తెలంగాణ చార్జి షీట్ :ఇవి ఆత్మహత్యలు కాదు, హత్యలే


తెలంగాణకోసం జరిగిన ఆత్మహత్యలన్నీ హత్యలే. నిజమే. కానీ హంతకులెవరు? 2009 డిసెంబరు 9 తర్వాతనే ఆత్మహత్యలు ఎందుకు మొదలయ్యాయి? యువకాశల నవపేశల సుమగీతావరణంలో హోరెత్తాల్సిన యువకెరటాలు అగ్నికీలల్లో దూకి కాలిపోవలసిన అగత్యం ఎందుకు వచ్చింది? తెలంగాణ యువకుల హృదయాలను ఛిద్రం చేసిన శక్తులేవి? తెలంగాణ స్వప్నాన్ని భగ్నం చేసిన ధూర్తులు ఎవరు? తెలంగాణ ఇస్తమని మాటతప్పిన మారీచులు ఎవరు? వచ్చిన తెలంగాణకు అడ్డంపడిన సైంధవులెవరు? తెలంగాణ శ్రేణులు ఏకోన్ముఖంగా ఉద్యమిస్తుంటే సీమాంధ్ర నేతల గులాములుగా ఉద్యమంపైకి విషం చిమ్మి, ఉన్మాద ప్రేలాపనలతో గందరగోళం సృష్టించిన ఇంటిదొంగలు ఎవరు? తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వికృత కథనాలను, అబద్ధాల పంచాంగాలనూ ప్రచురించి పిల్లల మనసును గాయపరిచిన పత్రికలు, చానెళ్లు ఏవి? తెలంగాణలో 700 మందిని బలితీసుకున్నవారిపై, తెలంగాణకు అడ్డం పడినవారిపై, తెలంగాణ ఉద్యమంలో గందరగోళం సృష్టించాలనుకుంటున్నవారిపై చార్జిషీటు దాఖలు చేయాల్సివస్తే, అది ఎలా ఉంటుంది? నిందితుల జాబితా ఎలా ఉంటుంది? మొదటి ముద్దాయి ఎవరు? చివరి ముద్దాయి ఎవరు? అభియోగాలు ఏమిటి?

అభియోగాలు ఏవి?

రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ ఏకాభ్రిపాయం ప్రాతిపదికగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించి, ఆ మరుసటి రోజే మాట తప్పి, తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం తలపెట్టడం.

తెలంగాణపై అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మాటతప్పి తెలంగాణ యువకులను నిరాశా నిస్పృహలకు గురిచేసి, వారిని ఆత్మహత్యలకు పురికొల్పడం. 700 మందికి పైగా యువకుల ఆత్మహత్యలు, కాదు హత్యలకు కారణం కావడం.

2009 డిసెంబరు 9కి ముందు వరకు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన సీమాంధ్రుల నాయకత్వంలోని పార్టీలు రాత్రికిరాత్రి మాటమార్చి రాజీనామాల డ్రామాతో ప్రజాస్వామిక ప్రక్రియకు భంగం కలిగించడం.

ఎన్నికల మ్యానిఫెస్టోల్లో, శాసనసభ వేదికల్లో, పార్లమెంటులో ఇచ్చిన హామీలను వమ్ము చేసి కాంగ్రెస్, టీడీపీలు ప్రజాస్వామ్య ద్రోహానికి, రాజ్యాంగ ద్రోహానికి పాల్పడడం.

సీమాంధ్ర రాజకీయ పార్టీలు, నాయకుల ప్రయోజనాలకు అనుకూలంగా, తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమ శ్రేణుల్లోనే గందరగోళం సృష్టించేందుకు కుట్రలు చేయడం.

సీమాంధ్ర మీడియా-కొన్ని పత్రికలను, చానెళ్లను అడ్డంపెట్టుకుని తెలంగాణకు వ్యతిరేకంగా, ఉద్యమకారులకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు చేసి, తెలంగాణ ప్రజలు, యువకుల మనోభావాలను దెబ్బతీయడం.
ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రజాస్వామ్యయుతంగా జరిగిన 42రోజుల సకల జనుల సమ్మెను, తెలంగాణ నలుమూలల్లో, అన్నివర్గాల ప్రజల్లో వెల్లువెత్తిన ప్రజానిరసనను గుర్తించడానికి నిరాకరించడం.

