవారికి మధ్యనే సమరం. సమైక్యాంధ్రకోసం పార్లమెంటులో ప్లకార్డు పట్టుకున్న జగన్‌ను, తెలంగాణలో ఎన్నికలు పూర్తయి నంద్యాలలో ప్రవేశించగానే హైదరాబాద్‌కు వెళ్లాలంటే వీసా తీసుకోవాల్సివస్తుందని ఆంధ్రా ప్రజలను రెచ్చగొట్టిన రాజశేఖర్‌రెడ్డిని తెలంగాణ ప్రజలు మరచిపోలేరు. తెలంగాణ విషయంలో చంద్రబాబుకు జగన్‌కు తేడాలేదని తెలంగాణవాదులు భావిస్తున్నారు. రెండు కళ్ల ధోరణిని లేక రెండు నాల్కల ధోరణిని తెలంగాణ ప్రజలు సహించడానికి సిద్ధంగా లేరు. అందువల్ల ఏ పార్టీలో ఉన్న నాయకులైనా తెలంగాణపై ఏ పార్టీ ఏం చెబుతుందో చూసుకుని మసలుకోవలసిందే.

తెలుగుదేశానిది కూడా ఏదో ఒకటి తేల్చుకోక తప్పని స్థితి. చంద్రబాబునాయుడు తెలంగాణపై స్పష్టమైన వైఖరిని తీసుకోవడం ఒక్కటే ఆ పార్టీని కాపాడగలదు. నైతికంగా బాగా బలహీనపడిన తెలుగుదేశం శ్రేణులలో కొత్త ఉత్సాహాన్ని నింపాలంటే అధినేత మరోసారి నైతిక నిర్ణయమే తీసుకోవాలి. కోల్పోయిన చోటే వెతుక్కోవాలి. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషిచేస్తామ’ని 2009 ఎన్నికలకు ముందు చెప్పిన మాటను నిలబెట్టుకోవడం ఒక్కటే చంద్రబాబును, తెలుగుదేశాన్ని కాపాడగలదు. పరకాల ఎన్నికల తర్వాత చంద్రబాబుతో లేఖ ఇప్పిస్తామని చెప్పిన తెలుగుదేశం నేతలు తీవ్ర అంతర్మథనానికి గురువుతున్నారు. పరకాల సమీక్ష సందర్భంగా అధినేతను అదే విషయం అడిగినట్టు కొందరు తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. ‘ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి. ఇప్పుడే తొందరెందుకు? ఎన్నికలకు ముందు చూద్దాం’ అని చంద్రబాబు అన్నట్టు వారు వాపోతున్నారు. చంద్రబాబు చాలా లెక్కలు వేసుకుని, కొన్ని అంచనాలకు వచ్చి ఇలా మాట్లాడినట్టు తెలుగుదేశం నాయకులతో కాసేపు ముచ్చటిస్తే తెలిసిపోతుంది. చంద్రబాబు మొదటి అంచనా ఏమంటే, ‘తెలంగాణలో టీఆరెస్ రోజు రోజుకు బలహీనపడిపోతున్నది. మరోవైపు పన్నెండు నియోజకవర్గాల ఉప ఎన్నికల నాటికి ఆరు నియోజకవర్గాల ఉప ఎన్నికల నాటికి టీడీపీ బలపడింది. పరకాల ఉప ఎన్నిక నాటికి ఇంకా బలపడింది. 2014 నాటికి టీడీపీ ఇంకా బలపడుతుంది, టీఆరెస్ బలహీనపడిపోతుంది’.

