పరకాల- అనేక తీర్పులకు సందర్భం


పరకాల ఉప ఎన్నికకు సాధారణ పరిస్థితుల్లో అయితే పెద్దగా ప్రాధాన్యం లేదు. ఒకే ఒక్క నియోజకవర్గం. పైగా ముందు తెలంగాణవాదులు గెల్చిన సీటు కాదు. కానీ ఇప్పుడు చాలా ప్రాధాన్యతలను సంతరించుకుంది. ఈ ఒక్క ఎన్నిక ద్వారా పరకాల ప్రజలు అనేక సంకేతాలను, తీర్పులను ఇవ్వాల్సి ఉంది. కొందరు ద్రోహులను తిప్పికొట్టాల్సి ఉంది. ఇంకొందరి భ్రమలను తొలగించాల్సి ఉంది. మరికొందరి మాయలను తిరస్కరించాల్సి ఉంది. తెలంగాణ రాజకీయ అస్తిత్వ బావుటాను మరోసారి సమున్నతంగా ఎగరేయాల్సి ఉంది. తెలంగాణ ప్రజల కన్ను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తప్ప మరి దేనిపైనా లేదని తేల్చి చెప్పాల్సి ఉంది. మహబూబ్‌నగర్ ఉప ఎన్నికలో
జరిగిన తప్పిదాలను సరిచేసుకోవడానికి పరకాల ఉపఎన్నిక కలసివచ్చిన అవకాశం. మానుకోట గాయాల్ని మాన్పడానికి, జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ చొరబాటును తిప్పికొట్టడానికి ఇది సరైన సందర్భం. తెలంగాణవాదం కోసం నిలబడినా బిజెపిని ఎందుకు నమ్మడం లేదని ఒక మిత్రుడు ప్రశ్నించారు. నమ్మకం రాత్రికి రాత్రి తయారయ్యేది కాదు. సుదీర్ఘ అనుభవం, ఆచరణ మీద ఆధారపడి ఏర్పడేది. బుద్ధిజీవులు ఎవరైనా అనేక సాధారణ పరిణామాలను పరిశీలించి ఒక నిర్దిష్ట వైఖరి, ఒక నైతిక నిర్ణయం తీసుకుంటారు. ఒక నిర్దిష్ట పరిణామాన్ని చూసి సాధారణ నిర్ణయాలు చేయరు.

బిజెపిని నమ్మకపోవడానికి లేక శంకించడానికి కారణాలనేకం- మొదటిది, బిజెపి గతంలో ఒకసారి మాట ఇచ్చి తప్పింది. ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదంతో బలపడిన బిజెపి టీడీపీతో పొత్తుకోసం మాటమార్చింది. రెండు, బిజెపి జాతీయ పార్టీ, ఆపార్టీకి వంద ఎజెండాలు ఉన్నాయి. ఎన్నిక ఎన్నికకూ దాని ప్రాధాన్యతలు, ఎజెండాలు మారడం చూస్తున్నాం. రామజన్మభూమి, కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు వంటి నినాదాలను ఆ పార్టీ ఇప్పుడు వినిపిస్తోందా? మూడు, బిజెపికి దేశవ్యాప్తంగా డజనుకుపైగా రకరకాల మిత్రపక్షాలున్నాయి. అధికారంలోకి రావడానికి  ఆ పార్టీ ఎప్పటికప్పుడు కొత్త మిత్రపక్షాలను వెదకుతూనే ఉంది. వాటితో పొత్తుకోసం, మద్దతుకోసం, స్నేహంకోసం ఎప్పుడయినా ఏ హామీనయినా, ఏ నినాదాన్నయినా పక్కన పెట్టే అవకాశాలు కోకొల్లలు. తెలుగుదేశంకోసం తెలంగాణను తొక్కిపెట్టిన చరిత్ర ఉండనే ఉంది. నాలుగు, జాతీయ పక్షాలకు చాలా రాజకీయ అనివార్యతలు(పొలిటికల్ కంపల్షన్స్) ఉంటాయి. ఎప్పుడు ఏ అనివార్యత వాటిని ప్రభావితం చేస్తుందో చెప్పలేం. ఐదు, బిజెపి నుంచి గెలిచే ఎంపీలు, ఎమ్మెల్యేలు అధిష్ఠానం ఆదేశాల మేరకు పనిచేస్తారు తప్ప, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు స్పందించరు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను చూస్తున్నాం-వాళ్లేం చేస్తున్నారో, ఎన్ని పిల్లి మొగ్గలు వేస్తున్నారో! జాతీయ పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేల జుట్టు ఢిల్లీ పెద్దల చేతుల్లో ఉంటుంది. ఇంతెందుకు వెంకయ్యనాయుడు కనుసన్నల్లో పనిచేసే కిషన్‌రెడ్డిని కూడా చూశాం. లక్ష్మీనారాయణ రాజీనామా చేస్తే, ఆయన మాత్రం రాజీనామా చేయడానికి నిరాకరించారు. మన ఓటు, అధికారాన్ని మన అదుపాజ్ఞల్లో ఉంచుకోడానికి ఉపయోగపడాలి. ఎక్కడో కనిపించని అధిష్ఠానం చేతుల్లో పెట్టడం ఎందుకు? మన ఎంపీలు, ఎమ్మెల్యేల జుట్టు మన తెలంగాణ నేతల చేతుల్లోనే ఉండాలి. ఆరు, బిజెపి సమాజాన్ని చీల్చి రాజకీయంగా బలపడాలని చూసే పార్టీ. కుల, మత రాజకీయాలకు పెట్టింది పేరు. మహబూబ్‌నగర్‌లో దాని విశ్వరూపం చూశాం. ఇప్పుడు పరకాలలో కూడా కులం కార్డును ప్రయోగిస్తున్నది.