తెలంగాణకు శాపంగా మారిన తెలంగాణ కాంగ్రెస్, తెలుగుదేశం నేతల రాజకీయ బానిస బుద్ధి. సీమాంధ్ర రాజకీయ నాయకులు, మీడియా ఇన్ని కుట్రలు చేస్తున్నా తెలంగాణ నేతలు ఇంకా వారి సంకల్లోనే కూర్చుని ఉద్యమంపైకి రాళ్లు విసరడం ద్వారా తెలంగాణ ప్రజలను తీవ్ర క్షోభకు గురిచేయడం.

తెలంగాణ ప్రజల అస్తిత్వ కాంక్షలను, ఉద్యమ దీక్షను సవాలు చేస్తూ తెలంగాణపైకి సీమాంధ్ర నాయకుల రాజకీయ దండయాత్రలను ప్రోత్సహించడం.

ప్రజాస్వామికంగా జరుగుతున్న ఉద్యమాన్ని అణచివేయడానికి నిరంకుశ అణచివేత విధానాలను అమలు చేయడం. వేలాది మంది విద్యార్థులు, యువకులపై అసంఖ్యాకంగా కేసులు నమోదు చేసి, జైళ్లపాలు చేయడం.

ఆంధ్రలో కల్తీసారా తాగి మరణించినవారి కుటుంబాలను పరామర్శించిన చంద్రబాబు, ఇతర సీమాంధ్ర నేతలు తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర కాంక్ష భగ్నమై మరణించినవారి కుటుంబాల్లో ఒక్కరిని కూడా పరామర్శించకపోవడం.

అభియోగాలను రుజువు చేసే సాక్ష్యాధారాలు

కాంగ్రెస్, తెలుగుదేశం, పీఆర్పీ మ్యానిఫెస్టోలు, రాష్ట్రపతి ప్రసంగాలు, సోనియాగాంధీ ప్రసంగం.

అసెంబ్లీలో, పార్లమెంటులో ఆ పార్టీల నేతలు చేసిన ప్రసంగాలు.

రాజీనామా డ్రామాలకు సంబంధించిన అసెంబ్లీ రికార్డులు.

2009 డిసెంబరుకు 9కి ముందు తర్వాత చంద్రబాబు, చిరంజీవి, రోశయ్య, ఇతర నేతలు తెలంగాణపై చేసిన ప్రకటనల పత్రిక క్లిప్పింగులు, విడియో క్లిప్పింగులు.

యువకుల ఆత్మహత్యల వార్తల పత్రిక క్లిప్పింగులు, విడియో ఫుటేజ్‌లు.

ఆత్మహత్యలు చేసుకున్న యువకుల మరణవాంగ్మూలాలు, వారు రాసిన లేఖలు.

మృతుల తలిందండ్రుల వాంగ్మూలం.

2009 డిసెంబరు 9, ఆతర్వాత చిదంబరం చేసిన ప్రకటనల విడియో క్లిప్పింగులు.

విద్యార్థులపై, ఉద్యమకారులపై పెట్టిన కేసులు, నిర్బంధాల రికార్డులు.

ముద్దాయిలెవరు?

మొదటి ముద్దాయి- కేంద్ర ప్రభుత్వం:

2004లో తొలి యుపిఎ ప్రభుత్వం ఏర్పడినప్పుడే కనీస ఉమ్మడి కార్యక్రమంలోనూ, రాష్ట్రపతి ప్రసంగంలోనూ తగిన సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చింది. కాన్సెన్సస్(విస్తృతాంగీకారం) కుదిరితే తెలంగాణ ఏర్పాటుకు సిద్ధమేనని చెబుతూ వచ్చింది. తొలి యుపిఎ పాలన సమయంలోనే ప్రధాన ప్రతిపక్షమైన బిజెపితో సహా దేశంలోని 30 రాజకీయ పక్షాలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయి. విస్తృతాంగీకారం అప్పుడే వచ్చింది. కానీ యుపిఎ కావాలనే తెలంగాణ ప్రజలను వంచిస్తూ వచ్చింది. డిసెంబరు 2009లో రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ దీక్షతో ఉద్యమం ఉధృతమైన నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలు అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ఏర్పాటుకు విస్తృతాంగీకారం తెలియజేశాయి. పార్లమెంటులో, శాసనసభలో అన్ని పార్టీలూ తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండు చేశాయి. తదనుగుణంగా డిసెంబరు 9న కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. కానీ రాష్ట్రంలోని సీమాంధ్ర నాయకులు రాజీనామాల డ్రామా ఆడడంతో కేంద్రం కూడా ప్లేటు ఫిరాయించింది. ఒకసారి విస్తృతాంగీకారం ఏర్పడిన తర్వాత, కేంద్రం ఒక రాజకీయ ప్రక్రియను ప్రకటించిన తర్వాత దానిని తిరగదోడడం నమ్మకద్రోహం, ప్రజాస్వామ్యానికి విఘాతం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం విశ్వాసఘాతుకానికి పాల్పడింది. ఇందుకు ఆ ప్రభుత్వం తెలంగాణ ప్రజల దండనకు అన్ని విధాలా అర్హమైంది.