రెండవ అంచనా ఏమంటే, ‘టీడీపీ తెలంగాణపై ఇప్పుడు లేఖ ఇస్తే, కాంగ్రెస్ కూడా తప్పనిసరి పరిస్థితి తలెత్తి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. తెలంగాణ ఏర్పడితే టీడీపీకి కలిగే ప్రయోజనం పరిమితం. కాంగ్రెస్, టీఆరెస్‌లకే ఎక్కువ మేలు జరుగుతుంది. ఆంధ్రలో ఇప్పుడే టీడీపీ పరిస్థితి బాగోలేదు. తెలంగాణపై లేఖ ఇస్తే ఇంకా దెబ్బతింటుంది. జగన్ ఇంకా బలపడతాడు. అందువల్ల ఇప్పుడు కాకుండా ఎన్నికలకు ముందు తెలంగాణపై లేఖ ఇస్తే కాంగ్రెస్ అప్పటికప్పుడు తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడుతుంది కాబట్టి అది టీడీపీకి ఉపయోగపడుతుంది. తెలంగాణ రాకపోతే టీఆరెస్‌ను కూడా దోషిగా నిలబెట్టి దెబ్బతీయవచ్చు. తెలంగాణలో బలపడ్డామంటే ఆంధ్రలో కూడాత్రిముఖ పోటీలో టీడీపీకి ప్రయోజనం ఉంటుంది. పైగా 2014లోపు తెలంగాణను అడ్డుకునే ఎజెండా విజయవంతమవుతుంది’. దీనిని తెలివి అనలేము. చావుతెలివి అనాలేమో! రాజకీయాల్లో సరళ రేఖలుండవు. సూటిగా లెక్కలు వేసి కొట్టడానికి! మనం కొడుతూ ఉంటే అవతలివాళ్లంతా చేతులు ముడుచుకుని కూర్చోరు. చంద్రబాబునాయుడు ఇప్పటికీ తాను జనం దృష్టిలో ఎందుకు పలుచనయ్యారో తెలుసుకోవడం లేదు. తనను జనం ఎందుకు విశ్వసించడంలేదో తర్కించుకోవడం లేదు. తాను ఏం చేస్తే ధీమంతునిగా తిరిగి నిలబడగలరో గుర్తించడం లేదు. సొంతపార్టీలో తనపై సడలిపోతున్న నమ్మకాన్ని కూడా ఆయన తెలుసుకోలేకపోతున్నారు. ‘అధినేత వైఖరి వల్ల తెలంగాణలో మేము దోషులుగా నిలబడాల్సి వస్తోంది. తెలంగాణపై మాటమార్చడం మమ్మల్ని రాజకీయంగా బాగా దెబ్బతీసింది. ఎంత నిజాయితీగా తెలంగాణ గురించి మాట్లాడినా మమ్మల్ని విశ్వసించడం లేదు. అధినేత చేసిన తప్పిదాలకు మా రాజకీయ జీవితాలు బలవుతున్నాయి. తెలంగాణపై కేంద్రానికి లేఖ ఇప్పించడమో లేక మా దారి మేము చూసుకోవడమో-ండే మాకు మిగిలిన ప్రత్యామ్నాయాలు. 2014లో గెలువకపోతే ఇక మేము శాశ్వతంగా తెరమరుగు కావలసిందే’ అని తెలంగాణ తెలుగుదేశం నాయకుడొకరు ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ల గుండె చప్పుడు బాబు వింటారా? నిజాయితీ మాత్రమే జనం మనసులను గెల్చుకుంటుంది. డొంకతిరుగుడు వ్యవహారాలను, ఎత్తులు జిత్తులను జనం ఛీకొడతారు. తెలంగాణను అడ్డుకోవడం, జగన్‌పై రోజూ దుమ్మెత్తిపోయడం తెలుగుదేశాన్ని బతికించదు. చంద్రబాబు ఇమేజి పెరిగితేనే ఆ పార్టీ బతుకుతుంది. తెలుగుదేశం మాత్రమే ప్రత్యామ్నాయం అన్న నమ్మకం కలిగితేనే ఆ పార్టీ నిలబడగలుగుతుంది. అందుకు కష్టమైనా కొన్ని కఠిన నిర్ణయాలు చేయాలి. పార్టీకి మోరల్ బూస్టర్‌లు ఇవ్వాలి. తెలంగాణ అనుకూల నిర్ణయం, అవినీతి రహిత స్వచ్ఛమైన పాలనతోపాటు గతకాలపు దోషాల నుంచి ఆయనకు ప్రాయశ్చిత్తం ప్రసాదించే పలు కొత్త నినాదాలు కావాలి. కార్యాచరణ కావాలి.

టీఆరెస్‌కు కూడా ఇది పరీక్షా సమయం. ప్రణబ్ ఎన్నికను ట్రిగ్గర్‌లా ఉపయోగించాలని తెలంగాణవాదులు ఒత్తిడి తెస్తున్నారు. ప్రణబ్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని కూడా వారు డిమాండు చేస్తున్నారు. ప్రణబ్ తెలంగాణ వ్యతిరేకి అని, తెలంగాణ సమస్య ఇంతకాలం నానడానికి కారకుడు ఆయనేనని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. ప్రణబ్ విషయంలో తెలంగాణవాదులు చేస్తున్న వాదనలన్నీ నిజమే. కానీ ప్రణబ్‌కు వ్యతిరేకంగా ఓటు చేయాలన్న నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా అంత తేలికైన విషయం కాదు. టీఆరెస్ ఓటు వేసినా వేయకపోయినా ప్రణబ్ ఎలాగూ గెలుస్తారు. ఐదేళ్లు రాష్ట్రపతిగా ఉంటారు. తెలంగాణ ఏర్పాటు కూడా ఆయన చేతులమీదుగా జరగాల్సిందే. కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే సాధారణంగా అయితే రాష్ట్రపతి నిరభ్యంతరంగా దానిని పార్లమెంటుకు నివేదించవలసిందే. కానీ కేంద్రం నిర్ణయాలను తొక్కిపెట్టిన జైల్‌సింగ్ వంటి రాష్ట్రపతిని చూశాం. అటువంటప్పుడు ప్రణబ్‌కు వ్యతిరేకంగా ఓటు వేసి ఎన్‌డిఏ శిబిరంతో ఐడెంటిఫై కావడం ఎందుకు? కొత్త సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు? ఇక అప్పుడు మిగిలిన ప్రత్యామ్నాయం-ఎన్నికలను బహిష్కరించడం. ఎన్నికలను బహిష్కరించడం కూడా ఒక ఉద్యమ రూపమే. కేంద్రం సానుకూలంగా ఉందన్న సంకేతాలు వస్తున్న తరుణంలో ఇటువంటి చర్య మేలు చేస్తుందా? హాని చేస్తుందా? అలాగని ఉన్నపళంగా అనుకూలంగా ఓటు వేయవచ్చా? అదీ కష్టతరమైన నిర్ణయమే. ఏ హామీ లేకుండా, కేంద్రం నుంచి ఏదోఒక హామీ లభించకుండా ఓటు వేయడం టీఆరెస్‌కు చిక్కు సమస్యే. ఆచితూచి అడుగేయవలసిన తరుణం ఇది. టీఆరెస్‌కు కూడా తెలంగాణ సాధనలో ఈ ఆరుమాసాల కాలమే కీలకం.

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s