టీఆరెస్ ఇందుకు పూర్తిగా భిన్నం. టీఆరెస్‌ది ఏకైక ఎజెండా. తెలంగాణ సాధన దాని ఏకైక లక్ష్యం. మిత్రపక్షాల గొడవ లేదు. రాజకీయ అనివార్యతల సమస్యలేదు. మాటమార్చే అగత్యం లేదు. మన ఓటుతో అధికారాన్ని మన చేతుల్లో ఉంచుకోవాలి. టీఆరెస్ నుంచి గెలిచే ఎంపీలు, ఎమ్మెల్యేలకు తెలంగాణ నేతలు, ప్రజలే అధిష్ఠానం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడమే వారి ప్రాథమిక లక్ష్యం అవుతుంది. టీఆరెస్ తెలంగాణ సమాజాన్ని ఐక్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నది. హిందూ-ముస్లిం ఐక్యతా సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళుతుంది. ఉద్రిక్తతలను, ఉన్మాదాలను రెచ్చగొట్టదు. ఈ పదకొండేళ్లలో ఎదురైన అనేక అనుభవాల తర్వాత బుద్ధిజీవులు ఎవరైనా ఇంతకన్నా భిన్నంగా ఆలోచించే అవకాశం లేదు.

ఇక జగన్‌మోహన్‌రెడ్డి విషయం – ఆయన తెలంగాణ ప్రజలకు ఏమీకాడు. ఆయన రాజశేఖర్‌రెడ్డి వారసుడు. రాజశేఖర్‌రెడ్డి తెలంగాణకు చేసిన ద్రోహాలకు, వెన్నుపోట్లకు వారసుడు. రాజశేఖర్‌రెడ్డి తెలంగాణలో కొల్లగొట్టిన సంపదలకు వారసుడు. తెలంగాణ నుంచి అక్రమంగా మళ్లించిన వనరులకు వారసుడు. హైదరాబాద్‌కు
పోవాలంటే వీసా తీసుకోవాల్సి వస్తుందని ఆంధ్రా ప్రజలను బ్లాక్‌మెయిల్ చేసిన రాజశేఖర్‌రెడ్డికి ఆయన రాజకీయ అంతేవాసి. తెలంగాణ ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్న రాజశేఖర్‌రెడ్డికి కొనసాగింపు. స్వయంగా తాను సమైక్యవాదినని  పార్లమెంటులోనే ప్లకార్డు ప్రదర్శించినవాడు. రాజకీయాల్లో అడ్డగోలు ఎదుగుదలకు,
అంతులేని అవినీతికి సింబల్. అన్ని రకాల అవినీతి ఆరోపణల్లో పీకల్లోతు కూరుకుపోయినవాడు. తెలంగాణ ప్రజాభీష్టంపై దురాక్రమణకు ప్రయత్నించి మానుకోటను యుద్ధభూమిగా మార్చినవాడు. ఇవన్నీ ఎలా మర్చిపోగలం? పైగా ఆయనది సీమాంధ్ర పార్టీ. సీమాంధ్ర నాయకత్వంలో నడిచే పార్టీ. ఇంత జరిగిన తర్వాత, ఇన్ని
అనుభవాల తర్వాత జై తెలంగాణ అనని వారికి ఇక్కడ ఎలా ఓటేస్తారు?