రెండవ ముద్దాయి-కాంగ్రెస్:

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించారు. ఈ ప్రకటన చేయడానికి ముందు సోనియాగాంధీ, మన్‌మోహన్‌సింగ్‌ల సారథ్యంలో కాంగ్రెస్ అత్యున్నతస్థాయి కోర్ కమిటీ పలుమార్లు సమావేశమై చర్చించింది. కేంద్రం సూచన మేరకే అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్‌తోపాటు తెలుగుదేశం, పీఆర్పీ, సిపిఐ, బిజెపి, టీఆరెస్ అంగీకారాన్ని తీసుకుని కేంద్రానికి పంపారు. ఆ తీర్మానం ప్రాతిపదికగానే హోంమంత్రి చిదంబరం ప్రకటన చేశారు. అంటే కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటుకు సిద్ధపడే ఇవన్నీ చేసింది. ఇన్ని జరిగిన తర్వాత మళ్లీ రాజకీయ పక్షాల అభిప్రాయాలు కావాలని మొదలు పెట్టడమంటే తెలంగాణ ప్రజలను వంచించడమే, దగా చేయడమే. మరికొంతకాలం కాలయాపన చేసే కుతంత్రమే. సీమాంధ్ర రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రజాస్వామిక ప్రక్రియను వమ్ము చేయడమే. ఒక సమస్యపై విస్తృతాంగీకారాన్ని ఒకసారి సాధిస్తే చాలదా? ఎన్నిసార్లు విస్తృతాంగీకారం కావాలి? ఎన్నేళ్లు ఈ నాటకాలు కొనసాగిస్తారు? కాంగ్రెస్ సీమాంధ్ర నాయకత్వం కనుసన్నల్లోనే తెలంగాణ ప్రజలను హింసిస్తున్నది. వేధిస్తున్నది. కాంగ్రెస్ కుట్రల కారణంగానే తెలంగాణ యువకులు నిరాశా నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ గర్భశోకానికి ప్రధాన కారణం కాంగ్రెసే. తెలంగాణ ప్రజలు విధించే శిక్షలకు కాంగ్రెస్ నాయకత్వం అన్ని విధాలా అర్హమైంది.

మూడవ ముద్దాయి-తెలుగుదేశం:

నిజానికి పీఆర్పీ రావడంతోనే తెలుగుదేశం పతనం మొదలైంది. ఒకప్పుడు అసెంబ్లీలో ‘తెలంగాణ’ పదాన్ని నిషేధించిన తెలుగుదేశం పార్టీ 2008 వచ్చేసరికి తెలంగాణ నినాదాన్ని ఎత్తుకుంటే తప్ప బతకలేని పరిస్థితి. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని అందుకుని పార్టీని బతికించుకుంటే, ఆంధ్రాలో ఆ ఆదరువుతో బతికేయవచ్చని టీడీపీ భావించింది. అందుకే తెలంగాణపై ఎర్రన్నాయుడు అధ్యక్షతన ఒక కమిటీ వేసి, విస్తృతంగా సంప్రదింపులు జరిపి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా తీర్మానం చేసింది. తీర్మానం ప్రతిని ఎర్రన్నాయుడు ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి కూడా అందజేశారు. ఇవేవీ రహస్యంగా జరగలేదు. కమిటీల ఏర్పాటు, సంప్రదింపులు, తీర్మానం చేయడం, ప్రణబ్ కమిటీకి అందజేయడం అన్నీ పత్రికల్లో విస్తృతంగా వచ్చాయి. అప్పుడెప్పుడూ సీమాంధ్ర తెలుగుదేశం నాయకులకు సమైక్యాంధ్ర గుర్తుకు రాలేదు. అప్పుడెప్పుడూ అభ్యంతరాలు చెప్పలేదు. చివరకు 2009 డిసెంబరు 7,8,9 తేదీల్లో తెలంగాణపై తీర్మానం పెట్టాలని కూడా టీడీపీ సవాలు చేసింది. అశోకగజపతి రాజు నాయకత్వంలోని టీడీపీ ప్రతినిధి బృందం అఖిలపక్షం సమావేశానికి హాజరై ప్రత్యేక రాష్ట్ర తీర్మానానికి మద్దతు తెలిపింది. కానీ చిదంబరం ప్రకటన వచ్చిన మరుక్షణమే చంద్రబాబు ప్లేటు ఫిరాయించారు. సడన్‌గా రెండు కళ్ల సిద్ధాంతం అంటూ కతలు మొదలు పెట్టారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్ర నాయకులతో రాజీనామాలు చేయించారు. ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో చేయకూడని విశ్వాసఘాతుకానికి, విద్రోహానికి పాల్పడ్డారు. మాట మార్చి, నీతి తప్పి, తెలంగాణ ప్రజల హృదయాల్లో కనీవినీ ఎరుగని సంక్షోభానికి కారకులైన టీడీపీ నాయకత్వం అన్ని రకాల శిక్షలకూ అర్హమైందే.