చంద్రబాబునాయుడుకూ, రాజశేఖర్‌రెడ్డికీ స్థూలంగా ఏమీ తేడా లేదు. తెలంగాణలో దోపిడీకి ఒకరు పునాది వేస్తే, మరొకరు పూర్తి చేశారు. హైదరాబాద్‌ను కాలనీగా మార్చడానికి ఒకరు దారులు వేసి, కిటికీలు తెరిస్తే, మరొకరు ద్వారాలు తెరిచారు. ఒకరు తెలంగాణ రాకుండా అడ్డంపడితే, మరొకరు వచ్చిన తెలంగాణకు అడ్డం పడ్డారు. ఇద్దరిదీ రెండు కళ్ల సిద్ధాంతమే. ఇక్కడో మాట, అక్కడో మాట. మనుషులిక్కడ, ఆత్మలక్కడ. అవినీతి విషయంలోనూ ఇద్దరిదీ ఒకటే బడి. ఒకరిది పాలిష్డ్ అవినీతి. మరొకరిది మొరటు అవినీతి. తీవ్రతలో తేడా. పరిమాణంలో తేడా. చంద్రబాబునాయుడుకు తెలంగాణలో ఓటు అడిగే హక్కులేదు.

కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం గురించి ఒక రాజకీయ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్య ఈ సందర్భంగా ఉటంకించడం సబబుగా ఉంటుందేమో- ‘కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్‌కు ఒక నిరర్థక ఆస్తి(నాన్ పర్‌ఫార్మింగ్ అసెట్-ఎన్‌పిఏ). తెలంగాణ ప్రజలకు భారం. ఉండీ ఉండనట్టు. దేనికీ కట్టుబడనట్టు. ఏ పనీ చేయనట్టు. ఎవరికీ
పట్టనట్టు. ఏ ప్రభావానికీ లొంగనట్టు. ఎవరికీ ఏమీ కానట్టు. అనేక మంది నాయకులు. వంద కుంపట్లు. వేయి నాల్కలు. ఏకకాలంలో అనేక యుద్ధాలు చేస్తున్నట్టు కనిపిస్తారు. వందలాది మ ంది కత్తులు గాలిలో తిప్పుతూ కనిపిస్తారు.  చివరకు చూస్తే వీళ్ల శరీరాల నుంచే రక్తం ధారలు కడుతుంటాయి. వీళ్లను గెలిపిస్తే ఈ ఎనిమిదేళ్లలో ఏం జరిగింది? ఇప్పుడు ఒరిగేదేముంది?’  ప్రతి ఎన్నిక ఒక తీర్పు చెప్పే సందర్భం. ప్రతి ఓటు నచ్చనివాటిని నిరాకరించే అస్త్రం. ప్రతిఓటు అస్తిత్వాన్ని చాటుకునే ఆయుధం! తెలంగాణవాదాన్ని గెలిపించుకోవాలి. తెలంగాణవాదాన్ని బతికించుకోవాలి.

*****

ఇద్దరు జర్నలిస్టుల సంభాషణ- ‘రాజకీయాల్లోకి వచ్చి పట్టుమని పది  మాసాలు కాకముందే ముఖ్యమంత్రి పదవిపై మోజుపడిన మనిషిని, ఇన్ని అవినీతి ఆరోపణలు ఎందుర్కొంటున్న వ్యక్తిని, పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయిన మనిషిని సీమాంధ్రలో ఎందుకింత అభిమానిస్తున్నారు? ఆయన జైలుకెళితే, ఆయన తల్లి, చెల్లి
పర్యటనకెళితే జనం ఇంతగా ఎందుకు విరగబడుతున్నారు?’. ‘అది వాస్తవం కాదు. బలమైన వాదం, ప్రత్యామ్నాయం ఉన్న చోట జగన్‌ను నిలువరించగలిగారు. తెలంగాణలో జగన్ ఎందుకు ఏమీ చేయలేక పోయారు? తెలంగాణవాదం ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అయింది. అందుకే జగన్‌వైపు పెద్దగా జనం కదలలేదు. ఇకముందు కదిలే అవకాశం లేదు. సీమాంధ్రలో చంద్రబాబు, కిరణ్ లేక బొత్స లేక చిరంజీవి ఒక బలమైన ప్రత్యామ్నాయంగా జనం విశ్వాసాన్ని చూరగొనలేకపోతున్నారు. ఆ నాయకులు విధానాలపరంగా, రాజకీయంగా దివాలా అంచున నిలబడి ఉన్నారు. తలా ఒక కుంభకోణాన్ని నెత్తిపెట్టుకుని, జగన్
అవినీతిపై యుద్ధం చేస్తున్నామని చెబితే ఎవరు నమ్ముతారు? క్రెడిబుల్ ఆల్టర్నేటివ్ లేదు. జనం ఉన్నవాళ్లలో బెటర్ ఎవరో ఎంచుకుంటున్నారు. ఒక రకంగా జనానికి జగన్ కొత్త. ఏం చేస్తాడో చూద్దామన్న ఉత్సుకత. అందుకు రాజశేఖర్‌రెడ్డి చేసిన మేళ్లు కొంత ఉపయోగపడుతున్నాయి. గెలిచేవాడివైపు ఉండాలన్న గాలివాటం ఇంకొంత
తోడవుతోంది. అన్నీ జగన్‌కు ఉపకరిస్తున్నాయి’.

‘జగన్‌ను మానుకోటవరకు వెళ్లనిచ్చి ఉంటే తెలంగాణవాదం ఎప్పుడో చల్లారిపోయి ఉండేదని ఒక రాజకీయ వేత్త చెబుతున్నాడు’. ‘తెలంగాణ వ్యతిరేకతతో అలా మాట్లాడి ఉంటాడు. జగన్‌ను అప్పుడడ్డుకున్నారు. సరే నిజామామాద్ జిల్లాకు వెళ్లి దీక్ష చేశాడు. చంద్రబాబును ఐదు వేల మంది పోలీసు బలగాలను మోహరించి పాలకుర్తి పంపారు. కిరణ్‌కుమార్‌రెడ్డి భూపాలపల్లి దగ్గర్లో పురుషులను బంధింపజేసి, మహిళలతో సభలు పెట్టించారు. ఏమైంది? తెలంగాణవాదం చల్లారిపోయిందా? ఆ తర్వాతనే కదా ఆరు నియోజకవర్గాల ఉప ఎన్నికలు జరిగి తెలంగాణ వాదులు గెలిచిందీ, టీడీపీ సగం సీట్లలో డిపాజిట్లు గల్లంతయింది, అధికారపార్టీ అన్ని చోట్లా
ఓడిపోయింది’.

*****

ఒక పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధి ఐదేళ్లపాటు ఏ పార్టీలోకీ వెళ్లకుండా చట్టం తేవాలి(ఒంగోలు సభలో)….ఉప ఎన్నికలంటే తమాషా అయిపోయింది. ప్రతిసారీ రాజీనామా చేయడం, పోటీ చేయడం రాష్ట్రంలో తప్ప ఎక్కడా లేదు. ఇలా రాజీనామా చేసేవారు మళ్లీ పోటీ చేయకుండా పదేళ్లు నిషేధం విధించాలి.