నాలుగువ ముద్దాయి-తెలంగాణ నేతలు:

ఉద్యమంలో తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నేతలది అడుగడుగునా విద్రోహపాత్రే. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కొంత తెగువ ప్రదర్శించినా, వారు కూడా చివరికి దాగుడు మూతల్లోకే జారిపోయారు. టీడీపీ నేతలైతే తెలంగాణ పాలిట బ్రూటస్‌లుగా మారారు. నలభైరెండు రోజుల సకల జనుల సమ్మె తెలంగాణ చరిత్రలో వీరోచితమైన ఉద్యమం. ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న కాలంలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు మరోసారి రాజీనామాచేసి రాజకీయ సంక్షోభం సృష్టించి ఉంటే ఈ పాటికి తెలంగాణ సమస్య పరిష్కారమై ఉండేది. తెలంగాణకు ఈ గుండెకోత కొంతయినా తప్పి ఉండేది. ఈ ఆత్మహత్యలు నిలిచిపోయేవి. బయటివారి విద్రోహం కంటే ఇంటిదొంగల చేతగానితనం, రాజకీయ నంగనాచితనం తెలంగాణ ప్రజలను బాగా కలచివేస్తోంది. సొంతరాజకీయ అస్తిత్వంలేని ఈ వానపాములను ఎన్నుకున్నందుకు తెలంగాణ ప్రజలు కుమిలిపోతున్నారు. అవకాశం వచ్చినప్పుడు వీరిని శిక్షండానికి వెనుకాడరు.

ఐదవ ముద్దాయి-సీమాంధ్ర మీడియా:

తెలంగాణకు వ్యతిరేకంగా ఒంటికాలుపై లేచే చానెళ్లు, పత్రికలు కొన్ని ఉన్నాయి. ‘తోడేళ్లు, గుంటనక్కలు, పిచ్చి కుక్కలు, గుడ్ల గూబలు మానవరూపం ఎత్తి తెలంగాణలోనే సంచరిస్తున్నాయి. ఇక్కడి ఉద్యమకారులపైకే ఎగబడుతున్నాయి’ అని ఒక సందర్భంలో ఒక కవి అన్నారు. ఈ తోడేళ్లను, గుంటనక్కలను కెమెరాల ముందు కూర్చోబెట్టి తెలంగాణవాదంపై విద్వేషాన్ని, విషాన్ని, ఉన్మాదాన్ని కక్కిస్తున్నాయి ఈ చానెళ్లు, పత్రికలు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా, తెలంగాణ ద్రోహులకు అనుకూలంగా అసత్య, అర్ధసత్య, కాల్పనిక కథనాలను వండివార్చి, తెలంగాణ యువతను నిరాశా నిస్పృహల్లోకి నెట్టి, వారిని ఆత్మహత్యలకు పురికొల్పి వినోదిస్తున్న పత్రికలు, చానెళ్లు కూడా తెలంగాణ ప్రజల శిక్షల నుంచి తప్పించుకోలేవు.

తీర్పు

తీర్పు ప్రజలకు తెలుసు. ఇప్పుడు తెలంగాణ ప్రజ మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేదు. సీమాంధ్ర పార్టీలు, మీడియా చేసే కుట్రలను ప్రజలు ఇప్పుడు తేలికగానే పసిగట్టగలుగుతున్నారు. ఎప్పుడు ఎటువంటి తీర్పు ఇవ్వాలో ప్రజలు రిజర్వు చేసుకునే ఉంటారు.

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s