-నారా చంద్రబాబునాయుడు
ఎంకిపెల్లి సుబ్బిసావుకు వచ్చినట్టు, ఉప ఎన్నికలు తెలుగుదేశం చావుకు వచ్చాయి. ఆడలేని వాడు మద్దెలను బద్దలు కొట్టాలని చూస్తాడు. పోరాడలేనివాడు ఎన్నికలు నిషేధించాలని చూస్తాడు. అనువైతే ఒక మాట, అనువుకాకపోతే మరో మాట..ఐదేళ్లకోసం ఎన్నుకున్న ఎన్‌టిఆర్‌ను దించేసి ముఖ్యమంత్రి పదవిని, పార్టీ
అధ్యక్షపీఠాన్ని కబ్జా చేయవచ్చు. ఎన్‌టిఆర్ చలువతో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించి ఏకంగా ప్రభుత్వాన్నే మార్చేయవచ్చు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన మోత్కుపల్లి నర్సింహులు(1999 ఎన్నికల్లో)తో తిరుగుబాటు చేయించి పచ్చజెండా కింద ఆశ్రయం ఇవ్వచ్చు. తనపైనే ‘బిగ్‌బాస్’ ఆరోపణలు చేసిన
మైసూరారెడ్డిని పార్టీలో చేర్చుకోనూవచ్చు. ప్రతిపక్ష జడ్‌పిటిసి సభ్యులను టోకున కొనుగోలు చేసి(2001 స్థానిక ఎన్నికల్లో) వరంగల్, రంగారెడ్డి, చిత్తూరు….జడ్పీలను కైవసం చేసుకోవచ్చు. అప్పుడెప్పుడూ చంద్రబాబుకు నిషేధాలూ, నీతులూ గుర్తుకురాలేదు. అదొక్కటేనా నలభై ఎనిమిది గంటల్లో మాటమార్చవచ్చు. ఏడాది తిరగకుండానే ఎన్నికల మానిఫెస్టోను మరచిపోవచ్చు. పార్టీ మార్చడాన్నేనా, మాట మార్చడాన్ని నిషేధించవద్దా? మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఐదేళ్లదాకా మార్చకుండా చట్టం తేనవసరం లేదా?

*****

ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌పైన, కేంద్రమంత్రులపైన అన్నాహజారే బృందం ఆరోపణలు చేయడం సరికాదు. ‘ఎటువంటి హేతుబద్ధత లేకుండా, సహజ, సమన్యాయ సూత్రాలను గాలికి వదిలేసి అత్యుత్సాహంగా, నిర్లక్ష్యంగా ఆరోపణలు చేయడం వల్ల అవినీతిపై మనం చేస్తున్న సంఘటితపోరాటం దెబ్బతింటుంది’.

-లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ్

‘విషవృక్ష వారసుడుగా అవినీతికి మూల్యం చెల్లించడమే జగన్ అరెస్టు. జగన్ అవినీతిపై స్పష్టమైన ఆధారాలు దొరకడంతోనే అరెస్టు జరిగింది.  ఇలాంటి అవినీతి ఘటనలతో తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిని తలదించుకునే దుస్థితి దాపురించింది’- ఈ మాటలన్నది కూడా జయప్రకాశ్ నారాయణ్‌గారే. ప్రధాని చేసిన కోల్ బ్లాక్‌ల
కేటాయింపుపై దర్యాప్తు చేయాలని డిమాండు చేయవద్దు. సిబిఐ దర్యాప్తూ చేయవద్దు. ఆధారాలు పట్టుకోవద్దు. ఒకే నేత, రెండు నీతులు.

*****

వాన్‌పిక్‌లో మోపిదేవి వెంకటరమణ పొందిందేమీ లేదు. జగన్ రూ.00 కోట్ల ముడుపులు తీసుకున్నారు. తండ్రి(వైఎస్) అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాగించిన అవినీతి, అక్రమాలు చట్టబద్ధం కావాలని కోరుకుంటున్నాడు
– రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్
రాజకీయాల్లో దయ, దాక్షిణ్యాలుండవు. శాశ్వతశత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. బండ్లు ఓడలవుతాయి. ఓడలు బండ్లవుతాయి. విధేయులు విరోధులవుతారు. విరోధులు విధేయులవుతారు. ఉండవల్లి అరుణ్‌కుమార్ మొన్నమొన్నటిదాకా ఏం మాట్లాడారో, ఇప్పుడేం మాట్లాడుతున్నారో చూస్తే, చదివితే మనకు మతిపోతుంది. ‘‘ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై బురదజల్లేందుకే టీడీపీ అధినేత చంద్రబాబు అనవసరంగా అవినీతి అంటూ గగ్గోలు పెడుతున్నారు…ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు, ఈటీవీ న్యూస్ చానెల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అవినీతి మయమైందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు… (2.12.200). రాజశేఖర్‌రెడ్డి పేదలపాలిట పెన్నిధి….(01.09.09). బతికున్నంతకాలం లేదా ఆయన కోరుకున్నంతకాలం సీఎంగా ఆయనే
కొనసాగుతారు…(29.06.09). చంద్రబాబు పదవీకాంక్షకు ప్రతిరూపం. నిత్యం వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను, హామీలను నెరవేర్చగలిగిన సత్తా జగన్‌లో ఉందని జనం నమ్మారు. కాబట్టే ఆయన సీఎం అయితే బాగుంటుందని భావించారు. అంతేతప్ప తనను సీఎం చేయమని జగన్ ఎవ్వరినీ అడగలేదు…(10.01.10). విశ్వసనీయతలో వైఎస్‌ను మించినవారు లేరు. పేదలకు మేలు చేయడంలో, చెప్పినమాట నిలబెట్టుకోవడంలో ఆయనే నంబర్ వన్…(20.03.09). ఎన్నిసార్లు ఆయన(వైఎస్)కు నా మాటల వల్ల బాధ కలిగిందో…హటాత్తుగా నాకు భగవద్గీతలో శ్లోకం గుర్తుకు వచ్చింది…‘కృష్ణా! నాశరహితా, నీ మహిమ తెలియక పొరపాటునగానీ చనువువల్లగానీ ఓ కృష్ణా, యాదవా, సఖా…విహారము సల్పునపుడుగానీ, పరుండునప్పుడుగానీ, కూర్చున్నప్పుడుగానీ, భుజించునప్పుడుగానీ, ఒక్కడవు ఉన్నప్పుడుగానీ…ఏవిధముగా
ప్రవర్తించితినో… నా అపరాధములన్నింటినీ అప్రమేయుడవగు నీవు క్షమించమని వేడుకుంటున్నాను’. తండ్రీ! ఓ రాజశేఖర్‌రెడ్డీ నన్ను క్షమించు….అనుగ్రహించు!(వైఎస్ మృతి సందర్భంగా 15.09.09న రాసిన వ్యాసం)’’…ఇవన్నీ ఉండవల్లి చేసిన ప్రసంగాలు, రాసిన రాతలే. ఎవరు ఎవరిని క్షమించాలి? ఏది పాపం? ఏది పుణ్యం? ఎవరు కృష్ణుడు? ఎవరు కంసుడు?

*****

మా మంత్రి మోపిదేవి వెంకటరమణ గుడ్‌పర్సన్…సిన్సియర్…క్లీన్….ఆయన ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటికి వస్తారని నమ్ముతున్నాను.
-ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి
అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గం ఉమ్మడిగా తీర్మానాలు చేస్తే, ఆ తీర్మానాల ఆధారంగా కార్యదర్శులు ఆదేశాలు రూపొందిస్తే, మంత్రులు సంతకాలు చేస్తే జీవోలు వెలువడుతాయి. ముఖ్యమంత్రి బలవంతుడే కావచ్చు, సర్వాధికారీ కావచ్చు. కానీ చట్టంలో ఆ పదాలు లేవు. ప్రభుత్వం నిర్ణయాలకు
మంత్రివర్గం ఉమ్మడిగా బాధ్యత వహించాలని చట్టం చెబుతుంది. జీవోలు విడుదల చేసిన ఆరుగురు మంత్రులే కాదు, రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్న మంత్రులందరూ ఉమ్మడిగా బాధ్యత వహించాలి. మంత్రి వర్గ తీర్మానాల వల్ల జరిగిన ఇచ్చిపుచ్చుకోవడాలకు జవాబుదారీ కావాలి. జగన్‌రెడ్డి పిటిషన్ వేయించింది మీ
ఎమ్మెల్యేతోనే. (జగన్‌రెడ్డిని కోర్టులో ఇరికించినందుకు ప్రతిఫలంగా మంత్రిపదవి ఇచ్చిందీ, అంతలోనే తొలగించిందీ తమరే.) ముందుగా అరెస్టు చేసిందీ మీ ప్రభుత్వాధికారులనూ, మంత్రినే. మొద్దులో తోక ఇరికించి మేకు పీకేసిన కోతి కథలా లేదు. ఇప్పుడు లాక్కోలేరు, పీక్కోలేరు. ఇంత బురద మీదపోసుకుని, జగన్ రెడ్డిపై ఎంత బురదవేస్తే మాత్రం ఏం ప్రయోజనం?
*****

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily

One thought on “పరకాల- అనేక తీర్పులకు సందర్భం”

  1. మీ ఆర్టికల్ ఒకవైపే ఉంది /వుంటుంది/ వుండాలి .. ఎందుకంటే మీరు వృత్తి ధర్మం పాటించాలి కనుక.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s